5, సెప్టెంబర్ 2025, శుక్రవారం

 :: చిత్రగణపతి ::

    దేవతలూ, రాక్షసులూ కలిసికట్టుగా క్షీరసాగరమథనం చేసి అమృతాన్ని సాధించారు. విష్ణువు జగన్మోహినీ రూపంలో రాక్షసులను మోసపుచ్చి అమృతాన్ని దేవతలపాలు చేశాడు. అమృతం తాగి అమరత్వం పొందిన దేవతలు గర్వంగా తిరుగసాగారు. దానవులకు జరిగిన అన్యాయానికి దేవతలపై కసి తీర్చుకోవడానికి తారకాసురుడు ఘోరమైన తపస్సుచేసి, బ్రహ్మను మెప్పించి చావులేని వరం కోరాడు. 

    " పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పనిది. మరోవరం కోరు " అన్నాడు బ్రహ్మ. 

    తారకాసురుడు బాగా ఆలోచించి శివుడి కుమారుడి వల్లనే తప్ప మరేవిధంగానూ తనకు చావులేని వరాన్ని బ్రహ్మనుంచి పొందాడు. 

    అప్పటికి శివుడి భార్య సతీదేవి దక్షయజ్ఞంలో యోగాగ్నితో తనువు చాలించింది. సంతానం లేకుండానే సతీవియోగం పొందిన శివుడు ఉన్మత్తుడిలాగ తిరిగి తిరిగి, హిమాలయ పర్వతాల్లో ఒకచోట విరాగిగా కఠోరదీక్షతో తపస్సుచేస్తూ ఉన్నాడు. 

    తారకాసురుడు రాక్షసులందర్నీ కూడగట్టుకొని విజృంభించాడు. ముల్లోకాలనూ ఆక్రమించుకొని, కసితీరా దేవతలను చిత్రహింసలు పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు తమ దీనావస్థను బ్రహ్మతో మొరబెట్టుకున్నారు. 

    " శివుడికి కుమారుడు పుట్టాలి, అతని వల్లనే తారకుడు చావాలి " అలాంటి వరాన్ని తారకుడికి ఇచ్చాను మరి. ఇంకెవరివల్లా తారకాసురుడికి ఎటువంటి హాని జరుగదు. మరోవిధంగా అతడికి చావూలేదు " అని బ్రహ్మచెప్పి దేవతలను వెంటబెట్టుకొని తరుణోపాయానికి విష్ణువు దగ్గరకు దారితీశాడు. 

    " సతీదేవి హిమవంతుడికి కూతురుగా పుట్టి పార్వతిగా పెరుగుతూ ఉన్నది. శివుడికి, పార్వతికి పెళ్ళి జరిగేలా చూడండి " అని విష్ణువు చెప్పాడు. దేవతలు నారదుణ్ణి హిమవంతుడి దగ్గరకు పంపించారు. నారదుడి ఆదేశం ప్రకారం హిమవంతుడు తపస్సులో నిమగ్నుడై ఉన్న శివుని దగ్గరకు వెళ్ళి, పూజించి తన కుమార్తె పార్వతి అతని తపస్సుకు అనుకూలంగా పరిచర్యలు చేస్తూండడానికి అనుమతించ వలసిందని వినయపూర్వకంగా కోరాడు. 

    శివుడి మౌనాన్ని అంగీకారంగా గ్రహించి హిమవంతుడు పార్వతిని శివుడికి పరిచర్యలు చేయడానికి పురమాయించాడు. 

    చిన్నతనంనుంచి పార్వతికి శివుడంటే చాలా యిష్టం. బాలపార్వతికి నారదుడు శివుడి గురించి అనేక విషయాలు చెబుతూండేవాడు. శివుడి కథలనూ, గుణగణాలనూ, మహిమలనూ పదేపదే వినడానికి కుతూహలపడుతూ ఉండేది పార్వతి. పెళ్ళాడితే శివుణ్ణే పెళ్ళాడాలని ఉవ్విళ్ళూరేది. అటువంటి శివుడికి పరిచర్యలు చేయడం తరుణప్రాయంలో ఉన్న పార్వతికి మహాభాగ్యంగా తోచింది. 

    తెల్లవారుతూండగా శివుడు తపస్సు చేస్తున్న పరిసర ప్రాంగణమంతా నెమలిపింఛపు కట్టతో తుడిచి, హిమానీ జలాల్లో మంచి గంధం కలిపి కల్లాపు జల్లి, ముత్యాలముగ్గులు తీర్చేది. బంగారు తీగెలతో అల్లి, రత్నాలు కెంపులు పొదిగిన తట్టలో శివుడికి యిష్టమైన ఫలపుష్పాలను, మారేడు పత్రిని, తెల్లకలువను తీసుకెళ్ళి పక్కనుంచేది. బంగారు కమండలువు నిండా హిమశిఖరాల నుండి జారే స్ఫటిక జలాలను నింపి, జపమాలతో కలిపి అమర్చి పెట్టేది. శివుణ్ణి ఆకర్షించడానికి ఎన్నో విధాలుగా అలంకరించుకొని వెళ్ళేది. కిన్నెరపై శివుడికి ప్రీతికరమైన భైరవి, ముఖారి, కేదార, శివరంజని మొదలైన రాగాల్ని ఆలపించేది. శివుడి చూపులు తనపై పడాలని పదేపదే ప్రయత్నిస్తూండేది. 

    తపోదీక్షలో నిమగ్నుడై శివుడు ఒక్కసారైనా తనను పరికించగలడేమోనని, అతని చల్లని చూపులు తనపై వాలాలని పార్వతి శివుడి ముఖాన్ని అలాచూస్తూ ఉండిపోయేది. శివుడు పొరపాటుగానైనా తనవంక చూడడేమో అని నిరాశా, నిస్పృహలతో ఊగిసలాడేది. 

    శివుడి మనస్సు చలించడానికి మన్మధుడి అవసరం తప్పనిసరి అని గుర్తించి, దేవేంద్రుడు మన్మధుణ్ణి పిలిచాడు. సకలమర్యాదలు చేసి తన సింహాసనంమీద కూర్చోబెట్టి ఎన్నోవిధాలుగా పొగిడి పొంగ వేశాడు. శివుడికి పార్వతిపై అనురాగం కలిగేలా చేయమని అర్థించాడు. 

    వసంతుడు సారథ్యం చేస్తూండగా మన్మధుడు చెరకు వింటినీ, పూలబాణాలనూ ధరించి రతీదేవితో చిలుకరథాన్నెక్కి, ఈశ్వరుడు తపస్సు చేస్తూన్న హిమాలయ శిఖరాల నడుమనున్న లోయను ప్రవేశించాడు. ఒక్కసారిగా ఆ లోయనంతటా వసంతఋతువు వెల్లివిరిసింది. రమణీయంగా మారింది. కోయిలల సంగీతంతో, తుమ్మెదల ఝంకారంతో అంతా రసమయంగా వెలిగిపోయింది. తానున్న పరిసరమంతా ఆకస్మికంగా మారిపోయినట్లుగా తోచి, శివుడు కళ్ళు తెరచి చూశాడు. అకాల వసంతాగమనానికి ఆశ్చర్యపోతే, తపోభంగ మైనందుకు నొచ్చుకుంటూండగా అతని చేతినుంచి జపమాల జారిపడింది. పార్వతి జపమాలను తీసి శివుడికి అందిస్తున్న సమయంలో మన్మధుడు విరియబూచిన నల్ల ఉమ్మెత్తపూల పొదచాటునుంచి నీలోత్పల బాణాన్ని శివుడి గుండెకు గురిపెట్టి వదిలాడు. అది తగలగానే శివుడు తృళ్ళిపడి తేరిపారజూచాడు. అతని మ్రోల మోకరిల్లి రెప్పవాల్చకుండా తననే చూస్తున్న పార్వతి ముఖబింబం ఎంతో మనోహరంగా కనిపించింది. 

    తన తపోభంగానికి శివుడు నివ్వెరపడుతూ రుద్రుడై తన మూడవ కంటిని తెరచి మన్మధుణ్ణి చూశాడు. మరుక్షణంలో శివుడి ఫాలనేత్రంనుంచి వెలువడిన జ్వాలల్లో మన్మధుడు కాలి బూడిదయ్యాడు. శివుడు దిగ్గున లేచి చరచరా తన కైలాస శిఖరాగ్రం మీదికి వెళ్ళిపోయాడు. 

    మన్మధుడి వెన్వంటి ఉన్న రతీదేవి భర్త బూడిద కుప్పమీద కూలిపోయి భోరుమన్నది. శివతపోభంగానికి మన్మధుణ్ణి పంపిన దేవేంద్రాది దేవతలను శాపాలు పెట్టబోయేసరికి, బ్రహ్మాది దేవతలు వచ్చి పార్వతీ శివుల కళ్యాణం జరిగినప్పుడు మన్మధుడు తిరిగి బతికివస్తాడని నచ్చజెప్పి, ఓదార్చి సహగమనం మాన్పించారు. రతీదేవి మన్మధుడి బూడిదకుప్పనే కనిపెట్టుకొని అలా దివారాత్రాలు గడపసాగింది. 

    పార్వతికి తన సౌందర్యంపట్ల నమ్మకం పోయింది. శరీర లావణ్యంమీద మమకారం పోయింది. శివుణ్ణి రంజింప చేయలేని తన తనువు నిరర్థకంగా తలచి శివరంజనిగ తపస్సు చేయడానికి పూనుకొన్నది. తల్లి మేనక ఎంత వద్దన్నా వినలేదు. కేవలం కొద్ది ఆకులను మాత్రమే తింటూ శరీరాన్ని కృశింపజేసుకొని తపస్సు మొదలుపెట్టింది. జయ, విజయ అనే యిద్దరు చెలికత్తెలు ఆమెకు తోడుగా ఉంటూ ఆమె యోగక్షేమాల్ని మేనకా, హిమవంతులకు తెలియజేస్తూ వస్తున్నారు. కొన్నాళ్ళ తర్వాత పార్వతి పర్ణాలను కూడా తినడం మానివేసి నిరాహారంగా తపస్సు చేస్తూ, అపర్ణ అని పేరుపొందింది. 

    శివుడు మన్మధుణ్ణి భస్మం చేశాడే గాని, మన్మధుడి బాణ ప్రభావం ఊరికే పోలేదు. పార్వతి తపస్సుకూడా ఫలితం సాధించింది. శివుడు మారువేషంతో పార్వతి దగ్గరకు వెళ్ళి, పార్వతి మనస్సును పరీక్షించాడు. పార్వతిని మనసారా మెచ్చుకొని పెళ్ళిచేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సప్తఋషులను హిమవంతుడి దగ్గరకు పెళ్ళిపెద్దలుగా పంపించాడు. శివుడంతటి వాడికి కన్యాదాత కాబోతున్నందుకు ఉన్నతోన్నతంగా శిఖరాలు పెంచుకున్నాడు హిమవంతుడు. ఋషులు ముహూర్తం పెట్టి వెళ్ళారు. 

    ప్రమథగణాలు ముందు నడవగా శివుడు పెళ్ళికుమారుడై హిమవంతుడింటికి తరలి వెళ్ళాడు. హిమాలయ శిఖరాలు పెళ్ళిపందిరికి రాటలైనాయి. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలుగాగల దేవతలు, సప్తర్షుల వెంట వేలాది మహర్షులు, నారదాది మునిపుంగవులు అక్కడకు చేరుకున్నారు. 

    పెద్ద ముత్తయిదువు అరుంధతి శివుడి ఫాలనేత్రం రెప్పమీదుగా కల్యాణ తిలకం నిలువుగా దిద్దింది. పెళ్ళి అలంకరణతో శివుడు చాలా సుందరంగా తయారయ్యాడు. అప్పుడు అందరూ శివుణ్ణి - సుందరేశ్వరుడు అని అన్నారు. 

    సర్వాలంకార శోభితయై విద్యుల్లతలాగా మెరిసిపోతూన్న పార్వతిని పెళ్ళికూతురుగా తీసుకొచ్చి విష్ణువు శివుడితో " నీవు సుందరేశ్వరుడివి అయితే, నా చెల్లెలు పార్వతి మీనాక్షీదేవి " అని అంటూ పార్వతి కుడిచేతిని శివుడి కుడిచేతిలో పెట్టి యిద్దర్నీ పెళ్ళిపీటలమీద కూర్చోబెట్టాడు. 

    శివపార్వతుల వివాహం ఎంతవైభవంగా జరగాలో అంతవైభవంగా జరిగింది. 

