27, ఏప్రిల్ 2025, ఆదివారం

:: హంస వాయసముల కథ :: 

    సముద్రంలో ఒక విశాల ద్వీపంలో ధర్మాత్ముడైన రాజుగారి నగరంలో ఒక వైశ్యుడుండేవాడు. అతడు యజ్ఞాలు చేస్తూ శాంతం, కరుణ, సంయమనం మొదలైన గుణాలతో ఒప్పుతూండేవాడు. పెక్కుమంది పుత్రులతో, భోగభాగ్యాలతో విలసిల్లుతూ దానాలు చేస్తూండేవాడు. ఒక కాకి అతడి ఇంటికి రాగా అతడి కుమారులు దానికి ఎంగిళ్ళు పెట్టి పెంచసాగారు. అది ఆ ఎంగిళ్ళతో పెరుగుతూ గర్వించి ఇతర పక్షులేవీ తనకు సాటిరావన్న దురహంకారంతో ఎన్నో విధాల క్రీడిస్తూ తిరుగుతూ ఉండేది. ఆవిధంగా కాకి విహరిస్తూ ఉండగా గరుడుడితో సమానమైన రెక్కల శక్తి గలిగిన కొన్ని హంసలు సముద్రాన్ని చేరవచ్చాయి.

    వైశ్యకుమారులు ఆ హంసలను చూపిస్తూ కాకితో యిలా అన్నారు. " హంసలు ఆకాశవీథిలో కడు వేడుకతో ప్రకాశిస్తూ విహరిస్తున్నాయి. పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు పలురీతుల గమనాలతో హంసలతో కలిసి పరుగెత్తి వాటిని ఓడించాలి "- అని తారతమ్య భేదం ఎరుగని ఆ అజ్ఞానులు కోరగానే ఎంగిళ్ళుతిని గర్వించి ఉన్న మూర్ఖమైన ఆ కాకి, తాను అంతటి దాననే అని తలంచి, ఆ హంసల దగ్గరకు వెళ్ళి, వాటిలో మేటిగా గోచరించిన దానిని పిలిచి, తనతో సమానంగా పరుగెత్తమని అడుగగా, ఆ హంసలు నవ్వుతూ కాకితో ఇట్లా అన్నాయి. " మానస సరోవరం మా నివాసం. మా బలాన్నీ, వేగాన్నీ చూచి పక్షులన్నీ పొగిడే విధంగా ఎంత దూరమైనా ఎటువంటి కష్టం లేకుండా ఎగిరిపోగలము. ఇటువంటి మాలో బలశాలి అయిన హంసనే అవివేకంతో పోటీకి రమ్మని పిలుస్తున్నావు. అసలు హంసలతో పోటీకి రాగల కాకులు ఇంతవరకూ ఎక్కడైనా ఉన్నాయా? " అని హంసలు అనగానే కాకి వాటికి సమాధానంగా ఇలా అన్నది. " నూట ఒక్క గతులు వేటిలోనయినా నూరు ఆమడల దూరం వెళ్ళగలను. పొడవుగా మీదికి ఎగిరి అదేవిధంగా నేలకు దిగి రాగలను. మనోహర గతులతో వంకరగా, వలయాకారంగా మీరు కోరిన విధంగా పరుగెత్తి ఎటువంటి హంసనైనా ఓడించగలను. మిగిలిన హంసలన్నీ భయపడేటట్లుగ దానిని గెలుస్తాను " అని అనగా ఆ కాకి మాటలు విని ముందు పందెపు పోటీకి పిలువబడిన హంస దానిని చూచి " నూరుగతులలో పరుగెత్తగలనన్నావు గదా, అవన్నీ నాకు తెలియవు. ఆకాశమార్గంలో పక్షులన్నీ నిడువుగా ఏవిధంగా ఎగురుతాయో ఆవిధంగా సముద్రంపై ఆకాశమార్గంలో చక్కగా పరుగెత్తుదాము రమ్ము " అని హంస పలుకగా అక్కడ చేరిన కాకులు " శతగతులు నేర్చిన ఈ కాకితో ఏకైక గమనవగు నీవు పోటీపడి అవమానం పాలు కావలసిందే కాని, ఏవిధంగా సాటి కాగలవు? " అని హంసను పరిహసించగా, ఆ హంస మారు మాటాడక వాటిని వదిలి సముద్రం పైమార్గంలో పరుగెత్తసాగింది. కాకి గూడా దానిని వెంబడించింది. 

    ఈ విధంగా రెండూ పోటీపడి ఎగురుతూ ఉండగా, రాజహంస అలసట లేకుండా మందగమనంతో వెడుతూంటే, వాయసం ఉత్సాహంతో క్రీడావిలాసంతో తన నేర్పులు చూపుతూ వివిధ గతులలో వేగంగా వెళ్ళటం వలన అలసట చెందుతూ పరుగెత్తుతున్నది. ఆ కాకి హంసను దాటిపోయి తిరిగి వచ్చి పిలిచేది. దాని ముక్కుమీద ముక్కు మోపేది. ఈకలను ఈకలతో రాసేది. దాని చుట్టూ విజృంభించి తిరిగేది. చిత్రమైన నడకలతో వచ్చి తాకేది. తనలో తాను మురిసిపోతూ నవ్వేది. ఈ విధంగా తెగ మిడిసిపాటుతో వ్యవహరించేది. కాకి ఈ విధంగా వివిధ గతుల నేర్పులు ప్రదర్శిస్తూ పరుగెత్తటం చూచిన తోటి కాకులు, సంతోషంతో అరుస్తూ, హంసలను గేలిచేస్తూ చెట్లపై గెంతులు వేయసాగాయి. " హంస ఓడిపోతుంది " అని పెద్ద గొంతులతో అరవసాగాయి. వాటి అరుపులు విన్న హంస నిండు ఉత్సాహంతో పొడవుగా పైకి ఎగిరి పడమటివైపు పారగా, కాకి గూడా దాని వెంట వేగంగా వెళ్ళి ఆ హంసను దాటటానికి శక్యంగాక ఊపిరిబిగబట్టి పరుగెత్తసాగింది. హంస, శీఘ్రగమన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ పారగా, దానితోపాటు పరుగెత్తుతూ అలసిపోయిన కాకి శక్తి కోల్పోయి బలహీనమయి మనసు కలత నొందగా ఈ రకంగా చింతించ సాగింది. " ఎరుగక హంసతో పోటీకి సిద్ధపడ్డాను. కాలు నిలుపటానికి మార్గంలో చెట్లు, తీగలు, పొదలు, గట్లు ఏవీ లేవు. నీటిపై దిగుదామా అంటే, సముద్రంలోని జంతువుల బారిన పడక తప్పదు. " అని అనుకొంటూ దిగులుతో, భయంతో కలత చెందిన మనసు కలదై కాకి, దప్పితో వశంతప్పి క్రమంగా క్రిందికి దిగసాగింది. 

    దానిని చూసిన హంస ఈ విధంగా అంది. " ఓ వాయసమా! నేను నిన్ను దాటి పిలిచినా నీవు బదులు పలుకక జాప్యం చేస్తున్నావు. నీ రెక్కలు నీకు దూరమై పోయినట్లు చూస్తున్నావు. నీవు నేర్చిన పెక్కు గతులలో ఇది ఏ రకమైన గమనమో వివరించగలవా? " అని హంస కాకితో హేళనగా పలికింది.  అప్పుడు సముద్ర జలాలు రెక్కలను, ముక్కును, తోకను తాకుతూ ఉండగా, మాటిమాటికి మీదకు ఎగురుతూ, బలహీనపడి క్రిందికి వాలుతూ ఉండగా అలసిపోయి ఎగురలేక భయపడింది. ఈ విధంగా పైకి ఎగురలేక సముద్రపు నీటిమీద పడి, తన బలహీన స్థితికి భయపడుతున్న కాకిని చూచి రాజహంస యిలా అన్నది. " మాటలు ఎన్నయినా చెప్పవచ్చు. కాని, చెప్పినదంతా చెయ్యటం ఎవరికీ సాధ్యమవుతుంది? గొప్పలు పలికిన నీ పని అయిపోయిందికదా! " అన్న హంస మాటలు విని కాకి ఈవిధంగా అన్నది. " ఎంగిళ్ళుతిని, బలిసిన దేహంతో గర్వించి, నాకు ఎదురు ఎవరూ లేరని భావిస్తూ గరుత్మంతుడిని సైతం ఓడించగలనని తలచే దానిని. నా అల్పత్వం ఎంతో ఇప్పుడు తెలుసుకున్నాను. నిన్ను శరణు కోరుతున్నాను. నాపై దయచూపి నన్ను రక్షించు. నా తోటి కాకులలో మళ్ళీ నన్ను చేర్చుము. ఇది నీకు న్యాయం కదా!" అని ఈ విధంగా వ్యాకులమైన మనసుతో కావుకావు మని ఎంతగానో అరుస్తూ నీటిలో మునిగిపోతున్న కాకిని చూచి హంస దయతో కాకిని తన కాళ్ళతో పట్టి పైకెత్తి, దాని ప్రాణాలు కాపాడి, బలమొప్పగా వీపున మోసికొని వస్తున్న హంసను చూచి పక్షులన్నీ పొగడ సాగాయి. హంస ఈ విధంగా కాకిని మోసుకొనివచ్చి దాని స్థానంలో దింపింది. కాకి స్తిమితపడిన తరువాత తోటి కాకులు వినేటట్లుగా ఇకముందెప్పుడూ గర్వంతో ఈ విధమైన పనులకు పూనుకొనవద్దని బుద్ధి చెప్పి తోడి హంసలతో కలసి వెళ్ళిపోయింది. 

    ఈ రకంగా కాకి హంసల కథను కర్ణునికి వినిపించి శల్యుడు అతడితో వైశ్య కుమారులు పెట్టిన ఎంగిళ్ళు తిని గర్వించిన కాకివలె నీవు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని, నీ శక్తి మరచి, నిన్ను మించిన వారితో తలపడుతున్నావు. దీని వలన నీకే హాని జరుగుతుంది. కాబట్టి నా మాటలు విని అర్జునునితో యుద్ధంచేసి ప్రాణంమీదకు తెచ్చుకోకు అని హితోపదేశం చేశాడు. పరిశీలించి చూస్తే, ఈ హంస వాయసముల కథ ద్వారా కర్ణుడిని అవమానపరచాలన్న శల్యుడి ఉద్దేశం ప్రస్ఫుటమవుతున్నది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...