18, ఫిబ్రవరి 2025, మంగళవారం

:: పురూరవుని పుట్టుక :: 

    వైవస్వతమనువు కుమారుడైన సుద్యుమ్నుడు ఒకరోజు అశ్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు. మందీమార్బలం కూడా వెంట వెళ్ళింది. ఆ విధంగా అతడు ధనుర్బాణాలతో మృగాలను వేటాడుతూ చివరకు అరణ్యపు ఉత్తర భాగానికి చేరుకున్నాడు. అక్కడ   మేరుపర్వత సానువుల్లో అత్యద్భుతమైన సౌందర్యంతో విరాజిల్లే ఓ ఉద్యానవనం గోచరించింది. ఫలవృక్షాలతోనూ, సౌరభాలను వెదజల్లే పలువిధములైన పూల తరువులతోనూ నిండి, పక్షుల కిలకిలారావాలతో, తుమ్మెదల ఝంకారాలతో సందడి గొలుపుతూ సర్వాంగ సుందరంగా ఎవరో చక్కగా తీర్చి దిద్దినట్లుగా ఉంది ఆ తోట. నిజానికి అది శివుడు ఉమతో గూడి విహరించే సుకుమారమనే వనము. సుద్యుమ్నుడు ఆ వనాన్ని చూడగానే పరవశించి పోయాడు. సేవకులతో సహా  ఆ ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. అందులోనికి ప్రవేశించిన వారంతా అకస్మాత్తుగా స్త్రీలుగా మారిపోయారు. సుద్యుమ్నుని గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. అలా ఎందుకు జరిగిందో వారికేమాత్రం బోధపడలేదు. విచారగ్రస్తులై ఖిన్న వదనాలతో చేసేదిలేక విచారించారు.  

    పూర్వమొకసారి శివపార్వతులు ఆ వనంలో విహరిస్తున్న సమయంలో వారి దర్శనార్థము   బ్రహ్మ మానస పుత్రుల్గగు సనకసనందనాది మహామునులు అక్కడకు వచ్చారు.   ఆ సమయంలో అంబిక వివస్త్రయై ఉండడం వలన హఠాత్తుగా వచ్చిన ఆ మౌనివరులను చూసి సిగ్గుపడి వెంటనే భర్త ఒడిలో నుండి దిగి వస్త్రంతో వక్షస్థలాన్ని కప్పుకొంది.    ఋషులు తమ పొరబాటుని గ్రహించిన వారై వెంటనే అక్కడి నుండి వెనుదిరిగి నరనారాయణాశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పుడు శివుడు తన పత్నికి ప్రసన్నతను కలిగించగోరి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వర ప్రభావము వలన ఏ పురుషుడు ఆ వనంలో ప్రవేశించినా వెంటనే స్త్రీ రూపాన్ని పొందుతాడు. . అప్పటినుంచి విషయం తెలిసిన వారెవరూ ఆ వనంలోకి వెళ్ళటం మానుకున్నారు. సుద్యుమ్నుడు ఇది తెలియకవెళ్ళాడు. స్త్రీగా మారిపోయాడు. అనుచరుల గతీ అంతే అయింది. స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడు ఆ వనం విడిచి ఇవతలికి వచ్చి అరణ్యంలోనే స్థిరపడిపోయాడు. రాజ్యానికి వెళ్ళేందుకు మనసు ఒప్పలేదు. ఇళ అనే పేరుతో ఆ అడవిలోనే అలా అలా తిరుగుతున్నాడు. పరివారం మొత్తం చెలికత్తెలై సేవలు చేస్తున్నారు. 

    ఇది యిలా ఉండగా - ఒకరోజున బృహస్పతి భార్య తారకు, చంద్రునికి జన్మించిన బుధుడు యవ్వనవంతుడై ఆ అడవికి వేటకైవచ్చి అక్కడ ఇళ పేరుతో స్త్రీరూపంలో ఉన్న సుద్యుమ్నుని చూశాడు. ఇళ అందానికి మోహితుడయ్యాడు. ఆమె హావభావాలు అతణ్ణి అమితంగా ఆకర్షించాయి. ఇళ కూడా అలాగే స్పందించింది. బుధుణ్ణి పతిగా వరించింది. ఇద్దరూ గాంధర్వరీతిని వివాహం చేసుకున్నారు. తరువాత యిద్దరకూ ఒక పుత్రుడు కలిగాడు. వానికి పురూరవుడని పేరు పెట్టారు.

    తరువాత స్త్రీ రూపంలో ఉన్న సుద్యుమ్నుడు తన కులగురువైన వశిష్ఠుని స్మరించాడు. అతని దు:ఖకరస్థితికి జాలిచెందిన వశిష్ఠుడు  శివుని ప్రార్థించి సుద్యుమ్నుని స్త్రీత్వాన్ని తొలగించమని అభ్యర్థించాడు. పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలుగకుండా మధ్యేమార్గంగా శివుడు వరం ప్రసాదించాడు. ఈ సుద్యుమ్నుడు ఇకనుంచి ఒక నెల పురుషుడుగా, ఒక నెల స్త్రీగా ఉంటాడని అభయం యిచ్చాడు. దీనికే సంబరపడ్డ సుద్యుమ్నుడు పురుషునిగా మారి రాజ్యానికి వెళ్ళాడు. వశిష్టుని అనుగ్రహంతో పరిపాలన సాగించాడు. స్త్రీ రూపాన్ని పొందిన నెల రోజులూ రాజమందిరం విడిచి బయటకు రాలేదు. పురుష రూపంలో ఉన్న మాసంలో పరిపాలన చేసేవాడు. కాని అది ప్రజలకు నచ్చలేదు. సుద్యుమ్నునికి ఉత్కలుడు, గయుడు, విమలుడు అనే ధార్మికులైన పుత్రులు కలిగారు. వారంతా దక్షిణాపథానికి రాజులయ్యారు. పురూరవుడు యవ్వనంలోకి ప్రవేశించగానే రాజ్యం అతడికి అప్పగించేసి అడవులకు వెళ్ళిపోయాడు సుద్యుమ్నుడు. తరువాతి కాలంలో పురూరవుడు  ప్రతిష్ఠాన పురాన్ని చక్కగా పాలించాడు. 




















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...