:: మహాగణపతి ::
పార్వతి పుత్రగణపతి కేకకు బిరబిరా వచ్చి, తల తెగిపడి ఉన్న బాలుణ్ణిచూసి, శివుణ్ణి చురచుర చూస్తూ " ఎంతపని చేశావు. మన పుత్రుణ్ణి నరికావు. పుత్ర హంతకుడివి " అంటూ కుప్పకూలబడి భోరుమని శోకించ సాగింది.
అంతవరకూ స్తంభించిపోయి చూస్తూన్న గుంపులో కలకలం సముద్ర ఘోషలాగా చెలరేగింది. పెద్ద నేరం చేసినవాణ్ణి లాగా శివుణ్ణి చూడసాగారు. శివుడికి ముచ్చెమటలు పోశాయి. బిక్కముఖం పెట్టి " నాకు తెలియని పుత్రుడా! ఎలాగ వచ్చాడు? " అన్నాడు.
పార్వతి తన వంటికి పెట్టుకున్న నలుగుముద్ద ఏవిధంగా పుత్రగణపతి అయినదీ చెప్పింది. దానికి శివుడు పెదవి విరిచి, కోపంగా చూస్తూ " నీకు కుమారుడైతే కావచ్చు. అందుకే అమ్మ, అమ్మ అంటూ తెగ వాగాడు. మన పుత్రుడంటున్నావు. నాకు పుత్రుడెలాగు అవుతాడు? " అని అడిగాడు.
పార్వతి తెల్లబోయింది. అప్పుడు విష్ణువు బ్రహ్మకు సైగ చేశాడు. బ్రహ్మ ముందుకు వచ్చి " శివుడు పార్వతి చేతిని పుచ్చుకున్నప్పుడే శివుడి తేజస్సు పార్వతి శరీరం నిండా ప్రవేశించి పులకరింప జేసింది. అది మొదలు శివుడు పార్వతిలో సగభాగంగా అంతర్లీనమై ఉంటూనే ఉన్నాడు. పుత్రగణపతి శివుడి కుమారుడే " అని నాలుగు వేళ్ళతో నొక్కి చెప్పాడు.
శివుడు చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తూంటే, పార్వతి బాలుడి కళేబరంమీద పడి ఏడుస్తూంటే, ఆకాశంనుండి " ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తూన్న ఏనుగు తలను తెచ్చి నాకు అతకండి. నేను లేస్తాను " అన్న పుత్రగణపతి వాక్కులు వినిపించాయి.
వెంటనే దేవతలు, ప్రమథులు అంతా గాలిస్తూ ఎంత వెదికినా ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తున్న వాళ్ళెవరూ కనిపించలేదు.
ఇంకా వెతుకుతూ పోగాపోగా సహ్యాద్రి పర్వతంమీద బిల్వ వనంలో ఒక తెల్లని ఏనుగు గున్న మాత్రం ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తూనే శివస్మరణ చేస్తూ కనిపించింది.
ఆ ఏనుగు గున్న దేవలోకంలో దేవతా గజమైన ఐరావతం కుమారుడైన గజేంద్రుడు. ఐరావతం ఇంద్రుడి వాహనం. ఒకసారి ఇంద్రుడు అలా వస్తూంటే గజేంద్రుడు అతణ్ణి లెక్కచేయకుండా తన ధ్యాసలో తానుండటం చూసి ఇంద్రుడు కళ్ళెర్రజేసి " నా వాహనం కొడుక్కి ఇంత పొగరా? " అని దుర్భాషలాడాడు.
అప్పుడు గజేంద్రం శాంతంగా " నా తండ్రి తన విధిని తాను చేస్తున్నాడు. అంతమాత్రం చేత నీవు మమ్మల్ని తక్కువచేసి మాట్లాడవలసిన పనిలేదు.నీకు నేను భయపడాల్సింది ఏమీ లేదు " అన్నాడు.
" నేను దేవేంద్రుణ్ణిరా, ఏనుగా! " అన్నాడు ఇంద్రుడు గర్వంగా.
ఔను, నేను ఏనుగును. గజేంద్రుణ్ణి. మరొకరు నాగేంద్రుడైతే, ఇంకొకరు పక్షీంద్రుడు. ఇలా ఎంతమంది ఇంద్రుళ్ళున్నా ఉండవచ్చు. నూరు యజ్ఞాలు చేస్తే చాలు. ఇంద్రపదవి పొందవచ్చు. తపస్సుతో సాధించవచ్చు. అందుకే ఎవరెక్కడ ఏది చేస్తున్నారని తెలిసినా నీకు తగని భయం. ఇంద్రత్వం ఏమంత గొప్పదని నీవు జ్ఞానంతో చెప్పుకొంటున్నావు? " అన్నాడు గజేంద్రుడు.
ఇంద్రుడు రెచ్చిపోయి శపించుతున్నట్లుగా " నీతల తెగా " అని తిట్టాడు.
గజేంద్రం నవ్వుతూ " శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదుకదా! ఆ తలముందే నీతల వంచవలసి వస్తుందేమో ఎవరికెరుక " అన్నాడు.
గజేంద్రం గొప్ప జ్ణాని అని గుర్తించలేని గర్వాంధుడైన ఇంద్రుడు " ఆ శివుణ్ణే నమ్ముకో. భూమ్మీదపడు " అని గజేంద్రాన్ని స్వర్గంనుండి క్రిందకు తోసేసాడు. గజేంద్రం సహ్యపర్వతంమీద పడి, ఎల్లప్పుడూ శివ సంస్మరణం చేసుకొంటూ, శివుడి నివాసమైన కైలాసం ఉండే ఉత్తరదిక్కుకే తలపెట్టుకొని నిద్రిస్తూండేది.
దేవతలు గజేంద్రం తల నరికి తీసుకెళ్ళారు. ఆ తలను శివుడు బాలుడి కళేబరానికి అతికించగానే పుత్రగణపతి ఏనుగు ముఖంతో కళకళలాడుతూ లేచి నుంచున్నాడు.
" నా ముద్దులయ్యకు ఏనుగుముఖం ఏమిటి? నేను చూడలేను " అని పార్వతి దు:ఖంతో కళ్ళు మూసుకుంది.
అప్పుడు గజముఖుడు వీనుల విందు చేసే స్వరంతో " అమ్మా! ఎందుకు విచారిస్తావు? జరగాల్సిందంతా నిర్విఘ్నంగా జరిగింది. ఆనాడు మీరిద్దరూ గోడమీద ఏనుగుల చిత్రాన్ని చూస్తున్నప్పుడు కనిపించిన నన్ను గుర్తించలేదా? విఘ్నేశ్వరుణ్ణి " అన్నాడు.
ఆ మాటలు వింటూనే పార్వతికి కల వచ్చినట్లుగా ఆ విశేషమంతా కనిపించింది. శివుడికి అలాగే విఘ్నేశ్వరుడు స్ఫురణకు వచ్చాడు.
" విఘ్నేశ్వరా! నీవా! మాకు పుత్రుడవై అవతరించావా? ఇందుకా నన్ను అంతగా కవ్వించి కయ్యానికి కాలుదువ్వి, నాకు కోపం తెప్పించింది. నాకు అంతా బోధపడుతున్నది. నీ లీల అద్భుతం " అన్నాడు శివుడు.
" లేకపోతే గజాసురుడికి నువ్వు యిచ్చిన వాగ్దానాలు ఎలా నెరవేరతాయనుకున్నావు? " అని విఘ్నేశ్వరుడు జ్ఞాపకం చేశాడు.
శివుడు " బాగా జ్ఞాపకం చేశావు. నేను గజచర్మాన్ని గూడా కట్టుకోవలసి ఉన్నది. ఏనుగుతల నా కుమారుడికి ఉండనే ఉన్నది " అన్నాడు. ఆ తర్వాత గజచర్మాన్ని తెప్పించుకొని కట్టుకున్నాడు.
శివుడు విఘ్నేశ్వరుడికి వినయంగా వంగి " విఘ్నేశ్వరా! నీ విశ్వరూపాన్ని చూపించు " అని కోరాడు.
అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశానికి పెరిగి అయిదు తలలతో కనిపించాడు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అనే పంచభూతాల రంగులైన ఆకుపచ్చ, మబ్బురంగు, ఎరుపు, తెలుపు, నీలం రంగులు అయిదు ఏనుగు తలలకూ ఉన్నవి. ఆ తలలపై నక్షత్రాలు తలపూవులుగా మెరుస్తున్నవి. విఘ్నేశ్వరుని గుండ్రని పెద్ద బొజ్జ మినుకు మినుకుమనే కాంతులతో ఆకాశాన్ని పోలి ఉన్నది. అతని అనేకమైన చేతుల్లో అంకుశము, గొడ్డలి, పాశము, కలశములతోపాటు త్రిమూర్తులకు చెందిన శంఖ చక్ర గదా పద్మ ఢమరుక త్రిశూల వజ్రాయుధాలు, జపమాల, కమండలువు, వీణ, ఖడ్గము, శక్తియీటె మొదలైనవన్నీ ఉన్నాయి. అతని రూపాన్ని తలలు పైకిసారించి చూస్తున్న వారంతా కళ్ళు మిరుమిట్లు గొలిపే అతని తేజస్సు చూడలేక తలలు దించారు. అప్పుడు అందరిలోనూ ఏదో మహానందం కలిగింది. సరస్వతి వీణ తీసి విఘ్నేశ్వరుడికి ప్రియమైన హంసధ్వని రాగాన్ని సంరంభంగా దురితగతితో పలికిస్తూంటే, నారదుడు మాయామాళవ గౌళరాగాన్ని మధ్యమధ్య జోడించాడు. శివుడు ఆనందతాండవం చేశాడు.
ఇంద్రుడితో సహా ముక్కోటి దేవతలు తలలువంచి విఘ్నేశ్వరుడికి నమస్కరించారు. అప్పుడు ఇంద్రుడి చెవుల్లో " ఆ తలముందే నీతల వంచవలసి వస్తుందేమో " అని గజేంద్రం అన్న మాటలు గింగురుమన్నాయి. పుత్రగణపతికి అతికిన తల గజేంద్రానిదని అతనికి తెలుసు. ఇంద్రుడు చెవులు పట్టుకొని మూడుసార్లు వంగిలేస్తూ లెంపలేసుకొని సాష్టాంగపడి మ్రొక్కి " గజేంద్రా! నీవు జ్ణానివి. నేను అజ్ఞానిని. నా గర్వాన్ని మన్నించు " అని మనస్సులో అనుకున్నాడు. దేవతలంతా ఇంద్రుడు చేసినట్లే అనుకరించి మ్రొక్కారు.
విశ్వరూపం దాల్చిన విఘ్నేశ్వరుడితో శివుడు " విఘ్నేశ్వరా! నీ రూపానికి ఎన్నో విశేషార్థాలున్నట్లుగా మాకు తోస్తున్నది. తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాము " అని అన్నాడు.
విఘ్నేశ్వరుడు " శివ భక్తుల సమ్మెళనమే యీ విశ్వం. నేను విశ్వ జననీ జనకులైన పార్వతీ శివులకు పుత్రుణ్ణి మాత్రమే. వారికి అంజలి ఘటిస్తున్నాను " అని అంటూ చేతులెత్తి జోడించి ఊరుకున్నాడు.
బ్రహ్మ ముందుకు వచ్చి యిలా చెప్పాడు. " మత్స్యావతారం ఎత్తి విష్ణువు సోమకాసురుణ్ణి సంహరించి వేదాల్ని భద్రపరిచాడు. నిండు చందమామ కాంతుల్ని విరజిమ్ముతూ విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి వాటిని నాకు అందజేసాడు. నాకు జ్ఞాన సిద్ధి కలిగింది. అప్పుడు విఘ్నేశ్వరుని గురించి విశేషాలు చాలా తెలుసుకున్నాను. సంకల్పసిద్ధికి మూలమైన విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి సక్రమంగా సృష్టి చేయగలిగాను.
విఘ్నేశ్వరుడు విరాట్ స్వరూపుడు. వ్యాపించేవాడు కనుకనే " విష్ణుం " అనిపించుకున్నాడు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, మట్టి అనే పంచ మహాభూత గణానికి అధిపతి గనుకనే విఘ్నేశ్వరుడు మహాగణాధిపతి. లక్ష్మీస్వరస్వతుల నిలయంగా నడుమనున్న విశ్వరూప విఘ్నేశ్వరుడి అయిదు తలలూ శ్వేతనీలము, ఊదా, ఎరుపు, శ్యామనీలము, పచ్చరంగులతో పంచ మహాభూతాలకు ప్రతిరూపాలుగా ఉన్నవి.
ఏనుగు తల బలానికి, మేథస్సుకి చిహ్నం. బొజ్జ ఉండగానే సంబరం కాదు. తగినంత మేథస్సు ఉండాలని అర్థం. కొత్తవి పడుతూ ఉంటే, పాతవి జీర్ణం అవుతూండే తినుబండారాలకుమల్లే, అనంతాకాశంలో నక్షత్ర మండలాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, గోళాలు, లోకాలు నిండి ఉన్నాయని లంబోదరం గుర్తుచేస్తూన్నది. ఈయన త్వరలోనే చిన్న ఎలుకనెక్కి తిరుగబోతున్నాడు. అంటే, సూర్యచంద్రాది గ్రహాలు, మహా మండలాలు శూన్యాకాశంలో గతులు తప్పకుండా అంతలా ఘనంగా తిరుగుతున్నాయనీ, విశ్వస్వరూపం చిట్టెలుకపై ఏనుగుస్వారీ లాంటి చిత్రాతి చిత్రమైన జ్ఞానంతో నిండి ఉన్నదనీ చెప్పడం అన్నమాట. విశ్వ విజ్ఞానానికి విఘ్నేశ్వరుడు సంకేతం. ఆయన విజ్ఞానేశ్వరుడు అనబడుతున్నాడు.
విశ్వానికి అధినేత. నియంత. అంకుశాన్ని ధరించాడు. బుద్ధిబలానికి విఘ్నేశ్వరుడు గురుతు. బుద్ధి వెర్రితలలు వేయకుండా మావటివాడు ఏనుగును ఉంచినట్లుగా, అదుపులో ఉంచాలని అంకుశం మనోనిగ్రహానికి ప్రతిరూపంగా ఉన్నది. సర్వమూ తమ తమ ధర్మాలకు కట్టుబడి ఉన్నదని విఘ్నేశ్వరుని చేతనున్న పాశము చెబుతున్నది. పరిపూర్ణత తొణకని బెణకని నిండుకుండ లాంటిదని కలశాన్ని ధరించాడు. పరశువుతో విఘ్నాన్ని చిన్నాభిన్నం చేస్తాడు. విశ్వం నాదాత్మకమయినది. అనేక ఓంకార ఝంకారాల్ని ధ్వనించే విశ్వ వీణనే విఘ్నేశ్వరుడు మీటుతున్నాడు. చరాచర జీవకోట్ల మొరలన్నీ వినడానికే పెద్ద చెవులు రిక్కించి ఉన్నాడు. ఏనుగు కళ్ళు చిన్నవైనా సూక్ష్మదర్శనం కలిగి, నిశితంగా చూడ గల్గినట్లే, పరమాణువు మొదలుకొని బ్రహ్మాండాన్ని పరిశీలిస్తున్నాడు. వంపుపెట్టిన వక్రతుండం వంకల్ని తుండ తుండాలుగా చేసి సరిదిద్దుతుంది. తొండం నిడువుగా సాగి ఎన్నిటినైనా అందుకుంటుంది, అందిస్తుంది.
సస్య సమృద్ధికి విఘ్నేశ్వరుడు అధినాథుడు. భోజనప్రియుడు గనుక, ఆహారం వల్లనే కండబలమూ, కండబలం ఉంటేనే బుద్ధిబలానికి నిలకడ, సార్ధకతా ఉంటాయని పండ్లు, పిండివంటలు, ఆకుకూరలు వద్దనకుండా స్వీకరిస్తాడు. భాద్రపద మాసంలో ఏనుగుల్లాంటి మేఘాలు తొండాలవంటి వర్షపు ధారలు కురుస్తాయి. మేఘ గణాలకు నాథుడు గణనాథుడు. విఘ్నేశ్వరుడు అవతరించిన ఇది భాద్రపద మాసమే. భాద్రపద శుక్ల చవితినాడు విఘ్నేశ్వరుణ్ణి అర్చించిన వారికి సంకల్పసిద్ధితో బాటు అన్ని విఘ్నాలను అరికట్టుకోగల బుద్ధి నిబ్బరము కలుగుతుంది.
తన దంతపు ఘంటాన్ని మోపినది ఎత్తకుండా విఘ్నేశ్వరుడి చేతి మీదుగానే పంచమవేదం అనదగ్గ మహాభారతం అక్షరసిద్ధిపొంది చిరస్థాయిగా నిలుస్తుంది. విఘ్నరాజు మహిమలు వర్ణించడం నా తరం కాదు. ఏ కార్యమైనా తలపెట్టేముందు విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి, పూజించి మరీ ప్రారంభించాలి. శుభం కలుగుతుంది అంటూ అభయముద్ర పట్టి ఉన్నాడు. మహాగణాధిపతి అందరికీ ప్రథమ ఆరాధ్య దైవము " అని బ్రహ్మ ముగించాడు.
అప్పుడు శివుడు అందర్నీ కలయజూసి " బ్రహ్మ వాక్కు విన్నారు గదా! విఘ్నేశ్వరుడు తొలిపూజ దేవర " అన్నాడు.
అందరూ ఔను ఔనని తలలూపారు. నారదుడు హంసధ్వని రాగాన్ని వీణపై హోరెత్తిస్తూంటే, సరస్వతి హంసానంది రాగాన్ని అందుకొంది. ఆ సంరంభంలో పార్వతి విఘ్నేశ్వరుడికి నమస్కరించబోతూంటే, విశ్వరూప మహాగణాధిపతి " అమ్మా! అమ్మా! వద్దు " అని వారిస్తూ చప్పున విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని, గుజ్జు వినాయకుడై తల్లి కాళ్ళు చుట్టేసుకున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి