:: ప్రాణంపొందిన ప్రతిమ ::
దేవతల శిల్పి విశ్వకర్మ. రాక్షస శిల్పి మయుడు. ఇద్దరూ గొప్ప శిల్పులే. కానీ, యిద్దరిలోనూ మయుడు చాలా మెరుగు. అయితే, అతను రాక్షస శిల్పి కావటంచేత అతణ్ణి దేవతలు ఎన్నడూ మెచ్చేవారు కాదు. విశ్వకర్మే గొప్ప శిల్పి అని చెప్పుకునే వారు.
మయుడు శిల్పంలో ఎంత గొప్పవాడో అతని స్వభావం కూడా అంత మంచిది. తనను దేవతలు మెచ్చుకోలేదని అతను బాధపడే వాడు కాడు. కాని, మిగిలిన రాక్షసులు, మయుడి దగ్గరకెళ్ళి " నీకామాత్రం పౌరుషమైనా లేదేం? విశ్వకర్మ నీ కాలి గోరికైనా సమం కాడుగదా! అలాంటి విశ్వకర్మ నీకన్నా గొప్ప శిల్పి అంటే చూస్తూ ఊరుకొంటావా? " అన్నారు.
మయుడు నవ్వి " నేను ఎటువంటి శిల్పినో దేవతలు ఎరగరా? శివుడు ఆజ్ఞాపించగా సాల్వుడి కోసం గాలిలో ఎగిరే సౌభకనగరం నిర్మించలేదా? పాండవుల కోసం నేను నిర్మించిన సభను అందరూ చూశారుగదా? " అన్నాడు.
" విశ్వకర్మ మాత్రం సామాన్యుడా? స్వర్గమంతా అతనే కట్టాడు. సూర్యుణ్ణి సానబట్టి, అప్పుడు వచ్చిన చూర్ణంతో మహావిష్ణువుకు చక్రం చేసిపెట్టాడు. పాండవులకు ఇంద్రప్రస్థం కట్టిపెట్టాడు. ఇప్పుడా పాతవిషయాలన్నీ తవ్వటం అనవసరం. నీకూ, విశ్వకర్మకూ పోటీని ఏర్పాటుచేస్తాం. ఆ పోటీలో నీవు విశ్వకర్మను ఓడించాలి. అప్పుడు నీ ఘనతను అందరూ గుర్తిస్తారు " అని రాక్షసులు మయుణ్ణి ఒత్తిడి చేశారు.
" సరే, పోటీ ఏర్పాటుచెయ్యండి " అన్నాడు మయుడు.
రాక్షసులు దేవతల వద్దకు వెళ్ళి " మీ విశ్వకర్మకూ, మా మయుడికీ పోటీ ఏర్పాటు చెయ్యండి. ఇద్దరిలో ఎవరు గొప్ప శిల్పి అయిందీ తేలిపోతుంది. మాటలతో పని ఏమిటి? " అని అడిగారు.
దేవతలు తమలో తాము గుసగుసలాడుకుని విశ్వకర్మతో ఈ మాట చెప్పారు.
" బృహస్పతికి బావమరిదిని. సూర్యుడికి పిల్లనిచ్చిన మామను. ఈ రాక్షస శిల్పితో పోటీకి వెరుస్తానా? " అన్నాడు విశ్వకర్మ.
దేవతలు మయుణ్ణి పిలిపించి " నీకూ, విశ్వకర్మకూ పోటీ ఏర్పాటు చేస్తున్నాం. నువ్వు ఎటువంటి మహత్తుగల వస్తువు నిర్మిస్తావో చెప్పు. అటువంటిదే విశ్వకర్మను గూడా నిర్మించమంటాం " అన్నారు.
" మహిమలకేమిటి? అందరి మహిమలూ అందరెరిగినవే. నేను మూడు లోకాలలోనూ లేని సుందరిని బంగారు ప్రతిమగా తయారుచేద్దామనుకుంటున్నాను. నా శిల్పంలోని సౌందర్యాన్ని అంచనా వెయ్యటానికి వారూ వీరెందుకు? సృష్టికర్త అయిన బ్రహ్మనే ఏర్పాటు చెయ్యండి " అన్నాడు మయుడు.
దేవతలు ఇందుకు సంతోషంతో ఒప్పుకొని వెళ్ళిపోయారు.
త్వరలోనే మయుడు ఒక అద్భుతమైన స్త్రీ రూపాన్ని మనిషి ప్రమాణంగల బంగారు విగ్రహంగా నిర్మించాడు. దేవతలంతా వచ్చి ఆ విగ్రహాన్ని చూసి నివ్వెరపోయారు.
విశ్వకర్మకు కాలూ, చెయ్యీ ఆడలేదు. ఆయన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి " తాతా! ఈ మయుడు నీకు చాలా పెద్ద అవమానం చేస్తున్నాడు. మూడు లోకాలలోనూ ఎక్కడాలేని సౌందర్యవతిని సృష్టించాడు. సృష్టికర్తవైన నీవు కూడా అటువంటి సుందరిని ఎన్నడూ సృష్టించలేదని ఋజువు చెయ్యటానికే అతను ఈ పని చేశాడు. ఆ విగ్రహం ప్రపంచంలో ఉన్నంతకాలమూ మయుడి కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అంతకాలమూ నీకూ, నాకూ కూడా అపకీర్తి తప్పదు " అన్నాడు.
మిగిలిన దేవతలుకూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి " తాతగారూ! మీరే ఎలాగైనా ఈ పోటీకి విఘాతం కలిగించాలి. లేకపోతే మన విశ్వకర్మకు అపకీర్తి, అపజయమూ తప్పవు " అని వేడుకున్నారు.
మయుడు సృష్టించిన హేమ విగ్రహాన్ని చూడటానికి బ్రహ్మదేవుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు. దేవతలు చెప్పిన మాటలలో అతిశయీక్తి ఏమీ లేదని బ్రహ్మకు కూడా తోచింది.
ఆయన మయుడితో " నాయనా! నీవు కుర్రవాడివయినా ఈ హేమ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించావు. కాని, నాకు ఒక్కటే విచారంగా ఉన్నది. ఏమిటంటే, నేనెన్నడూ ప్రాణం లేని ప్రతిమలను సృష్టించినవాణ్ణి కాను. ఈ ప్రతిమను చూస్తుంటే, దీనికి ప్రాణం ఉంటే యింకా ఎంత బాగుండునని నాకే అనిపిస్తున్నది. విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పి వనిపించుకోవటానికి ఈ విగ్రహాన్ని ఎందుకు వృథా చేస్తావు? నేను దీనికి ప్రాణం పోస్తాను. ఇది నీకు యావజ్జీవం భార్యగా ఉంటుంది.అంతకన్నా కావలసిందేమిటి? " అన్నాడు.
మయుడు కొంచెంసేపు ఆలోచించి " దేవా! అలాగే చెయ్యండి. నేను విశ్వకర్మకు ఓడినట్టు ఒప్పుకుంటాను " అన్నాడు.
దేవతల ఆనందానికి మేరలేదు. బ్రహ్మదేవుడు హేమ విగ్రహానికి ప్రాణంపోసి, మనిషిని చేసి, ఆమెకు 'హేమ' అని నామకరణం చేశాడు. అప్పటికప్పుడే మయుడికీ, హేమకు వివాహం అయిపోయింది. బ్రహ్మదేవుడూ, మిగిలిన దేవతలూ వెళ్ళిపోయారు.
" ఇక మీదట హేమ సౌందర్యం గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. ఆమెకు శరీర ధర్మాలన్నీ ఏర్పడ్డాయి. కాలక్రమాన ఆమెకు పిల్లలు పుడతారు, జబ్బులు చేస్తాయి, ముసలితనం వస్తుంది, చివరకు చచ్చిపోతుంది. మయుడి శిల్పం ఈ విధంగా మట్టిలో కలిసిపోతుంది " అని బ్రహ్మ దేవతలతో అన్నాడు.
ఆయన అన్నట్టుగానే అక్షరాలా జరిగింది. హేమ కొంతకాలం మయుడితో కాపురం చేసి, మండోదరీ, మాయావీ, దుందుభీ అనే పిల్లలను కన్నది. ఆమె శరీరం వయసుతో ముడతలుకూడా పడ నారంభించింది. ఒకప్పుడు హేమ సౌందర్యాన్ని గురించి గొప్పగా చెప్పుకున్న రాక్షసులే ఆమెను గురించి చెప్పుకోవటం మానేశారు.
ఇంతలో దేవతలు వచ్చి మయుడితో పోట్లాట పెట్టుకున్నారు. " హేమ మా ఆడపడుచు. మా లోకంలో ఉన్నట్లయితే, శరీర ధర్మాలకు అతీతంగా ఉండి, నిత్య యౌవనిగా ఉండేది. నీకు భార్య కావటం చేత అందవికారంగా అయిపోయింది, చూడు! " అంటూ వారామెను తీసుకొని వెళ్ళిపోయారు.
మయుడు విరక్తిచెంది తన పిల్లలను వెంటవేసుకొని దేశాటనచేస్తూ తిరిగాడు. ఇలా తిరుగుతున్న సమయంలోనే అతనికి రావణుడు కనిపించాడు. అతనికి మయుడు తన కుమార్తె మండోదరిని యిచ్చి పెళ్ళిచేశాడు. ఆ కథ అంతా మీకు తెలిసినదే!
అయితే, ఈ కథలో అందరకూ మయుడు సాటిలేని శిల్పి అయిఉండి కూడా, విశ్వకర్మను పోటీలో ఎందుకు ఓడించి శాశ్వతకీర్తి సంపాదించుకోలేదు? తన విగ్రహంలో శాశ్వతంగా నిలిచిపోవలసిన సౌందర్యాన్ని క్షణికమైన సౌందర్యంగా బ్రహ్మా మారుస్తానంటే ఎందుకు సమ్మతించాడు? కీర్తికాంక్ష లేకనా? అటువంటి అందగత్తె తనకు భార్య అయితే అంతే చాలుననా? అనే సందేహాలు తప్పక కలుగుతాయి. వాటికి ఇలా సమాధానాలు చెప్పుకోవచ్చు. " బ్రహ్మదేవుడు హేమకు ప్రాణం ఇచ్చినప్పుడే మయుడు విజయం సాధించాడు. ఎందుచేతనంటే, మనిషి చేసిన శిల్పాలకు అంతకు పూర్వంగాని, ఆ తరువాతగాని బ్రహ్మదేవుడు ప్రాణం పొయ్యటం జరుగలేదు. అదీగాక, శిల్పంలో ఉండే సౌందర్యం శాశ్వతమైనదనుకోవటం చాలా పొరపాటు. విశ్వకర్మ నిర్మించిన నగరాలూ, మయుడు నిర్మించిన నగరాలూ ఇప్పుడున్నాయా? అవి ఏనాడో నశించిపోయాయి. కాని, సౌందర్యం నశింపులేనిది. మయుడు చేసిన హేమ విగ్రహానికి ప్రాణం పోసి, బ్రహ్మదేవుడే ఆ విగ్రహంలో ఉండే సౌందర్యాన్ని శాశ్వతంగా చేశాడు. ఎందుకంటారా? హేమలో ఉండిన సౌందర్యం మండోదరికి వచ్చింది. ఆమెను గూడా త్రిలోకసుందరి అన్నారు. ఈనాటికీ కూడా ప్రతి సౌందర్యవతిలోనూ హేమ సౌందర్యం ఉండనే ఉంది. ప్రపంచం ఉన్నంతకాలమూ అది నశించదు. ఇది తెలుసు కనుకనే మయుడు బ్రహ్మ సలహాను ఆమోదించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి