ద్రౌపది నవ్వు
శ్రీమహాభారత కథాగమనమును మలుపు త్రిప్పిన సంఘటనలందు " ద్రౌపది నవ్వు" అప్రముఖమైనదిగా చెప్పబడుతుంది. మన కెదురుగ నున్న వ్యక్తి యొక్క అమాయక గుణమును లేదా వాని యిబ్బందికర పరిస్థితిని గమనించి పరిహాసమొనర్చి తద్వారా ఆతని మనస్సునందు తీరని అవమాన భారమును నింపుటవంటి సమయసందర్భములందు సాహితీలోకమందు ఈ నానుడిని విస్తారముగా వినియోగించెదరు. .
ఈ సామెత ప్రచారమున కొచ్చిన మూలమును పరిశీలించినప్పుడు మనకు భారతకథలోని ఒక సంఘటన గుర్తుకురాక తప్పదు. రాజసూయాగానంతరము పాండవ వీరులు ఇంద్రప్రస్థపురమందు రాక్షస శిల్పి అయిన మయబ్రహ్మ నిర్మించి యిచ్చిన మయసభయందు నివాసముండెడి వారు. అత్యద్భుతమైన శిల్పకళా నైపుణ్యముతో మయసభ మనోహరంగా దీపిల్లుతూ ఉండేది. చూచువారలకు చిత్తభ్రాంతిని కలిగించుచు, ఆశ్చర్య చకితులను చేస్తూండేది. నేల, జలము, గోడ మొదలైనవన్నీ స్థానభ్రంశమును చెందినట్లుగా గోచరమవుతూ చూపరులను తికమక పెడుతూ, గుర్తుపట్టడములో క్లిష్ట సమస్యల నుద్భవింప జేసేది. దుర్యోధను డొకసారి ఈ మయసభలో విడిది చేయుటకు వచ్చి, సభా ప్రాంగణమును, లోపలి భాగమునందును సంచారమొనరించుచు, సభలోని మాయలను గమనించుటలో తబ్బిబ్బు పడినాడు. నీరు ఉన్న తావును నేల అనుకుని అడుగులువేసి నీటిలో పడుట, అటులనే గోడ అనుకొని శూన్యము లోనికి వెళ్ళుట వంటి అనుభవములతో అవస్థల పాలయినాడు.
దుర్యోధనుడా రీతి భ్రమలకు లోనయి భంగపడిన దృశ్యములను అక్కడకు దగ్గరగా ఉండి గమనించిన వారు కలకల నవ్వినారని, మేడ మీద నుండి దీనిని గమనించిన పాండవ పత్ని ద్రౌపది కూడా నవ్వినట్లుగా ప్రచారమందు నున్న కథనము తెలియజెప్పుచున్నది. ఈ సంఘటన, యింకను ద్రౌపది తనను చూచి పరిహాసముగా నవ్వుటను దుర్యోధనుడు తీవ్రముగా పరిగణించి, గాయపడిన అహంభావముతో , పాండవులపైని మరింత కసిని రగుల్చుకుని దానిని గాఢమైన పగగా పెంచుకున్నాడు. తదనంతర కాలములో ఈ పెచ్చు మీరిన పగ ప్రతీకారమే వారితో మాయాజూదమాడుట, ద్రౌపదీ వస్త్రాపహరణకు పూనుకొనుట, తుదకు సర్వనాశనమునకు దారితీసిన కురుక్షేత్ర సంగ్రామమునకు నాంది పల్కుటకు కారణభూతమయినది.
" ద్రౌపది నవ్వు " అనబడు ఈ చిన్ని పౌరాణిక జాతీయము మానవాళికి ఒక జీవిత పాఠమును ఉపదేశిస్తున్నది. సమయము కాని సమయమందు అసందర్భ ప్రేలాపములతో కావించు హాస్య భాషణము చేకూర్చు అనర్థదాయకమైన స్థితి ఎంత తీవ్రతరముగా ఉండునో హెచ్చరిస్తున్నది. మనము సరదాగా చిన్న నవ్వు నవ్వినను లేదా తేలికపాటి మాట మాట్లాడినను ఒక్కొక్కసారి తోడివారి హృదయాలను అవి బాధపెట్టవచ్చు. అందువలననే మన మాటతీరులోను , ప్రవర్తనా సరళిలోను సంయమనము పాటించవలయునని అనుభవజ్ఞులైన పూజ్యులు సూచిస్తారు. నవ్వుట అనునది సహజగుణ మయినప్పటికీ పరుల ఆత్మగౌరవమును, విశ్వాసమును దెబ్బతీయునటుల ఆ నవ్వు ఉండరాదన్న ధర్మసూత్రమును ఈ నానుడి ప్రభోదిస్తున్నది.