:: వ్యాఘ్రేశ్వరలింగావిర్భూతి ::
పూర్వం దితి - కశ్యపుల పుత్రుడైన హిరణ్యాక్షుడు భూమిని చాపచుట్టగా చుట్టి పాతాళానికి తోసేసాడు. అప్పుడు విష్ణువు యజ్ఞవరాహ అవతారాన్ని ధరించి అతనిని చంపి భూమిని పునరుద్ధరించాడు. అయితే, కొడుకైన హిరణ్యాక్షుని మృతికి అతని తల్లి దితి అమితంగా దు:ఖించింది. అప్పుడు ప్రహ్లాదుని మేనమామ, దుష్టుడూ అయిన దుందుభి నిర్హాదుడనే రాక్షసుడు దితిని ఓదార్చి దేవతలమీద పగదీర్చుకొనటానికి ఉపాయాన్ని ఇలా ఆలోచించాడు. ఎవరికైనా బలాన్నిచ్చేది ఆహారమే కదా! దేవతలయొక్క ఆహారం బ్రాహ్మణులు యజ్ఞాలలో సమర్పించే హవిస్సులు మాత్రమే! యజ్ఞాలకు వేదములే ఆధారం. ఆ వేదాలు బ్రాహ్మణులను ఆశ్రయించి ఉంటున్నాయి. కనుక బ్రాహ్మణులు నశిస్తే, వేదాలు, వేదాలతో బాటు యజ్ఞాలూ నశిస్తాయి. ఆ తరువాత దేవతలకు హవిర్భాగాలు లభించక దుర్బలులవుతారు. అపుడు వారిని తేలికగా జయించవచ్చు. వారి అక్షయ సంపదలను కైవసం చేసికొనవచ్చు - ఇలా ఆలోచించి ఆ దుష్టుడు బ్రహ్మతేజోవిరాజమానులు, వేదాధ్యన సుసంపన్నులు అధికంగా నివసిస్తున్న వారణాసీ నగరానికి వచ్చి వారిని భక్షించటం మొదలుపెట్టాడు.
అతడు మాయావి అయిన కారణంగా వనంలో వనచరునిగాను, జలాలలో జలజంతువు రూపంలోనూ, పగటి భాగంలో మనుష్యుల మధ్య ముని రూపంలోనూ, ఇంకా, అనేక రూపాలలో ఉంటూ బ్రాహ్మణులను చంపి భక్షిస్తూ ఉండేవాడు. రాత్రి పెద్దపులి రూపంలో వచ్చి ఎముకలను గూడా విడిచి పెట్టకుండ తినివేసేవాడు. నిన్న కనిపించిన విప్రుడు ఈరోజున కనిపించక పోయేసరికి కాశీ నగరంలో పెద్ద గగ్గోలు పుట్టింది. అప్పటికే చాలామంది బ్రాహ్మణులు మాయావి నోట్లోపడి మాయమయ్యారు.
ఒకరోజున శివరాత్రినాడు శివభక్తుడైన ఒక బ్రాహ్మణుడు శివుని అర్చించి ధ్యాన నిమగ్నుడయినాడు. దుందుభినిర్హాదుడు అతనిని కబళించటానికి నిశ్చయించుకొన్నాడు కాని, అస్త్ర మంత్రన్యాసం చేసి ఏకాగ్రచిత్తంతో శివధ్యానం చేస్తూన్న విప్రుని సమీపించ లేకపోయాడు. ధ్యానం నుండి లేచి అర్చన ముగించగానే విప్రుని కబళింపబోయాడు మాయావి. వెంటనే సర్వ వ్యాపకుడైన రుద్రుడు వాని అభిప్రాయాన్నెరిగి బ్రాహ్మణుడు అర్చించిన లింగం నుండి ఆవిర్భవించి మృగరూపంలో ఉన్న రాక్షసుని బాహుబంధంలో ఇరికించి పిడికిలితో నెత్తిపై మొత్తగానే వ్యాఘ్ర రూపంలో ఉన్న రాక్షసుడు వెంటనే భయంకరంగా గర్జిస్తూ మరణించాడు. ఆ అరుపుకు అనేకమంది మునులు, ఋషులు, విప్రులు, ప్రజలు అక్కడకు చేరుకొని జయజయ ధ్వానాలతో శంకరుని స్తుతించి అక్కడనే నిత్యనివాసంగా ఉండమని ప్రార్థించారు. భక్తవత్సలుడైన శంభుడు తానావిర్భవించిన లింగము నందే లీనమయ్యాడు. అప్పటి నుండి ఆ లింగం కాశీ నగరంలో వ్యాఘ్రేశ్వర లింగమనేపేర నిత్య పూజలను అందుకుంటూ భక్తుల కొంగుబంగారమై వారిని రక్షిస్తూనే ఉంది. ఈ గాథ శివప్రీతి కరమయినది, భుక్తిముక్తి దాయకమైనదిగా ప్రఖ్యాతి చెందియున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి