కాశ్యపగౌతమాఖ్యానం అనబడే బ్రాహ్మణ నాడీజంఘుల కథ
భీష్ముడు ధర్మరాజుకు రాజధర్మములను గురించి వివరిస్తూ - క్రూరుడు, పేరాశపరుడు, చాడీలు చెప్పేవాడు, మందకొడి, చేసిన మేలును మరచిపోయేవాడు, తెలివిమాలినవాడు, అబద్ధాలాడేవాడు, నిందపడేవాడు, పిరికివాడు, తెగింపులేనివాడు, నీతిమాలినవాడు, మితిమించిన చెడు అలవాట్లు కలవాడు, రాజునకు దగ్గరగా ఉంటే ఆపద ముంచుకొస్తుంది. అందునా, తగని స్వభావంగల నీచులలోకెల్లా చేసిన మేలు మరచిపోయేవాడు ఎక్కువ తగనివాడు. దీనిని చెప్పే పాతకాలంనాటి కథ ఒకటి చెబుతాను. వినుమంటూ చెప్పాడు. దానిని మీకు నేనిప్పుడు చెబుతాను వినండి. దీనినే కాశ్యప గౌతమాఖ్యానం అంటారు.
వెనుకటికి ఓ బాపడు, తన తాతముత్తాతలనుండి వస్తున్న కులవృత్తి గౌరవాన్ని వదులుకొని ఒక బోయ వనితను పెళ్ళాడాడు. బోయవారితో కలిసిపోయి వేటాడేవాడు. మాంసం తినేవాడు. బాగా సుఖాలు మరగిన అతడు ఒకసారి వ్యాపారనిమిత్తం మరొక దేశానికి పోతున్న ఓ వర్తక బృందంలో చేరి వారితో కలసి తానూ వెళ్ళాడు. అట్లా పోతూ ఉండగా ఒక ఆడఏనుగు తటస్థపడి ఆ బిడారులోని జనాన్ని పిచ్చెత్తినట్టు నేలమీద పడేసి కాలితో తొక్కి చంపటం మొదలుపెట్టింది. ఆ గుంపంతా చెదిరిపోయి తలోదిక్కుకూ చెల్లాచెదరయింది. ఆ బ్రాహ్మణుడు భయంకొద్దీ దిక్కుతోచక పరుగెత్తాడు. ఉత్తరం వైపుగా చాలాదూరంపోయి ఒక దోవ చూచాడు. అతడు ఆ త్రోవలో వెళ్ళగా ఆ ప్రక్కనే దట్టంగా ఉన్న డొంకల మధ్య గుబురుగా ఉన్న ఒక మర్రిచెట్టును చూచాడు. అది చాలా ఎత్తుగా, వెడల్పుగా ఎంతో గుండ్రంగా అందంగా ఉన్నది. అక్కడ కాసేపు నిలబడాలనిపించి ఆ చెట్టు క్రిందకు పోగా, అడవిపూల వాసనను ఇముడ్చుకున్న సుడిగాలి అతడి అలసటను కొంత పోగొట్టింది. ఆ బ్రాహ్మణుడు తనివితీరా ఆ చెట్టు నీడను కూర్చున్నాడు. అంతలో అక్కడికి చక్కగా నడుచుకొంటూ ఒక పెద్ద కొంగ వచ్చింది. ఆ కొంగ బ్రహ్మ దయను నోచుకొన్నది. నాడీజంఘుడు, రాజధర్ముడు అనేవి ఆ కొక్కెర పేర్లు. ఆ మర్రిచెట్టుమీదే కొంగ ఉండేది. ఆ కొంగ అట్లా వచ్చి బాపనయ్యను చూచింది. ప్రేమతో ఆదరించి, " ఓ బ్రాహ్మణోత్తమా! ఎక్కడినుండి ఎక్కడకు ఏమి పనిమీద వెడుతున్నావు? నిన్ను చూచి సంతోషించాను. నాకు తగ్గ అతిథివి. నీ సంగతులు తెలియజెప్పుము " అని అడుగగా " నాది మధ్యదేశం. నాపేరు గౌతముడు. నేను ఉత్తముడైన ఓ బ్రాహ్మణుని కుమారుడను. నేను సోమరిపోతునై, వేదాలు వల్లించటం వంటి మా జాతి కర్మలను మానివేశాను. కామంలో పడి ఒక బోయ స్త్రీని పెళ్ళాడాను. బీదరికంతో విసిగిపోయి వర్తకం వెంబడి ఒక బిడారుతో కలిసి మరో దేశానికి వెడుతున్నాను. కాలుతీసి కాలు పెట్టలేనంత దట్టంగా ఉన్న కొండలలో, అడవులలో సాగుతున్న మాకు ఒక అడవి ఏనుగు తటస్థపడి బిడారుమీద పడి చంపబోయింది. ఆ గుంపులోని వారంతా తత్తరపడి పరుగెత్తారు. నేను భయపడి అడవిలో పరుగెత్తి త్రోవ తప్పాను. నా అదృష్టంకొద్దీ నీవు ఉండే ఈ మర్రిని చూచాను. " అనగానే, ఆ కొంగ " మంచిదే! నీ బీదతనాన్ని పోగొడతాను. నీవు బాధపడకుము " అని చెబుతూ తన ఆతిథ్యాన్ని అందుకొనమన్నది. మంచి రుచిగా ఉండే గంగానదిలోని చేపలను కాల్చి తెచ్చింది. తీయటి అడవి పళ్ళు పెట్టింది. అతిథి బ్రాహ్మణుడు తృప్తిపడేటట్లు భోజనం పెట్టింది. ప్రొద్దుపోవటంతో చిగురుటాకులతోనూ, పూలతోనూ ఒత్తుగా ప్రక్కను సిద్ధం చేసింది. ఆ కొంగలరాజు, ఆ బాపడు ముచ్చటలతోనూ, హాయి అయిన నిద్రతోనూ ఆ రాత్రి గడిపారు.
తెల్లవారగానే ఆ బ్రాహ్మణుడిని చూచి " వినుము - మనిషి పేదరికం పోవటానికి స్నేహితుడూ, వెండీ, బంగారమూ, ఆలోచన అనే నాలుగింటినీ కారణాలుగా దేవగురువు బృహస్పతి చెప్పాడు. వీటి అన్నింటిలోనూ, ఓ బాపనయ్యా! మిత్రుడు గొప్పవాడు. కశ్యపుడి సంతానంలోని వాడనైన నేను నీతో చెలిమి చేస్తూ ఉంటే, అంతులేని సిరిసంపదలకు యోగ్యుడవు కాకుండా పోతావా? నాకు విరూపాక్షుడనే మిత్రుడొకడున్నాడు. మధువ్రజం అతడి పట్టణం. అది యిక్కడకు మూడామడల దూరంలో ఉంటుంది. దానికి మరీ దూరం, మరీ దగ్గరాకాని త్రోవ వెంబడే గబగబా వెళ్ళుము.ఆ రాక్షస రాజును ఆశ్రయించుము. విరూపాక్షుడిని చూచి అతడితో నేను పంపించినట్లు చెప్పుము. అతడు ఎంతో సంతోషిస్తాడు. బంగారం, మణులూ యిచ్చి సత్కరిస్తాడు " ఆంటూ ఆ కొంగ మధువ్రజం పోయే దిక్కును చెప్పింది. ఆ దారి వెంబడి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు విరూపాక్షుడిని చూచాడు. నేను నాడీజంఘుడికి ఆప్తమిత్రుడనని చెప్పాడు. అతడు పంపబట్టి డబ్బు కోరి వచ్చాను అని బ్రాహ్మణుడు చెప్పగానే విరూపాక్షుడు అతడిని తేరిపార చూచాడు. లోలోపల ఈ బ్రాహ్మణుడు నీచుడిగా అనిపిస్తున్నాడు. సంగతేమిటో అడిగి తెలుసుకోవాలి, అని అనుకొని " నీ వంశం, నీ చదువు, నీ నడవడి ఉన్నదున్నట్లుగా చెప్పుము " అని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం జంకలేదు. తన సంగతి అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అప్పుడు విరూపాక్షుడు కూడా ఎట్లాంటి మానసిక, శారీరక వికారాలకు లోబడని వాడవుతూ, " ఈ బ్రాహ్మణుడు ఎటువంటి వాడైతే నేమిలే. నాడీజంఘుడితో స్నేహమే ఈ బ్రాహ్మణుడి యోగ్యతను తెలుపుతుంది. కాబట్టి ఇతడికి కరువుతీరా ధనమిస్తాను " అని నిర్ణయించుకొని ఆ బ్రాహ్మణుడికి అవసరానికి తగ్గట్టుగా తిండి, బట్టలు సమకూర్చి పెట్టడానికి కొంతమందిని నియమించాడు.
ఆ మరునాడు కార్తీక పౌర్ణమి. విరూపాక్షుడు తన ఇంట్లో వేలకొద్దీ బ్రాహ్మణులు బంగారు పళ్ళాలలో భోజనాలు ఆరగించటానికి, కానుకలు ఎక్కువగా పుచ్చుకొనటానికి అనువుగా గల కర్మల నాచరించాడు. ఆ మహాజనంతో బాటు ఎంతో ఆదరణతతో దొడ్డమనస్సుగల ఆ విరూపాక్షుడు ఆ బ్రాహ్మణుడికి ఎన్నో సేవలు చేశాడు. కడుపునిండా కమ్మని తిండి పెట్టాడు. మొయ్యలేనంత బంగారం, రత్నాలు యిచ్చి, తిన్న బంగారు పళ్ళాన్ని గూడా మనసారా యిచ్చాడు. బాహ్మణుడు ఆనందంగా అన్నీ పుచ్చుకున్నాడు. బరువు ఎక్కువ అవటంతో భుజాలు చేతులు మార్చుకొంటూ మోస్తున్నాడు. బరువువలన మెడా, వీపు, రెక్కలూ చాలా నొప్పి పుట్టాయి. ఆ నొప్పివలన వంగిపోతున్నాడు. గబగబా అడుగులు వేస్తూ నాడీజంఘుడు ఉండే మర్రిచెట్టును చేరుకున్నాడు. అతడిని చూచి కొంగ సంతోషించింది. అట్లా వచ్చిన బ్రాహ్మణుడిని చూచి కొంగ తృప్తి పడింది. దొప్పలవంటి తన రెండు రెక్కలతో మెల్లగా విసరి అతడి బడలిక పోగొట్టింది. ఆకలి తీర్చింది. రాత్రి అయింది. ఆదమరచి నిద్రపోతూండగా ఆ పాడు బాపడు మరునాటి ప్రయాణంలో తిండిని గురించి ఆలోచించాడు. ఈ కొంగ ఒళ్ళు బాగా కొవ్వి కండపట్టి ఉన్నది. ఇది ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నది. దీనిని చావమోది, మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పట్టుకుపోవాలని దుర్మార్గంగా ఆలోచించాడు. బట్టను లాగి బిగించి కట్టుకొని రెండు చేతులతోనూ కర్రను బాగా గట్టిగా పట్టుకొని అప్పటికప్పుడే మెడమీదా, తలమీదా దబదబా చితక బాదాడు. ప్రాణం పోయిందని రూఢిచేసుకొన్నాడు. ఈకలన్నీ గబగబా పెరికివేశాడు. పీకను చీల్చాడు. పేగులు బయటకు లాగి మాంసాన్ని పొందికగా మూటకట్టుకున్నాడు.
అంతలో తెలవారగా విరూపాక్షుడు నిద్రనుండి లేచి " మాంసం కంపు కొడుతున్నది. ఏం ముంపు ముంచుకొస్తుందో ఏమో! మనస్సులో కలతగా ఉన్నది " అని తన వారితో చెబుతూ భయంతో వణికిపోతున్నాడు. జాము పొద్దెక్కగా రాజధర్ముడిని అంటే నాడీజంఘుడిని గుర్తుతెచ్చుకొని, నా మిత్రుడు ప్రతి నిత్యం ప్రొద్దున్నే వచ్చేవాడు. ఈరోజు ఎందుకు రాలేదో ఏమో! బ్రాహ్మణుడు నీచుడని అపుడే అనుకొన్నాను. ఈ తుచ్ఛుడు ఏమి తలపెట్టాడో ఏమో! అయ్యో! దైవమా! నాడీజంఘుడు ఏమి కానున్నాడో ఏమో! ఏమీ కల్మషం ఎరుగనివాడు. అందరినీ నమ్ముతాడు అనుకొంటూ విరూపాక్షుడు తీవ్రంగా ఆలోచించాడు. తన పరివారానికి కొంగను వెదకండని పురమాయించాడు. ఆ పరిజనం వెళ్ళి వెదకి, కొంగ డొక్కను గుర్తుపట్టి వెంటనే ఆ సంగతి రాజునకు కబురు పంపారు. ఆ బ్రాహ్మణుడు ఎటువైపుగా వెళ్ళాడో ఏమిటో తెలుసుకొని, వడివడిగా పరుగెత్తి అ బ్రాహ్మణుని వెదకి పట్టుకున్నారు. వెంటనే రెక్కలు విరిచికట్టి రాజు ముందుకు తెచ్చారు. విరూపాక్షుడు " ఇతడు చేసిన మేలు మరచినవాడు. వీడిని నా ఛాయలకు తేకండి. వెంటనే చంపి తినండి " అని సేవకులతో చెప్పాడు. ఆ మాటలు విన్న భటులు " ఈ పాపిష్టి శరీరం తినటానికి మేమంత నీతి లేని వారమా? ఇట్లాంటివి తింటే మాకు పాపం అంటుకొంటుంది." అని ఇష్టపడకపోవడం వలన ఆ విరూపాక్షుడు " తింటే తినండి, లేకపోతే మానెయ్యండి. ఏం చేసినా సరే! ఈ కృతఘ్నుడిని నా ఎదుటికి ఎందుకు తెచ్చారు? " అని రాజు అనగానే ఆ రాక్షసులు, మధువ్రజం వెలుపలికి తీసుకొని వెళ్ళి, అతడి శరీరాన్ని చిన్న చిన్న కండలుగా కోసి, గాయాలనుండి రక్తం చిందుతూ ఉండగా పడదోసారు. అంతలో ఆ పాపి శరీరాన్ని తినటానికి నకనకలాడుతున్న కడుపులతో కుక్కలమంద వచ్చిపడింది. అంత ఆకలితోనూ అవి ఆ పాపాత్ముడి శరీరాన్ని ముట్టకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. కృతఘ్నుని మాంసాన్ని కుక్కలు కూడా ముట్టవు. రోత పడతాయని భీష్ముడు ధర్మరాజునకు చెప్పి , ఆ తరువాత జరిగిన వృత్తాంతమును గూడా ఈ రకంగా వివరించాడు.
విరూపాక్షుడు విలవిలా ఏడుస్తూ నాడీజంఘుడి డొక్కను తెప్పించాడు. స్నేహితులతో కలసి, తాను గౌరవంగా తలకొరివి పెట్టాడు. అపుడు దేవేంద్రుడు వచ్చాడు. ఇంద్రుడిని చూచాడు విరూపాక్షుడు. అతడిలో తత్తరపాటు, వినయం కలగలుపుగా దీనత్వం తోపగా, విలవిలా ఏడుస్తూ, " నా రాజధర్ముడిని తిరిగి బ్రతికించవా?" అంటూ వేడుకొన్నాడు. విరూపాక్షుడి ప్రార్థన విన్న ఇంద్రుడు " నీ చెలికాడు నాడీజంఘుడు బ్రహ్మకు స్నేహితుడని నీకింతవరకూ తెలియదా? అతడి గురించి ఏడవటం ఎందుకు? అతడు ప్రతినిత్యము తన దగ్గరకు రావాలని బ్రహ్మ కోరుకుంటాడు. కాబట్టి తరచూ రానందుకు బ్రహ్మ విచారించేవాడు. అతడికి ఇటువంటి దశ పట్టినదంటే, అతడి స్నేహితుడవటంవల్లనే, నీవు స్నేహితుడవటంవలన నీవు ఈ కొంగకు తలకొరివి పెట్టావు. అది చాలా మంచి పని కదా! అటు దహన సంస్కారం ముగించిన నీవు ఇటు వచ్చావో లేదో, ఆ వెంటనే ఆ చితిమంట దగ్గరలో ఒక ఆవు తన దూడకు ఎంతో ప్రేమగా పాలిస్తుండగా, చిన్న పాలచేపు రాగానే దూడ నోటినుండి నురగ తుంపర జారి పడింది. అది సుడిగాలికి ఎగిరి చితిమీద పడింది. ఆ నురగ పడిందో లేదో నాడీజంఘుడు తిరిగి బ్రతికాడు. మునుపటి మాదిరిగానే అదే రూపంతో వస్తూ ఉన్నాడు. ఇట్లా జరిగింది అంటే, అది ఆ బ్రహ్మదేవుడి లోకాతీతమైన దయామహిమే! " అని ఇంద్రుడు చెప్పగానే కొంగల రాజు రానే వచ్చాడు. అతడి రాకకు విరూపాక్షుడు మరింత సంతోషించాడు. అంతకు మునుపే ఇంద్రుడు బ్రహ్మ మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడిని తాళ్ళతో కట్టించాడు. ఆ రాజధర్ముడు, బ్రాహ్మణుడికి తన వలన కలిగిన దురవస్థకు తట్టుకొనలేక పోయాడు. అతడిని విడిపించమని ఇంద్రుడిని వరం అడిగాడు. ఈ వరం యివ్వటంలో బ్రహ్మదేవుడి దయ ఉందని ఇంద్రుడు దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాడు. వెంటనే బ్రాహ్మణుని విడిచిపెట్టి కొంగ కోరిక తీర్చాడు. రాక్షసరాజు ఆజ్ఞతో బ్రాహ్మణ ధనాన్ని తెచ్చిన వారు తిరిగి అతడికి ముద్రశుద్ధిగా ముట్టచెప్పారు. నాడీజంఘుడిని కొనియాడుతూ ఆ బ్రాహ్మణుడు ధనం మూటను మోసుకొంటూ వెనక్కి తిరిగి చూస్తూ తత్తరపడుతూ పోయాడు. ఆ తరువాత ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. విరూపాక్షుడు ఆ బకరాజు రాజధర్ముడిని సంతోషంగా సాగనంపాడు. అతడూ గొప్పగా తానుండే మర్రిచెట్టును చేరుకొన్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి