29, ఫిబ్రవరి 2024, గురువారం

 :: శ్రీమాతా :: 

అంచితమైన నీనెమ్మి ననంతమునౌ నటులన్ విస్తా 

రించిన వెంటనే పాపములెల్ల క్రమమ్ముగ నాశమ్మై 

వంచకులంత రూపాఱి ప్రవర్తనలన్నియు బాగౌచున్ 

మంచిగ శాంతి చేకూరును మౌలిని వాసిగ శ్రీమాతా! 


ప్రీతిగ నీదునౌన్నత్యప్రవీణత నెంచుచు నిత్యమ్మున్ 

బాతిగ పృథ్విలో నీదు జపమ్మె ఘటించగ చేకూరున్ 

ఘాతకముల్ సమూలమ్ముగ కాట్పడ జేసెడి సత్త్వమ్మే 

చేతనమందు శోభిల్లి విశేషమొసంగును శ్రీమాతా! 


శ్రీలిడు నిందిరమ్మా! హరి శ్రీమతివై సరి భక్తాళిన్ 

లీలగ ప్రోచుచున్ విత్తము లెస్సగ నీయగ నీకీర్తిన్ 

వాలయమంత కొండాడుచు వారలు యుర్విని సంప్రీతిన్ 

తేలుచు భక్తి పోనొత్తక త్రిమ్మరుచుందురు శ్రీమాతా!


నేనొనరించు పాపమ్ము లనేకములైనను నీనామ 

మ్మేను ఘనమ్ముగా బల్కుచు నేగగ బుద్ధియె ప్రాప్తించెన్ 

జానుగ సంపదల్ చొప్పడి సంక్షయమయ్యె దరిద్రంబుల్ 

పానకమయ్యె నీనామము బాగుగ పేర్కొన శ్రీమాతా! 


నేమముతోడ నీపూజలు నేర్పుగ జేయుచు తారాడన్ 

సేమమొసంగి సౌఖ్యమ్ములె జేర్చుదువెంతయు కారుణ్య 

మ్మౌ మమతానురాగమ్ముల మాతృస్వరూపము గూడంగన్ 

భామవు నీకు జేజేలని పల్కెద నెప్పుడు శ్రీమాతా! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...