24, జనవరి 2025, శుక్రవారం

: ముద్గలోపాఖ్యానము :: 

    పూర్వం కురుక్షేత్రంలో ముద్గలుడనే విప్రుడు ఉంఛవృత్తితో జీవించేవాడు. ఆ పుణ్యాత్ముడు అతిథిప్రియుడు. అతడు పక్షోపవాస వ్రతం చేపట్టాడు. పాడ్యమి మొదలు పదునాల్గు రోజులు ఒక్కొక్క గింజగా తూమెడు వడ్లు సమకూర్చేవాడు. పర్వదినాన అంటే, అమావాస్య పూర్ణిమలలో ఆ బియ్యాన్ని పాకంచేసి, దేవ పితృ పూజలు చేసి, పుత్ర కళత్రాదులతో భుజిస్తూ దేహయాత్ర సాగిస్తూ ఉండేవాడు. 

    ఒక పర్వదినాన ముద్గలుడి ఇంటికి దుర్వాసమునీంద్రుడు అతిథిగా వచ్చాడు. ముద్గలుడతనిని పూజించి అన్నం వడ్డించాడు. దుర్వాసుడు వండిన అన్నమంతా తిన్నంత తిని మిగిలిన దానిని దేహమంతా పులుముకొని వెళ్ళాడు. ముద్గలుడికి తినటానికి ఏమీ మిగులలేదు. అయినా, అతడు నిర్వికారంగా పక్షోపవాస వ్రతం సాగిస్తూనే ఉన్నాడు. దుర్వాసుడు, ఆరు పర్వాలు వరుసగా వచ్చి ముద్గలుడిని పరీక్షించాడు. కాని, అతడిలో ఎటువంటి అసహనం కనబడలేదు. దానవ్రతంలో దీక్ష తగ్గలేదు. దుర్వాసుడతని దానశీలతకు మెచ్చి బొందితో స్వర్గం పొందే వరం ప్రసాదించి వెళ్ళాడు. ఆ తరువాత దేవదూత దివ్య రథాన్ని తెచ్చి ముద్గలుడిని స్వర్గానికి రమ్మని ఆహ్వానించాడు. ముద్గలుడు స్వర్గలోకం లోని గుణ దోషాలను తెలుపమని దేవదూత నడిగాడు. అతడీ విధంగా చెప్పాడు. 

    స్వర్గం, ఈ లోకానికి పైగా ప్రకాశమానంగా ఉంటుంది. అది దివ్య దృష్టితో చూడగలిగింది. దేవయానంతో చేరగలిగింది. తపస్వులు, సోమయాజులు, సత్యసంధులు, ఉత్తములు, జితేంద్రియులు, సమబుద్ధి గలవారు, దానపరులు, రణశూరులు - ఆ లోకంలో నివసిస్తారు. అందులో అప్సరసలు, సాధ్యులు, దేవమునులు వేరువేరుగా తగినచోట్ల ఉంటారు. ముప్పదిమూడువేల యోజనముల విస్తీర్ణంగల మేరుపర్వత శిఖరం మీద ఆ లోకం ఉంటుంది. నందనవనోద్యాలు పుణ్యాత్ముల విహారస్థలాలు. అక్కడి వారికి ఆకలిదప్పులు, శీతోష్ణబాధలు, జరారోగ బాధలు ఉండవు. మనస్సు కాహ్లాదం కలిగించే ప్రకృతి సౌందర్యం అక్కడ ఉంటుంది. ఆ లోకవాసులు దివ్యదేహాలతో, దివ్యభోగాలను అనుభవిస్తూ ఉంటారు. దివ్య విమానాలలో తిరుగుతూంటారు. ఆ లోకం మీద బ్రహ్మలోకం ఉన్నది. అందులో శోక మనేది ఉండదు. మానవులు, బ్రహ్మలు, మునులు అందులో వసిస్తారు. లోభం, క్రోధం, పాపం, అపకీర్తి, దు:ఖం, మరల పుట్టడం అనేవి అక్కడి వారికి ఉండవు. ప్రళయం తరువాత కూడా ఆ లోకం నిలిచి ఉంటుంది. ఇంద్రాదులు కూడా ఆ లోకాన్ని పొందాలని అనుకుంటారు. 

    స్వర్గంలో ఉండే దోషాలను కూడా వినుము. జీవులాలోకంలో పుణ్యఫలాలను అనుభవిస్తారే కాని, పుణ్యం చేసికొనలేరు. పుణ్యఫలానంతరం మరల భూమిపై జన్మలెత్తుతూ ఉంటారు. స్వర్గ సుఖం నిత్యం కాదు. అందులోని వారు అసూయలకు పాల్పడతారు. అయినా, బ్రహ్మలోకం తరువాత స్వర్గమే ఉత్తమం - అని దేవదూత వివరించాడు. ముద్గలుడు పునర్జన్మలేని బ్రహ్మలోకాన్ని పొందగోరి స్వర్గలోక భోగాన్ని త్యజించాడు. ఉంఛవృత్తి మాని జ్ఞానయోగంతో సమత్వాన్ని సాధించి మోక్షాన్ని పొందాడు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...