30, జనవరి 2025, గురువారం

 గాయత్రీమాత

    ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసం  పుష్కర తీర్థంలో  తానుగా ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిద్దామని  నిశ్చయించాడు. వెంటనే ఆ విషయాన్ని శివకేశవులకు తెలియజేశాడు. వారిరువురూ తాము బాధ్యత వహించి దగ్గర ఉండి నిరాటంకంగా యాగం పరిసమాప్తి అయ్యేటట్లు చూసే బాధ్యతను చేపడతామని బ్రహ్మదేవునకు హామీ యిచ్చారు. ముహూర్తం నిశ్చయమైంది. సర్వులకూ ఆహ్వానపత్రికలు పంపబడ్డాయి. ముహూర్త క్షణానికి సరస్వతీదేవిని తీసుకురమ్మని బ్రహ్మ ఇంద్రదేవుడిని పంపాడు. పిలిచిన వారందరూ వచ్చిన తరువాత వస్తానని సరస్వతి ఇంద్రునితో చెప్పింది. వెంటనే అతడు బ్రహ్మ దగ్గరకు వచ్చి ఆ సంగతి తెలియజేసి కూర్చున్నాడు. ముహూర్తపు వేళ సమీపిస్తున్నా సరస్వతి రాకపోవటం చేత బ్రహ్మ ఇంద్రుని పిలిపించి  ముహూర్త లగ్నం దాటి పోరాదు కాబట్టి నీవు వెంటనే వెళ్ళి ఒక కన్యను చూచి తెచ్చినట్లయితే, నేను ఆమెను భార్యగా గ్రహించి యజ్ఞ సంకల్పం చేస్తానని చెప్పాడు.  బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించి ఇంద్రుడు భూలోకానికి పోయి, అక్కడ పెరుగు అమ్ముకుంటున్న గాయత్రి అన్న కన్యను, ఆమె దు:ఖిస్తున్నా వినకుండా బ్రహ్మ చెంతకు తెచ్చి అప్పజెప్పాడు. ఆయనను చూడగానే గాయత్రి తన లోకాన్ని, తన తల్లిదండ్రులను పూర్తిగా మరచి పోయింది. ఆ వెనువెంటనే శివకేశవులు ఆధ్వర్యం వహించి ఆమెతో బ్రహ్మకు  గాంధర్వ వివాహం జరిపించారు. తరువాత సంకల్పం చెప్పుకొని బ్రహ్మ యాగాన్ని ఆరంభించాడు.

    ఈ తతంగాలన్నీ ముగిసాక, తీరికగా సరస్వతి, లక్ష్మీ పార్వతులతోనూ, యితర సఖులతోనూ అక్కడకు వచ్చి జరిగిన విషయాలను విని మహోద్రేకంతో గట్టిగా మండిపడింది. ఆమె కోపాన్ని చూసి అందరూ భయ కంపితులయ్యారు. ఉక్రోషం పట్టలేక  ఆమె అక్కడున్న వారినీ, తనతో వచ్చిన వారిని కూడా  శపించింది. కార్తీక పౌర్ణమి నాడు తప్ప మరెప్పుడు నిన్నెవరు పూజించరని బ్రహ్మకు శాపమిచ్చింది. విష్ణువు వంక తిరిగి, నీవు రామావతారం చేపట్టినప్పుడు భార్యా వియోగాన్ని అనుభవిస్తావని, ఆ తరువాత కృష్ణావతారంలో పశువులను కాస్తూ జీవనాన్ని సాగిస్తావని శపించింది. దారుకావనంలో నీ లింగము భూపతనమై, నీవు నపుంసకుడువుగా మారతావని శివునికి శాపమిచ్చింది. అగ్నిని చూచి నీవు సర్వమల భక్షకుడవై, రుద్ర వీర్యము త్రాగుతావని, అలాగే ఇంద్రుణ్ణి ' నీవు శత్రువుల చేతిలో ఓడి అనేక అవమానాలు పొందుతావంటూ శాపాలిచ్చింది. తరువాత అక్కడున్న బ్రాహ్మణులను చూచి, ' మీరంతా పరాన్న భోజనులై, తీర్థక్షేత్రాలలో దుర్దానాలను గ్రహిస్తూ, అనర్హులైనవారిచేత యజ్ఞ యాగాదులు చేయిస్తారని, చివరకు ప్రేతాత్ములై తిరుగుతారని తీవ్రంగా శపించింది. నా ఆలశ్యానికి మీరంతా కారకులంటూ, పార్వత్యాదులను, దేవతా స్త్రీలను అందరనూ గొడ్రాళ్ళుగా మారతారని. శచీదేవిని,  నీవు నహుషునివలన బాధలనుభవిస్తావని శపించి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయింది. 

    బ్రహ్మదేవుని చేపట్టి యజ్ఞమునందు యజమానురాలయి యుండుటచేత, గాయత్రికి దేవతా మహిమలన్నీ కలిగాయి. శాపముల బాధతో కుములుతున్న అక్కడి వారి నందరినీ చూచి, నేడు నేను బ్రహ్మకు భార్య నగుట వలన నాకు కలిగిన సర్వశక్తి సామర్థ్యాలతో మీ కందరకూ శాప విమోచనా వరాలను యిస్తానని చెబుతూ, బ్రహ్మను పూజించిన వారు ఇహ పర సౌఖ్యముల నన్నింటినీ పొందగలరని, ప్రత్యేకించి కార్తీక పౌర్ణమినాడు పూజిస్తే మోక్షార్హులగుదురనీ చెబుతూ, విష్ణువు వంక జూసి కేశవా! నీవు రామావతారంలో నీ భార్యను వెరజిన రాక్షసుని సమూలంగా నాశనం చేయగలవు, కృష్ణుడవై పుట్టి సర్వలోక పూజ్యుడవవుతావు; శంకరా! నీ లింగం పూజార్హమై అభిషేకించబడుతుంది. భక్తుల కోర్కెలను తీర్చగలవు; అగ్నిదేవా! వేనిని భక్షించిననూ నీవు పరిశుద్ధంగా ఉంటూ, దేవతలకు హవిస్సులను అందజేస్తూంటావు; దేవేంద్రా! నీకు తాత్కాలికముగా శత్రుబాధ కలిగిననూ మరల త్రిలోకాధిపత్యమును వహించెదవు; బ్రాహ్మణులారా! మీరు నన్ను తలచుకున్నంతనే పాప విముక్తులవుతారు. ఎన్ని దుర్దానాలను పట్టినా, గాయత్రీ మంత్ర జపంతో దోషాలు నశించి పవిత్రులవుతారు; పార్వత్యాది దేవకాంతలారా! మీకు సంతానం లేకపోయినా, ఆ దు:ఖము మీకు బాధ కలిగించకుండును - అంటూ అందరకూ వరాల నిచ్చి అందరిచేత పరదేవతగా కీర్తించబడింది. 

    యజ్ఞము పరిసమాప్తమయిన తరువాత బ్రహ్మ శివకేశవులను పిలిచి సరస్వతిని ప్రసన్నురాలను చేసి నా సముఖమునకు రప్పింపుమని కోరగా, వారిద్దరూ భార్యలతో సహా వెళ్ళి సరస్వతిని వేనోళ్ళ కీర్తించగా ఆమె, శ్రీహరీ! లక్ష్మి ఎల్లప్పుడూ నీ హృదయం మీద స్థిరమై ఉంటుందని, ఏ అవతార మెత్తితే ఆ అవతారంలో నిన్ను అనుసరిస్తుందని చెప్పి, శంకరా! పార్వతి నీ అర్థ శరీరమై ఉంటుందని,  మీరిద్దరూ అందరకూ సర్వ శుభాలను కలుగజేస్తూంటారని పేర్కొంది. ఆ తరువాత వారితో కలిసి బ్రహ్మ సముఖానికి వచ్చి బ్రహ్మకు నమస్కరించి, గాయత్రిని ఆలింగనం చేసుకొని, సోదరీ! మనమిరువురమూ మన నాథునికి ఇరువైపులా ఉంటూ భక్తులను రక్షిస్తూ సృష్టి ఉన్నంతవరకూ ఈ పుష్కర క్షేత్రంలో విలసిల్లుదామని చెప్పగా గాయత్రీదేవి గూడా అందుకు తన సమ్మతిని తెలిపింది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...