:: గోకర్ణొపాఖ్యానము ::
తుంగభద్రానదీ తీరంలో ఒక పట్టణముంది. ఆ పట్టణంలో సకల వేదాలను చదివిన ఆత్మదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు భిక్షావృత్తితో ధనవంతుడయ్యాడు. అతని భార్య దుందులీ. ఆమె గయ్యాలి. వారికి సంతానం కలుగలేదు. ఆత్మదేవుడు ఒకరోజు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సన్యాసి కనిపించాడు. ఆత్మదేవుడు సన్యాసి కాళ్ళపై పడి నమస్కరించి " అయ్యా! నాకు సంతానం లేదు. నేనొక గోవును పెంచుకుంటున్నాను. ఆ గోవుకూడా గొడ్డుదయింది. నేను చెట్టును పెంచినాకూడా అది ఫలాలనివ్వడంలేదు. సంతానంలేని నిర్భాగ్యుని జీవితం వ్యర్థమే కదా! నాకు సంతానం కలిగే ఉపాయం చెప్పండి." అని ప్రార్థించాడు. ఆ సన్యాసి " ఓ విప్రోత్తమా! నీకు ఒక పండిస్తాను. దాన్ని నీ భార్యతో తినిపించు. కుమారుడు తప్పక జన్మిస్తాడు" అని పండునిచ్చి వెళ్ళిపోయాడు. ఆత్మదేవుడు ఆ ఫలాన్ని తెచ్చి భార్యకిచ్చాడు. ఆమె తన మనస్సులో "ఈ పండు తింటే నాకు గర్భం వస్తుంది. పొట్ట పెద్దదవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ పెరిగినకొద్దీ అనేక దు:ఖాలు కలుగుతాయి. పురుడు వచ్చినప్పుడు బిడ్డ అడ్డం తిరిగితే బాధ భరించలేక చావాల్సి వస్తుంది " అని అనుకుంటూ ఆ పండును తన చెల్లెలికి ఇచ్చింది. ఆ చెల్లెలు " ఇప్పుడు నేను గర్భవతిని. నాకు పుట్టిన బిడ్డను నీకే ఇచ్చేస్తాను " అని చెప్పింది. వారిద్దరూ కలిసి ఆ పండును ఇంట్లో ఉన్న ఆవుకు పెట్టారు. చెల్లెలికి బిడ్డ పుట్టగానే ఆమె దుందులికి ఇచ్చేసింది. దుందులి ఆ బిడ్డను భర్తకు చూపి వీడు నాకు పుట్టిన కుమారుడని చెప్పింది. ఆత్మదేవుడు ఆ కుమారునికి ' ధుంధుకారి ' అని పేరు పెట్టాడు. ఆ పండు తిన్న గోవుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు. ఆత్మదేవుడు ఆ పిల్లవానికి ' గోకర్ణుడు ' అని పేరు పెట్టాడు. ఇద్దరు బిడ్డలను ప్రేమతో పెంచసాగాడు. గోకర్ణుడు పండితుడు, జ్ఞాని అయ్యాడు. ధుంధుకారి చదువులేని మూర్ఖుడు దుష్టుడు అయ్యాడు. గోకర్ణుడు సత్కార్యాలు చేయసాగాడు. ధుంధుకారి దొంగ అయి, హింసాపరుడై, దీనులను హింసిస్తూ, దుర్మార్గులతో స్నేహంచేసి, కుక్కలను పెంచుతూ వేశ్యాలోలుడయ్యాడు. ఆత్మదేవుడు చెడుమార్గాల్లో వెళ్తున్న తన కొడుకుని చూసి బాధపడసాగాడు. ఆత్మదేవుడు చావడానికి సిద్ధమై అడవికి బయలుదేరాడు. అప్పుడు గోకర్ణుడు వచ్చి తండ్రికి సంసారం నిస్సారమని చెప్పి జ్ఞానాన్ని ఉపదేశించాడు. " తండ్రీ! నీవు భాగవతాన్ని పారాయణంచెయ్యి ముక్తిని పొందుతావు " అని ఉపదేశించాడు. ఆత్మదేవుడు అడవుల్లో నివశిస్తూ నిరంతరం శ్రీహరిని స్మరిస్తూ భాగవతంలోని దశమస్కంధం పారాయణం చేయసాగాడు. ఆ పుణ్యంవల్ల ఆత్మదేవుడు శ్రీకృష్ణుడిలో ఐక్యమయ్యాడు.
ధుంధుకారి తల్లిని కొట్టి బావిలో పడేశాడు. ఆమె మరణించింది. ధుంధుకారి ఐదు భోగకాంతలను ఇంట్లో ఉంచుకున్నాడు. దొంగతనం చేసి బట్టలు, నగలు, ధనం తెచ్చి ఇచ్చేవాడు. ఒకసారి ఆ వేశ్యలు బలవంతంగా ధుంధుకారిని చంపి గోతిలో పూడ్చిపెట్టారు. వాడు ప్రేతమై గాల్లో తిరుగసాగాడు. అది గోకర్ణుడికి తెలిసింది. సోదరునికి గయాశ్రాద్ధాన్ని పెట్టి తీర్థయాత్రలు చేశాడు. ఒకనాడు గోకర్ణుడు పడుకొని ఉండగా ధుంధుకారి భయంకరమైన ప్రేతరూపంతో కనబడ్డాడు. గోకర్ణుడు వానిపై నీళ్ళు చల్లాడు. వాడి పాపాలు నశించిపోయాయి. కాని, ప్రేతత్వం పోలేదు. గోకర్ణుడు ఎందరో పండితులను ప్రేతత్వ ముక్తికి ఉపాయాన్ని అడిగాడు. ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు గోకర్ణుడు తన యోగ మహిమతో సూర్యవేగాన్ని ఆపి, సూర్యునికి భక్తితో నమస్కరించి " ఓ జగత్సాక్షీ! నీకు నమస్కారం. మోక్ష ఉపాయాన్ని చెప్పు " అని అడిగాడు. అదివిన్న సూర్యుడు గోకర్ణా! నీవు ఏడురోజులు భాగవతాన్ని దీక్షతో పఠించు అని చెప్పాడు. గోకర్ణుడు భాగవత సప్తాహ పారాయణం మొదలుపెట్టాడు. ఆ కథ వినడానికి ధుంధుకారి వచ్చాడు. అక్కడ ఏడు కణుపులతో ఒక వెదురు చెట్టు ఉండగా దాని రంధ్రంలో ధుంధుకారి ప్రవేశించి భాగవత కథ వినసాగాడు. మొదటిరోజు సాయంకాలానికి భాగవతకథ ముగిసింది. ఆ వెదురుగడ కణుపొకటి బద్ధలై పెద్ద శబ్దం వచ్చింది. ఇలా ఒక్కోరోజు ఒక్కో కణుపు బద్ధలవసాగింది. గోకర్ణుడు పన్నెండు స్కంధాల కథను వినిపించి భాగవత సప్తాహాన్ని పూర్తిచేయగానే ధుంధుకారి ప్రేతత్వం తొలగిపోయి దివ్యరూపంతో తులసీమాలను, పీతాంబరాన్ని ధరించి నీలమేఘశ్యాముడై, కవచకుండలాలను ధరించి గోకర్ణునికి నమస్కరించాడు. సోదరా! నీవు చెప్పిన భాగవత కథలను వినడంవల్ల నా ప్రేతత్వం పోయింది. వైష్ణవతత్త్వం వచ్చింది. భాగవత సప్తాహంవల్ల వైకుంఠలోకం ప్రాప్తించిందని చెప్పి విష్ణువిమానమెక్కి ధుంధుకారి వైకుంఠానికి వెళ్ళిపోయాడు.
భాగవత సప్తాహం అంత గొప్పది. భాద్రపద, ఆశ్వయుజ, కార్తిక, మార్గశిర, జ్యేష్ఠ, శ్రావణ మాసాలు భాగవత సప్తాహయజ్ణం చేయడానికి ప్రశస్తమైనవి. భాగవత కథాశ్రవణంవల్ల సకల రోగాలూ, పాపాలూ నశిస్తాయి. సంతానంలేని వారికి సంతానం కలుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి