:: దిలీపచక్రవర్తి ::
ఇక్ష్వాకు వంశంలో పేరెన్నికగన్న రాజు దిలీపుడు. అతడు ధర్మపరుడు. పరాక్రమవంతుడు. అకుంఠిత దీక్షాదక్షతలతో అనాయాసముగా రాజ్యపరిపాలన సాగించినట్టివాడు. అతని భార్య సుదక్షణ. దాక్షిణ్యగుణం నిండుగా గలిగిన ఆమె మహాపవిత్రురాలు. ఆ రాజు అన్నివిధాలా తనకు తగిన ఆమె యందు సంతానం పొందాలని ఆశించాడు. కానీ, ఆయన కోరిక నెరవేరలేదు. ఇలా చాలాకాలం గడచిపోయింది. తుదకు సంతాన ప్రాప్తికి తగిన వ్రతం అనుష్ఠించాలని దిలీపునకు సంకల్పం కలిగింది. వెంటనే అతడు మహారాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించాడు. పత్నీ సమేతుడై బ్రహ్మను పూజించాడు. పిమ్మట సంతాన కాంక్షతో వ్రతానుష్ఠానానికై ఆ రాజదంపతులు కులగురువైన వశిష్ఠుని ఆశ్రమానికి పయనమయ్యారు.
రాజు ఆశ్రమం చేరిన సమయానికి వశిష్ఠ మహర్షి సాయంకాలానుష్ఠానంలో ఉన్నాడు. ఆయన అనుష్ఠానం ముగిసేవరకు ఉండి పిమ్మట అరుంధతీదేవితో కలిసి ఉన్న మునీంద్రుని సందర్శించాడు. రాజదంపతులు మునిదంపతుల పాదాలంటి ప్రణామం చేశారు. మునిదంపతులు వారిని ప్రీతితో ఆశీర్వదించారు. తరువాత వశిష్ఠ మహర్షి దిలీపుని కుశల ప్రశ్నలు వేశాడు. అన్నిటికీ సమాధానాలు చెప్పి చివరకు సంతతి కలుగక పోవడం చేత సంతోషం లేకుండా పోయిందని తన చింతను మహర్షికి తెలియజెప్పి బాధపడ్డాడు దిలీపచక్రవర్తి. యజ్ఞానుష్ఠానంలో నేను పరిశుద్ధుడనయ్యాను కాని, సంతానలోపం వల్ల పరితప్తుడనవుతున్నానని చెప్పాడు. సంతానప్రాప్తి కలిగే మార్గం బోధించమని మహర్షిని వేడుకున్నాడు. దిలీపుని విన్నపం విని వశిష్ఠ మునీంద్రుడు ధ్యానంతో నిశ్చల నేత్రుడై ఆపై యోగదృష్టికి గోచరించిన విషయాన్ని ఇలా చెప్పాడు. రాజా! పూర్వం ఒకప్పుడు నీవు ఇంద్రుణ్ణి సేవించడానికై స్వర్గలోకానికి వెళ్ళావు. తిరిగి భూలోకానికి వస్తున్నప్పుడు దారిలో కల్పవృక్షం క్రింద ఉన్న కామధేనువునకు ప్రదక్షిణాది సత్కారం చేయకనే తిరిగి వచ్చావు. తనను ఆదరించకుండా వెడుతున్నావని దానికి కోపం వచ్చింది. అందువల్ల, నన్ను తిరస్కరించావు కాన నా సంతానాన్ని ఆరాధించకపోతే నీకు సంతానము కలుగదని కామధేనువు నిన్ను శపించింది. ఆ సమయానికి గంగాప్రవాహంలో మదించిన దిగ్గజం ఘీంకరిస్తూ ఉండటంవల్ల ఆ శాపం, నీకు నీ సారథికి వినబడలేదు. నీకు సంతతి కలుగక పోవడానికి కారణం ఇదే. పూజ్యులను పూజించకపోతే శ్రేయస్సుకు ఆటంకం కలగడం సహజమే కదా! ఇప్పుడు ఆ కామధేనువు వరుణుడు చేస్తున్న దీర్ఘకాలిక యాగానికి ఆజ్యం మొదలయిన హవిస్సులు చేకూర్చటానికై పాతాళానికి పోయి ఉన్నది. పాతాళ ద్వారం మహా సర్పాలతో నిరోధింపబడి ఉన్నది. అక్కడకు పోవడం సాధ్యం కాని పని. ఆ కామధేనువు పుత్రికయైన నందినీ ధేనువు ఇక్కడ నా ఆశ్రమంలోనే ఉంది. దానికి మారుగా దీనిని నీవు శుచివై, ధర్మపత్నితో గూడి భక్తి శ్రద్ధలతో పూజించు. ఇది సంతసించినా నీ కోరిక నెరవేరుతుంది అని వశిష్ఠ మహర్షి చెబుతూ ఉండగానే ఆయనకు హవిస్సు సమకూర్చే ప్రశస్తమైన నందినీ ధేనువు అడవినుండి తిరిగి వచ్చింది. పిమ్మట దిలీపుడు సుదక్షిణాదేవి చేత నందినికి పూజ చేయించాడు. దూడకు పాలుగుడిపించి కట్టివేశాడు. తరువాత ఆవును అడవికి వదలి ఎవ్వరినీ రానీయకుండా తానొక్కడె ఆ ధేనువును కాపాడుతూ వెంట వెళ్ళాడు. నందినికి రుచికరమైన పచ్చగడ్డి కబళాలు అందిస్తూ, దాని ఒడలు గోకుతూ, ఈగలు వాలకుండా నివారిస్తూ, అది పోయిన దారినే పోనిస్తూ భక్తితో ఉపచర్యలు చేసేవాడు. ఏదేమైనా, మహారాజు, రాణి నందినికి భక్తి ప్రపత్తులతో క్రమం తప్పకుండా పూజలు చేశారు. ధేను వ్రతాన్ని అనుష్ఠించారు. ఆ వ్రతం ఇరవైయొక్క దినాలు నిర్విఘ్నంగా కొనసాగింది.
తనను సేవిస్తున్న దిలీపుని భక్తిని పరీక్షించగోరి నందినీ ధేనువు ఒకరోజు చెంతనున్న ఒక కొండ గుహలోనికి ప్రవేశించింది. ఇంతలో ఒక సింహం హఠాత్తుగా అక్కడకు లంఘించి ఆవును పట్టి తినబోయింది. అది చూసిన దిలీపుడు ఆవును రక్షించే ప్రయత్నంగా సింహంపై బాణం వేయబోగా, అతని చెయ్యి పనిచెయ్యలేదు. అప్పుడు సింహం నేను నా ఆహారాన్ని భుజించ బోతూండగా నీ వెందుకు అడ్డగిస్తున్నావు అంటూ, నేను శివకింకరుడను. నామీద నీ శక్తులేవీ పనిచేయవు అని అంది. అది విన్న దిలీపుడు ఆ సింహంతో ఓ శివకింకరా! ఆ పరమేశ్వరుడు నీకు వలెనే నాకు కూడా పరమ పూజ్యుడు. కానీ, మా గురువుగారైన వశిష్ఠ మహర్షికి హోమధేనువైన ఈ గోవును కాపాడటం నా విద్యుయుక్త ధర్మం కదా! కాబట్టి నువ్వు నా ఈ శరీరాన్ని ఆహారంగా స్వీకరించి నా గురు ధనమైన ఈ నందినీ ధేనువును విడిచిపెట్టు అన్నాడు. ఇది వినగానే సింహం, ఈ భూమండలానికే ఏలికయైన నీవు ఒక్క గోవుకోసం విలువైన నీ ప్రాణం వదులుకుంటావా? ఈ ఆవు కాకపోతే, ఇలాంటివి కోటి మీ గురువుగారికి యివ్వవచ్చు. నీ పాలనలో సుఖంగా ఉన్న కోట్లాది ప్రజలను అనాథలను చేస్తావా? అంటూ దిలీపుడిని ప్రలోభపెట్ట జూచింది. కానీ అతడు ససేమిరా అన్నాడు. ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్న ప్రాణాలు ఎందుకంటూ దయచేసి నా ప్రార్థన మన్నించి నా శరీరాన్ని ఆహారంగా స్వీకరించమని సింహాన్ని ప్రాధేయపడ్డాడు. చివరకు ఎట్లాగో ఒప్పుకుంది సింహం. రాజు మామూలుగా కదలగలిగాడు. తనకు తాను సింహానికి అర్పించుకుందామని మోకాళ్ళపై కూర్చొని తలవంచుకొని సింహం వేటుకై ఎదురు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది. నందినీ ధేనువు దివ్యాకృతి దాల్చి, రాజా! వశిష్ఠ మహర్షి తపశ్శక్తివలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి నాకు హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరాన్ని స్వీకరించు సంతానవంతుడవవుతావు అని అన్నది నందినీ ధేనువు. దూడ పాలు త్రాగిన తరువాత, మునులు యజ్ఞార్థము క్షీరమును పొందిన తరువాత మిగిలిన పాలలో ఆరవ వంతు మాత్రమే తీసుకొని తృప్తి చెందాడు. ధేనువ్రత మహిమ వలన రఘుమహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి