:: నరకాసుర వధ ::
నరకాసురుని వధించడానికి శ్రీకృష్ణుడు ఆయత్తమయ్యే సమయంలో సత్యభామ కృష్ణుని దరిచేరి "దేవా! నీవు రాక్షస సంహారం చేస్తుంటే నీ నైపుణ్యం చూడాలని ఉంది. నన్నుకూడా యుద్ధానికి నీతోబాటు తీసుకొని వెళ్ళకూడదా" అని కోరింది. అంతట కృష్ణుడు "నువ్వా! యుద్ధానికా! యుద్ధం అంటే ఏవనుకుంటున్నావు? అవి తుమ్మెదల ఝంకారాలు కావు. ఏనుగుల ఘీంకారాలు. అక్కడ పద్మాల పుప్పొడి ఉండదు. గుర్రాల కాలిగిట్టల దుమ్ము మాత్రమే ఉంటుంది. నీటితరగల మీద నురుగు కాదు. శత్రువుల బాణాలు. అవి సరోవరాలు కావు. సైన్యసమూహాలు. నేను త్వరలో వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు". అనగా, అప్పుడు, కృష్ణుడితో సత్యభామ "నీ బాహువుల దగ్గర ఉంటే అవతలి వారు దానవులయితే నేమి, దైత్యులయితే నేమిటి?" అంటూ నేను వస్తానని మెత్తగా చెప్పింది. చేతులు జోడించింది. కృష్ణుడు ఆమెను కరకమలాలతోగుచ్చి ఎత్తాడు. గరుత్మంతుణ్ణి అధిరోహించాడు. ప్రాగ్జోతిషపురాన్ని సమీపించాడు. గిరిదుర్గం, శస్త్రదుర్గం, జలదుర్గం, అగ్నిదుర్గం, వాయు దుర్గాలతో అభేద్యంగా ఉంది ఆ పురం. కృష్ణుడు ముందుగా ఆ దుర్గాల్ని ముక్కలుజేసి క్రమంగా రూపుమాపాడు. మురుణ్ణి కప్పిన మురాశరుని పాశాలు ఛేదించాడు. ఆ పట్టణ ప్రాకారాల్ని గదా ఘాతాలతో కూల్చివేశాడు. పాంచజన్యం పూరించాడు. ఆ ధ్వనికి పంచశిరుడయిన మురాసురుడు ఆవులిస్తూ నీటినుండి బయటకు వచ్చాడు. అగ్నిజ్వాలలతో కూడిన శూలాన్ని గరుత్మంతుని మీద ప్రయోగించాడు. భూమ్యాకాశాలు దద్దరిల్లేలా గర్జించాడు. గరుడుని మీద పడవచ్చిన శూలాన్ని కృష్ణుడు ఒడిసి పట్టుకొని మూడుముక్కలుగా చేశాడు. వాడు చేతులు చాచి ముందుకు వచ్చాడు. అంతలోనే కృష్ణుడు వాని తలలను ఖండించాడు. మురుడు నీటిలో కూలిపోయాడు. అతని కొడుకులు ఏడుగురు పీఠడు అనే దండనాథుణ్ణి ముందుంచుకొని హరిని ఎదిరించారు. ఎన్నో బాణాలు గుప్పించారు. వాటినన్నింటినీ నేలకూల్చాడు కృష్ణుడు. వారి చేతులను, ముఖాలను, కంఠాలను నరికివేశాడు. వారందరూ చనిపోవడం నరకునికే ఆశ్చర్యం కలిగించింది. యుద్ధానికి సిద్ధమై వచ్చాడు నరకుడు. సత్యభామతో కూడిన కృష్ణుణ్ణి చూశాడు. పోరుకు సిద్ధమయ్యాడు. అతనిని చూచి సత్యభామ తన జడ ముడిచుట్టింది. కోక సరిచేసుకుంది. నగలు సవరించుకుంది. పయ్యెద బిగించింది. తన భర్త ముందట లేచి నిలబడింది.
ఆ సత్యభామను చూచి కృష్ణుడు "ఈ విల్లందుకో" అని సత్యభామకొక విల్లు అందించాడు. వెంటనే ఒక తేజోవిశేషం పుట్టింది. ఆమె ఆ వింటినారిని సంధించింది. ధనుష్టంకారం చేసింది. వీరశృంగారాలు, భయరౌద్రవిస్మయాలు రూపుదాల్చినట్లుగా ఉంది. ఎప్పుడు వింటికి బాణం తొడుగుతోందో, ఎప్పుడు విడుస్తోందో తెలియటం లేదు. బొమలు ముడిపడ్డాయి. అనురాగమందహాసాలు, వీరశృంగారరసాలు వ్యక్తమవుతూ, అవలీలగా శత్రువును నొప్పిస్తూ, భర్తను అలరిస్తోంది. ఒక పాదం ముందుకు, ఒక పాదం వెనుకకూ పెట్టి నిలబడింది. లక్ష్యాన్ని మాత్రమే చూస్తోంది. ధనుస్సు వలయాకారంగా ఉంది. బాణాలు పుంఖానుపుంఖాలుగా ప్రయోగిస్తోంది. నిజానికి సత్యభామ సుకుమారి. అలా యుద్ధం చేయడం ఆశ్చర్యంగా ఉంది చూచేవారికి. చెలికత్తెల కోలాహల ధ్వనినే ఓర్చుకోలేని ఆమె భేరీభాంకారాలను ఎలా ఓర్చుకొంటోందో తెలియడంలేదు. సత్యభామను ప్రశంసిస్తూ కృష్ణుడు విల్లందుకున్నాడు. అపుడు నరకాసురుడు కృష్ణునితో ఇలా అన్నాడు. "ఆడుది యుద్ధం చేస్తోంది నీకు మగతనం లేదా, దనుజులు ఆడువారితో యుద్ధం చెయ్యరు" అంటూండగానే శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. శత్రుసైన్యమంతా హాహాకారాలు చేస్తూ పారిపోయింది. సత్యాకృష్ణులను మోస్తూనే గరుత్మంతుడు కాలి గోళ్ళతో, ముక్కుతో, రెక్కలతో శత్రువుల గజసమూహాన్ని ఛిన్నాభిన్నం చేశాడు. ఆ గాలివేగం సహించలేక చావగా మిగిలిన సైన్యం పారిపోయింది. అదే సమయంలో నరకాసురుడు ఏనుగుమీద విహరిస్తున్నాడు. కృష్ణునిపైకి విసరడానికి శూలం చేతిలో పట్టుకున్నాడు. కృష్ణుడు తన చక్రంతో నరకుని తల నరికాడు. చప్పుడు చేస్తూ ఆ తల నేలపై పడింది. దేవతలు మునులు ఆకాశంనుండి పూలవాన కురిపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి