:: శిశుపాలుని చరిత్ర ::
శిశుపాలుడు చేది వంశంలో సాత్వతీదమఘోషులకు పుట్టాడు. పుట్టుకతోనే వానికి నాలుగు భుజాలు, నొసట కన్ను, గాడిద కంఠధ్వనితో ఏడ్పు వచ్చాయి. తల్లిదండ్రులు అదిచూచి భయపడ్డారు. ఆశ్చర్యపోయారు. అప్పుడొక అశరీరవాణి ఇలా అన్నది - ఈ బాలుణ్ణి ఇతరులెవ్వరూ చంపలేరు. ఎవరైతే ఇతణ్ణి ఎత్తుకోగానే, ఎక్కువగా ఉన్న రెండు చేతులు, కన్నూ అణగిపోతాయో అతడే ఇతడి పాలిటి యముడు. అశరీరవాణి ఆ విధంగా చెప్పేసరికి, శిశుపాలుని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. చూడవచ్చిన వాళ్ళందరి చేతికి ఎత్తుకోవటానికి ఆ బాలుణ్ణి ఇవ్వసాగారు.
అద్భుత ప్రతిభావంతులైన బలరామకృష్ణులిద్దరూ వికార రూపంలో ఉన్న బాలుడు శిశుపాలుణ్ణి, మేనత్త అయిన సాత్వతిని ప్రియమార చూడాలని బంధువులతో, మంత్రులతో, మిత్రులతో కలసి ఒకనాడు చేది భూపతి పట్టణానికి వెళ్ళారు. సాత్వతి ఈ విధంగా వచ్చిన బలరామ కృష్ణులను ప్రీతితో గౌరవించి, బాలుడైన శిశుపాలుణ్ణి ఎత్తుకోవటానికి మొదట బలరాముని చేతికిచ్చింది. ఆ తరువాత శ్రీకృష్ణుని చేతికిచ్చింది. శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే, అందరూ చూస్తుండగా, ఆశ్చర్యకరంగా - అధికంగా ఉండే అతని చేతులు, కన్ను ఒక్కసారిగా అణగిపోయాయి. దానిని చూసి సాత్వతి ఆశ్చర్యపోయింది. అశరీరవాణి చెప్పిన మాటలను మనసులో తలచు కొన్నది. శ్రీకృష్ణుని వల్లనే తన కొడుకుకు మరణం తప్పదని తెలిసికొని శ్రీకృష్ణునితో ఇలా అన్నది. శ్రీకృష్ణా! ఈ బాలుడు చెడు మార్గంలో నడిచేవాడై అపకారం చేసి నీకు అప్రియుడైనా - నీ మరది చేసే తప్పులు నూఱింటిని దయతో క్షమించుమని ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో ఆమె కోరిన వరాన్ని ప్రసాదించాడు.
ఆ తరువాత ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగానికి శిశుపాలుడు హాజరయి, శ్రీకృష్ణుని అగ్రపూజకు ఆహ్వానించిన ధర్మరాజుని, భీష్మాచార్యుని తదితర పెద్దలను తీవ్రంగా అధిక్షేపించి, శ్రీకృష్ణునితో ముఖాముఖి ఈ విధంగా అన్నాడు. ఓ కృష్ణా! అవమానించ దగిన నిన్ను స్నేహం చేత, కురువంశపు ముదుసలి అయిన భీష్ముని ప్రేరణ చేత, నిండు సభలో గౌరవించ దగిన వాడవని ఎంచి తప్పుగా పూజించారు. కేశవా! అవివేకులైన పాండవులు, నీ మీది మోహంతో మతి కోల్పోయిన భీష్ముడు, నీవు నాతో యుద్ధం చెయ్యటానికి సిద్ధంకండి అని మితిమీరిన గర్వంతో అన్నాడు. అప్పుడు చక్రధారి అయిన శ్రీకృష్ణుడు సమస్త రాజసమూహం వినేటట్లు ఈ విధంగా అన్నాడు. ప్రాగ్జ్యోతిషాధిపతి భగదత్తుని మీద మేము దండెత్తిన సమయంలో ఈ శిశుపాలుడు దుర్మార్గుడై బాలురకు, వృద్ధులకు భయం కలిగేటట్లు ద్వారకా నగరాన్ని తగులబెట్టాడు. వీరులైన భోజరాజులు భార్యలతో కలసి రైవతకాద్రిమీద క్రీడిస్తూ మైమరచి ఉన్న సమయంలో క్రూరుడై వారిని వధించాడు. దేవతాసమానుడైన వసుదేవుడు అశ్వమేధ యాగానికై పూజించిన గుర్రాన్ని అపహరించి, ఆ యాగానికి చెఱుపు చేశాడు. పాపాత్ముడై బభ్రుని భార్యను తన భార్యగా చేసుకొన్నాడు. అంతేగాక, మాటలకు సంబంధించి అనేక అపకారాలు కూడా చేశాడు. మా అత్త సాత్వతి ప్రార్థించటంచేత ఈ దుర్మార్గుడు చేసిన నూరు తప్పులు సహించాను. ఇప్పుడు మీరంతా చూస్తుండగా నాపట్ల దుర్మార్గ ప్రవర్తన ప్రారంభించి పరమ శత్రువయ్యాడని శ్రీకృష్ణుడనగానే, శిశుపాలుడు మహా కఠినమైన మాటలతో పురుషోత్తముణ్ణి ఇలా అన్నాడు. దుర్జనులకు ప్రియమైన వాడా! నీ స్నేహంతో, నీ కోపంతో నాకేమి పని? మొదట నా కిచ్చిన కన్యను నీ దానినిగా చేసుకొని ఈ విధంగా మాట్లాడటానికి సిగ్గులేదా? అంటూ శిశుపాలుడు ఒకదాని వెంట ఒకటిగా శ్రీకృష్ణుణ్ణి నిందా వాక్యాలతో దూషిస్తుండగా, రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుని సుదర్శన చక్రం అగ్నిజ్వాలలు చలిస్తుండగా, అందరు రాజులూ భయపడుతూండగా, శిశుపాలుని శరీరం నుండి రక్తధారలు ఒక్కుమ్మడి మీదికి చిందుతుండగా అతని తలను నరికి వేసింది. నిందిస్తూ మాట్లాడిన శిశుపాలుని నోరు మూతపడింది. రాజులంతా ఆశ్చర్యంతో కళ్ళంతా పెద్దవి చేసికొని చూస్తుండగా, శిశుపాలుని శరీరం, వజ్రాయుధంతో హతమైన కొండలా క్రిందపడింది. ఆ కళేబరం నుండి ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ వెలుపలికి వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. తరువాత శ్రీకృష్ణుడు శిశుపాలుని మృతదేహానికి అంత్యక్రియలు జరిపించి, అతని కుమారుణ్ణి చేది రాజ్యానికి రాజుగా చేశాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి