:: ధ్రువోపాఖ్యానము ::
స్వాయంభువునకు శతరూప ద్వారా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇరువురు పుత్రులు కలిగారు. ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని ఇరువురు భార్యలు. సునీతి ధ్రువుణ్ణి, సురుచి ఉత్తముణ్ణి కన్నారు. రాజుకి సురుచిపై మక్కువ ఎక్కువ.
ఉత్తానపాదు డొకనాడు సురుచి సుతుడగు ఉత్తముణ్ణి తొడలపై ఉంచుకొని లాలిస్తూ ఉన్నాడు. ధ్రువుడు వచ్చి తానూ తండ్రి తొడపై ఎక్కగోరాడు. ప్రక్కనే ఉన్న సురుచి " తండ్రి తొడ ఎక్కాలంటే నీవు నా కడుపున పుట్టి ఉండాలి. ఇతర గర్భజుడవైన నీకు ఆ భాగ్యం ఎక్కడిది? నీవు విష్ణు పాదసేవ చేస్తే ఆ దేవుడు నా గర్భాన పుట్టిస్తాడు " అని తూలనాడింది.
తండ్రి వింటూ ఉండగా పినతల్లి అన్న మాటలు వానికి వ్యథ కలిగించాయి. ఏడుస్తూ వాడు తన తల్లి చెంతకు పోయాడు. ఆమె జరిగిన వృత్తాంతం అంత:పురవాసుల ద్వారా విన్నది. " నాయనా! దు:ఖించకు. నా కడుపున పుట్టడం వల్లనే నీకీ అవమానం జరిగింది. తండ్రి తొడ ఎక్కాలనుకుంటే సురుచి చెప్పినట్లు హరి చరణాలను దర్శించు. ఆ దేవుణ్ణి సేవించు " అని ఆమె ఆ బిడ్డకు చెప్పింది.
తల్లిమాట విని ధ్రువుడు నగరం వదిలి వెళ్ళాడు. దారిలో నారదుడు అతని వృత్తాంతం తెలిసి అతని చెంతకు వచ్చాడు. సవతితల్లి వాగ్బాణంవల్ల కలిగిన వ్రణాన్ని భగవధ్యాన రసాయనంతో మాపుకుంటానని ధ్రువుడు నారదునితో అన్నాడు. ధ్యాన దీక్షనుండి ఆ బాలుని విరమింప జేయడానికి ఆయన యత్నించాడు. కాని ఆ బాలుడు తన నిశ్చయం నుండి మరలలేదు.
అతని పట్టుదలకు సంతసించిన నారదుడతణ్ణి మధువనానికి పోయి ధ్యానం కొనసాగించమని బోధించాడు. " ఓం భగవతే వాసుదేవాయ " అన్న ద్వాదశాక్షరీ మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. ధ్రువుడు మధువనం చేరుకొన్నాడు. పిదప నారదుడు ఉత్తానపాదుని చెంతకు పోయి పుత్రవియోగంతో దు:ఖిస్తున్న ఆ రాజును ఓదార్చాడు.
అక్కడ ధ్రువుడు సర్వేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఫల భక్షణతో మొదటి మాసం, జీర్ణతృణపర్ణాలు ఆహారంగా రెండవ మాసం, జలపానంతో మూడవ మాసం, వాయుభక్షణతో నాల్గవనెల, నిరుచ్ఛ్వాసుడై ఒంటికాలిపై అయిదవ నెల గడిపాడు.
అతని దీక్షకు భగవంతుడే కంపించాడు. ప్రాణ నిరోధం పొందిన లోకపాలకులు నారాయణుని శరణు పొందారు. ఆ దేవుడు ధ్రువుని విషయం గ్రహించి అతణ్ణి తపోదీక్ష నుండి మరలించడానికై మధువనానికి వెళ్ళాడు. ధ్రువుని ఎదుట ప్రత్యక్షమయినాడు. సంతోషాతిశయంవల్ల ధ్రువుడు భగవానుణ్ణి స్తుతించ లేకపోయాడు. దేవుడు తన శంఖంతో అతని కపోలతలం అంటాడు. అప్పుడు ఆ బాలుడు భగవంతుణ్ణి పలువిధాల వినుతించాడు.
