సుభాషితం:
" స్వభావసిద్ధముగనే ' ఇది అందమైనది ', ' ఇది వికృతమైనది ' అని ఎక్కడనూ ఏదిన్నీ ఉండదు. ఎవరికి ఏది సమ్మతముగా, యిష్టముగా ఉంటుందో అదే వానికి చక్కనిదిగా కనబడుతూంటుంది.
శ్లో. " శీతే అతీతే వసన మశనం వాసరాంతే నిశాంతే,
క్రీడారంభం కువలయదృశాం యౌవనాంతే వివాహం,
సేతోర్బంధం పయసి గళితే వార్ధకే తీర్థయాత్రాం,
విత్తే నష్టే వితరణ మహో! కర్తు మిచ్ఛంతి మూఢా: "
శీతాకాలం వెళ్ళిపోయాక వస్త్రము, పగలు గడిచిపోయాక భోజనము, తెల్లవారిన తరువాత తరుణీ సంగమము, యౌవనాంతనైనాక వివాహము, గతజలసేతుబంధనము, వృద్ధాప్యంలో తీర్థయాత్ర, ధనం పోయాక దానము - వీటిని చేయ సమకట్టు వారెంతటి పరమమూర్ఖులో చెప్పాలా?