20, మార్చి 2025, గురువారం

:: కుమారస్వామి ప్రభవాభి వర్ణనము ::

    ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు. ఆ శక్తిని భరింపలేక ఆ అగ్ని సృష్టికర్తకు తెలుపగా, ఆ బ్రహ్మ దానిని గంగానదీగర్భంలో విడిచిపెట్టమనగా అతడు అట్లే చేశాడు. ఆ సమయంలో గంగానదిలో స్నానమాడుతున్న షట్ కృత్తికల గర్భాలలో ఆ తేజం ప్రవేశిస్తుంది. వారు గూడా ఆ రుద్రతేజాన్ని భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అందునుండి అప్పుడు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవించి అగ్నిభవుడుగాను, గాంగేయుడుగాను, శరజన్ముడుగాను, కార్తికేయుడుగాను అయ్యాడు. బృహస్పతి వచ్చి అతడికి జాతకర్మాది ఆచారాలను జరిపి వెళ్ళాడు. ఆ కుమారుడు ఉత్తమమైన తపస్సు విహారంగా, భూమిదాదిగా ధనుర్వేదాది వేదాలు తనను సేవించగా వృద్ధిపొందాడు. 

    ఒకనాడు కుమారుడను చూచే ఆసక్తితో పరమేశ్వరుడు పార్వతితో విశేషబలాన్ని, శక్తినీ, అనేక విధాలయిన శరీరాలు కలిగిన ప్రమథగణాలు సేవించగా ఆ చోటునకు వచ్చారు. అప్పుడు బ్రహ్మ విష్ణులు, ఇంద్రాది దిక్పాలురు, ఏకాదశ రుద్ర ద్వాదశాదిత్య సప్తమరుత్తులు, అష్టవసువులు మొదలయిన సమస్త దేవతలును, గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధవిద్యాధర యక్షాది దివ్యులును, తాపసులును, ఇంకను పితృదేవతలును వారి పరివారంతో కూడి వచ్చారు. ఓషధులు, నదులు, సప్తసముద్రాలు, సప్తకులపర్వతాలు, మూర్తిమంతములై వచ్చాయి. ఈవిధంగా తనను చూడగా ఆసక్తులై వచ్చిన ఆ గొప్ప సమూహానికి ఎదురేగి యోగబలంతో కూడుకొన్న ఆ పసివాడు నాలుగు ఆకారాలతో శివుడు, పార్వతి, అగ్ని, గంగల వద్దకు వెళ్ళాడు. ఆప్పుడు ఆ నలుగురూ సంతోషంతోనూ, వినయంతోనూ తగువిధంగా బ్రహ్మవద్దకు వెళ్ళి మహనీయుడా! ఈ బాలుడి తేజోమయమూర్తికీ, గుణసంపదకూ తగిన గొప్ప పదవిని ఆలోచించి ఈయవలసినదని కోరగా, అందులకు బ్రహ్మ ప్రీతితో ఆ బాలుడు దేవతలకు ప్రియుడనే విషయాన్ని తెలుసుకొని, ' ఈతడు దేవసేనాపతి అగుగాక ' అని నిర్ణయించాడు. అక్కడి వారినంతా కలయజూచాడు. వారందరూ తెలుసుకొనేటట్లు ఆ విషయాన్ని చెప్పాడు. తరువాత అందరూ ఆ బాలుని సరస్వతీనదీ తీరానికి జాగ్రత్తగా తీసుకువెళ్ళారు. 

    అన్ని రత్నాలను నింపిన దివ్య పీఠాన్ని పర్వతరాజైన హిమవంతుడు పెట్టగా దానిమీద ఆ భూతనాథుడి కుమారుడిని నిలిపి, బృహస్పతి హోమాదికాలు చేయగా ఈశానుడు, విష్ణుడు, బ్రహ్మ కౌశికులు మొదలైన దేవ ప్రముఖులు అభిషేక వస్తువులను సరస్వతి నది నీటితో నింపిన బంగారుమయమైన రత్నాలు తాపిన గిండీలను మోసుకొంటూ గంధర్వాప్సరోగణాలు సంగీతంతో మంగళాశీస్సులు పలుకగా, మహాముని సమూహాలు పుణ్యాహ వేదఘోషలతోను, పార్వతి, లక్ష్మి, సరస్వతి, శచి మొదలయిన ముత్తయిదువులు అక్షతలతో స్నానం చేయించి, సంతోషంతో సేనానాయకత్వానికి పట్టాభిషేకం చేసి ఆధిపత్యాన్ని అందించారు. మునుపాచోట దేవతలు జలాధిపతిగా వరుణుడిని అభిషేకించారు. ఆ వరుణాభిషేకం కంటే కుమారాభిషేకం ఒప్పింది. ఆ అగ్నిదేవ సంభవుడికి పరమశివుడు, బ్రహ్మ, విష్ణువు మొదలైన ప్రభువులందరూ తమ తమ సేవకులందలి రూపాధిక్యాన్ని, బలాధిక్యాన్ని, పరాక్రమాధిక్యాన్ని కలవారిని ఎన్నుకొని, భీమ కంటాకర్ణ సంక్రమ దండధర సహితులయిన ఎందరో వీరులనొసగి,  వారితో కలసి తిరగటానికి తగినటువంటి సేనాంగాల సమూహాన్ని ఆ శక్తిమూర్తికి మారుబలంగా యిచ్చారు. ఆ సేనలు చిత్రాభరణ వర్మాయుధ ధారులుగా అనేక ప్రకారాకారులైన గజకర్ణ నికుంభ కుముదాదులైన సైనికులుగా యొప్పారు. ఆ సేనలో వైరి భయంకరులైన సప్త మాతృకా గణాలు ప్రభాసినీ విశాలాక్షీ పాలికా పురస్సరంగా నిలిచాయి. అటువంటి సమయంలో పరమేశ్వరుడు ఉదయభానుడికి సమానమైన కాంతిని, ఇంద్రుడు రాక్షసులను నాశనం చేయగల పరిపక్వమయిన శక్తిని, విష్ణుడు బలమును పెంచే వనమాలను, పార్వతి ఏ వేళలోనూ నాశనంకాని తెల్ల పట్టువస్త్రాల జతను, గంగాదేవి ప్రకాశవంతమైనదీ, అమృతంతో నిండినదీ అయిన కమండలాన్ని, బృహస్పతి వెలుగు దండాన్ని, గరుడుడు మహిమగల నెమలిని, వరుణుడు ఉదార రూపమైన కుక్కుటమును, కుబేరుడు పొగరుబోతు మేకను, స్రష్ట అందమైన జింకతోలును, సాటిలేని యుద్ధ విజయాన్ని ఆ షణ్ముఖుడికి ప్రేమతో యిచ్చారు. 

    ఈ విధంగా నిజరూపంతో వెలుగుతున్న వాడిని వదలకుండా చూచిన శివుడు ' ఈతడికి ఈ వైభవంతో సుఖంగా శ్రమలేకుండా రాక్షస వినాశం చేయటానికి సాధ్యమవుతుంది ' అని యోచించి ప్రమథగణాలతో నిండిన మహాసేనను ఇచ్చాడు. అపుడు ఇంద్రుడు మొదలయిన దేవతలు తమ బలాలతో నెమలి వాహనంగా కలిగిన కుమారస్వామిచుట్టూ చేరారు. శంఖం, భేరి, పణవం, గోముఖం మొదలైన తూర్య శబ్దాలు దిక్కులనిండా వ్యాపించాయి. అటువంటి శక్తివంతమైన సుర సైన్యానికి నాయకుడుగా ఆ మహాసేనుడు దేవతలను చూచి ' మీరెవరినైనా చంపటంకాని, నాశనం చేయటం గాని చేయవలసి ఉన్నదా? అటువంటి బలవంతులైన శత్రువులను నాశనం చేస్తాను ' అని మాట యిచ్చాడు. వారంతా చాలా ఆనందించారు. సేన చేసిన సింహనాదానికి ముల్లోకాలు నాదమయములయ్యాయి. ఆ విధంగా విశాఖుని ఉన్నత స్థానంలో నిలిపి బ్రహ్మ విష్ణు శివులు తమకు నచ్చిన చోటులకు వెళ్ళారు. ఆపై షణ్ముఖుడు దేవతలు తారకుడి వలన బాధపడటం తెలుసుకొని తారకునిపైకి దండెత్తినాడు. బలవంతుడైన తారకుడు పలువురు రాక్షస సైనికులతో శౌర్యంతో ఎదురువచ్చాడు. ఆ సేనలు రెంటికి ఆశ్చర్యం కలిగించే యుద్ధం జరిగింది. 

    కుమారస్వామి యొక్క మహత్త్వశక్తిగల అస్త్రం నుండి అనేక కోట్ల శక్తులు పుట్టి, నానా రాక్షస సమూహాలను అలయజేశాయి. ఆ శక్తినుండి అనేకాగ్ని గోళాల పిడుగుల గుంపు మ్రోత క్రమ్ముకోగా, అది ఎందరో దానవ సేనా నాయకులను హతమార్చింది. దేవ సేనలు ఉత్సాహంతో రాక్షస సేనలను తెగటార్చాయి. ఆ బాలుడు శక్త్యాయుధాన్ని వేయగా అది శత్రువులను రూపుమాపి తిరిగి అతడి చేతిలోనికి వస్తూ ఉన్నది. ఆ విధంగా తనవారు చావగా తారకుడు కోపంతో ఆ గుహుడుని తాకి, బలయుతమైన అతడి శక్యాయుధపు దెబ్బకు పడిపోయాడు. ఆ కార్తికేయుడు విజయంతో వెలిగాడు. దేవతలంతా ఆనందించారు. ఆ మీదట క్రౌంచపర్వతాన్ని తన ఉనికిగా చేసుకొని లోకభయంకరుడయి, దేవతలను అమితంగా బాధించే బలిచక్రవర్తి కుమారుడైన బాణుడన్న రాక్షస రాజును గూడా కుమారస్వామి వధించాడు. ఈ విధంగా ముల్లోకాలకూ సంతోషాన్ని కలిగించినవాడై విజయైశ్వర్యంతో ప్రకాశించాడు. సమస్త లోకాలూ గౌరవించవలసిన ఆ ఆరుముఖాల వాడి గాథలు వింటే ధన్యత్వం కలుగుతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...