20, జనవరి 2025, సోమవారం

  :: సర్పయాగం

    మహాభారత యుద్ధానంతరం కౌరవ వంశానికి అంకురంగా నిలచిన వాడు ఉత్తరాభిమన్యులపుత్రుడు పరీక్షితుడు. పాండవుల తరువాత హస్తినాపుర సింహాసనమెక్కి అరవైయేడేళ్ళు నిరాఘాటంగా పరిపాలించాడు. ఒకనాడు పరిక్షిన్మహారాజు వేటకు వెళ్ళాడు. ఒక మృగంమీద బాణం వేశాడు. అది ఆ గుచ్చుకున్న బాణంతోనే పరుగెత్తడం మొదలుపెట్టింది. రాజు దాని వెంట పడ్డాడు. అది కనుమరుగైపోయింది. ఆ అరణ్యంలో శమీకుడనే ముని కనబడ్డాడు. అతడిని మృగాన్ని గురించి అడిగాడు. ఆ ముని ధ్యానంలో మౌనవ్రతంలో ఉండటంచేత మాట్లాడలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. ప్రక్కన చచ్చిపడి ఉన్న ఒక పామును వింటి కొప్పుతో ఎత్తి ఆ ముని మెడలో వేసి హస్తినాపురికి తిరిగి వెళ్ళాడు. 

    శమీకుడు సమాధిలో ఉండటంచేత పాము మెడలో పడ్డా ఒళ్ళు తెలియలేదు. అతనికి శృంగి అనే కుమారుడున్నాడు. అతడు తపస్వి అయినా మహాకోపి. తండ్రికి జరిగిన అవమానాన్ని ఒక ముని వలన విని, ఆగ్రహోదగ్రుడై  " ఏడు రోజుల్లో తక్షక విషాగ్ని దగ్ధుడై పరీక్షిత్తు ప్రాణాలు కోల్పోవు గాక " అని శపించాడు. 

    శృంగి తండ్రి వద్దకు వచ్చాడు. పామును తండ్రి మెడ నుండి తొలగించాడు. శాపాన్ని తండ్రికి తెలియజెప్పాడు. శమీకుడు కోపం వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయనీ, క్షమాగుణం తపస్వికి అలంకారమని కొడుకునకు బోధించి శాపాన్ని క్రమ్మరించుమని కోరాడు. శృంగి దానికి అంగీకరించలేదు. శమీకుడు విచారపడ్డాడు. ఒక శిష్యునితో శాప వృత్తాంతాన్ని రాజుకు తెలియపరిచాడు. 

    శాప వృత్తాంతం విని పరీక్షిత్తు భయపడ్డాడు. మంత్రులతో మంతనాలు సలిపి ఒంటి కంబపు మేడ కట్టించుకొని అందులో విషాన్ని విరిచే మహామంత్రాలు జపిస్తూ రాత్రింబవళ్ళు వైద్యులు, భటులు కాపలా కాస్తూ ఉంటే, వారం రోజుల గడువును కంటికి కూరుకు లేకుండా సాగిస్తూ ఉన్నాడు. 

    పూర్వం బ్రహ్మదేవుడు కశ్యపుడనే బ్రహ్మర్షికి " సంజీవని " ని ఉపదేశించాడు. పరీక్షిత్తును తక్షకుడు కాటేసి చంపితే అతనిని తిరిగి బ్రతికించి తన విద్యా బలాన్ని ప్రభువు ముందు వెల్లడించాలని కశ్యపుడు బయలుదేరాడు. అతన్ని త్రోవలో తక్షకుడు కలిసికొన్నాడు. కశ్యపుని శక్తిని పరీక్షించటానికి తక్షకుడు ఒక మఱ్రిచెట్టును కాటేసి దగ్ధం చేశాడు. వెంటనే కశ్యపుడు ఆ చెట్టును బ్రతికించాడు. అతని విద్యాబలం తెలిసికొని ఎంతో ధనాన్ని అతనికి పారితోషికంగా ఇచ్చి హస్తినాపురం చేరకుండా అతడిని తిరిగి పంపించి వేశాడు. పరీక్షిత్తుకు మృత్యువు తథ్యమని తేలింది. 

    తక్షకుడు నాగ కుమారులతో కలిసి బ్రాహ్మణ వేషాలతో వెడలి ఏకస్తంభ హర్మ్యానికి చేరుకున్నాడు. వేదఘోషతో వచ్చిన ఆ విప్రులను రాజు పూజించాడు. ఏడవరోజున సూర్యాస్తమయం అవుతున్నది కదా అని, ఆ విప్రులు తెచ్చిన పండ్లలో ఒక దానిని తినటానికి పరీక్షిత్తు ఉద్యుక్తుడైనాడు. ఆ పండులో క్రిమిగా తక్షకుడు తలయెత్తి విషాగ్నిని గుప్పించాడు. మేడతో సహా పరీక్షిత్తు దగ్ధుడైపోయాడు. 

    పరీక్షిత్తు చనిపోయే నాటికి అతని కుమారుడు జనమేజయుడు బాలుడు. పిన్ననాటనే రాజ్యభారాన్ని స్వీకరించవలసి వచ్చింది. అలా ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తున్న కాలంలో ఒక రోజు పైలుడు అనే మహర్షికి శిష్యుడైన ఉదంకుడు జనమేజయుని వద్దకు వచ్చి వాని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తుచేసి సర్పయాగం చేయమని ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సహించటంలో ఉదంకుని స్వార్థం కూడా ఉన్నది. ఉదంకునికి కూడా తక్షకునిపై కోపం ఉన్నది. అతడు ఒకసారి గురుపత్ని కోరికపై మహిమాన్వితమైన కుండలాలు తీసుకొని వెడుతూండగా వాటిని తక్షకుడు అపహరించుకొని పోవటం వలన నాటినుండి ఉదంకుడు తక్షకునిపై కోపాన్ని పెంచుకొని ప్రతీకారంకోసం ఎదురుచూస్తూ సమయోచితంగా జనమేజయునకు వాని తండ్రి మరణ వృత్తాంతాన్ని సాక్ష్యాలతో సహా తెలియజేసి తక్షకునిపై కోపాన్ని రగిలింపజేసి సర్పయాగానికి అనుజ్ఞనివ్వజేసాడు. యాగం ఆరంభమయి తీవ్రంగా సాగింది. హోతలు మంత్రోచ్ఛారణ చేస్తుంటే ఎక్కడెక్కడి నాగులు హోమంలో పడి తగులబడిపోసాగాయి. కాని తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించి ఉన్నాడు. " సహేంద్ర తక్షక స్వాహా! " అని హోతలు విధివిహితంగా మంత్రోచ్ఛారణ చేయగానే తక్షకునితోపాటు ఇంద్రుడు కూడా యజ్ఞగుండం వైపు జారిపోనారంభించాడు. నాగముఖ్యుడైన వాసుకి సోదరి జరత్కారువు. ఆమె భర్త జగత్కారుడు. వారికి ఆస్తీకుడనే బిడ్డ నాగజాతి రక్షణార్థం కారణజన్ముడై జనించాడు. అది తెలిసిన మిగిలిన నాగముఖ్యులు వాసుకితో సహా వచ్చి సర్పయాగాన్ని మాన్పించమని ఆస్తీకుని ప్రార్థించారు. సరిగా తక్షకుడు మంటలలో పడబోయే సమయానికి ఆస్తీకుడు అక్కడకు వెళ్ళి సముచితమైన స్తుతులను చేసి జనమేజయుని మెప్పించి దక్షిణగా యాగాన్ని నిలుపుచేయమని కోరాడు. సత్యదీక్షాపరుడైన జనమేజయుడు ఆ విప్రుని కోరిక మేరకు సర్పయాగాన్ని ఆపించేశాడు. .

    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...