అందుకు భగవానుడు సంతసించి ఆ బాలునికి " ధ్రువక్షితి " అన్న స్థానం ప్రసాదించాడు. ఆ స్థానం లభించే వరకూ ధర్మబద్ధంగా రాజ్యం పాలించగలవన్నాడు. ఉత్తముడు వేటకు పోయి అడవిలో మరణిస్తాడని చెప్పాడు. వాని తల్లి వానిని అన్వేషిస్తూ పోయి అక్కడ దావాగ్నిలో పడి చనిపోతుందని తెలియజేశాడు. నీవు అనేక యజ్ఞాలు చేసి నన్ను భజించి తుదకు సప్తర్షిమండలోన్నతమైన నా పదవి పొందగలవని చెప్పి గరుడారూఢుడై ధ్రువుడు చూస్తూ ఉండగా వైకుంఠానికి వెళ్ళాడు.
పిదప ధ్రువుడు భగవదనుగ్రహం పొందినా భగవానుణ్ణి మోక్షం కోరలేకపోయానే అని చింతిస్తూనే తన నగరానికి పయనమయ్యాడు. శ్రీహరి అనుగ్రహం పొంది వస్తున్న కుమారుని వార్తవిని ఉత్తానపాదుడు సపరివారంగా ఆ బాలుని కెదురేగి నగర సమీపంలో అతణ్ణి చూశాడు. రథం దిగి తనయుణ్ణి కౌగలించుకొన్నాడు. ధ్రువుడు తండ్రి ఆశీర్వాదం పొంది ఆయన పాదాలకు నమస్కరించాడు. పిమ్మట తల్లులకు ప్రణమిల్లుతూ సురుచికి మ్రొక్కగా ఆమె అతణ్ణి నగుమోముతో ఆలింగనం చేసుకొని ఆశీర్వదించింది. ఉత్తముడూ, ధ్రువుడూ అన్యోన్యంగా కౌగలించుకొని ఆనందాశ్రువులు కార్చారు. సునీతి కుమారుణ్ణి కౌగలించుకొని దు:ఖరహిత అయింది. పురజనులు ధ్రువుణ్ణి ప్రశంసించారు.
ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. ఆపై వనానికి వెళ్ళాడు. ధ్రువుడు " భ్రమి " అనే కన్యను చేపట్టి ఆమె ద్వారా కల్పుడు, వత్సరుడు అన్న ఇరువురు కొడుకులను కన్నాడు. " ఇల " అన్న భార్య ద్వారా ఉత్కలుడనే కొడుకును, ఒక అందమైన కన్యనూ సంతానంగా పొందాడు.
పిమ్మట వివాహం లేకుండానే ఉత్తముడు వేటకు వెళ్ళి అక్కడ యక్షునిచే నిహతుడయ్యాడు. అతని తల్లి వనానికి పోయి అక్కడ దావానలంలో దగ్ధురాలయింది.
ధ్రువుడు సోదర మరణానికి కోపించి రథమెక్కి అలకాపురికి వెళ్ళాడు. అతని శంఖనాదం విని యక్షభటులతనితో తలపడ్డారు. యుద్ధంలో యక్షులు పరాజితులయ్యారు. ఇంతలో అసురమాయ వ్యాపించి ధ్రువుణ్ణి చీకాకు పరిచింది. అతడు నారాయణాస్త్రం ప్రయోగించి అసురమాయను దూరీకరించాడు.
అప్పుడు స్వాయంభువుడు వచ్చి ధ్రువుణ్ణి శాంతింపజేశాడు. ఆపై కుబేరుడు రాగా ధ్రువుడతనికి నమస్కరించాడు. కుబేరుడతనికి స్థిరమైన హరిస్మరణమనే వరం ప్రసాదించి అంతర్హితుడయ్యాడు.
ధ్రువుడు తిరిగి తన నగరం చేరి పలు యజ్ఞాలు చేశాడు. శ్రీహరిని భక్తితో ఆరాధించాడు. ఇరవయ్యారువేల సంవత్సరాలు రాజ్యం పాలించాడు. పిదప కొడుకుకు పట్టంగట్టి తాను విరక్తుడై బదరికా భూమికి వెళ్ళాడు. అక్కడ భగవధ్యానం అనుష్ఠించాడు. అప్పుడొక విమానం అక్కడకు వచ్చింది. అందులో వచ్చిన నందసునందులనే భగవత్కింకరులు ధ్రువుణ్ణి విమానమెక్కించుకొని మాధవపదానికి తీసుకొనిపోయారు. అతని తల్లికూడా అతనికి ముందే విమానమెక్కి వెళ్ళింది. ఇలా ధ్రువుడు హరిపదం పొందాడు. నారదుడు ప్రచేతసుల సత్త్రంలో ధ్రువుని మహిమను కీర్తించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి