:: బ్రాహ్మణప్రభావము ::
పూర్వకాలంలో పరిక్షితుడు అనే రాజు అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు. సూర్యవంశజుడైన ఆ రాజు సూర్యుడివలె తేజస్సుతో వెలుగుతూ ఉండేవాడు. అతడు ఒకనాడు గుర్రమెక్కి అడవికి వేటకెళ్ళాడు. అనేక మృగాలను వేటాడాడు. ఒకచోట ఆ మహారాజు ఒక అందగత్తెను చూచి, మదన భావానికి వశుడై ఆమెను సమీపించాడు. ఆమె కూడా అతనిని నర్మగర్భంగా చూచి వలపును ప్రకటించింది. ఆమె తండ్రి ఆజ్ఞ చొప్పున తగిన వరుడి కొరకు అన్వేషిస్తూ ఆ అడవిలో నడయాడుతున్నదని తెలిసికొని ఆమెపై గల తన వలపును తెలియబరిచాడు. ఆమె అతడిని వివాహమాడటానికి అంగీకరించింది. కాని, ఆమెను ఎప్పుడూ జలవిహారానికి వినియోగించకూడదని కట్టడి చేసింది. అతడు ఆ నియమానికి కట్టుబడి ఆమెను రాజదానికి తనతో తీసికొనిపోయాడు. అక్కడ క్రీడాభవనాలలో, ఉద్యానవనాలలో ఆమెతో రమిస్తూ విహరించాడు. ఒకనాడు విలాసభవనం నుండి వెలువడిన పరిక్షితుడి శరీరం చెమటతో తడిసింది. అందువలన సమీప సరోవరంలో స్నానం చేయాలని అనుకున్నాడు. తన ప్రియురాలిని కూడా రమ్మని, సరోవరంలో దిగి జలకాలాడుమని పిలిచాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ ఆ కొలనులో దిగి వెంటనే అదృశ్యమైపోయింది.
రాజు అందుకు ఆశ్చర్యపడిపోయాడు. ఆ కొలనంతా ప్రియురాలికోసం గాలించాడు. నీరంతటనీ తోడి బైటపోయించాడు. అయినా, ఆమె కనబడలేదు. కాని, అడుగున ఎన్నో కప్పలు ఉండటం గమనించాడు. అవే తన ప్రియురాలిని మ్రింగి ఉంటాయని భావించి ఆగ్రహించి, తన రాజ్యంలో ఉన్న కప్పలన్నింటినీ వెదకి వెదకి చంపటానికి భటులను ఆజ్ఞాపించాడు. వారు నీటిపట్టులన్నింటినీ గాలించి కప్పలను చంపి కుప్పలుగా పోయ నారంభించారు.
దానిని గమనించి కప్పల రేడు ఒక మహర్షి రూపం ధరించి పరిక్షితుడు వద్దకు వచ్చి అతడి కప్పలమీది ద్వేషానికి కారణమడిగాడు. తన ప్రేయసికి చేసిన అపకారానికి ప్రతిగా కప్పలను చంపుతున్నానని ఆ రాజు చెప్పాడు. ఆమాటలు విని మునివేషం వదలి కప్పలనాయకుడైన ఆయువు నిజరూపంలో కనబడి, పరిక్షితుని ప్రేమించిన కన్య తన కూతురనీ, ఆమె పేరు సుశోభన అనీ ప్రకటించాడు. ఆమె తన వలపుతో అంతకుముందే ఎందరినో మోసగించిందని చెప్పాడు. రాజు కోరికపై ఆమెను నిజరూపంతో అతడికి అప్పగించాడు. ఆమె రాజులను చులకనగా భావించి మోసగించింది కాబట్టి ఆమెకు పుట్టే కొడుకులు మోసగాండ్రు అవుతారని శపించాడు. ఆయువు కూతురుకు హితవు చెప్పి వెళ్ళిపోయాడు. పరిక్షితుడు సుశోభనయందు శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కొడుకులను పడశాడు. వారిలో పెద్దవాడైన శలుడికి పట్టంకట్టి తపోవనానికి వెళ్ళిపోయాడు.
ఒకనాడు శలుడు బంగారు తేరుమీద అడవికి వేటకు వెళ్ళాడు. ఎన్నో మృగాలను సంహరించాడు. ఒక మృగాన్ని వాడియైన బాణంతో కొట్టాడు. గ్రుచ్చుకొన్న బాణంతో ఆ లేడి తప్పించుకొని పారిపోసాగింది. దాని వెంట రథాన్ని పరిగెత్తించాడు. కాని, ఆ రథాశ్వాలు అంత వేగంగా రథాన్ని లాగలేకపోయాయి. రథసారథి కామ్యజాతి గుర్రాలయితే రథాన్ని అద్భుత వేగంతో లాగగలవని రాజుకు విన్నవించుకున్నాడు. కామ్యహయాలు వామదేవుడనే మహర్షివద్ద ఉంటాయని తెలియజెప్పాడు. శలుడు వామదేవాశ్రమానికి వెళ్ళి, ఆ కామ్యాశ్వాలను అర్థించాడు. ఆముని కరుణించి, పని తీరిన తరువాత వెంటనే ఆ గుర్రాలను తిరిగి తనకిచ్చే కట్టడితో ఆరాజుకు కామ్యాశ్వాలను యిచ్చాడు. శలుడు ఆ కట్టడికి అంగీకరించి, కామ్యాశ్వాలను రథానికి పూన్చుకొని, మృగాన్ని వేటాడి దానిని చంపి, తన పట్టుదల సాధించి సంతృప్తి చెందాడు. కాని, ఆ కామ్యాశ్వాలను వామదేవుడికి తిరిగి ఇవ్వకుండానే తన రాజధానికి వెళ్ళాడు. " ఆ మేటి గుర్రాలు రాజులదగ్గర ఉండదగినవి కాని, పేద బాపడు కెందు"కని భావించి అహంకరించి ఆ గుర్రాలను తన అంత:పురంలో ఉంచుకొన్నాడు.
నెలరోజులు గడిచాయి. వామదేవుడు శలుడి దురహంకారాన్ని పసికట్టాడు. అశ్వాలను అడిగి తెమ్మని తన శిష్యుడైన ఆత్రేయుడిని పంపాడు. ఆత్రేయుడు రాజును దర్శించి వామదేవుడి సందేశాన్ని వినిపించాడు. శలుడు దురహంకారంతో దుర్భాషలాడి గుర్రాలనిచ్చేది లేదని, తిరిగి పొమ్మని తిరస్కరించాడు. ఆత్రేయుడు తిరిగి వెళ్ళి గురువుకా సంగతి చెప్పాడు. వామదేవుడు ఆగ్రహించాడు. శలుడి దగ్గరకు స్వయంగా వెళ్ళాడు. పరద్రవ్యాపహరణ పాపహేతువని హెచ్చరించి తన గుర్రాలను తిరిగి ఇచ్చి మాట నిలబెట్టుకోమని కోరాడు. శలుడు అతడి మాటలు పట్టించుకొనలేదు. బ్రాహ్మణులకు గుర్రాలు నిరుపయోగాలనీ, గుర్రాలకు బదులు ఎద్దులనుగానీ, అధిక సంఖ్యలో కంచరగాడిదలనుకానీ ఇస్తానని చెప్పాడు. అంతటితో ఆగక కామ్యజాతి గుర్రాలను ముని కోరటం అనుచితమనీ నిందించి, తిరిగి పొమ్మని పరుషంగా పలికాడు. అతడి మాటలను వామదేవుడు సహించలేకపోయాడు. " విప్రుల ధనాన్ని అపహరించటమే ఒక పాపం. దానికి బదులు మరేదో ఇస్తాననటం హాస్యాస్పదం. అది అన్యాయం " అన్నాడు. ఆ మాటలకు శలుడు మండిపడ్డాడు. వామదేవుడిని పట్టి బంధించి శూలాలతో పొడిచి చంపండని భటులను ఆజ్ఞాపించాడు. వామదేవుడి ముఖం కోపంతో ఎర్రబారింది. అందులోనుండి ఆ క్షణంలో అనేకమంది రాక్షసులు పుట్టి, శలుడిపై లఘించి శూలాలతో పొడిచి అతడిని చంపేశారు. మునీంద్రుడు తిరిగి వెళ్ళాడు.
శలుడి తరువాత అతడి తమ్ముడు నలుడు రాజయ్యాడు. కొంతకాలం గడిచాక వామదేవుడు మరల రాజాస్థానానికివచ్చి, తన గుర్రాలను తిరిగి ఇచ్చి ధర్మాన్ని కాపాడుమని నలుడిని అడిగాడు. నలుడు మండిపడ్డాడు. వామదేవుడికి యుక్తాయుక్త విచక్షణ లేదని నిందించాడు. విషబాణంతో వామదేవుడి వక్షాన్ని చీల్చి చంపుతానని సారథిని విల్లుని సిద్ధం చేయమన్నాడు. ఆమాటలు వామదేవునికి ఈటెలుగా చెవులకు తాకాయి. " ఓ రాజా! నీవు ప్రయోగించే బాణం అంత:పురంలో ఉన్న పసివాడైన నీ కొడుకును సంహరిస్తుంది చూడు " అని హెచ్చరించాడు. వామదేవుడన్నంత పనీ అయింది. అంత:పురంలో బాలుడు చనిపోయాడని స్త్రీలు రోదించ నారంభించారు. నలుడు కోపోద్రిక్తుడయ్యాడు. బాణంతో బ్రాహ్మణుడిని చంపటానికి వింటినారి సారించాడు. కాని, వామదేవుడి మహిమతో నలుడి చేతులు అమ్ముతోపాటు స్తంభించిపోయాయి. నలుడు ఆశ్చర్యపడి, చేసేదిలేక తలవంచుకున్నాడు. కొంత తడవు విచారించి అందరూ వినేటట్లు ఈ విధంగా ప్రకటించాడు. " నేను అనేక దుర్భాషలాడాను. అవన్నీ వమ్మయిపోయాయి. బాణంవేసే శక్తి నాకు పోయింది. బ్రాహ్మణమాహాత్మ్యం నిజంగా గొప్పది. నేను వామదేవుడిముందు ఓడిపోయాను. ప్రజలారా! మీ ముందు ఈ మహామునిని శరణు వేడుతున్నాను " అని పేర్కొన్నాడు. అందరూ అతడితోపాటు మునీంద్రుని శరణు వేడారు. వామదేవుడు ప్రసన్నుడై స్తంభనస్థితినుండి రాజును విముక్తుడిని చేశాడు. మృతబాలుడిని తిరిగి బ్రతికించాడు. నలుడు తన అంత:పురంనుండి వామ్యాశ్వాలను తెప్పించి వామదేవుడికివినయంతో సమర్పించాడు. వామదేవుడు వామ్యాశ్వాలను తీసికొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. బ్రాహ్మణ ప్రభావం అంటే ఇటువంటిది అని మార్కండేయమహర్షి ధర్మరాజుకి వివరించి చెప్పాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి