:: సుందోపసుందుల కథ ::
పూర్వం దితి కుమారుడైన హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడు అనే వానికి సుందోపసుందులనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారు నిగ్రహంతో కూడిన మనసు కలవారై తపస్సుచే తప్ప సర్వాన్ని పొందటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చి వింధ్య పర్వతానికి వెళ్ళారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని, వేసవికాలం అయిదు అగ్నుల మధ్య, వర్షాకాలంలో, చలికాలంలో నీటి మడుగులలో ఉండి, గాలిని భక్షిస్తూ, ఒంటి కాలి మీద నిలబడి, చేతులు పైకెత్తి తలలు వంచి చాలాకాలం తపస్సు చేయగా, వారి భయంకరమైన తపో వేడిమికి వింధ్య పర్వత గుహలలో పొగపుట్టి, ఎంతో పైకెగసి, ఆకాశం అంతా కప్పగా దేవతలు భయపడ్డారు. అందమైన స్త్రీలచేత వాళ్ళ తపస్సుకు విఘ్నం కలిగించాలని ప్రయత్నించారు. విఫలులయి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి, ఆ రాక్షసుల తపస్సు చెడగొట్టాలని అనగా, ముల్లోకాలచే పూజింపబడిన వాడూ, పద్మం పీఠంగా గలవాడూ అయిన ఆ బ్రహ్మదేవుడు దేవతలకు మేలుచేయాలని, దయతో వరం యివ్వటానికి సుందోపసుందుల దగ్గరకు వచ్చాడు. వారి తపస్సుకు మెచ్చి, వారికి ప్రత్యక్షమై, మీకు యిష్టమైన వరం ఇస్తాను, వేడండి అనగా, వారు చేతులు జోడించి కోరిన రూపం కలిగి ఉండటాన్ని, కోరిన విధంగా వెళ్ళగలగటాన్ని, అన్ని మాయలు కలిగి ఉండటాన్ని, యితరుల చేత చావు లేకుండటాన్ని, అసలు చావే లేకుండటాన్ని అనుగ్రహించమని కోరారు. బ్రహ్మదేవుడు వారికి ' చావు లేకుండటం ' అనే వరం ఒక్కటి తప్ప తక్కిన వాటినన్నింటినీ దయతో అనుగ్రహించాడు.
ఈ విధంగా వారు బ్రహ్మ వలన వరాలు పొంది చెలరేగి, సాటిలేని రాజ్యవైభవంతో వెలిగి, గర్విష్టులై లోకాలను జయించాలన్న కోరికతో దేవతలు, గరుడులు, నాగులు, కిన్నరుల యొక్క పురాలను కొల్లగొట్టుతూ, భూలోకంలోని రాజులను, ఋషులను, బ్రాహ్మణ శ్రేష్ఠులను బాధిస్తూ, బ్రాహ్మణోత్తములు చేసిన యజ్ఞాలు,, వేదాధ్యయనాలు, శ్రాద్ధాలు, హోమాలు, తపస్సులు, దానాలు, జపాల చేత పితృదేవతలు ఎల్లప్పుడూ తృప్తి పొందుతున్నారని కోపించి, పుణ్యవంతుల నిత్య నైమిత్తిక కర్మలకు ఆటంకాలు కల్గిస్తూ, సింహం, పెద్దపులి, ఏనుగు రూపాలు ధరించి అడవులలో తిరుగుతూ, మునిపల్లెల్లో ప్రవేశించి మునులకు ప్రాణభయం కలిగిస్తూ ఉండగా, మునులంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, లోకాలకు సుందోపసుందులు కలిగించే ఉపద్రవాలను గూర్చి చెప్పారు. బ్రహ్మ మునులు చెప్పింది విని, ఆశ్చర్యపడి, వారు యితరుల చేత చావరని, ఒకరితో ఒకరు యుద్ధం చేసి మాత్రమే మరణిస్తారని చెప్పి, విశ్వకర్మను పిలిపించి అందం, కాంతి గల ఒక స్త్రీని సృజింపుమని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ వెంటనే, తన నేర్పుతో కాంతివంతమైన దేహంతో ప్రకాశించే నల్ల కలువల వంటి కన్నులు గల తిలోత్తమను సృజించాడు.
దేవేంద్రుడు మొదలైన దేవతల సమూహాలూ, మునుల సమూహాలూ కొలుస్తూ ఉన్న బ్రహ్మదేవునికి ఆ తిలోత్తమ మహాభక్తితో నమస్కరించి ' పని ఏమి? ' అని ఎదుట నిలిచింది. బ్రహ్మదేవుడు ఆ అందగత్తెను చూచి, ' సుందుడు, ఉపసుందుడు ' అనే రాక్షసి లిద్దరు పొగరెక్కి లోకాలకు కీడుచేస్తూ వింధ్యపర్వత గుహల్లో ఉన్నారు. వారిద్దరూ నీ కారణంగా తమలో తాము పోరాడుకొని మరణించేటట్లుగా చేయుమని ఆజ్ఞాపించాడు. తిలోత్తమ అలాగేనని బ్రహ్మ దగ్గర శలవు తీసుకొని దేవసభకు ప్రదక్షిణ చేసింది. అప్పుడు బ్రహ్మ ఆమె సౌందర్యాన్ని చూడటానికి తనకు నాలుగు దిక్కులలో ముఖాలు కల్పించుకొని చతుర్ముఖుడయ్యాడు. దేవేంద్రుడు తన రెండు నేత్రాలతో చూస్తే తృప్తి కలుగదని వేయికన్నులవాడయ్యాడు. దేవతలు కామమోహితులయ్యారు. ఈ విధంగా తిలోత్తమ అందరినీ మోహింపజేసి, మానవ లోకానికి మెరుపుతీగవలె ప్రకాశిస్తూ, వింధ్యపర్వత అరణ్యప్రాంతమంతా వెలుగుతూండగా వచ్చింది.
సుందోపసుందులు ఆ తిలోత్తమను చూచి, ఒక్కసారిగా మన్మథపీడితులై, పరస్పర స్నేహాన్ని వదలి, అనురాగంతో ఆమె మీద చూపులు నిలిపారు. ఒకే ఆసనంమీద కూర్చొంటూ, ఒకే ఆహారం భుజిస్తూ, ఒకే వాహనం ఎక్కుతూ, ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే పడకమీద పడుకొంటూ, ఒకే పనిచేస్తూ, ఒకటిగా ఉన్న బలవంతులు ఆ సుందోపసుందులిద్దరూ దైవ నిర్ణయం వలన ఒకే స్త్రీని కామించారు. వారిద్దరూ మన్మథ బాధితులై మోహావేశంతో ' ఇది నా భార్య, ఇది నా భార్య ' అని ఆమె ఎడమ, కుడి చేతులను పట్టుకొని, సుందరీ! మా యిద్దరిలో నీవు ఎవ్వరిని కోరుతావో చెప్పు ' మని సుందోపసుందులడుగగా ' మీలో మీరు యుద్ధం చేసి, ఎవడు గెలుస్తాడో అతడినే కోరుతాను ' అని తిలోత్తమ చెప్పగా ఇద్దరూ తగ్గక, వజ్రసమదేహం గల వారిద్దరూ విజృంభించి కొండను కొండ ఎదుర్కొన్నట్లుగా ఒకరినొకరు ఎదుర్కొన్నారు. వ్యతిరేక బుద్ధితో కోపాత్ములై పిడుగులవంటి గట్టి పిడికిలి పోట్లతో ఒకరితో ఒకరు పోరాడినారు. ఒకరితో ఒకరు సంతోషకరంగా మాట్లాడే వారు, ఒకరి మేలు ఒకరు కోరే వారు అయిన ఆ రాక్షసులు పరాయి వారి వలె కోపంతో రెచ్చిపోయి, ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు. ధైర్యవంతులు కూడా స్త్రీల కారణంగా విరోధం పొంది తుదకు నాశనమయిపోతారు సుందోపసుందుల వలెనే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి