:: శివరాత్రి వ్రత మహిమ - గుహునికథ ::
చాలానాళ్ళకు పూర్వం గుహుడనే కిరాతకుడొకడుండేవాడు. వేటతో జీవించే వాడు. వేట దొరకకపోతే దారి దోపిడీలకు తలపడేవాడు. ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది. ఆ రోజు శివరాత్రి అనిగాని, అది పర్వదినం అనిగాని ఆ గుహుడనేవాడికి తెలియదు.
కుటుంబ పోషణార్థం యధావిధిగా ఆ రోజున కూడా విల్లమ్ములు తీసుకుని వేటకు బయలుదేరాడు. సాయంత్రమయింది గాని, జంతువు దొరకలేదు. వేట లేకుండా ఇంటికి వెళ్ళటానికి మనస్కరించక అడవిలోనే తిరుగుతూ ఒక చెఱువు దగ్గర చేరాడు.
సంధ్యవేళ అయింది గనుక నీటికోసం జంతువులక్కడకు వస్తాయేమోనని ఆశతో అక్కడే ఆగదలిచాడు. తనవద్ద నున్న నీటి పాత్రతో నీళ్ళు పట్టుకుని, చెరువు గట్టుననే ఉన్న మారేడు చెట్టు నెక్కి కూర్చున్నాడు.
మొదటి ఝాము ముగియకుండానే ఒక లేడి వచ్చింది. దానిని చంపదలచి విల్లునెక్కు పెట్టబోయాడు. ఆ సందట్లో - అతని వద్ద నీటికుండ తొణికింది. అది మారేడు చెట్టు కావడం వలన - కొమ్మలు కదిలి కాసిన్ని బిల్వపత్రాలు కుండలోంచి తొణికిన జలయుతంగా చెట్టు క్రిందనున్న శివలింగంమీద పడ్డాయి.
పగటి ఉపవాసం, శివరాత్రినాటి నిశి - ప్రథమయామంలో శివపూజ చేసిన ఫలం కలగలసి సంక్రమించాయి ఆ బోయవాడికి. కాని, ఈ లోపల ఆ లేడి వేటగాణ్ణి పసిగట్టింది. " ఓ కిరాతకా! నువ్వు నన్ను చంపి తింటానంటే నాకేం అభ్యంతరం లేదు. కాని, నాకు పసి కూనలున్నాయి. వాటిని నా భర్తకూ, సవతికీ అప్పగించి వస్తాను. నన్ను నమ్ము " అని ప్రార్థించింది. అప్పటికే పాపాలు తొలగి పోసాగాయి బోయవాడివి. అందువల్ల కాబోలు - " సరే, చూద్దాం వెళ్ళి రా! " అన్నాడు. ఆ లేడి గృహోన్ముఖి అయ్యింది. దానికోసం ఎదురు చూస్తూ తొలిఝామంతా నిద్ర లేకుండా గడిపాడు బోయవాడు.
రెండవఝాము కూడా వచ్చేసింది. ఆ సమయాన మొదటి లేడి యొక్క సవతి ఆ చెరువుకు వచ్చింది. దానిని చూసి గుహుడు మళ్ళా విల్లూ బాణం తీశాడు. ఈ సారి కూడా కుండ తొణికి నీళ్ళూ కొమ్మా వణకి బిల్వదళాలు దిగువనున్న శివలింగం పైన వర్షించాయి. శివరాత్రి నాటి రేయి రెండవ ఝామున శివార్చన చేసిన ఫలం గుహుడికి జమపడిపోయింది. ఈ గలగలకా లేడికూడా బోయవాణ్ణి గుర్తించింది. అది కూడా తన పిల్లల్ని తన భర్తకు అప్పగించి వస్తాననీ మాట తప్పననీ మరీమరీ చెప్పి వెళ్ళింది. ఈ లేడి కోసం ఎదురు తెన్నులు చూడటంతో గుహుడికి ఆ రెండవ ఝాము కూడా నిద్రలేకుండా పోయింది.
ఈ రెండు లేళ్ళూ కూడా మోసం చేసాయని అనుకున్నాడా బోయ. ఇంతలోనే మూడవ ఝాము సమీపించింది. ఆ సమయానికి - గతంలో వచ్చి వెళ్ళిన స్త్రీ హరిణాల భర్త - తన భార్యలను వెదుకుతూ - అక్కడికి వచ్చాడు. దీన్ని వదలకూడదని గుహుడు మళ్ళా బాణం పుల్ల తీసే సరికి యధాప్రకారం కొమ్మనుంచి బిల్వ పత్రాలూ, కుండనుంచి నీళ్ళు శివలింగంపై ఒలికాయి.
ఇంతలో మూడవ ఝాములో శివార్చన చేసిన పుణ్యంకూడా గుహుడికి సంక్రమించింది. ఇంతలో మగలేడి కూడా గుహుడిని గుర్తించింది. తాను భార్యాన్వేషణలో వచ్చాననీ, ఇంటి దగ్గర పిల్లలు తల్లులకోసం అల్లాడిపోతున్నారనీ వాళ్ళని వాళ్ళకు వప్పగించి వస్తాననీ నమ్మబలికి వెళ్ళిపోయింది. ఈ ఎదురు చూపులో మూడవ ఝాము కూడా నిద్రలేకుండా గడిపాడు బోయవాడు.
ఒకళ్ళోదారీ, మరొకళ్ళు మరొకదారిగా గృహం చేరిన దంపతులు కలిశారు. జరిగినదంతా ఒకరికొకరు చెప్పుకున్నారు. పిల్లలను ఓదార్చారు. భార్యలూ, భర్త కలిసి సత్యవాక్పాలనమే పుణ్యంగా భావించి బోయవాడికి బలైపోవడానికి బయల్దేరారు. తల్లిదండ్రులు అల్లా వెళ్ళిపోతుంటే బిడ్డలు ఊరుకోవడం జరుగదుగదా! అందువల్ల లేడిపిల్లలు కూడా జననీ జనకులను అనుసరించాయి.
నాలుగో ఝాము అయ్యేసరికి బందుమిత్ర కుటుంబ పరివార సమేతంగా వస్తున్న లేడి కుటుంబాన్ని చూసి ఆనందించి - పున: ధనుర్బాణాలు సంధించబోయాడు బోయవాడు. మళ్ళా శివార్చన జరిగిపోయింది. శివరాత్రి నాటి జాగరణ, నాలుగు ఝాములూ శివార్చనా ఫలంతో ఆ బోయవాడు జ్ఞానవంతుడయ్యాడు. తన గత జీవిత పాపాలు తలుచుకుని దు:ఖించాడు. సత్యవ్రతాన్ని పాటించిన హరిణాలను చంపనని వదిలేశాడు.
తక్షణమే ఆ కిరాతకుడి కళ్ళముందు తోచాడు శివుడు. అతణ్ణి అనుగ్రహించాడు. శివుడతనికి గుహుడనే పేరు పెట్టాడు. శృంగబేరిపురం రాజధానిగా నిషాదరాజ్యం పాలించుకోమన్నాడు. విష్ణ్వవతారుడైన రాముడితో మైత్రి కలుగుతుందని వరమిచ్చాడు. ఆడితప్పని లేడికుటుంబానికి సాలోక్యాన్ని ప్రసాదించాడు. అద్భుతాచలమనే ఆ గిరిమీద ఆ భక్తునిపేర వ్యాథేశ్వరుడనే లింగంగా పరిణమించి జగత్ప్రసిద్ధుడయ్యాడు. ఇంత మాహాత్మ్యం ఉంది శివరాత్రికి కాబట్టి - మానవుడు శివరాత్రి వ్రతం తప్పక ఆచరించి తీరాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి