6, సెప్టెంబర్ 2025, శనివారం

:: పుత్రగణపతి ::  

    తారకాసురుడి నిరంకుశత్వానికి తోడుగా, త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులు తపస్సులు చేసి వరాలుపొంది ఆకాశంలో ఎగురుతూ తిరిగే మూడు పట్టణాలను నిర్మించుకొని, ముల్లోకాల మీద విరుచుకు పడ్డారు. మూడు పురాల మీద ఎగురుతూ అగ్నిగోళాల్ని కురిపిస్తూ, పట్టణాలనూ, పచ్చని పల్లెలనూ తగలబెడుతూ విధ్వంసకాండ సాగిస్తున్నారు. జగత్తు అట్టుడుకు పోతున్నది. వారిని అంతమొందించ గలవాడు శివుడొక్కడే అని తెలిసిన దేవతలంతా కలిసివచ్చి, మందిర ప్రాంగణంలో హోరెత్తి ప్రార్థనలు చేశారు. పెళ్ళాడిన కొత్తలోనే ఏదో బెడద వచ్చిందని శివుడు విసవిస లాడినా, త్రిపురాసురులు చేస్తున్న మారణహోమం విన్నమీదట ఉద్రేకం పుట్టి మూలనున్న త్రిశూలాన్ని దుమ్ముదులిపి పట్టుకొని, తన అనుచరుల్నీ, ప్రమథ గణాలను వెంటబెట్టుకొని, త్రిపురాసురలను తుదముట్టించడానికి కదిలాడు. 

    అదే సమయంలో జడల ఏనుగుగా మారి లోకాన్ని భీభత్సం చేస్తూ ఒక రాక్షస రాజు బయలుదేరాడు. ఏనుగు రూపం కారణంగా అతడికి గజాసురుడు అన్న పేరు వచ్చింది. అతడు గొప్ప శివ భక్తుడు. శివుడి వల్ల తప్ప మరెవరివల్లా చావులేని వరం పొందాడు. 

    " శివుణ్ణి నీలోపలే ఉంచేసుకొంటే మరీ మంచిదిగదా! " అని నారదుడు గజాసురుడి మేలు కోరుతున్న వాడిలాగా అతడితో చెప్పాడు. గజాసురుడు వెంటనే ఉగ్రమైన ఆరాధనతో శివుణ్ణి గూర్చి తపస్సు మొదలుపెట్టి శివుణ్ణి మెప్పించాడు. త్రిపురాసుర సంహారానికని బయలుదేరిన శివుడు గజాసురుడి కోరిక ప్రకారం గజాసురుడి గుండెలో లింగరూపంతో ఉండిపోయాడు. 

    " శివుడు గజాసురుడి గుండెలో ఉండిపోతే త్రిపురాసుర సంహారం ఎలా జరుగుతుంది? నవ వధువు పార్వతి ముచ్చట తీరేదెలా? శివుడికి, పార్వతికీ పుట్టవలసిన వాడివల్లనే కదా తారకాసురుడి అంతం జరగాలి? " అని దేవతలంతా దిగులు ముఖాలు వేస్తూంటే నారదుడు, " శివుడు ఉబ్బు లింగడు గదా! " అని ఉపాయం అందించాడు. దేవతలంతా గజాసురుడి యెదుట శివుణ్ణి పొగుడుతూ స్తోత్ర పాఠాలు మొదలుపెట్టారు. 

    గజాసురుడు కూడా తన్మయుడై వారితో కలిసి శివభజన సాగించాడు. శివలింగం ఉబ్బి అలాఅలా పెరిగిపోతూ, గజాసురుణ్ణి చీల్చివేసింది. శివుడు ఇవతల పడ్డాడు. గజాసురుడు కన్నుమూస్తూ, " నిన్ను నమ్ముకొంటే ఇలా చేసావేమిటి? అని శివుణ్ణి నిందించగా " గజా! శివభక్తికి తార్కాణంగా కలకాలం నీపేరు నిలిచేలాగా ఏనుగుతల నాకు సన్నిహితంగా ఉంటుంది. గజ చర్మాన్ని కట్టుకుంటాను " అని శివుడు చెబుతూ గజాసురుణ్ణి తనలోకి తీసుకొని కైవల్యాన్ని ప్రసాదించాడు. 

    శివుడు భూమిని రథంగా, సూర్యచంద్రుల్ని రథ చక్రాలుగా, వేదాలు గుర్రాలుగా, బ్రహ్మ సారథిగా, మేరుపర్వతాన్ని ధనుస్సుగా, విష్ణువును బాణంగా సమకూర్చుకొని, తన అనుచరులైన నందీ, శృంగీ, భృంగీ మొదలైన ప్రమథ గణాలను వెంట వీసుకొని, ముక్కోటి దేవతలు వారివారి దేవేరులతో సహా వెనుక రాగా, భయంకరులైన త్రిపురాసురలపై యుద్ధానికి వెళ్ళాడు. 

    ఇంట్లో వంటరి పార్వతికి కాలం బరువుగా గడుస్తున్నది. శివుడు ఎప్పుడు వచ్చేదీ తెలీదు.ఆ సమయంలో నారదుడు వచ్చి " అమ్మాయీ! పార్వతీ! శివుడు నిన్ను పెళ్ళాడినప్పట్నుంచీ తారకాసురుడు తల్లడిల్లిపోతూ పీడకలలు కంటున్నాడు. నీకు ఎలాంటిహాని తలపెడతాడో ఏమో! వాడికి వజ్రదంతుడు తోడై ఉన్నాడు. వజ్రదంతుడు బహుమాయావి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలిసుమా! " అని హెచ్చరించి వెళ్ళాడు. 

    పార్వతికి మరింత చికాకు, దిగులూ కూడా కలిగాయి. చక్కగా తలంటు స్నానం చేస్తే చిరాకు తగ్గి బాగుంటుందనిపించింది. 

    పార్వతి నలుగు పెట్టుకొని, ఆ నలుగుముద్ద కూడదీసి, ఆ ముద్దతో ఒక బొమ్మచేసి ముచ్చటగా చూసుకొని అలా కింద పెట్టి అటు తిరిగి ఇటు చూసేసరికి బొమ్మకు మారుగా ముద్దులు మూటగట్టే బాలుడు కనిపించాడు. " ఎవరబ్బా, నీవు? " అని పార్వతి అడిగింది. 

    " నీ కాంతిని పుణికి పుచ్చుకొని రాలిన నలుగు ముద్దనే కదుటమ్మా! నీ పుత్రుణ్ణి. పుత్రగణపతిని " అన్నాడు బాలుడు. పార్వతి బాలుణ్ణి అక్కున చేర్చుకొని ముద్దాడి, ఒక అంకుశ గదా దండాన్ని అతని చేతికిచ్చి, " నాయనా! ఎవ్వరినీ, పురుగునైనా రానీయకు " అని చెప్పి సింహద్వారం దగ్గర కాపలా ఉంచింది. 

    " అమ్మా! తినడానికేమైనా పెట్టవూ! " అని అడిగాడు కుర్రవాడు. అప్పటికప్పుడు పిండి కలిపి చలిమిడి ముద్దనూ, ఉండ్రాళ్ళనూ చేసి యిచ్చి పార్వతి స్నానానికి వెళ్ళింది. 

    పార్వతిని అంతమొందించితే శివుడికి కొడుకుపుట్టే అవకాశం లేదు. తన ప్రాణానికి భయం ఉండదని తలచి తారకాసురుడు వజ్రదంతుణ్ణి పార్వతిని అపహరించుకు రావడానికి ముందు గజకర్ణి, గోకర్ణి అనే తన ముఖ్యానుచరులైన రాక్షసు లిద్దరిని పంపించాడు. 

    వాళ్ళు దున్నపోతుల్లాగా బలిసిన కుర్రాళ్ళ రూపంతో వెళ్ళి, దొంగ చూపులు చూస్తూ, సింహద్వారం దగ్గర అంకుశ గదా దండాన్ని పట్టి అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాస్తున్న బాలుణ్ణి " ఆడుకుందాం రా! " అని పిలిచారు. 

    బాలుడు వాళ్ళను చూడనట్టే చూసి నవ్వుతూ, " ముందు కాస్త తినండిరా! " అంటూ రెండు చలిమిడి ముద్దలు వాళ్ళ మీదకు విసిరాడు. వాళ్ళు తలలు దిమ్మతిరిగి పారిపోతోంటే, రెండు ఉండ్రాళ్ళు పెద్ద బండరాళ్ళై వాళ్ళ ముందు పడగా బోర్లా పడ్డారు. పుత్రగణపతి వాళ్ళను పిలిచి " చెవులు పట్టుకొని మూడేసి గుంజీలు తీసి, లెంపలేసుకొని మరీ పొండిరా! " అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే చేసి, రాక్షస రూపాలతో వజ్రదంతుడికి ఎగ ఊపిరితో జరిగింది చెప్పారు. 

    వజ్రదంతుడు హుంకరించి ఎలుక రూపంతో వెళ్ళి ద్వారానికి సమీపంలో బొరియ చేసి దూరబోతూండగా పుత్రగణపతి మొలపాశాన్ని తీసి ఉచ్చుపన్ని విసిరి మూషికాన్ని పట్టాడు. ఉచ్చు మెడకు బిగిసి కీచుకీచు మంటూన్న దాని నెత్తిన నాలుగు మొట్టికాయలు పెట్టి, తోక పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేశాడు. 

    పుత్రగణపతి విసురికి మూషికాసురుడు అమాంతంగా అతని రాజ్యంలో అంత:పురం ముందు దభీమని నిజరూపుతో బోర్లా పడ్డాడు. అతని భార్య ధవళ గొప్ప దేవీ భక్తురాలు. ఎప్పటికీ తన పసుపు కుంకుమలు నిలిచేలాగా  భర్తకు చావులేని వరం దేవివల్ల పొందింది. ధవళ భర్తను ఊరడించి వరం సంగతి చెప్పి ధైర్యం కలిగించి, పార్వతి జోలికి పోవద్దని హితవు చెప్పింది. 

    త్రిపురాసురులను సంహరించి ముందుగా వచ్చిన శివుడు పార్వతిని చూడాలనే తహతహతో హుటాహుటీగా వెళ్ళబోతూంటే బాలుడు అడ్డగించాడు. శివుడు చకితుడై " ఎవరు నువ్వు? " అని గద్దించాడు. 

    బాలుడు పకపక నవ్వుతూ " అమ్మ కొడుకుని. మాయావులూ, వేషధారులూ తిరుగుతున్నారు. పురుగైనా పోకుండా కాపలా పెట్టింది మా అమ్మ " అన్నాడు. 

    " నేను ఈశ్వరుణ్ణి. దేవుణ్ణి " అన్నాడు శివుడు. 

    " నాకు ఎటువంటి దేవుడితోనూ నిమిత్తం లేదు. అమ్మ ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి శాసనాన్ని అనుసరించి నడుచుకోవటం కంటే జీవకోటికి వేరే ధర్మమేదీ లేదు కదా! అమ్మ ఆజ్ఞ పాటించటమే నా విధి " అన్నాడు బాలుడు. 

    కొంచెం వెనుకనుంచి త్రిపురాసుర సంహారం చేసిన శివుడి పరాక్రమ వీరగాథను గానం చేస్తూ జయజయ ధ్వానాలతో వస్తూన్న ప్రమథ గణాలు, ముక్కోటి దేవతలు అక్కడకు చేరుకొని, శివుడు బాలుడితో ఘర్షణ పడుతూండడం చూసి ఆశ్చర్యంతో బొమ్మల్లాగా నిల్చిపోయి, వాళ్ళ సంవాదం వినసాగారు. 

    " కుర్రకుంకవు. తెలియక దేవుడు లేడంటున్నావు. అంతటికీ మూలము పరబ్రహ్మము. అతడే దేవుడు " అన్నాడు శివుడు. " పెద్దవాడివైనా, నీకే తెలియనట్టుంది. ఆదిశక్తి నుండి విశ్వమూ, త్రిమూర్తులూ వచ్చిన సంగతిని సూక్ష్మంగా చెబుతాను విను " అంటూ బాలుడు చెప్పసాగాడు. 

    ఆదిశక్తి రూపుదాల్చి బ్రహ్మను, విష్ణువును, మహేశ్వరుణ్ణి, తన మేను విదల్చగా వచ్చిన ఎరుపు, నీలం, తెలుపు రంగుల తేజస్సుల నుండి పుట్టించింది. బ్రహ్మ, విష్ణువు లిద్దరూ దేవి చెప్పింది వినకుండా ధిక్కరించారు. వాళ్ళను ఆమె తన మూడో కంటిని తెరచి బూడిద కుప్పల్ని చేసింది. మహేశ్వరుడు గడుసువాడు. చెప్పినట్టే వింటాను గాని, ముందు మూడో కన్ను తనకిమ్మన్నాడు. దేవి తన మూడో నేత్రాన్ని తీసి అతని నొసట అతికించింది. వెంటనే అతడు దాన్ని తెరచి ఆవిణ్ణి కాల్చాడు. ఆమె మండిపోతూంటే అగ్నిరేణువులు విరజిమ్ముకొని తేజోమండలాలు ఏర్పడ్డాయి. భస్మం రేగి అంతటా నిండింది. ఆ విధంగా విశ్వం ఏర్పడింది. తర్వాత కాలినట్టే కాలి పోయిన దేవి మళ్ళా యధారూపంలో కనిపించింది. అందుకే ఆమెను " మహామాయా " అని అన్నారు. మహేశ్వరుణ్ణి మెచ్చుకొని, అతడిని లయకారుడిగా నిర్ణయించింది. బ్రహ్మ, విష్ణువులను వారి బూడిదలనుండి రప్పించింది. కొంత మిగిలిఉన్న తన బూడిదను మూడు భాగాలు చేసి వాణిని, లక్ష్మిని, ఉమను రూపొందించింది. వాణిని బ్రహ్మ, లక్ష్మిని విష్ణువు, ఉమను మహేశ్వరుడు అర్థాంగులుగా స్వీకరించి లోకపాలన చేయండని చెప్పి దేవి అంతర్ధానమయింది. 

    " నీవు చెప్పినదంతా ఒట్టి కట్టు కథ " అన్నాడు శివుడు. 

    " నాది కట్టు కథ అయితే, బ్రహ్మమూ, దేవుడూ అంటూ నీవు చెప్పేదంతా కేవలం మెట్ట వేదాంతం అంటే తప్పేముంది?  అంతా దేవుడి నుండి పుట్టినదనడంకంటే ఆదిశక్తి నుంచి వచ్చినదనడం ఎక్కువ నిజంగా వినిపించడం లేదా? " అని అడిగాడు బాలుడు. అతని మాటలకు అక్కడున్న మగవాళ్ళ ముఖాలు వెలవెల పోయాయి. ఒక్క విష్ణువు మాత్రం మెచ్చుకుంటూన్నట్లుగా బాలుణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు. బ్రహ్మ బాలుడి తర్కానికి మురిసిపోయాడు. ఆడవాళ్ళ ముఖాలు కళకళలాడుతూ వికసించాయి. 

    శివుడు ముఖం ఎర్రగా చేసుకొని " చూస్తే పసివాడివైతివి. భయపడకు. నిన్నేమీ చేయనులే! మంచిగా ద్వారానికి అడ్డం తొలిగిపో! " అన్నాడు కసురుతూన్నట్టుగా! " నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను వెళ్ళ నిచ్చేది లేదు " అన్నాడు బాలుడు నిర్భయంగా. శివుడికి పట్టరాని కోపం వచ్చింది. చప్పట్లు చరచి ప్రమథ గణాలకు సైగ చేశాడు. బాలుణ్ణి ఈడ్చి పారేయడానికి వాళ్ళు ముందుకురికారు. 

    బాలుడు నవ్వుతూ, " పసివాడి వంటూ కనికరించినట్లే నటిస్తూ నామీదకు నీ గణాల్ని బలప్రయోగానికి ఉసికొల్పడం ఏమైనా బాగుందా? సరే, నేనూ గణాధిపతినే " అంటూ అంకుశదండాన్ని నేలకు గట్టిగా తాటించాడు. నేల ఈనినట్లు పుత్రగణపతి లాంటి రూపురేఖలుగల వాళ్ళు వేలకువేలు పుట్టుకొచ్చి, నందినీ, శృంగినీ, భృంగినీ, చండీశ్వరుణ్ణి  తమ చేతులలో ఉన్న అంకుశాలు, గదలు, పాశాలు, శూలాలతో గొడ్లను తరిమినట్టు తరిమేశారు. మిగతా శివానుచరులంతా జాడలేకుండా పారిపోయారు. పుత్రగణపతి గణమంతా అదృశ్యమయ్యారు. 

    శివుడు రుద్రుడై త్రిశూలం ఎత్తాడు. బాలుడు అంకుశ దండంతో అడ్డుకోగా ఖంగున మ్రోగుతూ త్రిశూలం పడిపోయింది. బాలుడు పకపక నవ్వుతూ " మా అమ్మ యిచ్చిన దండం నాచేత నుండగా నన్నేమీ చేయలేవు. నీవేదో చేద్దామనుకుంటున్నది నిర్విఘ్నంగా నెరవేర్చాలనే నేనూ సిద్ధంగా ఉన్నాను. తర్వాత కథ అమ్మ చూసుకుంటుంది " అంటూ అంకుశ గదా దండాన్ని దూరంగా విడిచి పెట్టాడు. శివుడు ఒళ్ళు తెలియని కోపంతో ఉన్మత్తుడిలాగా త్రిశూలాన్ని బాలుడి కంఠానికి గురిపెట్టి విసిరాడు. మరుక్షణంలో బాలుడు " అమ్మా!" అని పెద్దపెట్టున అరుస్తూండగా అతని తల తెగి ఆకాశానికి ఎగిరి పెద్ద జ్యోతిగా వెలిగిపోతూ, అంతరిక్షంలో లీనమైంది. సశేషం. తరువాయి జరిగే సంఘటనలు తిరిగి వచ్చే వారం. అంతవరకూ శలవు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: పుత్రగణపతి ::        తారకాసురుడి నిరంకుశత్వానికి తోడుగా, త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులు తపస్సులు చేసి వరాలుపొంది ఆకాశంలో ఎగురుతూ తిరి...