:: దక్షయజ్ఞం ::
దక్షుడు బ్రహ్మ పుత్రుడు. అతనికి ప్రసూతి అన్న ధర్మపత్నియందు పదహారుమంది కన్యలు పుట్టారు. వారిలో పదముగ్గురుని అతడు ధర్మరాజుకిచ్చాడు. ఒకతె అగ్నికీ, మరొకతెని పితృదేవతలకూ, ఇంకొక కుమార్తె సతిని శివునకూ ఇచ్చి పెండ్లిచేశాడు. నరనారాయణులు మూర్తి అనే దక్షపుత్రికకు జన్మించినవారే. వారే తరువాత కృష్ణార్జునులుగా జన్మించి భూభారం తగ్గించారు. సరే!
పూర్వం బ్రహ్మలు ఒక సత్త్రం నిర్వహించారు. దానిని చూడాలని ప్రజాపతులు వచ్చారు. దక్షుడుకూడా రాగా అతడిని చూచి బ్రహ్మ, శివుడు తప్ప తక్కిన వారంతా లేచి నిలబడ్డారు. దక్షుడు బ్రహ్మకు ప్రణమిల్లాడు. శివుడు లేవకుండటం చూసి ఆగ్రహించాడు. ఆ దేవుడిని పరుషోక్తులతో తూలనాడాడు. యజ్ఞంలో శివుడు హవిర్భాగం లేనివాడగుగాక! అని శపించాడు. అతని చర్యను సదస్సు లాక్షేపించగా దక్షుడు కోపంతో సదస్సునుండి వెళ్ళిపోయాడు. అప్పుడు నందికేశ్వరుడు దక్షుడు పశుప్రాయుడవుతాడనీ, త్వరలో మేషముఖుడు కాగలడనీ శపించాడు. హరుని ద్వేషించే ద్విజులు యాచకులవుతారనీ కూడా శపించాడు. అందుకు భృగువు కోపించి ధూర్జటి వ్రతులు పాషండులవుతారని ప్రతిశాపం యిచ్చాడు. ఇది చూచి విమనస్కుడై శివుడటనుండి వెళ్ళిపోయాడు. యజ్ఞం పూర్తికాగానే ఋషులు తమ తమ ఆశ్రమాలకు పయనమైనారు.
ఆ తర్వాత మామ దక్షుడికీ, అల్లుడు శివుడికీ ఒకరిపట్ల ఒకరికి ద్వేషం వర్థిల్లుతూనే చాలాకాలం దొర్లిపోయింది. అంతట్లో శివుడు లేకుండా యాగం మొదలుపెట్టి చేసినా చేయనట్లేనని దక్షుడికి తెలుసు. అయినాసరే, శివుడితో ముందునుంచి కొనసాగిస్తున్న వైరం వల్లా, బ్రహ్మ దక్షుడిని ప్రజాపతులందరికీ ఏలికను చేయడం వల్ల దక్షుడిలో అహంభావం ఏర్పడింది. బ్రహ్మ నిష్ఠులైన ఈశ్వరాదులను లెక్కచేయక, దక్షుడు శివుడు లేని ' వాజపేయి ' యజ్ఞం చేశాడు. వాజపేయం అంటే, నేతిని ఆహారంగా స్వీకరిస్తూ చేసే దైవకార్యం. ఆ తరువాత ' బృహస్పతి సవనం ' అనే పేరిట మరో యజ్ఞం చేయ తలపెట్టాడు. తిండి, తీర్థం, పలుకరింపులు ధర్మార్థ కర్మలుగా కాక, స్వార్థ కర్మలుగా ప్రవర్తింప జేసేది బృహస్పతి సవనం. అయినా వీటిని ప్రసాదించే దేవతలు ఈ సవనకర్తను దీవించడం సంప్రదాయం. ఆ బృహస్పతి యాగం చూడాలనే ఆత్రంతో బ్రహ్మ ఋషులూ, ప్రజాపతులూ, నారదుని వంటి దేవ ఋషులు తమ భార్యలతో కలసి క్రమంగా ఎంతో ఆసక్తితో తరలివచ్చారు. అందరూ దక్షుడికి శుభాలు కలగాలని దీవనలు పలికారు. దక్షుడి యాగ దక్షిణలను యథార్హంగా స్వీకరించారు.
దక్షుడి కూతురు సతీదేవి తన నివాసం నుంచే తండ్రి చేసే యాగం గొప్పతనాన్ని, గంధర్వుల స్తోత్రాల కలకలాన్ని ఆసక్తితో చెవులార విన్నది. ఎంతో ఉత్సాహంతో ఆకాశం వైపు చూడగా అదే సమయానికి ఆ దక్షుడు చేసే యాగం వేడుకలను కన్నులారా తిలకించాలనే ఉబలాటంతో అన్ని వైపులనుంచి ప్రజలు తరలి వెడుతున్నారు. ఆ వేళలో మితిమించిన ఉత్కంఠతో తమ పతులతో జంటగా గగనచరులైన గంధర్వ, కిన్నర స్త్రీలు విమానాలలో పయనమై నింగికి పోతూ ఉన్నారు. ఆ దృశ్యాలన్నీ కన్నులారా తిలకిస్తున్న సతీదేవి తానూ ఆ సవనానికి భర్తయైన శివునితో సహా వెళ్ళాలనుకున్నది. కానీ, శివుడు అందుకు ఒప్పుకొనక వద్దని వారించినా వినకుండా ఆమె తండ్రి యాగభూమికి వెళ్ళింది. అక్కడ తల్లి, సోదరీమణులు తప్ప తక్కిన వారెవరూ ఆమెను ఆదరించలేదు. శివుని పట్ల ద్రోహం చేశావని తండ్రిని ఆక్షేపించింది. అనేక రకాలుగా విమర్శించింది. చివరకు మౌనం పూని సతీదేవి నేలపై కూర్చొని యోగమార్గంలో శరీరాన్ని పరిత్యజించింది. ఆమె శరీరం యోగాగ్నిలో దగ్ధమయింది. అది చూసి రుద్ర పార్షదులు అంటే రుద్ర సహాయకులు దక్షుడిని హతమార్చడానికి ఉద్యమించారు. అందుకు ప్రతిగా భృగువు అభిచార హోమం చేశాడు. ఋభునామక దేవతలాభిర్భవించి రుద్రపార్షదులను పారదోలారు.
పిమ్మట నారదుని ద్వారా జరిగిన వృత్తాతం విని ఆ తొలిదైవం, ఆ రుద్రుడు, ఆ నీలగళుడు, ఆ గజాసురసంహారి పట్టలేని కోపంకొద్దీ మునిపళ్ళతో పెదవిని కొరికాడు. మత్తుగొన్న సింహంవలె కఠోరంగా గర్జించాడు. అత్యంత భీకరంగా పగలబడి నవ్వాడు. మెరుపులవంటి అగ్నికీలల పరంపరల అన్వయ కాంతితో ప్రకాశిస్తున్నట్టి, అప్పటి కోపతీవ్రతతో ఊగుతున్నట్టి ఒక జటను సర్రున పీకి భూమిపైన విసిరికొట్టాడు. ఆ జటనుంచి నల్లటి నిలువెత్తు రూపంతో లోకభయంకరుడుగా ఉన్న వీరభద్రుడు పుట్టుకొచ్చి, ఏమి చేయాలో తెలుపుమని శివుని అభ్యర్థించగా, దక్షవాటికకు పోయి శ్రద్ధాళువై యాగాన్ని భగ్నం చేయడంతో బాటు దక్షుడిని సంహరించు. దుర్లభమైన నా అంశాన జన్మనెత్తిన నీకు సాధ్యం కానిది ఏమీ ఉండదని శివుడు ఆజ్ఞాపించగా ఆ వీరభద్రుడు పట్టరానంత వేగంతో ఒక్క ఊపున కదిలాడు. శివప్రమథగణాలు రకరకాల ఆయుధాలను చేపట్టి వీరభద్రుడిని అనుసరించాయి. దక్షయాగ స్థలం చుట్టూ ఉన్న కంచెలను, నడవలను, ఇళ్ళ భాగాలను అస్తవ్యస్తం చేశారు. ప్రధాన యాగగృహం వెన్నుగాడిని భగ్నమొనర్చారు. ధర్మ గేహినులుండే పాకను, యాగ యజమాని పాకను, సభతీర్చే పాకను, అగ్నివహులైన ఋత్విక్కులుండే పాకను, వంటశాలలను పూర్తిగా ధ్వంసం చేశారు. యాగ పాత్రలను, వహ్నులను పాడుచేశారు. అగ్నిహోత్రాలను ఆర్పివేశారు. అగ్నిగుండాలలో మూత్రాన్ని విసర్జించారు. తీర్చిదిద్దిన వేదికల సోమసూత్రాలను తెంపివేశారు. మునులను కష్టపెట్టారు. మునిపత్నులను గజగజలాడించారు. ప్రమథగణములన్నీ జట్లుజట్లుగా యేర్పడి అలా చేస్తుంటే, భృగు ఋషిని మణిమంతుడూ, దక్షుడిని వీరభద్రుడూ, పూషుని చండీశుడూ, భగమునిని నందీశ్వరుడూ నిర్భంధించారు. ఇలాగున సభ్యుల, దేవతల, ఋత్విక్కుల వర్గాలపైకి రాళ్ళు విసరీ, మోకాళ్ళతో కుమ్మీ, అరచేతులతో చరచీ, మోచేతులతో పొడిచీ, పెక్కురకాలుగా పీడించారు. అక్కడి వారంతా భయంతో దిక్కుతోచక తలకొక దిక్కుకూ పరుగులు తీశారు. అప్పట్లో యాగవాటికలో దక్షుడు శివుని తిట్టిపోశాడు. అప్పుడు కనుసైగ చేసిన భగుని, ఇప్పుడు నందీశ్వరుడు పట్టికట్టేశాడు. రెండుకనులను పెరికివేశాడు. ఇదంతా చూస్తున్న జనంలో ఆర్తనాదాలు చెలరేగాయి. దక్షుడు శివుని దూషించినపుడు పూషుడు పల్లికిలిస్తూ నవ్వాడు. ఆ కారణంగా ఇప్పుడు పూషుడి దంతాలను చండీశుడు ఊడపీకాడు. ఆ సమయంలోనే మీసం, గడ్డం మెలిపెడుతూ నవ్విన భృగువును పట్టి వీరభద్రుడు ఆ ముఖ మీసం, గడ్డం మెలితిప్పి పెరికివేశాడు. ఇంకా ఆ వీరభద్రుడు విర్రవీగినవాడై దక్షుడిని ఆధీనం చేసుకొని అతని తలను తెగిపడేలా నరికివేశాడు. కోపం ఆపుకోలేక దక్షిణాగ్నికి ఆహుతి చేశాడు.
పిదప దేవతలు బ్రహ్మచెంతకు పోయి శివసైనికులవల్ల తమకు కలిగిన బాధలను వివరించారు. ఆయన శివుని తిరస్కరించటం తగదని చెప్పి, ఆయనను శరణు వేడమని హితముపదేశించాడు. బ్రహ్మ యితర దేవతలు కైలాసం చేరి అభవుని దర్శించి నమస్కరించారు. బ్రహ్మ శివుని వినుతించి దక్షాధ్వరాన్ని మరల ఉద్ధరించి దక్షుని బ్రతికించమని ప్రార్థించాడు. బ్రహ్మ ప్రార్థనను మన్నించి శివుడు, దగ్ధ శిరస్కుడైన దక్షుడు అజముఖుడగుగాక, అని చెప్పి ఆ దేవతలననుగ్రహించాడు. పిదప శివుడు బ్రహ్మాదులతో కూడి దక్షాధ్వర వాటికకు వెళ్ళాడు. ఆయన అనుగ్రహంతో క్షతగాత్రులందరూ పూర్వస్థితి పొందారు. దక్షుని మేషముఖుడిని చేయగా అతడు నిద్రమేల్కొన్నట్లు లేచి రుద్రుని స్తుతించి తనను క్షమించమని కోరాడు. ఆపై యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విష్ణు దేవతాకమైన కర్మ చేయగా శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆ దేవునికి భక్తితో మొక్కారు. పెక్కువిధాల స్తుతించారు. శ్రీహరి దక్షాధ్వరాన్ని ఏ కొరతా లేకుండా జరుగునట్లనుగ్రహించాడు. యజ్ఞానంతరం విష్ణువు మున్నగు వారంతా తమ తమ నెలవులకు వెళ్ళారు. యోగాగ్ని దగ్ధురాలైన సతి జన్మాంతరంలో హిమవంతుని కూతురుగా పుట్టింది. పూర్వదయితుడైన రుద్రుడినే చేపట్టింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి