10, మే 2025, శనివారం

:: నారదుడు ధర్మరాజుకు చెప్పిన కర్ణుని చరిత్ర :: 

    కుంతీదేవి కన్నెగా ఉన్న కాలంలో దుర్వాసోమహర్షి ఇచ్చిన మంత్ర ప్రభావం వలన సూర్యదేవుడిని ఆసక్తితో ప్రత్యక్షం చేసికొని కొడుకును కన్నందువలన మిక్కిలి సిగ్గుతో ఆ వాస్తవాన్ని ప్రకటించలేక పోయింది. కొడుకును కన్నప్పటికీ ఆమెకు కన్యాత్వం భగ్నం కాకుండా ఉండేటట్లు సూర్యదేవుడి వరం ఉండటంవలన ఆమె ఉత్తమ గృహిణిగా ప్రసిద్ధికెక్కింది. ఇదంతా దేవ రహస్యం. ఆవిధంగా కుంతిచేత నదిలో విడువబడిన ఆమె కొడుకును సూతుడు చూచి ఇంటికి ఎత్తుకొనిపోయాడు. అందువలన కర్ణుడు సూతుడికి పుట్టినవాడనీ, సూతకులంలో పుట్టినవాడనీ లోకంలో ప్రసిద్ధికెక్కుతూ పెరిగాడు. ధర్మరాజు నేర్పరితనం, భీముడి బాహుబలం, అర్జునుడి కోదండపాండిత్యం, అర్జునుడికి, శ్రీకృష్ణుడికి గల స్నేహం - ఇవన్నీ చూచి హృదయం మండి కర్ణుడు బాగా బాధపడుతూ ఉండేవాడు. నకుల సహదేవులకుండే నీతి, శాస్త్ర కళా పాండిత్యాన్ని ప్రజలు మిక్కిలి ప్రీతితో మెచ్చుకుంటూ ఉండటం కర్ణుడికి నచ్చేది కాదు. తోడు దానికి మనసు కలతపడగా బాధపడుతూ ఉండేవాడు. 

    అది అతడి స్వభావం. అంతేగాక విధి సంవిధానం కూడా అటువంటిదే. పాండవులమీది ద్వేషంతో ఆ కర్ణుడు అసూయ పెంచుకొని, దుర్యోధనుడితో చేతులు కలిపాడు. ఆ తరువాత అర్జునుడి విలువిద్యలోని మేటితనాన్ని గమనించి ఒకసారి ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు తనకు బ్రహ్మాస్త్రాన్ని సాంగోపాంగంగా ఉపదేశించమని కోరాడు. " నేను యుద్ధం చేయటంలో అర్జునుడికి సమానుడను కావాలని కోరి వచ్చాను. నీవా- శిష్యులందరినీ సమానంగా చూచేవాడవు. కాబట్టి నీ దయవలన బ్రహ్మాస్త్రాన్ని పొంది ప్రకాశించవద్దా! " అని అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడితో ద్రోణుడు ఇలా అన్నాడు. " వేదోక్త విధివిధానాలను జీవిత వ్రతంగా పాటించే బ్రాహ్మణ శ్రేష్ఠుడు కానీ, సాటిలేని తమ ప్రభావం వలన పుణ్యశీలుడైన రాజుకానీ,  బ్రహ్మాస్త్రాన్ని దానంచేస్తే స్వీకరించటానికి యోగ్యులౌతారు కానీ ఇతరులు కాదు. కాబట్టి నీకు నేను బ్రహ్మాస్త్రాన్ని దానం చేయటం ధర్మంకాదు ". 

    ద్రోణాచార్యుడు ఈవిధంగా అనగానే, మంచిదని కర్ణుడు తన ఇంటికి తిరిగిపోయి, మరునాడు బయలుదేరి మహేంద్రపర్వతానికి వెళ్ళి పరశురాముడిని దర్శించి వినయంతో నమస్కరించాడు. " నేను బ్రాహ్మణుడను. భృగువంశంలో పుట్టాను. అస్త్రవిద్య నేర్చుకోవాలన్న కోరికతో నిన్ను ఆశ్రయించటానికి వచ్చాను." అని అన్నాడు. ఆ మాటలకు సంతోషపడి పరశురాముడు కర్ణుడిని శిష్యుడిగా స్వీకరించాడు. ఆపైన కర్ణుడు అస్త్రవిద్యలో అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఒకనాడు అతడు ఆశ్రమ సమీప ప్రదేశంలో అస్త్రవిద్యాభ్యాసం చేస్తూ ఉండగా అతడి బాణం ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడి హోమధేనువు దూడకు తగలటం చేత అది చనిపోయింది. దానికి ఆ బ్రాహ్మణుడు కోపించి కర్ణుడికి శాపం పెట్టాడు. దానివలన అతడి రథం కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునిడితో పోరుచేసే సందర్భంలో నేలలో క్రుంగి పోయింది. 

    కర్ణుడు భక్తుడై పరశురాముని సేవించటం వలన ఆయన అతడికి బ్రహ్మాస్త్రం మొదలుకొని అనేక అస్త్రాలను నేర్పాడు. ఆ తరువాత ఒకనాడు పరశురాముడు కర్ణుడి తొడమీద తలపెట్టి నిద్రపోయాడు. వికారమైన, భయంకరమైన ఆకారం గలిగిన అళికం అనే పురుగొకటి కర్ణుడి క్రింది తొడభాగాన్ని వడివడిగా తొలిచివేసింది. కర్ణుడు గురువుకు నిద్రాభంగం కావటానికి ఇష్టపడక, ధైర్యంతో ఆ పురుగు చేసే కొరుకుడుకు సహించి కదలకుండా ఉన్నాడు. నెత్తురు కారటం మొదలుపెట్టి క్రమంగా సాగి పరశురాముడి శరీరాన్ని తాకింది. ఆ స్పర్శకు పరశురాముడు మేల్కొని " ఈ రక్తం ఎక్కడిది? " అని అడిగాడు. కర్ణుడు తొడ ఎత్తి కీటకాన్ని చూపి " ఇది తొలుస్తూ ఉండగా మీ నిద్ర చెడకుండా ఉండాలని ఆ బాధను సహించి నేను కదలకుండా కూర్చున్నాను " అన్నాడు. పరశురాముడు ఆ కీటకాన్ని చూడగానే ఆ పురుగు చనిపోయి రాక్షసరూపం పొంది, ఆకాశప్రదేశంలో నిలచి యిలా పలికింది. " ఓ దయామయా! నీకారణంగా నాకు భయంకరమైన శాపం నివృత్తి చెందింది. నేను నా పూర్వ రూపాన్ని పొందగలిగాను. గ్రస్తుడు అనే పేరుతో పిలువబడే ఒక రాక్షసుడిని నేను. భృగుమహర్షి భార్యను అపహరించి అతడి శాపానికి గురిఅయి కీటకంగా ఉంటూ వచ్చాను. ఓ పరశురామా! నీ చూపులనే అమృతపు చిలకరింపుల వలన నేను మరల నిజ రూపాన్ని పొంది సుఖంగా ఉన్నాను " అని చెప్పి నమస్కరించి స్వేచ్ఛగా వెడలి పోయాడా రాక్షసుడు. 

    ఆ తరువాత పరశురాముడు కర్ణుడు ప్రదర్శించిన అపూర్వ ధైర్యాన్ని మనస్సులో లోతుగా భావించి అతడితో " బ్రాహ్మణ జాతికి ఇటువంటి ఓర్పు ఉండదు. నిజంగా నీవెవడవు? " అని అడుగగా " నేను సూత పుత్రు "డనని కర్ణుడు భయపడుతూ సమాధానం చెప్పాడు. అందుకు పరశురాముడు మిక్కిలి కోపించి " బ్రాహ్మణుడనని పలికి నీవు వంచనతో నా శిష్యత్వాన్ని గ్రహించావు. దాని ఫలితాన్ని అనుభవించుము. నావలన నేర్చుకొన్న అస్త్రవిద్యా సంపద మొత్తం భగ్నమైపోవుగాక! " అని శపించాడు. కర్ణుడు గూడా చేయగలిగిందేమీ లేక విచారపడుతూ వచ్చి దుర్యోధనుడిని చూచి " ప్రభూ! నేను పరశురాముడిని ఆశ్రయించి అస్త్రవిద్యను గడించాను. ఇప్పుడీ లోకంలో వీరులెవ్వరూ యుద్ధంలో నన్ను ఎదుర్కొనేవారు లేరు " అంటూ కర్ణుడు అలా అనగా విని దుర్యోధనుడు సంతుష్టాంతరంగుడయ్యాడు. 

     " ఓ ధర్మజా! మీ అన్న అయిన కర్ణుడు నడచిన విధానాలటువంటివంటూ " నారదుడు  ఇంకా ఇలా చెప్పాడు. ఆ విధంగా కర్ణుడు దుర్యోధనుడికి ఆప్తమిత్రుడై ఉండగా, కళింగ రాజ్యాన్ని పరిపాలించే చిత్రాంగదుడనే రాజు తన పుత్రిక శుభాంగికి స్వయంవర మహోత్సవాన్ని చాటాడు. దానికి శిశుపాలుడు, నీలుడు, జరాసంధుడు, రుక్మి మొదలైన రాజులెందరో చిత్రాంగదుడి రాజధానీ నగరమైన రాజపురానికి చేరారు. దుర్యోధనుడు కూడా ఉత్సాహంతో చతురంగ బలాలను వెంటబెట్టుకొని, కర్ణ సహాయుడై, రథమెక్కి రాజపురానికి వెళ్ళాడు. అట్లా సమావేశమైన రాజులకందరికీ చిత్రాంగదుడు సముచిత సత్కారాలు చేసి తన కూతురైన శుభాంగికి స్వయంవర మహోత్సవ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. చెలికత్తెలు, దాదులు పేరు పేరున రాజులను చూపి పరిచయం చేస్తూ ఉండగా, ఆ కన్య వారిని చూస్తూ చేతిలో కల్యాణ పుష్పమాలను ధరించి రాజుల నడుమనున్న దారిని మెల్లగా నడుస్తూ దుర్యోధనుడిని దాటి పోయింది. అందుకు రారాజుకి కోపం వచ్చింది. ఆమెను ముందుకు సాగకుండా ఆపి పట్టి రథంమీద ఉంచటానికి ఆజ్ఞాపించి, తాను సభను వీడి వెళ్ళనారంభించాడు. సభలోని రాజులందరూ కలవరపడి గుమికూడి అతిభయంకరమైన విధంగా అతడిని ఎదుర్కొన్నారు. దుర్యోధనుడు కూడా వెనుకాడక, అందరూ అతడి బలపరాక్రమాలను పొగిడేటట్లు యుద్ధం చేశాడు. ఆ సమయంలో బల్లెములను ప్రయోగించి రాజుల శిరస్సులను భయంకరంగా నేల రాలేటట్లు చేస్తూ ఏనుగుల, రథాల, గుర్రాల, పదాతుల సమూహాలను మట్టుపెట్టుతూ, అందరికీ వారించడానికి శక్యం కాని వాడుగా కర్ణుడు యుద్ధరంగంలో నిలిచాడు. ఆ విధంగా బల పరాక్రమాలను ప్రదర్శించే వీరవర్యుడైన కర్ణుడిని చూచి , చావగా మిగిలిన రాజులు భయపడి పలాయనం చిత్తగించారు. దుర్యోధనుడు సంతోషించి కన్యారత్నమైన శుభాంగిని తీసికొని హస్తినాపురాన్ని చేరుకున్నాడు. అయితే, అప్పటి పగను మనస్సులో పెట్టుకున్న జరాసంధుడు కర్ణుడిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు. కర్ణుడు వెళ్ళాడు. 

    కర్ణ జరాసంధు లిరువురూ అసహాయ వీరులై యుద్ధం చేశారు. కర్ణుడు జరాసంధుని దివ్యాస్త్ర సముదాయాన్ని, ధనురాది సాధనాలను ద్వంసం చేశాడు. జరాసంధుడు కూడా కర్ణుడి అస్త్రశస్త్రాలను వమ్ము చేశాడు. ఆపైన ఇరువురూ రథాల పైనుండి నేలకు దిగి, పెరిగిన పట్టుదలతో బాహాబాహీ యుద్ధానికి పూనుకొని తలపడ్డారు. జరాసంధుడు బాధపొంది కీలు విరుగ గొట్టుకున్నాడు. అంతటితో పోరు ఇరువురూ చాలించారు. జరాసంధుడు కర్ణుడి పౌరుషానికి మెచ్చి గారవించి, అధిక సంపదలకు నిలయమైన మాలినీ నగరాన్ని అతడికి ఇచ్చాడు. కర్ణుడు అమిత తేజంతో తిరిగి వచ్చాడు. అట్లా బలపరాక్రమాలలో జగత్ప్రసిద్ధుడైన కర్ణుడి గొప్పతనాన్ని ధ్వంసంచేయదలచి ఇంద్రుడు అతని కవచకుండలాలను భిక్షగా అడిగి పుచ్చుకొన్నాడు. దాని వలన " ధర్మజా! నీకు మేలు జరిగింది. దానివలననే అర్జునుడు కర్ణుడిని సంహరించ గలిగాడు " అని నారదుడు చెప్పి మరలా ఇలా అన్నాడు. " ధర్మజా! నేను చెప్పేది విని గ్రహించుము. బ్రాహ్మణుడు కర్ణుడిని కోపగించి శపించాడు. ఆ తరువాత పరశురాముడు శాపం పెట్టాడు. ఇంద్రుడు మోసం చేసి సహజ కవచకుండలాలను గ్రహించాడు. కుంతి వరమనే నెపంతో కోరి కోపాన్ని మాన్పింది. భీష్ముడు కర్ణుడిని అర్థరథుడుగా చేసి అగౌరవ పరిచాడు. శల్యుడు అనుచిత సంభాషణలతో కర్ణుడి హృదయాన్ని కలతబెట్టాడు. కృష్ణుడు అతడికి దాటరాని విధిగా నిలిచాడు. ఇన్ని జరుగగా అర్జునుడు కర్ణుడిని రణరంగంలో వధించగలిగాడు. ధర్మరాజా! శివుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, ద్రోణుడు, కృపుడూ మొదలయిన వారందరూ లెక్కకుమించిన దివ్యబాణాలను ఉపదేశించటం వలన అర్జునుడి ప్రతాపతేజం కర్ణుడి పరాక్రమ తేజాన్ని ఆర్పగలిగిందిసుమా! " అని నారదుడు చెప్పగా విని తీవ్రమైన దు:ఖం చేత కలతచెంది ధర్మరాజు కన్నీరుమున్నీరుకాగా దీర్ఘనిశ్వాస విడుస్తూ ఉండగా అతడి సమీపంలో ఉన్న కుంతీదేవి అతడి అవస్థను చూచి, అతడి శోకాన్ని మాన్పాలని అతడితో ఇట్లా అన్నది. " కుమారా! పుట్టుకను గురించి నిజాన్ని చెప్పి అతడిని నీవైపు నేను ఆహ్వానించినప్పుడు, ఆ సూర్యభగవానుడు కూడా కన్నకొడుకనే భావంతో కలిగిన కరుణతో కుంతి చెప్పిన మాట నిజం. నమ్ము నాయనా! అని పలికాడు. కాని, కర్ణుడు దుర్యోధనుడిని ఆశ్రయించి నీవైపు రావటానికి ఏవిధంగానూ ప్రయత్నం చేయలేక పోయాడు. కాబట్టి అటువంటి కర్ణుడి కొరకు నీవెందుకు ఈవిధంగా మానసిక వేదనను పొందుతావు? " అని మాట్లాడిన కుంతీదేవి పలుకులు ధర్మరాజుకు ఏవగింపు కలిగించటంతో అతడు బాధపడి కుంతీదేవిని చూచి ఇటులన్నాడు. " నీవు నిర్వహించిన ఈ రాచకార్యాన్ని రహస్యంగా ఉంచటం వలననే ఇంతటి విపరీత పరిణామం కలిగింది " అని అంటూ అంతటితో ఆగక అన్ని లోకాలలో ఉండే ఆడవారికి రహస్యాలను రహస్యంగా కాపాడే శక్తి వారి మనస్సులలో లేకుండా పోవుగాక! అని ధర్మరాజు శపించాడు. అటుతర్వాత అమిత దు:ఖంతో తమ్ములతో కలిసి కర్ణుడికి తర్పణాలను శ్రద్దగా విడిచిపెట్టాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...