:: కండుమహర్షి ఉపాఖ్యానం ::
సర్వ శుభాలను ప్రసాదించే పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న గోమతీనదీ తీరంలో పుణ్యాశ్రమం అనే గ్రామంలో కండుముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఎండాకాలంలో పంచాగ్నుల మధ్యలో నిలబడి, వర్షాకాలంలో తడుస్తూ, శీతాకాలంలో తడిబట్టలు కట్టుకుని మహా కఠోరంగా దీర్ఘమైన తపస్సు కొనసాగించాడు. ఆయన తపోవేడికి ముల్లోకాలూ తలడిల్లిపోయాయి. ఇది గమనించిన ఇంద్రుడు ఎలాగైనా ఆయన తపస్సు భంగం చేయాలని భావించి , అందుకై ప్రమ్లోచ అనే అప్సరసను నియోగించి పంపాడు. రమణీయమైన పరిసరాలతో, పక్షుల కిలకిలా రావాలతో, చక్కటి సెలయేరులతో మనోహరంగా ఉన్న కండుముని ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ అనుకూలమైన ఒక చోట కూర్చొని మధురంగా గానాలాపన చేయసాగింది. ప్రమ్లోచ మధుర గానానికి కండుముని మనస్సు చలించింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. వెంటనే లేచి ఆ గానం వినిపించిన దిశగా బయలుదేరి వచ్చి, అక్కడ దివ్య సౌందర్యంతో మెరిసిపోతున్న ప్రమ్లోచను చూచాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు కండుముని. ఆమెతో సుందరీ! ఎవరు నీవు, నీ గానం నా మనసును దోచింది. నీ పేరేమిటో చెప్పు అని ప్రశ్నించాడు. నేనొక అనాథనని, తమరి సేవ చేయటానికై వచ్చానని, తమరి ఆశ్రమంలో కాస్త చోటు కల్పిస్తే, మీ ఆజ్ఞలను శిరసావహిస్తూ, మీ పాద దాసిగా ఉంటానంటూ కండుమునితో చెప్పింది ప్రమ్లోచ. ఆయన ఆమె విన్నపాన్ని మన్నించాడు. తన ఆశ్రమం లోనికి తీసుకువచ్చాడు.
ప్రమ్లోచతో ఆశ్రమం లోనికి అడుగుపెట్టిన కండుముని వెంటనే తన తపోశక్తితో నవయవ్వన పురుషుడిగా మారిపోయాడు. దివ్య సుందర రూపంతో ప్రకాశిస్తున్న కండుముని నూతన రూపం చూసి ప్రమ్లోచ ఆశ్చర్యపోయింది. ఇక ఆనాటి నుంచి కండుముని జపం, తపం, హోమం అన్నీ విడిచిపెట్టి, రాత్రనక, పగలనక ప్రమ్లోచతో సకల సుఖభోగాలు అనుభవించాడు. అలా వారిద్దరూ ఎన్నో సంవత్సరాలు సంభోగ సుఖాలలో మునిగిపోయారు.
ఒకనాడు కండుముని ఉదయాన్నే లేచి కుటీరం నుంచి బయటకు బయలుదేరాడు. ఆయన్ని చూసి, స్వామీ! ఎక్కడకు వెడుతున్నారని అడిగింది ప్రమ్లోచ. తెల్లవారింది. సంధ్య వార్చాలి కదా! అందుకే వెడుతున్నానని చెప్పాడాయన. ఆ మాటలు విని ప్రమ్లోచ ఒక్కసారి ఫక్కున నవ్వి ధర్మజ్ఞా! తమరి అనుష్ఠానం ఏనాడో గతించింది. ఇప్పుడేమిటి, కొత్తగా సంధ్యావిధి అంటున్నారని పలికింది. ఆమె మాటలు విని ఆశ్చర్యపోతూ, ఏమిటి నువ్వంటున్నది? నిన్ననే కదా నీవు నాకు కనిపించింది. ఎందుకు పరాచికాలాడతావు? నిజం చెప్పు అని అడిగాడు. స్వామీ! నా మాటలు నిజమే. మీరు నేను కలసి సుఖభోగాలు అనుభవించి కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. సరిగ్గా చెప్పాలంటే, తొమ్మిది వందల సంవత్సరాల ఆరు మాసాల మూడు రోజులయినదని చెప్పింది ప్రమ్లోచ.
అది వినగానే కండుమునికి జ్ఞానోదయమయింది. తనెంత పొరపాటు చేసాడో అర్థమయింది. అయ్యో! నేనెంత మోహంలో పడిపోయాను. ఎంత ఘోరమైన అపచారాన్ని చేశాను. ఇన్ని సంవత్సరాలూ నేను చేసిన తపస్సంతా వ్యర్థమై పోయింది కదా!నా వివేకం ఏమయిపోయింది? కామ ప్రభావానికి నేనెలా లొంగిపోయాను. నేను చేసిన పుణ్య కర్మలన్నీ తుచ్ఛమైన కామం బారినపడి సర్వనాశనమై పోయాయే. ఇక ఇప్పుడేమి చేయాలి? నా గతి ఏమిటి? అని చింతించి, ఎదురుగా ఉన్న ప్రమ్లోచతో చీ! పాపాత్మురాలా! నీ వల్లనే నాకీదుర్గతి పట్టింది. తుచ్ఛుడైన ఆ ఇంద్రుడు పంపగా వచ్చి, నా తపస్సును భంగం చేసి, నన్ను సర్వభ్రష్ఠుణ్ణి చేశావు. తప్పో ఒప్పో ఇన్నాళ్ళు నాతో ఉన్నావు కాబట్టి నిన్ను భస్మం చేయను. అయినా, ఇందులో నీ తప్పేముంది. నీ ప్రభువు చెప్పిన పని చేశావు, అంతే. నేనే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి నీ వలలో చిక్కుకున్నాను. తప్పంతా నాదే. ఇక నీవిక్కడ ఉండ తగవు. నీ లోకానికి తిరిగి వెళ్ళిపో అని గర్జించాడు కండుముని.
తపోధనుడైన ఆయన మాటలు వినగానే వళ్ళంతా జలదరించి చెమటలు పట్టాయి ప్రమ్లోచకు. మరేమీ మాట్లాడకుండా అక్కడనుంచి బయలుదేరింది. ఆశ్రమం దాటి వనంలోకి వచ్చింది. తన వంటికి పట్టినచెమటను అక్కడున్న చెట్ల చిగుళ్ళతో తుడుచుకుంది. వెంటనే ఆమే శరీరం ఒక్కసారిగా పులకరించింది. ఆ చెమట బిందువులు గర్భాన్ని ధరించాయి. అది తెలియని ఆమె ఆకాశమార్గాన తన లోకానికి వెళ్ళిపోయింది. ఆ వనంలోని వృక్షాలు చెమట బిందువులలో ఉన్న గర్భాన్ని సంరక్షించాయి. దినదినాభివృద్ధి చెందిన ఆ గర్భంనుంచి మారిష అనే వనకన్య జన్మించింది. ఆమె కాలాంతరంలో ప్రాచేతసులకు భార్య అయింది. దక్షుడు ఆమెకు జన్మించిన పుత్రుడే.
కండుముని ప్రమ్లోచ వెళ్ళిపోగానే, ఎంతో పశ్చాత్తపపడి తను చేసిన పాపం నుండి విముక్తి పొందటానికి పురుషోత్తమ క్షేత్రానికి చేరుకుని, ఎలాంటి కోరికలూ లేకుండా, నిశ్చల చిత్తంతో, అహంకార మమకారాలని త్యజించి పురుషోత్తముణ్ణి ధ్యానిస్తూ, భక్తిప్రపత్తులతో ఆయన మహిమలను, లీలలను వేనోళ్ళ కీర్తిస్తూ చివరకు పునరుత్పత్తి రహితమైన ముక్తిని అందుకున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి