13, మార్చి 2025, గురువారం

:: మధుకైటభుల వృత్తాంతము ::  

    ఒకప్పుడు సమస్తలోకాలూ మహాప్రళయ కాలంలో జలమయమై పోయాయి. ఎక్కడా భూమి జాడే లేదు. సృష్టిలో ఏ  ప్రాణీలేదు. దేవదేవుడైన శ్రీమహావిష్ణువు ఒక్కడూ మిగిలి శేషపర్యంకం మీద యోగనిద్రలో ఉన్నాడు. గాఢనిద్రలో ఉన్న ఆయన కర్ణముల నుండి  గులిమి జారి పడింది. ఆ గులిమి ఉండలనుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు అసురులు జన్మించారు. అక్కడే సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు. మహాబలవంతులుగా తయారయ్యారు. అన్నదమ్ములవలె సంచరిస్తూ సముద్ర జలాల్లోనే అటూ ఇటూ ఈదులాడుతూ మెలిగారు. తమ ఆహారం కొరకు వివిధ రకాలైన జలచరాలను చంపేవారు. 

    కాలక్రమేణా పెద్దయ్యాక, భారీ శరీరాలు, మరియు తగిన సాధారణ జ్ఞానం కలిగిన ఆ రాక్షస సోదరులు తమకు జన్మనిచ్చిన ఒక భారీ శక్తి  ఉందని గ్రహించారు. గాలినుండి వారు వాగ్బీజమనే  బీజమంత్రపు శబ్దాన్ని విన్నారు. శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెఱుపు మెరిసింది.  వారికి వినిపించిన వాగ్బీజం ఒక మహామంత్రమని వారిద్దరూ గ్రహించారు. నిరాహారులై, జితేంద్రియులై ఏకాగ్ర చిత్తంతో వెయ్యి సంవత్సరాలపాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహా తపస్సు చేశారు. వారి నిష్ఠకు మెచ్చుకున్నది పరాశక్తి. ప్రసన్నురాలై దర్శనమిచ్చింది. వరం కోరుకొమ్మంది.. స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్తకంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తథాస్తు అంది. 

    దేవీ వరంతో అహంకరించి, పద్మాసనం మీద కూర్చుని నిశ్శబ్దంగా జపం చేసుకుంటున్న బ్రహ్మదేవుని చెంతకేగి ఇద్దరూ మాతో యుద్ధం చెయ్యమని అడిగారు. లేదంటే మాకు పద్మాసనం అందించి ఎక్కడికైనా వెళ్ళిపొమ్మన్నారు. బలవంతులదే ఈ ఆసనం. ఇది వీర భోజ్యం. నీవు దుర్బలుడవు అని ప్రకటించారు. వారు అజేయులని గ్రహించి, బ్రహ్మ సామ దాన భేద దండో పాయములను ప్రయోగించి సమాధాన పరచటానికి ప్రయత్నించాడు. కానీ, సఫలీకృతుడు కాలేక పోయాడు. చివరకు యోగనిద్రలో నిశ్చలంగా ఉన్న విష్ణుమూర్తి దరికి చేరి ప్రార్థించాడు బ్రహ్మ. నారాయణుడు ఎంతకీ నిద్రనుండి మేల్కాంచలేదు. అప్పుడు బ్రహ్మ మహావిష్ణువును మేల్కొల్పమని యోగనిద్రాదేవిని స్తుతించాడు. ఆమె శౌరి శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. విరించి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. నిద్రలేచిన హరి ఎదురుగా భయంతో నిలుచున్న బ్రహ్మను చూచి తపస్సు మాని ఇక్కడకు వచ్చిన కారణమేమిటని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువుతో స్వామీ! నీ చెవిలోని గులిమినుండి మధుకైటభులనే రాక్షసులు ప్రాదుర్భవించి నా ఆసనాన్ని కోరుతూ నన్ను చంపబోయారు. వారు ఘోరమైన రూపంతో అతిశయిస్తూ మహాబలశాలురై ఉన్నారు. వారినుంచి దయతో నన్ను కాపాడు. నా భయాన్ని పూర్తిగా తొలగించి ఆదుకోమని కోరాడు. ఆ వెంటనే విష్ణుమూర్తి మధుకైటభులను తనతో పోరాడమని ఆహ్వానించాడు. పోరాటం అయిదువేల సంవత్సరాల కాలం కొనసాగింది. కానీ, స్పష్టమైన ఫలితం లేకుండా పోయింది. విష్ణుమూర్తి  అలసట చెందాడు. వాళ్ళిద్దరిలోనూ అలసటే లేదు. కారణం ఏమై ఉంటుందా అని కించిత్ ఆలోచనలో పడ్డాడు శ్రీహరి. 

    మధుకైటభులు విజయ గర్వంతో సంబరపడ్డారు. విష్ణువుతో గంభీరంగా ఇలా అన్నారు. హే విష్ణూ! అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే, మాకు శిరసు వంచి నమస్కరించు. దాసుడనని ప్రకటించు. కాదంటే, సమర్ధుడవై యుద్ధం చెయ్యి. నిన్ను చంపి, తరువాత ఈ నాలుగు ముఖాలవాడైన బ్రహ్మను గూడా చంపుతామన్నారు. అప్పుడు శ్రీమహావిష్ణువు సాదరమైన మధుర వచనములతో ఈ విధంగా పలికాడు. అలసిన వారిని, భయపడిన వారిని, ఆయుధం విడిచి పెట్టిన వారిని, క్రింద పడిన వారిని, పిల్లలను వీరులైన వారు చంపరు. ఇది సనాతన నీతి. అయిదువేల సంవత్సరాలు మీతో యుద్ధం చేసి అలసిపోయాను. మీరిద్దరూ సమాన బలశాలురు. సోదరులైన మీరు మధ్య మధ్య విశ్రాంతి తీసుకొంటూ యుద్ధం చేస్తున్నారు. నాకు విరామం లేదు. నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకునే వరకు మీరు యుద్ధం ఆపండి. తదనంతరం యుద్ధారంభం చేద్దామన్నాడు. శ్రీహరి అలా అనగానే సరే, కానిమ్మన్నారు, మధుకైటభులు. వాసుదేవుడు గాఢంగా ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వారిది స్వేచ్ఛా మరణమని, దేవి ఆ వరం ప్రసాదించిందనీ గ్రహించాడు. వెంటనే ఆ పరాశక్తిని శరణు వేడుతూ నమస్కరించాడు. 

    పరాశక్తి ప్రసన్నురాలు అయింది. చిన్నగా నవ్వుతూ శౌరితో ఇలా అన్నది. హరీ! మరలా యుద్ధం చెయ్యి. ఈ రాక్షసులను మోసగించి వధించాలి. వేరొక దారి లేదు. నేను వంకర చూపులతో వారిని సమ్మోహ పరుస్తాను. ఆ మాయలో ఉండగా నువ్వు వారిని మట్టుబెట్టు అంది. అన్నట్టుగానే జగదాంబ తన మాయతో మధుకైటభుల ఎదుట ఒక దివ్య సుందరిగా ప్రత్యక్షమయింది. మన్మధ శరముల వంటి దృక్కులతో రాక్షస వీరులను చూసి అందంగా నవ్వింది. ఆ జగదాంబ అపూర్వ సౌందర్యాన్ని గమనించి మోహపరవశులై పోయారు వారు. ఏ తల్లి దయతో వారికి స్వేచ్ఛా మరణ వరం లభించిందో ఆ తల్లినే మాయకు లోనై కాముక దృష్టితో చూశారు. తమను తామే మరచి పోయారు. వారి మోహావేశాన్ని కనిపెట్టాడు మహావిష్ణువు. వెంటనే, వారితో ఓ మధుకైటభులారా! మీ యుద్ధ నైపుణ్యం, పటిమ నన్ను అమితంగా సంతోషపెట్టాయి. మెచ్చాను. కోరుకోండి. కోరిన వరాలనిస్తాను అని అన్నాడు. అలా అనగానే సుందరీమణి సన్నిధానంలో తన గొప్పతనం చాటడానికి శ్రీహరి అలా అంటున్నాడని భావించి, మూర్ఖులైన ఆ రాక్షస సోదరులు కాముకత, అహంకారం, దురభిమానం అన్నీ ఏకమై మూఢత్వంతో అతిశయిస్తూ శ్రీమహావిష్ణువుతో ఇలా అన్నారు. అపూర్వ సుందరీమణి సన్నిధిలో నీ గొప్పదనం చాటటానికి ఇలా అంటున్నావు. కాని, మాకు వరాలనిచ్చే శక్తి నీ కెక్కడిది? మేము భిక్షుకులం కాదు. నీకే వరాల నియ్యగల దిట్టలం. ఏమి కావాలో కోరుకో, ఇస్తాం అన్నారు. అయితే, దానవులారా! మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి. వధ్యులు కావాలి. రమాపతి అలా కోరే సరికి మధుకైటభులు ఆశ్చర్యపోయారు. వంచితుల మయ్యామని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకుని ఆలోచించారు. జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. 

    జనార్దనా! ఇంతకుముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు. గుర్తుందిగా. మాట మార్చకు. నీకు మేము వంధ్యుల మవుతాము. కాకపోతే, నిర్జలమైన విశాల ప్రదేశంలో నిర్జించాలి. అదే, నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా. నెరవేర్చు అన్నారు. ఆ నియమానికి శ్రీహరి నవ్వుకొన్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్ములను సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీటిమీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా! ఈ తొడ మీద నీరు లేదు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను, రండి, అని పిలిచాడు. రాక్షసులకు మతిపోయింది. ఏమి చెయ్యాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను వెయ్యి యోజనాలకు పెంచారు. విష్ణుమూర్తి తన జఘన భాగాన్ని రెండువేల యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులూ ఖండించాడు. తలలూ, మొండాలూ తొడలమీద రాలిపడ్డాయి. మధుకైటభులు నిహతులయ్యారు. వారి కళేబరాలనుంచి మేదస్సు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేదిని అంటే, భూమి అయింది. అందుకనే మృత్తిక, అదే, మట్టి తినరానిదయింది. 

    
     

   

    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...