21, జూన్ 2026, ఆదివారం

 :: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట :: 

    శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ఒక దివ్యమైన ఉదయం. రేపల్లెలో బాలకృష్ణుడు తన చల్ది మూటను భుజాన వేసుకుని, చేతిలో పిల్లనగ్రోవిని పట్టుకుని, వేణునాదం చేస్తూ గోపబాలురందరినీ నిద్రలేపాడు. కృష్ణుడి పిలుపు వినడమే తడవుగా, వేలాదిమంది గోపబాలురు తమ తమ చల్ది కంచాలను, బుట్టలను చంకన పెట్టుకుని, గోవుల మందలను ముందుకు తోలుకుంటూ బృందావన అరణ్యాల వైపు ఉత్సాహంగా అడుగులు వేశారు. అందరిలోనూ ఒకటే ఆరాటం... ఈరోజు కృష్ణుడితో కలిసి అడవిలో గడపాలి, కృష్ణుడితో కలిసి భోజనం చేయాలి!

    యమునా నదీ తీరానికి చేరుకోగానే, గోపబాలుర ఆనందానికి అవధులు లేవు. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాల మధ్య వారు రకరకాల ఆటలు ఆడటం ప్రారంభించారు. కొందరు బాలురు కోకిలల్లా కూస్తే, మరికొందరు నెమళ్లలా నాట్యం చేశారు. "నేను కృష్ణుడిని పట్టుకుంటా" అంటూ ఒకరి వెనుక ఒకరు పరుగెత్తారు. కోతుల వలె చెట్లు ఎక్కడం, నీడలను చూసి నవ్వుకోవడం, ఒకరిపై ఒకరు పూలు చల్లుకోవడం... ఇలా ఆ అడవి అంతా వైకుంఠాన్నే తలపించింది. జగన్నాథుడైన ఆ పరమాత్మ, సామాన్య మానవ బాలకుడిగా మారి ఆ గోపబాలుర భక్తికి, నిష్కల్మషమైన ప్రేమకు దాసుడై వారితో కలిసి ఆటలాడాడు.

    ఆటల తర్వాత అందరికీ ఆకలి వేసింది. అప్పుడు కృష్ణుడు ఎంతో ఆప్యాయంగా బాలలందరినీ పిలిచి, భోజనానికి సమయమైందని, ఇక ఆలస్యం చేయవద్దని ఇలా అన్నాడు:

ఎండన్ మ్రగ్గితి రాకటంబడితి రింకేలా విలంబింపగా 

రండో బాలకులార! చల్దిగుడువన్ రమ్యస్థలంబిక్కడీ 

దండన్ లేగలు నీరుద్రావి యిరవందం బచ్చికల్ మేయుచుం 

దండంబై విహరించుచుండగ నమందప్రీతి భక్షింతమే

    "ఓ గోపబాలకులారా! మీరంతా ఎండకు అలసిపోయారు, ఆకలితో ఉన్నారు. ఇక ఆలస్యం ఎందుకు? మనం చల్ది తినడానికి ఇది ఎంతో అందంగా ఉన్న స్థలం. ఇదిగో! ఈ పక్కనే మన లేగదూడలు నీళ్లు తాగి, పచ్చిక మేస్తూ గుంపులు గుంపులుగా హాయిగా విహరిస్తున్నాయి. మనం కూడా ఇక్కడే కూర్చుని ఎంతో సంతోషంగా భోజనం చేద్దాం రండి" అని కృష్ణుడు పిలిచాడు.

    కృష్ణుడి మాట వినడమే తరువాయి, బాలలంతా యమునా నది ఇసుక తిన్నెలపై గుండ్రంగా కూర్చున్నారు. ఆ దృశ్యం ఎలా ఉందంటే:

జలజాంతస్థితకర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే 

కుల చందంబున గృష్ణునిం దిరిగిరా గూర్చుండి వీక్షింపుచున్ 

శిలలున్ బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులున్ బువ్వలా 

కులు కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకుల్ భూవరా!

     తామరపువ్వులో మధ్యఉన్న కర్ణికచుట్టూ వరుసలు వరుసలుగా రేకులు పరుచుకొని ఉంటాయి. అలాగే కృష్ణుడు కర్ణికలాగా మధ్యన కూర్చొని ఉండగా గోపబాలకులందరూ  చుట్టూ రేకుల్లాగా సర్దుకుని కూర్చుని ఆయననే చూస్తున్నారు. ఆ అడవిలో దొరికిన రాళ్లు, చిగురాకులు, గడ్డిపరకలు, తీగలు, ఉట్లు, విస్తరాకులను కంచాలుగా చేసుకుని ఆ గోపబాలురు భోజనం చేయడం ప్రారంభించారు.

    ఆ భోజన సమయంలో గోపబాలురు చేసిన అల్లరి, వింత చేష్టలు ఆ పరమాత్మకే అమితానందాన్ని కలిగించాయి. అక్కడ ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు:

మాటిమాటికి వ్రేలుమడిచి యూరించుచు నూరుగాయలు దినుచుండు నొక్క 

డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి "చూడులే"దని నోరుసూపు నొక్క,

డేగురార్గుర చల్దులెలమి బన్నిదమాడి కూర్కొని కూర్కొని కుడుచునొక్క 

డిన్నియుండగబంచియిడుట నెచ్చలితనమనుచు బంతెనగుండులాడునొకడు 

కృష్ణు జూడుమనుచు గికురించి పరుమ్రోల,

మేలిభక్ష్యరాశిమెసగు నొకడు -

నవ్వు నొకడు, సఖుల నవ్వించు నొక్కడు,

ముచ్చటాడునొకడు, మురియునొకడు.

    కృష్ణుని చుట్టూ వలయాకారంగా కూర్చున్న గోపాలకులంతా చల్దులారగిస్తున్నప్పుడు వారు చేసే పలుచేష్టలను పోతనగారు సహజంగా వర్ణిస్తున్నారు, కాదు కళ్ళకు కట్టిస్తున్నారు.ఒకడు మళ్ళీమళ్ళీ వేలు మడచి ఊరగాయలు తాను తింటూ , మిగిలినవారిని ఊరిస్తున్నాడు.  ఇంకొకడు పక్కవాడి కంచంలో పదార్థాన్ని టక్కున లాక్కుని మింగేసి, "నేను తీసుకోలేదు చూడు" అంటూ నోరు తెరిచి చూపిస్తున్నాడు. మరొకడేమో ఐదారుగురి చల్దన్నాన్ని ఒకేసారి కలిపి పంతానికి దిగి గబగబా నోట్లో కుక్కుకుంటున్నాడు. ఇంకో బాలుడు "ఇన్ని పదార్థాలు పక్కన పెట్టుకుని ఒంటరిగా తినడం స్నేహం అనిపించుకోదు, అందరికీ పంచి పెట్టాలి" అంటూ పంక్తిలో అందరికీ ఇస్తున్నాడు. ఒక బాలుడు పక్కవాడితో "అటు చూడు కృష్ణుడు!" అని మాయచేసి, వాడు అటు తిరగ్గానే వాడి ముందరి ఉత్తమ భక్ష్యాలను తినేస్తున్నాడు. ఇలా ఒకడు నవ్వుతూ, ఒకడు అందరినీ నవ్విస్తూ, ముచ్చటాడుతూ, మురిసిపోతూ ఆ వనభోజనాన్ని సాగించారు.

ఈ లీలలన్నింటి నడుమ, యజ్ఞభోక్త అయిన ఆ శ్రీకృష్ణుడు తన మిత్రుల మధ్య ఎలా కూర్చుని చల్దన్నం తిన్నాడో పోతన గారు అద్భుతంగా వర్ణించారు:

కడుపున దిండుగాగట్టిన వలువలో లాలితవంశనాళంబు జొనిపి 

విమలశృంగంబును వేత్రదండంబును జాఱి రానీక డాచంకనిఱికి 

మీగడ పెరుగుతో మేళవించిన చల్దిముద్ద డాపలిచేత మొనయ నునిచి 

చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళసందులనెల్ల వెలయ నిఱికి 

సంగడీల నడుమ జక్కనగూర్చుండి 

నర్మభాషణముల నగవునెఱపి 

యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద 

శైశవంబు మెఱసి చల్ది గుడిసె

 యజ్ఞయాగాదులలో హవిస్సులను స్వీకరించే ఆ శ్రీకృష్ణుడు, దేవతలు సైతం ఆశ్చర్యపోయేలా తన బాల్య లీలను ప్రదర్శించాడు. నడుముకు కట్టిన వస్త్రంలో పిల్లనగ్రోవిని దోపాడు; స్వచ్ఛమైన కొమ్ము బూరను, బెత్తాన్ని జారిపోకుండా ఎడమ చంకన ఇరికించాడు; మీగడ పెరుగుతో కలిపిన చల్ది అన్నం ముద్దను ఎడమ చేతిలో ఉంచుకున్నాడు; స్నేహితులు కొసరి కొసరి తెచ్చిన ఊరగాయ ముక్కలను తన కుడిచేతి వేళ్ల సందుల్లో ఇరికించుకున్నాడు. తన ప్రాణసఖులైన గోపబాలుర మధ్య చక్కగా కూర్చుని, వారితో పరిహాసాలాడుతూ, నవ్వులు చిందిస్తూ ఆ చల్దన్నాన్ని ఆరగించాడు.

ఇక్కడ జరిగిన సన్నివేశం కేవలం భోజనం కాదు, అది అద్వైత భావనకు, నిష్కల్మషమైన ప్రేమానురాగాలకు ప్రతీక. వేదాలకు, యజ్ఞాలకు దొరకని ఆ పరబ్రహ్మం, కేవలం 'భక్తి'కి లొంగిపోయి, బృందావనంలో గోపబాలుర మధ్య ఒక సామాన్య బాలుడిగా కూర్చుని చల్దన్నం తిన్న ఈ వనభోజన వృత్తాంతం భక్తి రసార్ద్రమైనది, సదా స్మరణీయమైనది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట ::       శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ...