:: శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించిన కథ ::
ద్రవిళదేశానికి రాజైన సత్యవ్రతుడు నీటిని మాత్రమే ఆహారంగా గ్రహిస్తూ ఒకనాడు కృతమాలిక అనే పేరుగల నది ఒడ్డున హరి సమర్పణంగా జలతర్పణం చేస్తూ ఉండగా అతని దోసిలిలో ఒక చేపపిల్ల కనిపించింది. అతడు ఉలిక్కిపడి ఆ చేపపిల్లను నదిలో వదలినాడు. నీటిలోనుండి చేపపిల్ల రాజుతో ఇలా అన్నది. " దయానిలయుడా! ఈ యేటిలో దాయాదులను చంపే పాపిష్ఠి చేపలున్నాయి. అవి చిన్నచేపలను పట్టి మింగుతాయి. అందువల్ల నేను ఇక్కడ ఉండలేక నీ దోసిటిలోనికి వచ్చినాను. దయలేకుండా నన్ను నట్టేటిలో త్రోయడం న్యాయంకాదు. పుణ్యాత్ముడా! ఇకమీదట చేపలుపట్టే జాలరులు వలలు తీసుకొని వస్తారు. నదిని కలతపెట్టి బంధించి, ఎగిరిపోనీయకుండా నామెడ పట్టుకుంటారు. అప్పుడు ఎక్కడ దాగుకోగలను? దీనవత్సలా! నన్ను పెద్దచేపలయినా తింటాయి. అలాకాని పక్షంలో ధూర్తులయిన వేటకాండ్రయినా పట్టుకొంటారు. ఆ విధంగా చచ్చిపోకుండా నన్ను రక్షించు. బలహీనులను కాపాడటం కన్నా మరొక పుణ్యం ఉందా? " చేపపిల్ల మాటలు విని జాలిపడి దయకు నిలయమైన వాడగు సత్యవ్రతుడు, ఆ చేపపిల్లను నెమ్మదిగా అందుకొని తన కమండలంలోని నీటిలో ఉంచి తన నివాసానికి తీసికొని వెళ్ళినాడు. ఒక్కరాత్రిలోనే ఆ చేపపిల్ల పెరిగి పెద్దదై కమండలమంతా నిండిపోయింది. కదలటానికి తావులేక ఆ చేపపిల్ల రాజుతో ఇలా అంది " ఓ రాజేంద్రా! నేను ఉండడానికి ఈ కమండలం చాలా చిన్నది. చాలటం లేదు. ఇంకొక దానిని తీసుకురా! " అని చేపపిల్ల అడుగగా సత్యవ్రతుడు, ఒక నీళ్ళ కడవలో దానిని విడిచినాడు. ఆ చేప క్షణకాలంలోనే మూడు చేతుల పొడవై ఆ పాత్ర అంతా నిండిపోయింది. ఆ చోటు దానికి చాలక ఇంకొక దానిని తెమ్మన్నది. దయానిధి అయిన సత్యవ్రతుడు ఆ చేపను ఒక చిన్న మడుగులో విడిచినాడు. అది ఆ మడుగుకంటే పెద్దదై " నేను తిరగడానికి ఇది చాలదు " అని చెప్పింది. ఉత్తముడైన రాజు ఆ చేపను ఎక్కువ నీళ్ళుండే పెద్ద చెరువులో విడచినాడు. ఆ చేప ఆ చెరువుకన్నా పెద్దదిగా పెరిగింది. చోటు చాలదని చెప్పుకొన్నది చేప. ఆ పుణ్యాత్ముడు ఆ పెద్ద చేపను పెను కడలిలో విడిచినాడు. సముద్రంలో చేరిన తరువాత " పెద్ద మొసళ్ళు నన్ను పట్టుకొని చంపి మ్రింగుతాయి. ఇంతకాలమూ కాపాడి ఇప్పుడు నన్ను విడవవద్దు. బయటకు ఎత్తు " అని ఆ చేప రాజుతో మొరపెట్టుకొన్నది.
అప్పుడు నేర్పరియైన చేపతో రాజు ఇట్లా అన్నాడు. " పురుషోత్తమా! ఒక్క దినంలోనే నీవు నూరు యోజనాల దూరం వ్యాపించినావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనీవిని ఎరుగము. చేప జాతులకు ఇంత శరీరము ఉండదు. నీవెవరు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీవు దీనులను కాపాడటం కోసం చేపరూపం ధరించిన విష్ణుదేవుడవని తెలుసుకున్నాను. అచ్యుతా! నారాయణా! లోకాలను సృష్టించి, పోషించి, లయించే మహానుభావుడవు నీవు. దిక్కులేని భక్తులమయిన మాకు నీవే దిక్కు. మహిమతోకూడిన నీ అవతారాలు అన్ని ప్రాణులకూ మేలు కలిగిస్తాయి. అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాను. మేము నీకు పరాయివాళ్ళం కాము. నిర్మలమైన జ్ఞానం కలవాళ్ళం. మా రక్షణకు నీవున్నావు. ఎల్లప్పుడు భక్తులు ఎక్కడ ఉంటే నీవూ అక్కడనే ఉంటావు. నిన్ను స్తుతించిన వారికి ఎప్పటికీ కీడు జరుగదు. శ్రీహరీ! నీవు లక్ష్మీదేవి వక్షస్థలంమీద క్రీడిస్తూ సంతోషంతో విహరించే ఆనంద స్వరూపుడవు. అజ్ఞానంతో కూడిన చేప రూపాన్ని ఎందుకు ధరించావో చెప్పు " ఈ విధంగా సత్యవ్రత మహారాజు అడుగగా ఆ యుగం చివర ప్రళయ కాలంలో ఒంటరిగా సాగరంలో సంచరించటానికి చేపరూపాన్ని ధరించిన విష్ణుమూర్తి సత్యవ్రతునితో ఇలా అన్నాడు/
" ఓ నృపవర్యా! ఈ రేయి గడచిన తరువాత రాబోయే పదవ దినంతో బ్రహ్మకు ఒక పగలు పూర్తవుతుంది. భూలోకాది ముల్లోకాలూ ప్రళయ సాగరంలో మునిగిపోతాయి. అప్పుడు నా ఆనతి మేరకు ఒక పెద్ద ఓడ నీ చెంతకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధీ సమూహాలనూ, విత్తన రాశులనూ ఆ నౌకపై ఉంచుకొని ప్రళయ సముద్ర జలాలలో విహరిస్తావు. నీతో కలిసి సప్త ఋషులు కూడా ఆ ఓడలో ఉంటారు. మీ ముందు భాగంలో పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల శరీర కాంతులు మిణుకు మిణుకుమంటూ మెరుస్తుంటాయి. సాగరంలో నౌక ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది. ఆ నౌక కడలి అలలకు దెబ్బతినకుండా మత్స్యరూపం ధరించిన నేను అన్ని వైపులా పెద్ద ఈకలు కలిగిన నా రెక్కలను కదిలిస్తూ ఉంటాను. నా ఆనతి మేరకు ఒక పెద్దపాము అక్కడ కనిపిస్తుంది. సుడిగాలులకు నావ తిరుగబడకుండా ఆ పాముతో నా కొమ్ము కొనకు ఆ నౌకను కట్టివేసి, నీకూ మునులకూ కీడు కలుగకుండా ఆ ప్రళయరాత్రి గడిచేవరకు నేను కాపాడుతుంటాను. ఇందుకోసమే నేను ఇలాంటి మత్స్యరూపాన్ని ధరించినాను. ఇంకా విశేషమేమంటే నేను నిన్ను అనుగ్రహిస్తాను. పరబ్రహ్మ స్వరూపమయిన నా మహిమను తెలుసుకో " ఈ విధంగా పలికి శ్రీహరి సత్యవ్రతుడు చూస్తుండగానే అదృశ్యమైనాడు. చేపరూపంలో మాధవుడు పలికిన మాటలను తలుచుకొంటూ తాపసియైన సత్యవ్రతుడు దర్భల శయ్యపై తూర్పువైపు తలగడగా పరుండి ప్రళయ సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. అటు పిమ్మట ప్రళయం సమీపించింది.
మెరుపులతో కూడిన మేఘాలు ఎడతెరపి లేకుండా భయంకరమైన వర్షం కురిపించినాయి. సముద్రాలు చెలియలికట్టలు దాటి పొంగి పొరలి దేశాలను ముంచివేసినాయి. బ్రహ్మకల్పం యొక్క అంత్యకాలంలో ఏర్పడిన ఆ ప్రళయం నైమిత్తికమయినది. ప్రళయం అయిదువిధాలు. అవి దైనందినం, బ్రాహ్మం, ఆదిభౌతికం, నిత్యం నైమిత్తికం అనేవి. నిత్యం, నైమిత్తికం, దైనందినం, మనుప్రళయం, మహాప్రళయం అనికూడా కొందరు చెబుతారు. జలప్రళయం, అంటే., ఉప్పెన, అగ్నిప్రళయం అంటే, దహనం, పృథివీప్రళయం, అంటే, భూకంపం, వాయుప్రళయం అంటే, వాయుగుండం, ఆకాశప్రళయం అంటే కుంభవృష్టి అనే పాంచభౌతిక ప్రళయాలూ ఉన్నాయి. సరే!, ఇక్కడ, ఆకాశంలో ఎగిసిపడుతున్న అలలుగల ప్రళయకాల జలరాశిలో సకల భూతరాశులూ కూలిపోయినాయి. లోకాల సరిహద్దులు మాయమయినాయి.
బ్రహ్మదేవుడు విశ్రాంతి లేకుండా పూనికతో ప్రాణులను సృష్టించి అలసిపోయినాడు. ఆయన నడుమూ, వీపు బిగుసుకుపోయినాయి. అతడు నీలుగుతూ, ఆవులిస్తూ సృష్టి కార్యాన్ని ఆపినాడు. శరీరాన్ని వాల్చి, రెప్పలు మూసుకొని, చెయ్యి తలగడగా ఉంచుకొని, గురకలు పెడుతూ, కలలుకంటూ నిద్రపోయినాడు. ఆయన నోళ్ళనుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడనే ఒక రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించినాడు. హయగ్రీవుడనే దేవుడు విష్ణువు అవతారంగా పురాణాలలో కీర్తింపబడినాడు. అతడు జ్ఞానానంద స్వరూపుడు. సర్వ విద్యలకు ఆధారమైనవాడు. ఇక్కడి దానవుని పేరుగూడా హయగ్రీవుడే! ఇతడు జ్ఞాననిలయాలైన వేదాలను బ్రహ్మ దగ్గరనుండి దొంగిలించినాడు. వేదాలను చేజిక్కించుకొన్న ఆ రాక్షసుడు వాటిని చదువుతూ, బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడినాడు. బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం కనిపెట్టి వాడు వేగంగా సాగరంలోనికి ప్రవేశించినాడు. ఆ ప్రళయకాలంలో వేదాలను అపహరించి సముద్ర జలాలలో మునిగి దాగిన ఆ రాక్షసుడిని జయించడమూ, ఓషధులూ, విత్తనాల పొట్లాలు సముద్రంలో తడిసిపోకుండా రక్షించడం, ఈ రెండూ పురుషోత్తముడగు విష్ణుదేవునకు కర్తవ్యాలయినాయి.
ఆ పురుషోత్తముడు ఆ మహారాత్రి ప్రవేశించే సమయాన మత్స్యావతారం ధరించినాడు. చిన్న రెక్కలూ, పెద్ద మీసాలూ, పొట్టి తోకా, బంగారు కాంతులీను మేనూ, అందమైన మచ్చలూ, చక్కని మొగమూ, ఒక కొమ్ము, మిరుమిట్లు కొలిపే చూపులూ కలిగి ఆ మహామత్స్యం విరాజిల్లుతున్నది. మత్స్యావతారుని క్రీడలు అద్భుతంగా ఉన్నాయి. తళతళలాడే పెనుచేప రూపంలో ప్రళయ జలాలలో వేదాలను వెదకటానికి పూనుకొన్నాడు. ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు. ఒకసారి వేగంగా గట్లవైపు దుమికి వస్తాడు. ఒకసారి ఆకసానికి ఎగురుతాడు. ఒకసారి నీటిలో ఒదిగి దాగుతాడు. ఒకసారి సముద్రంలో మునిగి తేలుతాడు. ఒకసారి బ్రహ్మాండాన్ని ఒరుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి చేపల గుంపును మ్రింగుతాడు. ఒకసారి నీటిని పీల్చి వెలుపలికి చిమ్ముతాడు. అలా ఆ మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదిలిస్తూ, మేని పొడలు మెరిపిస్తూ, కన్నుల కాంతులు ప్రసరిస్తూ, ఒడలు విరుచుకొంటూ, తళతళలాడుతూ సముద్ర గర్భంలో విహరించినాడు.
సత్యవ్రతుడు నారాయణుని స్మరిస్తుంటాడు. ప్రళయ సముద్రం భూలోకాన్ని ముంచెత్తే సమయం వచ్చింది. శ్రీహరి ప్రేరణతో ఒక ఓడ వచ్చింది. ఆ ఓడను చూచినాడు సత్యవ్రతుడు. అతడు ఓడపై పెక్కు ఓషధులను, విత్తనాలను అమర్చినాడు. విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తూ, మునులతోపాటు ఓడపై కూర్చున్నాడు. భయంతో సముద్రంపై తేలిపోతున్నాడు. అప్పుడు ఆ రాజుకు భక్తుల హృదయాలను అలంకరించే విష్ణుమూర్తి మహామత్స్యరూపంతో ఎదుట సాక్షాత్కరించినాడు. సత్యవ్రతుడు ఒక పెద్ద పామును తాడుగా చేసి ఆ ఓడను మహామత్స్యం కొమ్ముకు కట్టివేసినాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరచుకొన్నాడు. ఋషులతోపాటు అతడు విష్ణుమూర్తిని ఇలా పొగడ సాగాడు. " ఓ భగవంతుడా! తమలో ఆవరించిన అజ్ఞానం వల్ల కొందరు భ్రాంతిలో తిరుగుతుంటారు. మునుగుతూ, కల్లోలపడుతూ పెక్కు దారులవెంట పరుగులు తీస్తుంటారు. అలాంటివారు అదృష్టంవల్ల పరమాత్ముడవైన నిన్ను సేవించి కైవల్యాన్ని పొంది సంతోషిస్తుంటారు. అలా అందరినీ ఆదరించే నీవు మమ్ములను రక్షించు. ఓ లక్ష్మీపతీ! సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తుంటావు. జ్ఞానం లేనివానికి, దుర్భుద్ధి కలవానికి, తండ్రివి నీవే. కనుక కన్నులున్నవాడు కనులు లేని వానికి దారి చూపిన రీతిగా మమ్ములను ఉద్ధరించు. గురుడవై మాకు దారిని చూపించు. శ్రీహరీ! అగ్నిలో చేరడంవల్ల బంగారానికి రంగు, అదే మెరుగు కలుగుతుంది. ఆ విధంగానే నిన్ను పూజించే భక్తుల పాపాలు నాశనమై ముక్తి లభిస్తుంది. అంటూ అనేక రీతుల విష్ణుదేవుని ప్రార్థించాడు. అతని ప్రార్థనను ఆలకించి మత్స్యావతారుడై సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించినాడు. ఆ పరమాత్ముడు సాంఖ్యయోగ శాస్త్రాలతో కూడిన పురాతనమైన వేదభాగాన్ని అతనికి బోధించినాడు. మునీశ్వరులతోపాటు సత్యవ్రతుడు పరమ పురుషుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ధన్యుడైనాడు. సత్యవ్రతుడు తరువాతి కల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడనే పేరుతో జన్మించి, విష్ణుమూర్తి దయవల్ల ఏడవ మనువైనాడు. ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే పర్యంతమూ ఆ విధంగా విష్ణువు మత్స్యరూపంతో తిరుగుతున్నాడు.
ప్రళయ సముద్రంలో వ్యర్థమై మునిగి ఉన్న వేదాల దైన్య స్థితిని అవి మొరపెట్టుకోగా మీనావతారుడగు విష్ణుమూర్తి విన్నాడు. వేగంగా రెక్కలు అల్లార్చి నోరు తెరచినాడు. ఉత్సాహంతో తోక ఊగించినాడు. మేను మెరపించినాడు. దౌడలు చక్క జేసుకొన్నాడు. మీసాలు కదిలించినాడు. పిడికిటి పోటుతో కొండలను పిండి చేయగలవాడు, దుర్జనుడు అయిన హయగ్రీవుని హతమార్చినాడు. ఎప్పుడు తెల్లవారునా అని ఆతురులై ఎదురు చూస్తున్న మునీశ్వరులకు సంతోషకరంగా వేకువ కనిపించింది. మెలకువ శక్తితో నిద్రిస్తున్న సరస్వతి లేచి బ్రహ్మ ప్రక్కన కూర్చొని జారిన పయ్యెద కొంగును సవరించుకొన్నది. నిద్రవలన ప్రళయకాలంలో మసకబారిన బ్రహ్మదేవుని ముఖం ప్రకాశించింది. జీవులు సంపాదించుకొన్న పూర్వ పుణ్యాలు ఆయన కడకన్నులకు కనిపించినాయి. బ్రహ్మదేవుడు తన అవయవాలను కదలించినాడు. ఆవులించి నిదురనుండి మేల్కొన్నాడు. కొద్దిగా నీలిగినాడు. ఒత్తిగిలినాడు. ఒడలు విరుచుకొన్నాడు. కన్నులు నులుముకున్నాడు. తిరిగి సృష్టి చేయటం కోసం సిద్ధమై కూర్చున్నాడు. భగవానుడు విష్ణువు హయగ్రీవుని చంపి వాడు దొంగిలించిన వేదాలను చిక్కునుండి విడిపించినాడు. వాటిని మేల్కొన్న బ్రహ్మదేవునికి దయతో అప్పగించినాడు. విష్ణుమూర్తికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించినాడు. ప్రళయ సముద్రంనుండి బయట పడినాడు. మనువు అయినాడు. రాజర్షి అయిన సత్యవ్రతుడూ, మీనరూపుడైన శ్రీపతీ ప్రవర్తించిన ఈ పవిత్ర గాథను విన్నవారు బంధాలనుంచి విముక్తిని పొందుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి