2, మార్చి 2023, గురువారం

 తెలివి ఒకరి సొత్తా.........? 

    ఒక ఊరిలో ఒక పేద పండితుడు ఉండేవాడు. ఒకసారి ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు సంచారం చేస్తూ ఆ పండితుడు ఉన్న గ్రామం వచ్చాడు. పండితుడు తన పాండిత్యంతో ఆ రాజుని మెప్పించాడు. ఆయన వెంటనే ఆ ఊరి కరణంతో ఆ పండితుడికి ఊరి సమీపంలో ప్రవహిస్తున్న వాగు ఒడ్డున సాగు చేసుకోవడానికి భూమిని ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కరణానికి తనను ఏమాత్రం లెక్కచేయని పండితుడంటే ఒళ్ళుమంట.  అతడు వాగు వెంబడి ఉన్న భూమిని మొత్తం పరికించి సాగుకు ఏమాత్రం అనుకూలంగా లేని పనికిమాలిన అయిదెకరాల భూమిని ఎన్నిక చేసి సాగు చేసుకొమ్మని ఆ పండితుడి పేర ఇనాం రాయించి యిచ్చేశాడు.  

    ఇనాం పట్టా పుచ్చుకొని పొలం లోనికి అడుగు పెట్టిన పండితుడికి, ఆ భూమిని చూడగానే ఏడుపు వచ్చినంత పనైంది. అది తొండలు సైతం గుడ్లు పెట్టని భూమి. ఎందుకూ పనికి రానిది. కరణం చేసిన మోసానికి లోలోపల కృంగి పోయాడు. వాగుకు అటువైపు చూశాడు. చక్కని సారవంతమైన నేల. తనకిచ్చిన ఇనాం పట్టాలో హద్దులు చూశాడు. "ఉత్తరం వాగు" అని రాసి ఉంది. అదిచూడగానే మెరుపు మెరిసినట్లుగా అతనికొక ఆలోచన వచ్చింది. దానిని వెంటనే అమలుపెట్టి, వాగుకు అటు వైపున్న సారవంతమైన భూమిని సాగుచేయడం మొదలుపెట్టాడు. 

    కరణానికి అది తెలిసి ఒళ్ళు మండిపోయింది. వెంటనే రాజు సముఖానికి వెళ్ళి " ఆ పండితుని పొగరుబోతుతనం తమరే వచ్చి స్వయంగా చూడండి " అని ఫిర్యాదు చేశాడు. వెంటనే రాజుగారు హుటాహుటిని కదలి వచ్చారు. పండితుడు సాగుచేస్తున్న భూమిని చూసి కారణం అడిగాడు. 

    పండితుడు అమాయకంగా మొహం పెట్టి " ప్రభూ! పట్టాలో 'ఉత్తరం వాగు' అని రాసి ఉంది. వాగుకు ఉత్తరంగా ఉన్న భూమి అనుకొని దీనిని సాగుచేసుకున్నాను. తప్పయితే మన్నించండి " అన్నాడు. రాజు వాస్తవంగా పండితుడికిచ్చిన భూమిని చూశాడు. అది వ్యర్థమైనదని ఆయనకు అర్థమయింది. అంతలో కరణం చావు తెలివినీ, దానిని చక్కని సమయస్ఫూర్తితో తిప్పికొట్టిన పండితుడి తెలివినీ, అర్థంచేసుకొని, నవ్వుతూ " అదీ...ఇదీ...రెండూ నీకే! దున్నుకో " అన్నాడు ఆనందంగా. కరణానికి నోట మాట రాలేదు. 

                                                                  సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...