:: గోకర్ణక్షేత్రమహిమ ::
పూర్వం ఇక్ష్వాకు వంశంలో పరమ ధార్మికుడు, గొప్ప ధానుష్కుడు అయిన మిత్రసహ మహారాజు ఉండేవాడు. అతని భార్య పేరు మదయంతి. ఒకసారి ఆ మహారాజు సైన్యంతో కూడి దట్టమైన అడవిలోనికి వేటకు వెళ్ళాడు. జంతువులతోపాటు తనను సంహరించటానికి వస్తూన్న కమఠాసురుడనే దుష్టుని సంహరించాడు. ఆ దుష్టుని తమ్ముడు మహారాజుని మోసంతో జయించాలని నిశ్చయించుకొని మారువేషంతో వచ్చి రాజును ఆశ్రయించాడు. రాజు వానిని వంటశాలకు అధిపతిగా నియమించాడు.
ఒకరోజున మహారాజు తన తండ్రి మరణతిథి రోజున రాజగురువైన వశిష్టుని భోజనానికి ఆహ్వానించాడు. వచ్చిన వశిష్టునికి వంటవాని రూపంలో ఉన్న రాక్షసుడు కూరలో నరమాంసాన్ని కలిపి వడ్డించాడు. దానికి వశిష్టుడు కినిసి రాజును " నరమాంస భక్షుడవగు రాక్షసుడవుకమ్ము " అని శపించాడు. కాని జరిగిన దాంట్లో రాజుయొక్క తప్పిదం లేదని గ్రహించి శాపావధిని పన్నెండు సంవత్సరాలకు మాత్రమే కట్టడి చేశాడు. వశిష్టుని శాపానికి కుపితుడైన రాజు తిరిగి గురువును శపించటానికి ఉద్యుక్తుడయి శాపజలాన్ని అందుకోగా భార్య అయిన మదయంతి వారించింది. రాజు నిగ్రహించుకొని ఆ జలాన్ని తన పాదాలపై జల్లుకోగా తక్షణం అవి నల్లగా అయ్యాయి. అప్పటినుండి ఆ మిత్రసహ మహారాజు కల్మాషపాదుడు అనే పేరుతో విఖ్యాతుడయ్యాడు.
గురువైన వశిష్ట మహర్షి శాపాన్ని అనుసరించి ఆ రాజు రాక్షస రూపాన్ని ధరించి అడవిలో జంతువులను, నరులను చంపి భక్షిస్తూ తిరుగుతూ, ఒక రోజున నూతన వధూవరులైన ఇద్దరు ముని దంపతులను . చూచాడు. చూచి యవ్వనంలో ఉన్న మునికుమారుని పట్టుకొన్నాడు రాక్షసుడు. అతని భార్య ఎంత బ్రతిమిలాడినా కించిత్తయినా కరుణ చూపక ఆ మునికుమారుని ఎముకలను మాత్రం మిగిల్చి తక్కిన మాంసాన్ని తినేసాడు రాక్షస రూపంలో ఉన్న రాజు. ఆ బ్రాహ్మణ స్త్రీ అస్థికలను పేర్చి చితిని ఏర్పాటుచేసికొని అందు అగ్నిప్రవేశం చేయబోతూ " యీ నాటి నుండి నువ్వు ఏ స్త్రీతో సంగమించినా వెంటనే నీకు మృత్యువు సంప్రాప్తిస్తుంది. నాకు భర్తృసుఖం లేకుండా చేసిన నీ కర్మకు ప్రతికర్మ రూపంగా లభించే ఫలాన్ని నీ వనుభవింపక తప్పదు. ఇది నా శాపం" అని శపించి ఆ పతివ్రత అగ్నిప్రవేశం చేసింది.
రాజు శాపావధి పర్యంతము రాక్షస రూపంలో సంచరించి అనంతరం తన నిజ రూపాన్ని పొంది రాజధానికి చేరుకున్నాడు. సంతానం లేని రాజు బ్రాహ్మణ యువతి శాపానికి భయపడి రాజ్యం ఉన్నా రాజ్యసుఖాలను అనుభవించలేక వైరాగ్యాన్ని ఆశ్రయించి వన సంచారానికి వెళ్ళిపోయాడు. అతని వెనుకనే బ్రహ్మహత్యా దోషం భయపెడుతూ మహా దు:ఖాన్ని కలిగిస్తూ సంచరిస్తూ వచ్చింది. తద్దోష నివారణార్థం రాజు అనేక జపాలు, వ్రతాలు, యజ్ఞాలు చేయించాడు కాని అవన్నీ నిష్ఫలమయ్యాయి. ఒకరోజున మిథిలా నగర ప్రాంతంలో సంచరిస్తూండగా గౌతమ మహర్షి దర్శనమయింది. ఆయన ముందు తన దు:ఖాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు రాజు. ఆయన కల్మాషపాదుని దుస్థితికి చింతించి గోకర్ణ క్షేత్ర మహిమను విపులంగా చెప్పి, వెళ్ళి అక్కడ శరణాగతిని పొందమన్నాడు. మహర్షి మాట చొప్పున రాజు అక్కడకు వెళ్ళి అక్కడి తీర్థాలలో స్నాన మాచరించి, నియమ నిష్ఠలతో విధి విధానంగా మహాబలేశ్వరుని పూజించి బ్రహ్మహత్యా దోషంతోపాటు సకలమైన పాపాలనుండి విముక్తుడయి మరణానంతరం శివసాయుజ్యాన్నిపొందాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి