1, మార్చి 2025, శనివారం

:: జడభరతుడు :: 

    భరతుడు ఆంగీరస గోత్రుడైన ఒక బ్రాహ్మణునకు కుమారుడుగా పుట్టాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య వలన ఆయనకు తొమ్మిదిమంది పుత్రులు, రెండవ భార్య వలన కవల సంతానంగా ఒక పుత్రుడు, ఒక పుత్రిక కలిగారు. కవల సంతానములోని మగ శిశువే భరతుడు. భరతుని తండ్రి అయిన ఆ బ్రాహ్మణుడు వేదాధ్యయన సంపన్నుడు, సుగుణ గరిష్ఠుడు, నీతికోవిదుడు. భరతుడు పుట్టినది మొదలు సంసారబంధాలకు దూరంగా ఉంటూ, అచ్యుతుడు, సర్వేశ్వరుడూ అయిన విష్ణుమూర్తి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ కాలం గడపసాగాడు. పూర్వజన్మ స్మృతులవల్ల భరతుడు బంధ విముక్తికోసం ఉన్మత్తుడుగా, జడుడుగా, అంధుడుగా జనులకు కనిపిస్తూ జీవితం గడిపినాడు. అందువల్ల ఆ తరువాత అతడు జడభరతుడన్న పేరుతో ప్రసిద్ధిచెందాడు. 

    బ్రాహ్మణ కుమారుడైన జడభరతుడికి కర్మలంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా, బోధించేవాడు తండ్రి కాబట్టి వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రి వానికి ఉపనయనంచేసి, గాయత్రీమంత్రోపదేశం చేసి, వేదాధ్యయనం చేయించి, వానికి వానిపట్ల అభినివేశం లేకపోవడం గమనించి తన కోరిక నెరవేరలేదని నిరాశ పడ్డాడు. కొంతకాలానికి ఆ విప్రుడు ఆకస్మికంగా పరలోక గతుడైనాడు. తండ్రి పోగానే తల్లి సహగమనం చేసింది. సవతి పిల్లలు అవినీతిపరులు. అందువల్ల వారికి భరతుని గొప్పదనం తెలియలేదు. తండ్రి మరణానంతరం సవతి తల్లి పిల్లలు భరతుణ్ణి చదువనీయకుండా ఇంటిపనులు, పొలంపనులు చేయమని శాసించేవారు. ఆ పనులు చేస్తూ భరతుడు ఏ విషయంలోనూ ఆసక్తి లేకుండా ద్వంద్వాలలో సమబుద్ధి కలవాడై, వారేమి తిట్టినా పట్టించుకోకుండా కాలం గడిపాడు. అతడు పనిచేసే పొలానికి సమీపంలో ఒక నగరం ఉంది. దాని నాయకుడు భిల్లరాజు. వానికి సంతానం లేదు. సంతానం కోసం కాళికాదేవిని పూజించి, ఆమెకు బలి యివ్వాలని నిశ్చయించుకున్నాడు. కాళికాదేవికి బలి యివ్వటానికి ఒక మనుష్యుణ్ణి వెంటబెట్టుకొని వెడుతూ ఉంటే ఆ మనిషి తప్పించుకొని పారిపోయాడు. వాడు ఎంత వెదికినా దొరకలేదు. అప్పుడు భిల్లరాజు భటులు పొలంలో వీరాసనంలో ధ్యానం చేస్తున్న భరతుణ్ణి చూచి బలికి బలిపశువు దొరికిందని కాళికాలయానికి తీసుకుపోయి బలి యివ్వబోగా సాక్షాద్విష్ణు స్వరూపం అయిన భరతుణ్ణి చూచి కాళికాదేవి బోయరాజు మీద, భటుల మీద విజృభించి వారి శిరస్సులు నేలకూల్చింది. తరువాత జడభరతుడు పొలం దగ్గరకు వచ్చి పూర్వంలా కాపలా కాస్తున్నాడు. ఇలా సంవత్సరాలు గడిచాయి. 

    ఒకసారి సింధు దేశాన్ని పరిపాలించే రహూగణుడనే రాజు కపిలముని దగ్గర ఆత్మవిద్య తెలుసుకోవాలని బుద్ధిపుట్టి ఇక్షుమతీ నదీతీరంలోని కపిలమునిని దర్శించటానికి పల్లకీ ఎక్కి వెడుతున్నాడు. పల్లకీమోసే బోయీలకు పొలాన్ని కాపలాకాసే బలవంతుడైన భరతుడు పల్లకీ మోయటానికి బాగుంటాడని అతనిని తీసుకువచ్చి పల్లకీ బొంగు అతని భుజంమీద పెట్టారు. అలవాటులేని, ఆసక్తిలేని భరతుడు నడుస్తున్నాడు. మిగిలిన బోయీలకు ఇతని నడకతో జత కుదరలేదు. ఎగుడు దిగుడుగా పల్లకి నడుస్తుంటే రాజుకు కోపంవచ్చి బోయీలను మందలించాడు. వారు భరతుడు సరిగా నడవటం లేదని చెప్పారు. రహూగణునకు కోపం వచ్చి బ్రహ్మతేజస్సుతో, నివురుగప్పిన నిప్పులా ఉన్న భరతుణ్ణి నిందించాడు. భరతుడు మారు చెప్పకుండా పల్లకీ మోస్తూనే ఉన్నాడు. భరతునకు తనకిది చివరి జన్మమని తెలుసు. అహంకార మమకారాలకు మనస్సులో అవకాశం యివ్వలేదు. అతడు జ్ఞాని, పరబ్రహ్మస్వరూపుడు. రహూగణుడు పల్లకి ఎగుడు దిగుడుగా పోతుంటే పిచ్చికోపంతో అరిచాడు. ఓరీ! పొగరుబోతా! నడపీనుగా! నీ కుంటి నడకను వదిలించి సరిఅయిన మార్గంలో నడిపిస్తాను అని కారుకూతలు కూసాడు. అది విని భరతుడు ఓ రాజా! నీవు చెప్పింది నిజం. బరువు శరీరానికే గాని నాకేమాత్రం కాదు. జీవన్మృతుడను. నేను మాత్రమే కాదు. జనన మరణాలు కల్గిఉండే వారందరూ జీవన్మృతులే. యజమాని సేవకుడు అనే సంబంధం కర్మవల్ల కలిగింది. " నేను రాజును గదా!" అనే అభిమానంతో నీవు ఆజ్ఞాపించావు. " నీవు మదోన్మత్తుడవై ఉన్నావు. మూగవాడు, పిచ్చివాడు, గుడ్డివాడు ఎలాగో, నేనూ అంతే! జడుడను, మృతుడను అయిన నాకు శిక్ష విధించిన నీ శ్రమ వ్యర్థం " అని చెప్పి పల్లకి ఎప్పటిలాగే మోయసాగాడు. రహూగణుడు భరతుని శాస్త్ర సమ్మతములైన వాక్యాలను విన్నాడు. అహంకారం తొలగింది. బ్రాహ్మణునకు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. నీవు సామాన్య బ్రాహ్మణుడవు కావు. అవధూతలా కనిపిస్తున్నావు. నిగూఢమైన విజ్ఞాన రహస్యాలు నీకు తెలిసినట్టే ఉంది. నీవు లోకులను పరీక్షించటం కోసం ఎవరూ గుర్తించటానికి వీలుకాని ఆకారంలో తిరుగుతున్న కపిల మహామునీంద్రుడనే అనుకుంటున్నాను, అని రాజు రహూగణుడు బ్రాహ్మణుని ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నాడు. సంసారమనే అడవిలోని కష్టాలను, దు:ఖాలను సవివరంగా చెప్పగా సింధు దేశాధిపతి రహూగణుడు భరతుడికి నమస్కారం చేశాడు. మీరు జ్ఞానులు. మీ సాంగత్యంతో నాకు తత్త్వం బోధపడింది. దేహమే ఆత్మ అనే భ్రమ నశించింది అన్నాడు. ఇలా ఈ జడభరతుని చరిత్ర వినిపించిన వారినీ, విన్నవారినీ శ్రీమన్నారాయణుడు తప్పక రక్షిస్తాడు. వారు స్వర్గసుఖం అనుభవిస్తారు. 

    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...