    హిమాలయ లోయలో శివుడు, పార్వతి తపస్సులు చేసిన చోటనే దేవశిల్పి విశ్వకర్మ కొత్త దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కోసం దివ్యమైన అంత:పుర మందిరాన్ని నిర్మించాడు. 

    మంగళతూర్య నాదాలు మిన్నంటుతూండగా చేతులు కలుపుకొని శివుడు, పార్వతి అందరి మధ్య నడుస్తూ మందిరానికి బయలుదేరారు. మందిరాన్ని చేరుకునే దారిలోనే మన్మధుడి భస్మరాశి ఉన్నది. ఆ బూడిదకుప్పను అంటిపెట్టుకొని రతీదేవి కన్నీళ్ళతో మోకరిల్లి దోసిలిపట్టి పతిభిక్ష అడుగుతున్న దానిలాగ ఉన్నది.

    శివపార్వతులు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె తలపై చేతులుంచి దీర్ఘ సుమంగళిగా ఉండు అని దీవించారు. శివుడు మళ్ళీ తన మూడవ కంటినే తెరచి ఈసారి చల్లని వెన్నెల కాంతితో చూడగానే భస్మరాశి మాయమై మన్మధుడు నిజరూపంలో లేచి అందరికీ కనిపించి, చెరకు వింటి నారిని ఝమ్మనిపించి అదృశ్యమైపోయాడు. 

    అప్పుడు శివుడు రతీదేవితో " అమ్మా! నీ భర్త తిరిగి జీవించాడు. నీకు ఎప్పటిలాగే సదా కనబడుతూ ఉంటాడు. నీ రెండు కళ్ళకు తప్ప మరే మూడోకంటికి కనిపించడు. ఎవ్వరూ అతణ్ణి చూడలేరు కనుక అతణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేరు. అతని బాణాల బారి నుంచి తప్పించుకోలేరు. నీకు తప్ప ఇతరులకు కనిపించడం అతని యిష్టం పైన ఉంటుంది. అలాంటి వరాన్ని అతనికి యిస్తున్నాను " అని చెప్పాడు. 

    పార్వతీ శివులు గృహప్రవేశం చేశారు. కనిపించని మన్మధుడు కూడా కనిపించని పూల బాణాలతో రతీదేవితో మందిరంలోకి వెళ్ళాడు. అరుంధతి నూతన దంపతులకు ఎర్రనీటితో దిష్టితీసి, కర్పూరహారతి పట్టింది. అప్పుడు విశ్వకర్మ తెరతో నిండా కప్పబడి ఉన్న ఒక నిలువెత్తు పలకను పార్వతీ శివుల ఎదురుగా నిలబెట్టి " ఇది ఒక గొప్ప అపురూప చిత్రపటము. ఈ చిత్రంలో యిద్దరూ చిత్రింపబడి ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరి సౌందర్యం ఎక్కువ గొప్పదో మాబోటి వారికి ఎవరికీ చెప్ప శక్యం కాలేదు. అది చెప్పగలవారు మీరిద్దరే నన్న నమ్మకంతో మీముందు పెడుతున్నాను, చెప్పండి " అని తెరను తొలగించాడు. 

    అది ఒక నిలువుటద్దం. అద్దంలో శివుడు, పార్వతి తమను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. 

    " ముసిముసి నవ్వులు సమాధానాలు కావు. చెప్పితీరాలి " అన్నాడు నారదుడు. పార్వతిని క్రీగంట చూస్తూ, " ధగధగా శుక్రునిలాగా మెరుస్తున్న ముక్కరగల చిత్రాంగి సౌందర్యమే గొప్పది " అన్న వెంటనే పార్వతి సిగ్గుతో ఎర్రబడ్డ చెక్కిళ్ళతో " ఆ  ముక్కంటి పురుషుడి సౌందర్యమే సృష్టిలో గొప్పది " అని వీణ మీటినట్లు పలికింది.

    అందరూ శివపార్వతులపై పుష్పాక్షతలు చల్లి వెళ్ళిన తర్వాత కొత్త దంపతులిద్దరూ పట్టు దిళ్ళు అమర్చిన తూగుటుయ్యాలపై కూర్చున్నారు. 

    వారి కెదురుగా విశాలపు గోడమీద మనోహరమైన పెద్ద చిత్తరువు చిత్రింపబడి ఉన్నది. చిత్రం మధ్యలో అందమైన ఓ ఏనుగుల జంట నాట్యం చేస్తున్నట్లుగా ముందరి కాళ్ళు ఎత్తి ఎదురెదుగా ఎత్తిన తొండాలను పెనవేసుకొని ఉన్నవి. తోరణం కట్టినట్టు ఉన్న ఆ రెండు ఏనుగుల మధ్యనుంచి కనిపిస్తున్న సరోవరంలో పెద్ద పద్మాలు వికసిస్తూ ఉన్నవి. ఆ చిత్రంలో చిత్రింపబడిన ఏనుగుల జంటపై శివపార్వతుల చూపులు నిలిచాయి. అంతలో పద్మ చిత్రమున్నచోట వెన్నెల వంటి జ్యోతి వెలిగింది. ఆ వెలుగు క్రమక్రమంగా పెద్దదై వ్యాపించింది. ఆ వెలుగులో శశివర్ణంతో మెరిసిపోతూన్న విఘ్నేశ్వరుడు వారికి కనిపించాడు. 

    విఘ్నేశ్వరుడి ముఖము ఏనుగు ముఖమే. అయినప్పటికీ, ఆ ముఖంలో దివ్యత్వం నిండి ఉన్నది. ప్రసన్నత వెల్లి విరిస్తూన్నది. అతని చూపులు శాంతంగా మేథస్సునూ, శక్తిని చాటుతున్నాయి. అతని దోరపుబొజ్జ నిండుగా తళతళ లాడుతున్నది. అభయ హస్తంతో నిల్చొని ఉన్న విఘ్నేశ్వరుడు పార్వతికి ముద్దుల మూటలాగ కనిపించాడు. 

    విఘ్నేశ్వరుని చూస్తూంటే శివుడికీ, పార్వతికీ ఎన్నడు ఎరుగని అనిర్వచనీయమైన ఆనందమేదో తమలో ఉప్పొంగుతూన్నట్లు అనిపించింది. ఆ ఆనంద పారవశ్యంలో నోట మాటరాక విఘ్నేశ్వరుణ్ణి రెప్పవాల్చకుండా చూస్తున్నారు. విఘ్నేశ్వరుడు ఎడమ పక్కకు సొంపుగా వంపుపెట్టి ఉన్న చిన్నారి తొండాన్ని సవరించుకొని ఊపుతూ, ముద్దుముద్దు మాటలతో " నేను విఘ్నేశ్వరుణ్ణి! విఘ్నాలను అరికట్టే వినాయకుడిని. పంచభూత గణాలకు అధిపతిని. గణపతిని. చిత్ర విచిత్రమైన రూపంగల చిత్రగణపతిని. మీ ఇరువురి అనురాగ ఫలితంగా శివుడి తేజస్సుతో కుమారస్వామి పుట్టి తారకాసురుణ్ణి అంతమొందిస్తాడు. కుమారస్వామికి ముందుగా నేను అవతరించి మీకు పుత్రుడుగా ఉంటాను. పుత్ర గణపతినై అవతరించ బోతున్నాను " అని చెపుతూంటే పార్వతి అతణ్ణి అందుకొని ఎత్తుకోవాలని చేతులు చాచింది. విఘ్నేశ్వరుడు వెలుగుతో సహా అంతర్థానమయ్యాడు. 

    అంతవరకూ తమకు కనిపించినదంతా కలా నిజమా అని పార్వతీ, శివులు ఒకరినొకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో అంతా మరచిపోయారు. వారికి కనిపించిన అద్భుతమంతా మరుపుకొచ్చింది. 

    శివుడు, పార్వతి ఆ మందిరంలో ఆనంద సముద్రంలో మునిగి సంసారం సాగిస్తున్నారు. ఆ సమయంలోనే జగత్తుకు కనీవినీ ఎరుగని ఉపద్రవం ముంచుకొచ్చింది. అదేమిటో వచ్చేవారం తెలుసుకుందాం. ఇప్పటికైతే సశేషం. 


    


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: పుత్రగణపతి ::        తారకాసురుడి నిరంకుశత్వానికి తోడుగా, త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులు తపస్సులు చేసి వరాలుపొంది ఆకాశంలో ఎగురుతూ తిరి...