:: రామనవమి ::
లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు.
కొడుకు, కోడలూ వచ్చేవేళకి పులస్త్యులవారు పురాణం చదువుకుంటున్నారు. అది చూచి రావణుడు " ఏమిటండి, ఈ గాథ? " అని ఆయనను అడిగాడు.
" ఇది రామాయణం. దీనిని వాల్మీకి అనే మహర్షి రచించాడు. చిత్రమేమిటంటే, ఇందులో చెప్పబడిన కథ అంతా యిదివరలో జరిగినదికాక, ఇకముందు జరుగబోతున్నది " అన్నారు పులస్త్యులవారు.
" ఆ జరుగబోయే వింత కథ ఏమిటో కాస్త మాకు సెలవిస్తారా? " అని ఆయనను కోరినాడు రావణుడు.
" శ్రీమహావిష్ణువు భూలోకంలో దశరథుడనే రాజుకు కొడుకై పుట్టి, యుద్ధంలో రావణుడనే వాణ్ణి సంహరిస్తారట " అన్నారు పులస్త్యులవారు.
యాధాలాపంగా వింటూ ఉన్న మండోదరి ఉలిక్కిపడి, ఎంతో ఆదుర్దాగా " రావణుడంటున్నారు, ఆ రావణుడు మీరు కాదుగదా, కొంపతీసి? " అన్నది భర్తతో.
అందుకు పులస్త్యులవారు, " లోకంలో ఇద్దరు రావణులు లేరుసుమా! రావణుడంటే మనవాడేను " అన్నారు.
ఈమాట వినడంతోనే మండోదరీదేవి తన భర్తకు రాబోయే ఆపదను తలుచుకొని దు:ఖించటం మెదలుపెట్టింది.
రావణుడు నవ్వుతూ, " దశరథుడంటే ఎవడో మనుష్యుడై ఉంటాడు. మనుష్యులను జంతికలకుమల్లే కరకర నమిలి మ్రింగే రాక్షసకులానికంతటికీ రాజును నేను. నన్నా! ఆ దశరథకుమారుడు చంపటం? ఈ పుక్కిటి పురాణం నమ్మకు " అన్నాడు. ఈ మాటకు పులస్త్యులవారు, " అలాగ తోసిపారెయ్యకు. ఇది పుక్కిటి పురాణం ఎంతమాత్రం కాదు " అన్నారు.
" అటైతే, ఒక పని చేస్తాను " అన్నాడు రావణుడు. " ఏమిటి " అన్నది మండోదరి.
" ఆ దశరథుడనే వాడు ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు. వాణ్ణి పట్టుకు చంపివేస్తే, ఇంక వాడికి కొడుకు పుట్టడం, ఆ కొడుకు నన్ను చంపటం అనేది ఉండదు కదా! " అన్నాడు రావణుడు. అని వెంటనే తండ్రి వద్ద సెలవు తీసుకొని అతడు భార్యతో లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. చారులను రప్పించి, " దశరథుడనే వాడెవడో, వానికి పెళ్ళి అయినట్టయితే ఆ భార్య ఎవరో, వెంటనే తెలుసుకురండి " అని చెప్పి పంపాడు.
కొంతకాలమయేసరికి ఆ చారులు తిరిగివచ్చి, " ప్రభూ! హేమ పట్టణాన్ని హరసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు కోసల దేశపు రాజునూ, కేకయ దేశపు రాజునూ ఓడించాడు. కోసలదేశపు రాజునకు కౌసల్య అనీ, కేకయ దేశపు రాజునకు కైకేయీ అని కుమార్తెలు ఉన్నారు. హరసేనుడు ఆ బాలికలను హేమపట్టణానికి తెచ్చి భార్య కిచ్చి " ఈ పిల్లలను మన అమ్మాయి సుమిత్రతోబాటు పెంచు. ఈ ముగ్గురికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేద్దాం " అన్నాడు అని చెప్పారు.
అప్పుడు రావణుడు " నేను దశరథుని సంగతి కనుక్కు రండర్రా అని పంపిస్తే మీరు హేమ పట్టణం సొద చెప్పుకొస్తున్నారేమిటి? " అని విసుక్కున్నాడు.
అందుకు చారులు, " ప్రభూ! చిత్తగించండి. ఆ బాలికలు ముగ్గురిలోనూ పెద్దదైన కౌసల్యకు మొట్టమొదటి పెళ్ళికుమారుణ్ణి వెతికి తెచ్చారు. అతడే దశరథుడు " అన్నారు. " అయితే, ఎప్పుడు పెండ్లి? అన్నాడు రావణుడు.
అందుకు వాళ్ళు, " జైమిని అనే మహర్షి వచ్చి ఈ మధ్యనే ముహూర్తం పెట్టి వెళ్ళాడని అనుకుంటున్నారు ప్రభూ! అదీగాక మరొక్క చిత్రం కూడా విన్నాము " అన్నారు. " ఏమిటది ? " అన్నాడు రావణుడు.
" సుమిత్రకు, కైకేయికి కూడా సంబంధాలు చూడబోతూ ఉంటే ఆ పిల్లలిద్దరూ, మేము ముగ్గురం కలసి మెలసి పెరిగాము. మమ్మల్నికూడా ఆ దశరథుడికే యిచ్చి పెళ్ళిచేస్తే ముగ్గురం ఒకచోటనే ఉంటాం అన్నారట. అందువల్ల సుమిత్రను, కైకేయినీ కూడా ఆ దశరథునికే యిచ్చి పెళ్ళి చేస్తారట " అని చెప్పారు.
" ఈ పెళ్ళి కాకుండా చూడాలి " అంటూ రావణుడు కొలువు చాలించి లేచి, వెంటనే హేమపురాధీశ్వరుడైన హరసేనుని పైకి దండెత్తి వెళ్ళాడు.
ఆ రాజుని యుద్ధంలో ఓడించి పారద్రోలి, రావణుడు విజయగర్వంతో అంత:పురం ప్రవేశించి ఆ రాజకుమార్తెలను ముగ్గురునీ తెచ్చి రథంమీద కూర్చోబెట్టుకున్నాడు. ఇంక ఆ దశరథుని పని పట్టాలనే ఉద్దేశంతో రథాన్ని దశరథుని పట్టణమైన అయోధ్యానగరం వేపు పోనిచ్చాడు. దారిలో గంగానది అడ్డువచ్చింది. ఆ నది ఒడ్డున ఒక సుందరమైన ఓడ కనబడింది. " ఎవరిదీ ఓడ? " అని అడిగేసరికి ఆ ఓడవాళ్ళు " హరసేన మహారాజులంగారిది. వారికి కాబోయే అల్లుడైన దశరథుడు పెళ్ళికి తరలివచ్చినపుడు దాటించడం కోసం ఈ ఓడను మా రాజావారు పంపించారండి " అన్నారు.
ఈమాట వినేసరికి రావణునకు ఒక ఆలోచన తోచింది. " ఈ మానవుణ్ణి చంపటం కోసం నేను పనికట్టుకుని ఆ అయోధ్య దాకా వెళ్ళడం అనవసరం. ఆ బక్కవాని ప్రాణాలు తీయటానికి నా సేవకులే చాలు " అని అనుకొని రావణుడు మాయావులైన కొందరు రాక్షసులను రప్పించి వాళ్ళతో " మీరు ఈ ఓడవాళ్ళ నందరినీ చంపి భక్షించండి. నావికుల రూపాలు ధరించి హరసేనుని నావికులకుమల్లే నటిస్తూ, దశరథుణ్ణి ఓడపైకి రమ్మని పిలవండి. వానితో ఓడ సరిగా నది మధ్యకు రావడంతోనే దాన్ని బుడుంగుమని ముంచివెయ్యండి " అని ఆజ్ఞాపించాడు.
రావణుడు రాజకుమార్తెలతో లంకా పట్టణం చేరుకోవడంతోనే మండోదరి వాళ్ళను చూసి " ఎవరీ పిల్లలు ? " అంది. రావణుడు సంగతంతా చెప్పి " దశరథునికి జలగండం ఏర్పాటు చేసి వచ్చాను. వాడికి నేడో రేపో గంగానది మధ్యలో పెద్ద పెళ్ళి అయిపోతుంది. అదే ముహూర్తానికి ఈ చక్కని చుక్కలను నేను పెళ్ళి చేసుకుంటాను " అన్నాడు.
మండోదరి నెత్తి నోరూ బాదుకుంటూ " నీకూ నీ కులానికి మారకులైన కుమారులను కనబోయే ఈ రాజకుమార్తెలనా పెండ్లి చేసుకుంటానంటున్నావు? కొరివితో తలగోక్కోవడమా? " అన్నది. కొంచెం ఆలోచించుకున్న మీదట రావణుడు పెళ్ళి ప్రయత్నం మానివేశాడు.
తరువాత పెద్ద మానుపెట్టె ఒకటి తెప్పించి దానిలో ఆ ముగ్గురు రాజకుమార్తెలను పెట్టి, మూసివెయ్యమన్నాడు. అయితే, ఆ పెట్టెను దాచటం ఎలాగా అని సమస్య రాగా, రావణునికి వికర్ణుడనే మాయరాక్షసుడు జ్ఞాపకం వచ్చాడు. వికర్ణుడంటే, వేదాలను ఎత్తుకుపోయి బ్రహ్మదేవుణ్ణి ఏడిపించిన సోమకాసురుని కొడుకన్నమాట. ఈ సోమకాసురుణ్ణి చంపటానికే శ్రీమహావిష్ణువు అంతకుముందు మత్స్యావతారం ఎత్తవలసి వచ్చిందికూడా!
వికర్ణుడు రావటంతోనే రావణుడు ఆ పెట్టెను చూపించి " దీనిని తీసుకుపోయి భద్రంగా దాచు. నేను అడిగినప్పుడు మళ్ళీ తెచ్చి యిద్దువుగాని " అన్నాడు.
వికర్ణుడు " చిత్తం ప్రభూ! అంటూ ఆ పెట్టెను పుచ్చుకొని రావణుడు చూస్తుండగానే దానిని తన కడుపులో దాచేసి, ఇంక దీని సంగతి ఎవరికీ తెలియదుగా " అంటూ ఒకమారు వెకిలిగా నవ్వి, తన నివాస స్థానమైన సముద్రానికి వెళ్ళిపోయాడు.
అంతలో అక్కడ దశరథుడు పెండ్లికొడుకై తరలి రావడం, గంగ ఒడ్డున ఓడను ఎక్కడం, రావణుని ఆజ్ఞానుసారం ఆ మాయారాక్షసులు నట్టేట ఓడను ముంచి వెయ్యటం జరిగింది.
కాని, ఆయుర్దాయం ఉన్న వాళ్ళు నట్టేట మునిగినా చావరు. దశరథుడు ప్రవాహ వేగంతో సముద్రంలోకి కొట్టుకుపోయి, కెరటపు దెబ్బలకు మునుగుతూ తేలుతూ ఒకచోట విఘ్నేశ్వరుని కంటబడ్డాడు.
ఏదో పనిమీద అప్పుడు విఘ్నేశ్వరుడు సముద్రంలో ఉన్న వరుణలోకానికి వెళ్ళి, కైలాసానికి తిరిగి వస్తున్నాడు. కొన ఊపిరితో ఉన్న దశరథుణ్ణి గట్టుకు చేర్చి వాని పొట్టను నొక్కి, తాగిన నీరంతా బయటకు పోయేటట్టు చేశాడు. దానితో దశరథుడు బ్రతికి బయటపడి, పెండ్లికని వెడుతూ ఉంటే తనకు మృత్యువు ఎదురైన సంగతి చెప్పాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మీనమేషాలు లెక్కచూసి, " జైమిని పెట్టిన ముహూర్తం ఇంకొక్క అర ఘడియలో ఆసన్నమౌతుంది. ఆ ముహూర్తానికి తప్పక నీకు వివాహం అయే తీరుతుంది " అన్నాడు.
ఆయన అలా అంటూ ఉండగానే అక్కడికొక పెట్టె కొట్టుకు వచ్చింది. ఆ పెట్టెను తెరచి చూసేసరికి దశరథుని పెండ్లికుమార్తెలైన ఆ ముగ్గురు రాజకుమార్తెలూ కనబడ్డారు. " చూశావా, నా జ్యోతిషం ఎలా నిజమైందో మరి, " అంటూ విఘ్నేశ్వరుడు ఆ ముహూర్తానికే దశరథునకూ, ఆ రాజకుమార్తెలకూ మంత్రయుక్తంగా వివాహం జరిపించాడు. తరువాత వాయుదేవుని సహాయంతో వారిని అయోధ్యకు చేర్చి, తను కైలాసం చేరుకున్నాడు.
సముద్రమధ్యలో జరిగిన ఆ వివాహాన్ని రెండు తిమింగలాలు చూసినై. మగ తిమింగలం ఆడ తిమింగలంతో " రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఈ పెళ్ళి ఆపలేకపోయాడు, చూశావా? బ్రహ్మ రాతకు తిరుగు లేదు " అంది.
" అయితే, ఈ మానుపెట్టె ఎక్కడిది? " అన్నది ఆడ తిమింగలం.
" అది వికర్ణుని పొట్టలోంచి వచ్చింది. రావణుని ముందు మెప్పుదల కోసం వాడు దానిని తన కడుపులోనే దాచేశాడు. ఇందుకే దారుణమైన శూలపోటు బయలుదేరి, పెట్టె బయటపడితే గాని నిలవలేకపోయాడు. తరువాత వాడికి కునుకు పట్టింది. వాడు ఇంకా నిద్రపోతూనే ఉండగా ఈ పెట్టె ఇలా కొట్టుకొచ్చింది " అన్నది మగ తిమింగలం.
" అయ్యో పాపం, రావణునకీసంగతి తెలిస్తే వికర్ణుణ్ణి చంపేస్తాడు కదా! " అంది మళ్ళీ ఆడ తిమింగలం.
వికర్ణుడు చస్తే సముద్రానికే పీడ వదులుతుంది. ఆ దుర్మార్గుని కోసం మనం జాలి పడనక్కరలేదు. కానీ, రావణునకీసంగతి తెలవనే తెలవదు. దశరథుడు చనిపోయాడనీ, రాకుమార్తెలు యింకా వికర్ణుని కడుపులోనే ఉన్నారని అనుకొని, కొంతకాలానికి రాక్షసేశ్వరుడు ఈ ఉబుసే పూర్తిగా మరచి పోతాడు.
ఈ రాకుమార్తెలలో జ్యేష్ఠురాలైన కౌసల్య గర్భాన మహావిష్ణువు శ్రీరాముడై అవతరించి, లోకకంటకుడైన రావణున్ని వధించబోతాడు " అని చెప్పింది మగ తిమింగలం.
ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమినాడు భూలోకమందు అవతరించడం, రావణాసురుణ్ణి వధించడమూ కథలో వ్రాసిన ప్రకారం జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి