7, మార్చి 2023, మంగళవారం

 సుజనా శతకము - కందపద్యములు: 


1.  పలికెడి వాచకములకును / చలిపెడి పనులకు పొరపులు సంభవమగుచో 

     పలుకులవి పలుకు వానిని / ఇలను వసించెడి జనమ్ము లెంచరు సుజనా! 


2.  తెల్లబడెడి కురులెప్పుడు / వెల్లడి జేయును నిరతము పెరిగెడి వయసున్ 

     ఉల్లమున బెర్గు దెలివిడి / తెల్లనగు నెఱకల వలన తెలియదు సుజనా! 


3.  ఎప్పుడు శంకలు గలిగిన / నప్పుడె పరిజనము తోడ ననువున దానిన్ 

     చప్పున సమీక్ష జేసిన / తప్పక సందిగ్ధమంత తఱుగును సుజనా! 


4.  జోకను గూడిన గుణములు / తేకువ నొందుచు పొదలెడి తీరున నిలుపన్ 

     వీకను నెక్కొన జేయుచు / తాకించును మిసిమి నెపుడు ధరణిని సుజనా! 


5.  మాటల నుంచిన కోపము / చాటున నుంచుము చలిపెడి చర్యల లోనన్ 

     మాటల చేతల నుంచుము / నీటుగ ననురతి వలపులు నిరతము సుజనా! 

                                                      

                                                                 రచన: క్రొవ్విడి వేంకట రాజారావు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...