అజామిళోపాఖ్యానము
కన్యాకుబ్జపురంలో అజామిళుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పూర్వజన్మ సంస్కారం వల్ల వేదశాస్త్రాలను గురుసేవలో, ఇంద్రియ నిగ్రహంతో అభ్యసించాడు. పెద్దలను, జ్ఞానులను సేవించాడు. సకల ప్రాణులయందునూ సమదృష్టి కలిగి, మంత్రానుష్ఠానంతో సిద్ధులు పొందాడు. సత్యవ్రతం, నిత్య నైమిత్తికాది కార్యాలు నిర్వహించాడు. లోభాది దుష్టవర్తనలను వదలి సద్గుణవంతుడైనాడు. నిత్యం ఆచార నిష్ఠ కలవాడై, జ్ఞానాన్ని సముపార్జించే సరైన సమయంలో ఒకనాడు అతడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పుష్పాలు, పండ్లు తీసుకొని రావటంకోసం తోటలోనికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో అతడు నిర్లజ్జగా వేశ్యను ఆలింగనము చేసుకొని యున్నట్టి ఒక శూద్రుణ్ణి చూసాడు. కామోన్మత్తుడైన ఆ శూద్రుడు వేశ్యతో చుంబనాది కలాపాలను చేస్తున్నాడు. ఈ సన్నివేశాన్ని చూడగానే సద్బ్రాహ్మణుడైన అజామిళుని మనస్సులో పతనం ఆరంభమయింది. అతనిలో కామవాంఛ పెల్లుబికింది. ఆమె చూపులనే మోహ పాశాలలో చిక్కుకున్నాడు. నిత్యకృత్యములైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జప తపాలను మరచిపోయాడు. అతడి మనస్సనే అరణ్యంలో కామోద్రేకమనే కార్చిచ్చు చెలరేగింది. నియమబద్ధమైన అతడి చిత్తం పట్టు తప్పిపోయింది. కొంతకాలానికి ఆ వేశ్యను ఇంటికి తెచ్చుకున్నాడు. కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రిగారు సంపాదించిన ఆస్తి నంతటినీ ఆమె పాలు చేశాడు. సాధు లక్షణాలయిన సద్గుణాలను విడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలుగన్నుల ఇంతి అందచందాలకు లొంగిపోయాడు. నిండు యవ్వనం కలిగి, సుగుణ సంపత్తి కలిగి, అతనికి అన్ని రకాలా అనుకూలవతిగా ఉన్న భార్యను ఇంటిలోనే వదలి, తన గౌరవాన్ని పోగొట్టుకొని, నీచుడై ఆ స్త్రీ తోనే కాపురం మొదలుపెట్టాడు. చుట్ట పక్కాలను దూషించాడు. సజ్జనులను ద్వేషించాడు. దిక్కులేని దీనులను చిక్కులపాలు చేసాడు. చిట్టచివరకు ధనం కోసం దారులను కాచి వచ్చేపొయ్యే జనాన్ని దోచుకున్నాడు. దొంగతనంలో ఆరితేరాడు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని తిట్టినా లెక్కచేయకుండా సంపాదించిన ధనమంతా ఆ సుందరి చేతుల్లో పోసి, దాసుడై, ఆమె దయాదాక్షిణ్యాలపై జీవింపసాగాడు.
ఈ విధంగా అతనికి ఎనభై ఏళ్ళు గడిచిపోయాయి. వేశ్య వలన అతనికి పదిమంది పుత్రులు పుట్టారు. వారిలో చిన్నపిల్ల వానికి నారాయణుడనే పేరు పెట్టాడు. వృద్ధాప్యంలో పుట్టిన ఆ పిల్లవాని పట్ల అజామిళునికి అమితమైన అనురాగం ఉండేది. ఆ పిల్లవాని ఆలనా పాలనా చూస్తూ, అతని బాల్య చేష్టలకు అజామిళుడు ఆనందించేవాడు. తాను భోజనం చేసేటప్పుడు పిల్లవానిని భోజనానికి పిలిచేవాడు. తాను పానీయాలు త్రాగేటప్పుడు తన చెంతకు అతనిని చేరబిలిచేవాడు. ఆ విధంగా ప్రతిమారు. ప్రతిక్షణం ఆ పిల్లవానినే పేరుపెట్టి ' నారాయణా! ' అని పిలుస్తూ పుత్రరతుడయ్యాడు. ' నారాయణా! ', ఇది తిను, ' నారాయణా! ' పాలుత్రాగు, ' నారాయణా! ' ఇటురావయ్యా అంటూ తనకు తెలియకుండానే అతడు నారాయణ నామంలో మునిగాడు.
చివరికి అతని మరణం దగ్గర పడినప్పుడు యమదూతలు అతడిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. అజామిళుడు ఆ సమయంలో భయంతో ' నారాయణా! ' అని తన కుమారుడిని పిలిచాడు. అయితే, ' నారాయణ ' అన్న పేరులోని పవిత్రత కారణంగా, ఆ శబ్దం విష్ణుమూర్తిని చేరింది. అప్పటికి విష్ణుదూతలు అక్కడకు వచ్చి యమదూతలను ఆపారు. తరువాత విష్ణుదూతలు యమదూతలతో మాట్లాడుతూ అజామిళుడి పాపాలు ఎంత ఎక్కువయినా, చివరి సమయంలో ఆయన నారాయణుడి నామస్మరణ చేశాడు కాబట్టి, అతనికి విమోచన లభించాలి అని తెలిపారు. యమదూతలు వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఈ ఘటన తరువాత, అజామిళుడు తన పాపకర్మల పట్ల పశ్చాత్తాపం చెందాడు. అతడు తన జీవితం మిగతా భాగాన్ని నారాయణుడి సేవలో గడిపి, విష్ణు భక్తుడిగా మారి మోక్షాన్ని పొందాడు. మనం ఎన్ని తప్పులు చేసినా, పశ్చాత్తాపంతో మంచిదారి పట్టి భగవంతుని ఆశ్రయిస్తే మోక్షం పొందవచ్చు. భగవన్నామాన్ని జపించడం ఎంత ముఖ్యమో ఈ అజామిళుడి కథ ద్వారా నిరూపితమయింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి