29, ఫిబ్రవరి 2024, గురువారం

 :: శ్రీమాతా :: 

అంచితమైన నీనెమ్మి ననంతమునౌ నటులన్ విస్తా 

రించిన వెంటనే పాపములెల్ల క్రమమ్ముగ నాశమ్మై 

వంచకులంత రూపాఱి ప్రవర్తనలన్నియు బాగౌచున్ 

మంచిగ శాంతి చేకూరును మౌలిని వాసిగ శ్రీమాతా! 


ప్రీతిగ నీదునౌన్నత్యప్రవీణత నెంచుచు నిత్యమ్మున్ 

బాతిగ పృథ్విలో నీదు జపమ్మె ఘటించగ చేకూరున్ 

ఘాతకముల్ సమూలమ్ముగ కాట్పడ జేసెడి సత్త్వమ్మే 

చేతనమందు శోభిల్లి విశేషమొసంగును శ్రీమాతా! 


శ్రీలిడు నిందిరమ్మా! హరి శ్రీమతివై సరి భక్తాళిన్ 

లీలగ ప్రోచుచున్ విత్తము లెస్సగ నీయగ నీకీర్తిన్ 

వాలయమంత కొండాడుచు వారలు యుర్విని సంప్రీతిన్ 

తేలుచు భక్తి పోనొత్తక త్రిమ్మరుచుందురు శ్రీమాతా!


నేనొనరించు పాపమ్ము లనేకములైనను నీనామ 

మ్మేను ఘనమ్ముగా బల్కుచు నేగగ బుద్ధియె ప్రాప్తించెన్ 

జానుగ సంపదల్ చొప్పడి సంక్షయమయ్యె దరిద్రంబుల్ 

పానకమయ్యె నీనామము బాగుగ పేర్కొన శ్రీమాతా! 


నేమముతోడ నీపూజలు నేర్పుగ జేయుచు తారాడన్ 

సేమమొసంగి సౌఖ్యమ్ములె జేర్చుదువెంతయు కారుణ్య 

మ్మౌ మమతానురాగమ్ముల మాతృస్వరూపము గూడంగన్ 

భామవు నీకు జేజేలని పల్కెద నెప్పుడు శ్రీమాతా! 

12, ఫిబ్రవరి 2024, సోమవారం

 

:: మానవ ధర్మములు :: ( కంటిన్యూ .....)

చేసుకోవలసినవి

ఆత్మవిమర్శన, ఆత్మరక్షణ

వదులుకోవలసినవి

ఆర్భాటం, ఆడంబరం, స్వోత్కర్ష

కాపాడుకోవలసినవి

ఆత్మాభిమానం, శీలం

నేర్చుకున్నది

ఆవగింజంత

నేర్చుకోవలసినది

ఆకాశమంత

దైవధ్యానానికి పనికిరానివి

కోపము, చింత, వాంఛ, అపనమ్మకము

ఎదుటివానికి చేయకూడనివి

ఆశపెట్టుట, అవమానపరచుట

నమ్మదగనివాడు

అసత్యవాది

నమ్మదగినవాడు

భగవంతుడు

పట్టి పీడించేవి

అనుమానం, అపనమ్మకము

కష్టాలనుంచి కడతేర్చేవి

విజ్ఞానం, వివేకం

మరువకుండా చేయవలసినవి

పరోపకారం, దైవచింతన

ఉండవలసిన విధానం

ఆలోచన తక్కువ, ఆచరణ ఎక్కువ

భుజించవలసినది

మితాహారము

రాణించలేకపోవడానికి కారణం

అలసత్వం, అలక్ష్యం, కాలాతిక్రమణం  

నేర్చుకోవలసిన నీతి

మంచి విను, మంచి చూడు, మంచిగా మాట్లాడు

ఉన్నతుడు కావడానికి

భయము, బాధ్యత, భద్రత

 

:: మానవ ధర్మములు ::

మనిషిని జీవింపచేసేవి

నిగ్రహం, ప్రేమ, తృప్తి, త్యాగము

మనిషిని దహింపచేసేవి

అసూయ, అత్యాశ, ద్వేషం, పగ

జీవితానికి చెఱుపు తెచ్చేవి

అధికారం, అహంకారం, అనాలోచన

జీవితంలో ఆశించకూడనివి

అప్పు, యాచన

జీవితంలో చేయకూడనివి

వంచన, దూషణ

నేర్పరికి కావలసినవి

లక్ష్యం, సహనం, వినయం, విధేయత

పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేవి

వ్యామోహము, స్వార్ధము

సంచరించకూడని మార్గాలు

ఒంటరితనం, అవినీతి, అధర్మము

ఆచరించి బోధించదగినవి

నీతులు, సుద్దులు

నిత్యము ఆచరించదగినవి

ధర్మము, దయ, దాక్షిణ్యము

నిత్యము చేయదగినవి

దానము, ధ్యానము

నిత్యము ఆలోచింపదగినవి

సద్భావము, సమాజము, సమైక్యత

నియమంగా పాటించవలసినవి

కరుణ, క్రమశిక్షణ

పూజించదగినవారు

తల్లి, తండ్రి, గురువు, దైవము, పరస్త్రీ

నిత్యం చేయదగిన ఆరాథనలు

సత్యవ్రతము, మౌనవ్రతము

నిత్యం ఆదుకొనదగినవారు

దీనులు, ఆపన్నులు

చేయకూడని వృత్తులు

చోరత్వము, వ్యభిచారము

పలుకకూడనివి

అశ్లీలవాక్యములు, అశుభములు

నిత్యము కోరుకొనదగినది

అందరి క్షేమము

పనికిరానివి

పరవిమర్శన, పరనింద

( తరువాయి పేజీలో.........)

 

 

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...