:: మాండవ్యోపాఖ్యానము ::
పూర్వం మాండవ్యుడనే బ్రహ్మర్షి ఒంటరిగా భూమండలంలో ఉన్న పుణ్యతీర్థాల నన్నిటిని తిరిగి తిరిగి సేవించి ఒక పట్టణానికి కొంత దూరంగా ఉన్న అడవిలో ఆశ్రమం కట్టుకొని, దాని ద్వారంలో ఉన్న వృక్షం మొదట్లో చేతులు పైకెత్తి ఉంచి మౌనవ్రతంతో తపస్సు చేస్తూ ఉండగా, ఆ పట్టణపు రాజుయొక్క ధనాన్ని దొంగిలించి దొంగలు, తలారులు తమను వెంటాడుతూ ఉండగా మాండవ్యుడి సమీపానికి పరుగెత్తి ఆ ఆశ్రమంలో దాక్కున్నారు. ఆ దొంగలను వెంటాడి వచ్చిన తలారులు ఆ మునిని చూచి ' రాజధనం దొంగిలించిన దొంగలు నీ దగ్గరకే పరుగెత్తి వచ్చారు. నీకు తెలిస్తే వారి జాడను చెప్పు' మని అడుగగా, ఆ ముని మౌనవ్రతంలో ఉండుటచేత మాటాడకుండ ఉండగా, కోపగించి ఆశ్రమంలో ప్రవేశించి ఆ దొంగలను పట్టుకొని. ఆ మునియే దొంగలకు సంధానం చేసే దళారి అనీ, వేషం వేసికొని మౌనంగా తపస్సుచేస్తున్నట్లు మాటాడకుండ ఉన్నాడని నిందలుపలికి తలారులు నీతిమాలి మాండవ్యుడిని ఆ దొంగలతో కలిపి కట్టి తీసికొనివచ్చి రాజుకు చూపి ధనాన్ని ఒప్పగించగా, రాజు ఆ దొంగలను చంపించి, తపస్వి వేషంలో ఉన్న దొంగగా భావించి ఆ మాండవ్యుడిని నగరం వెలుపలి భాగంలో ఇనుప శూలానికి గ్రుచ్చబడిన వానిగా, అంటే., కొఱుతవేయబడిన వానిగా చేశాడు. మునిశ్రేష్ఠుడైన మాండవ్యుడు ఆ విధంగా కొఱుత వేయబడి కూడా తన మనస్సులో ఎటువంటి వికారంలేని శాంతభావంతో, సుఖదు:ఖాలలో కలతచెందని యోగచిత్తంతో ఆహారం తినకపోయినా చాలాకాలం ప్రాణాలతో కూడిన వాడై తపస్సు చేశాడు.
ఈ విధంగా దేహానికి కలిగిన బాధను పట్టించుకోక తపస్సు చేస్తున్న ఆ ముని తపస్సుయొక్క గొప్పతనానికి మెచ్చి, గొప్పవారైన ఋషులు పక్షుల ఆకారంతో రాత్రివేళ వచ్చి " ఓ ముని శ్రేష్ఠుడా! ఇటువంటి గొప్ప తపస్వివైన నీకు ఇటువంటి బాధ కలిగించినవారు ఎవ్వరు? అని అడుగగా, వారికి ఆ మాండవ్యుడు ఈ విధంగా అన్నాడు. మీ ప్రశ్నకు సమాధానం మీకు బాగా తెలిసికూడా నన్నడగటం దేనికి? నరుడు తన పూర్వ పుణ్య పాప కర్మల ఫలంగానే సుఖదు:ఖాలను పొందేటప్పుడు అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి నరుడు తన కర్మఫలాలకు తానే కారకుడవుతాడు. కాని ఇందులో ఇతరులు కారణమెందుకవుతారని అన్నాడు. ఆ విధంగా ఆ మహామునులతో మాండవ్యుడు పలికిన మాటలను ఆ నగరాన్ని రక్షించే భటులు విని వచ్చి రాజుకు తెలుపగా, ఆ రాజు వెంటనే బయలుదేరి శూలానికి గ్రుచ్చబడి కట్టబడి ఉన్న మాండవ్యుడికి మ్రొక్కి " నేను చేసిన తెలివితక్కువ తనానికి, అజ్ఞానానికి క్షమించి నన్ను అనుగ్రహించండి " అంటూ, శూలం నుండి ఆ మునిని విడిపించబోగా తీయటానికి రాలేదు. అప్పుడు దాని మొదలును నెమ్మదిగా నరికించగా, అతని కంఠంలోని ప్రక్కభాగంలో మిగిలిన శూలభాగం శరీరంలోనే ఉండిపోయింది. దాని వలన ఆ ముని ' ఆణిమాండవ్యుడు ' అని పిలువబడినాడు.
ఆ మహాముని గొప్ప తపస్సుచేసి లోకాలన్నింటిని దాటి ఒకనాడు యముని నగరానికి పోయి యమధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. యమధర్మరాజా! ఇటువంటి భయంకరమైన శిక్షకు నేనేమి తప్పుచేశాను? బ్రాహ్మణుడనైన నన్ను ఇంతగా కోపించి కూడని శిక్షతో శిక్షించటం న్యాయమా? అనగా మాండవ్యుడితో యమధర్మరాజు ఈ విధంగా అన్నాడు. నీవు నీ చిన్నతనంలో తూనీగలను ఎగురనీయకుండా పట్టి ముండ్లకు గ్రుచ్చి ఉంచావు. దాని ఫలాన్నే ఇప్పుడు అనుభవించావు. హింస చేసేవారికి కష్టాలు పొందక తప్పుతుందా? అనగా విని మాండవ్యుడు కోపించి, పుట్టినది మొదలుగా పదునాలుగేండ్లు దాటేంతవరకు పురుషుడు బాలుడనబడతాడు. అతడు ఏది చేసినా పాపాన్ని పెద్దగా పొందడు. అతడికి ఇతరులు కీడుచేస్తే పాపులౌతారు. ఇది నేను చేసిన కట్టడి. నీవు ఇట్టి ధర్మాన్ని భావించక బాల్యంలో స్వల్పమైన దోషాన్ని చేసిన నాకు బ్రాహ్మణులకు యోగ్యం కాని కఠినమైన శిక్షను యిచ్చావు. కాబట్టి నీవు మానవలోకంలో శూద్ర వనితకు పుట్టుమని శాపం ఇవ్వటం చేత యముడు విదురుడై పుట్టాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి