27, ఏప్రిల్ 2025, ఆదివారం

:: హంస వాయసముల కథ :: 

    సముద్రంలో ఒక విశాల ద్వీపంలో ధర్మాత్ముడైన రాజుగారి నగరంలో ఒక వైశ్యుడుండేవాడు. అతడు యజ్ఞాలు చేస్తూ శాంతం, కరుణ, సంయమనం మొదలైన గుణాలతో ఒప్పుతూండేవాడు. పెక్కుమంది పుత్రులతో, భోగభాగ్యాలతో విలసిల్లుతూ దానాలు చేస్తూండేవాడు. ఒక కాకి అతడి ఇంటికి రాగా అతడి కుమారులు దానికి ఎంగిళ్ళు పెట్టి పెంచసాగారు. అది ఆ ఎంగిళ్ళతో పెరుగుతూ గర్వించి ఇతర పక్షులేవీ తనకు సాటిరావన్న దురహంకారంతో ఎన్నో విధాల క్రీడిస్తూ తిరుగుతూ ఉండేది. ఆవిధంగా కాకి విహరిస్తూ ఉండగా గరుడుడితో సమానమైన రెక్కల శక్తి గలిగిన కొన్ని హంసలు సముద్రాన్ని చేరవచ్చాయి.

    వైశ్యకుమారులు ఆ హంసలను చూపిస్తూ కాకితో యిలా అన్నారు. " హంసలు ఆకాశవీథిలో కడు వేడుకతో ప్రకాశిస్తూ విహరిస్తున్నాయి. పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు పలురీతుల గమనాలతో హంసలతో కలిసి పరుగెత్తి వాటిని ఓడించాలి "- అని తారతమ్య భేదం ఎరుగని ఆ అజ్ఞానులు కోరగానే ఎంగిళ్ళుతిని గర్వించి ఉన్న మూర్ఖమైన ఆ కాకి, తాను అంతటి దాననే అని తలంచి, ఆ హంసల దగ్గరకు వెళ్ళి, వాటిలో మేటిగా గోచరించిన దానిని పిలిచి, తనతో సమానంగా పరుగెత్తమని అడుగగా, ఆ హంసలు నవ్వుతూ కాకితో ఇట్లా అన్నాయి. " మానస సరోవరం మా నివాసం. మా బలాన్నీ, వేగాన్నీ చూచి పక్షులన్నీ పొగిడే విధంగా ఎంత దూరమైనా ఎటువంటి కష్టం లేకుండా ఎగిరిపోగలము. ఇటువంటి మాలో బలశాలి అయిన హంసనే అవివేకంతో పోటీకి రమ్మని పిలుస్తున్నావు. అసలు హంసలతో పోటీకి రాగల కాకులు ఇంతవరకూ ఎక్కడైనా ఉన్నాయా? " అని హంసలు అనగానే కాకి వాటికి సమాధానంగా ఇలా అన్నది. " నూట ఒక్క గతులు వేటిలోనయినా నూరు ఆమడల దూరం వెళ్ళగలను. పొడవుగా మీదికి ఎగిరి అదేవిధంగా నేలకు దిగి రాగలను. మనోహర గతులతో వంకరగా, వలయాకారంగా మీరు కోరిన విధంగా పరుగెత్తి ఎటువంటి హంసనైనా ఓడించగలను. మిగిలిన హంసలన్నీ భయపడేటట్లుగ దానిని గెలుస్తాను " అని అనగా ఆ కాకి మాటలు విని ముందు పందెపు పోటీకి పిలువబడిన హంస దానిని చూచి " నూరుగతులలో పరుగెత్తగలనన్నావు గదా, అవన్నీ నాకు తెలియవు. ఆకాశమార్గంలో పక్షులన్నీ నిడువుగా ఏవిధంగా ఎగురుతాయో ఆవిధంగా సముద్రంపై ఆకాశమార్గంలో చక్కగా పరుగెత్తుదాము రమ్ము " అని హంస పలుకగా అక్కడ చేరిన కాకులు " శతగతులు నేర్చిన ఈ కాకితో ఏకైక గమనవగు నీవు పోటీపడి అవమానం పాలు కావలసిందే కాని, ఏవిధంగా సాటి కాగలవు? " అని హంసను పరిహసించగా, ఆ హంస మారు మాటాడక వాటిని వదిలి సముద్రం పైమార్గంలో పరుగెత్తసాగింది. కాకి గూడా దానిని వెంబడించింది. 

    ఈ విధంగా రెండూ పోటీపడి ఎగురుతూ ఉండగా, రాజహంస అలసట లేకుండా మందగమనంతో వెడుతూంటే, వాయసం ఉత్సాహంతో క్రీడావిలాసంతో తన నేర్పులు చూపుతూ వివిధ గతులలో వేగంగా వెళ్ళటం వలన అలసట చెందుతూ పరుగెత్తుతున్నది. ఆ కాకి హంసను దాటిపోయి తిరిగి వచ్చి పిలిచేది. దాని ముక్కుమీద ముక్కు మోపేది. ఈకలను ఈకలతో రాసేది. దాని చుట్టూ విజృంభించి తిరిగేది. చిత్రమైన నడకలతో వచ్చి తాకేది. తనలో తాను మురిసిపోతూ నవ్వేది. ఈ విధంగా తెగ మిడిసిపాటుతో వ్యవహరించేది. కాకి ఈ విధంగా వివిధ గతుల నేర్పులు ప్రదర్శిస్తూ పరుగెత్తటం చూచిన తోటి కాకులు, సంతోషంతో అరుస్తూ, హంసలను గేలిచేస్తూ చెట్లపై గెంతులు వేయసాగాయి. " హంస ఓడిపోతుంది " అని పెద్ద గొంతులతో అరవసాగాయి. వాటి అరుపులు విన్న హంస నిండు ఉత్సాహంతో పొడవుగా పైకి ఎగిరి పడమటివైపు పారగా, కాకి గూడా దాని వెంట వేగంగా వెళ్ళి ఆ హంసను దాటటానికి శక్యంగాక ఊపిరిబిగబట్టి పరుగెత్తసాగింది. హంస, శీఘ్రగమన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ పారగా, దానితోపాటు పరుగెత్తుతూ అలసిపోయిన కాకి శక్తి కోల్పోయి బలహీనమయి మనసు కలత నొందగా ఈ రకంగా చింతించ సాగింది. " ఎరుగక హంసతో పోటీకి సిద్ధపడ్డాను. కాలు నిలుపటానికి మార్గంలో చెట్లు, తీగలు, పొదలు, గట్లు ఏవీ లేవు. నీటిపై దిగుదామా అంటే, సముద్రంలోని జంతువుల బారిన పడక తప్పదు. " అని అనుకొంటూ దిగులుతో, భయంతో కలత చెందిన మనసు కలదై కాకి, దప్పితో వశంతప్పి క్రమంగా క్రిందికి దిగసాగింది. 

    దానిని చూసిన హంస ఈ విధంగా అంది. " ఓ వాయసమా! నేను నిన్ను దాటి పిలిచినా నీవు బదులు పలుకక జాప్యం చేస్తున్నావు. నీ రెక్కలు నీకు దూరమై పోయినట్లు చూస్తున్నావు. నీవు నేర్చిన పెక్కు గతులలో ఇది ఏ రకమైన గమనమో వివరించగలవా? " అని హంస కాకితో హేళనగా పలికింది.  అప్పుడు సముద్ర జలాలు రెక్కలను, ముక్కును, తోకను తాకుతూ ఉండగా, మాటిమాటికి మీదకు ఎగురుతూ, బలహీనపడి క్రిందికి వాలుతూ ఉండగా అలసిపోయి ఎగురలేక భయపడింది. ఈ విధంగా పైకి ఎగురలేక సముద్రపు నీటిమీద పడి, తన బలహీన స్థితికి భయపడుతున్న కాకిని చూచి రాజహంస యిలా అన్నది. " మాటలు ఎన్నయినా చెప్పవచ్చు. కాని, చెప్పినదంతా చెయ్యటం ఎవరికీ సాధ్యమవుతుంది? గొప్పలు పలికిన నీ పని అయిపోయిందికదా! " అన్న హంస మాటలు విని కాకి ఈవిధంగా అన్నది. " ఎంగిళ్ళుతిని, బలిసిన దేహంతో గర్వించి, నాకు ఎదురు ఎవరూ లేరని భావిస్తూ గరుత్మంతుడిని సైతం ఓడించగలనని తలచే దానిని. నా అల్పత్వం ఎంతో ఇప్పుడు తెలుసుకున్నాను. నిన్ను శరణు కోరుతున్నాను. నాపై దయచూపి నన్ను రక్షించు. నా తోటి కాకులలో మళ్ళీ నన్ను చేర్చుము. ఇది నీకు న్యాయం కదా!" అని ఈ విధంగా వ్యాకులమైన మనసుతో కావుకావు మని ఎంతగానో అరుస్తూ నీటిలో మునిగిపోతున్న కాకిని చూచి హంస దయతో కాకిని తన కాళ్ళతో పట్టి పైకెత్తి, దాని ప్రాణాలు కాపాడి, బలమొప్పగా వీపున మోసికొని వస్తున్న హంసను చూచి పక్షులన్నీ పొగడ సాగాయి. హంస ఈ విధంగా కాకిని మోసుకొనివచ్చి దాని స్థానంలో దింపింది. కాకి స్తిమితపడిన తరువాత తోటి కాకులు వినేటట్లుగా ఇకముందెప్పుడూ గర్వంతో ఈ విధమైన పనులకు పూనుకొనవద్దని బుద్ధి చెప్పి తోడి హంసలతో కలసి వెళ్ళిపోయింది. 

    ఈ రకంగా కాకి హంసల కథను కర్ణునికి వినిపించి శల్యుడు అతడితో వైశ్య కుమారులు పెట్టిన ఎంగిళ్ళు తిని గర్వించిన కాకివలె నీవు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని, నీ శక్తి మరచి, నిన్ను మించిన వారితో తలపడుతున్నావు. దీని వలన నీకే హాని జరుగుతుంది. కాబట్టి నా మాటలు విని అర్జునునితో యుద్ధంచేసి ప్రాణంమీదకు తెచ్చుకోకు అని హితోపదేశం చేశాడు. పరిశీలించి చూస్తే, ఈ హంస వాయసముల కథ ద్వారా కర్ణుడిని అవమానపరచాలన్న శల్యుడి ఉద్దేశం ప్రస్ఫుటమవుతున్నది. 

18, ఏప్రిల్ 2025, శుక్రవారం

 :: దక్షయజ్ఞం ::

    దక్షుడు బ్రహ్మ పుత్రుడు. అతనికి ప్రసూతి అన్న ధర్మపత్నియందు పదహారుమంది కన్యలు పుట్టారు. వారిలో పదముగ్గురుని అతడు ధర్మరాజుకిచ్చాడు. ఒకతె అగ్నికీ, మరొకతెని పితృదేవతలకూ, ఇంకొక కుమార్తె సతిని శివునకూ ఇచ్చి పెండ్లిచేశాడు. నరనారాయణులు మూర్తి అనే దక్షపుత్రికకు జన్మించినవారే. వారే తరువాత కృష్ణార్జునులుగా జన్మించి భూభారం తగ్గించారు. సరే! 

    పూర్వం బ్రహ్మలు ఒక సత్త్రం నిర్వహించారు. దానిని చూడాలని ప్రజాపతులు వచ్చారు. దక్షుడుకూడా రాగా అతడిని చూచి బ్రహ్మ, శివుడు తప్ప తక్కిన వారంతా లేచి నిలబడ్డారు. దక్షుడు బ్రహ్మకు ప్రణమిల్లాడు. శివుడు లేవకుండటం చూసి ఆగ్రహించాడు. ఆ దేవుడిని పరుషోక్తులతో తూలనాడాడు. యజ్ఞంలో శివుడు హవిర్భాగం  లేనివాడగుగాక! అని శపించాడు. అతని చర్యను సదస్సు లాక్షేపించగా దక్షుడు కోపంతో సదస్సునుండి వెళ్ళిపోయాడు. అప్పుడు నందికేశ్వరుడు దక్షుడు పశుప్రాయుడవుతాడనీ, త్వరలో మేషముఖుడు కాగలడనీ శపించాడు. హరుని ద్వేషించే ద్విజులు యాచకులవుతారనీ కూడా శపించాడు. అందుకు భృగువు కోపించి ధూర్జటి వ్రతులు పాషండులవుతారని ప్రతిశాపం యిచ్చాడు. ఇది చూచి విమనస్కుడై శివుడటనుండి వెళ్ళిపోయాడు. యజ్ఞం పూర్తికాగానే ఋషులు తమ తమ ఆశ్రమాలకు పయనమైనారు. 

    ఆ తర్వాత మామ దక్షుడికీ, అల్లుడు శివుడికీ ఒకరిపట్ల ఒకరికి ద్వేషం వర్థిల్లుతూనే చాలాకాలం దొర్లిపోయింది. అంతట్లో శివుడు లేకుండా యాగం మొదలుపెట్టి చేసినా చేయనట్లేనని దక్షుడికి తెలుసు. అయినాసరే, శివుడితో ముందునుంచి కొనసాగిస్తున్న వైరం వల్లా,  బ్రహ్మ దక్షుడిని ప్రజాపతులందరికీ ఏలికను చేయడం వల్ల దక్షుడిలో అహంభావం ఏర్పడింది. బ్రహ్మ నిష్ఠులైన ఈశ్వరాదులను లెక్కచేయక, దక్షుడు శివుడు లేని ' వాజపేయి ' యజ్ఞం చేశాడు. వాజపేయం అంటే, నేతిని ఆహారంగా స్వీకరిస్తూ చేసే దైవకార్యం. ఆ తరువాత ' బృహస్పతి సవనం ' అనే పేరిట మరో యజ్ఞం చేయ తలపెట్టాడు. తిండి, తీర్థం, పలుకరింపులు ధర్మార్థ కర్మలుగా కాక, స్వార్థ కర్మలుగా ప్రవర్తింప జేసేది బృహస్పతి సవనం. అయినా వీటిని ప్రసాదించే దేవతలు ఈ సవనకర్తను దీవించడం సంప్రదాయం. ఆ బృహస్పతి యాగం చూడాలనే ఆత్రంతో బ్రహ్మ ఋషులూ, ప్రజాపతులూ, నారదుని వంటి దేవ ఋషులు తమ భార్యలతో కలసి క్రమంగా ఎంతో ఆసక్తితో తరలివచ్చారు. అందరూ దక్షుడికి శుభాలు కలగాలని దీవనలు పలికారు. దక్షుడి యాగ దక్షిణలను యథార్హంగా స్వీకరించారు. 

    దక్షుడి కూతురు సతీదేవి తన నివాసం నుంచే తండ్రి చేసే యాగం గొప్పతనాన్ని, గంధర్వుల స్తోత్రాల కలకలాన్ని ఆసక్తితో చెవులార విన్నది. ఎంతో ఉత్సాహంతో ఆకాశం వైపు చూడగా అదే సమయానికి ఆ దక్షుడు చేసే యాగం వేడుకలను కన్నులారా తిలకించాలనే ఉబలాటంతో అన్ని వైపులనుంచి ప్రజలు తరలి వెడుతున్నారు. ఆ వేళలో మితిమించిన ఉత్కంఠతో తమ పతులతో జంటగా గగనచరులైన గంధర్వ, కిన్నర స్త్రీలు విమానాలలో పయనమై నింగికి పోతూ ఉన్నారు. ఆ దృశ్యాలన్నీ కన్నులారా తిలకిస్తున్న సతీదేవి తానూ ఆ సవనానికి భర్తయైన శివునితో సహా  వెళ్ళాలనుకున్నది. కానీ, శివుడు అందుకు ఒప్పుకొనక వద్దని వారించినా వినకుండా ఆమె తండ్రి యాగభూమికి వెళ్ళింది. అక్కడ తల్లి, సోదరీమణులు తప్ప తక్కిన వారెవరూ ఆమెను ఆదరించలేదు. శివుని పట్ల ద్రోహం చేశావని తండ్రిని ఆక్షేపించింది. అనేక రకాలుగా విమర్శించింది. చివరకు మౌనం పూని సతీదేవి నేలపై కూర్చొని యోగమార్గంలో శరీరాన్ని పరిత్యజించింది. ఆమె శరీరం యోగాగ్నిలో దగ్ధమయింది. అది చూసి రుద్ర పార్షదులు అంటే రుద్ర సహాయకులు దక్షుడిని హతమార్చడానికి ఉద్యమించారు. అందుకు ప్రతిగా భృగువు అభిచార హోమం చేశాడు. ఋభునామక దేవతలాభిర్భవించి రుద్రపార్షదులను పారదోలారు. 

    పిమ్మట నారదుని ద్వారా జరిగిన వృత్తాతం విని ఆ తొలిదైవం, ఆ రుద్రుడు, ఆ నీలగళుడు, ఆ గజాసురసంహారి పట్టలేని కోపంకొద్దీ మునిపళ్ళతో పెదవిని కొరికాడు. మత్తుగొన్న సింహంవలె కఠోరంగా గర్జించాడు. అత్యంత భీకరంగా పగలబడి నవ్వాడు. మెరుపులవంటి అగ్నికీలల పరంపరల అన్వయ కాంతితో ప్రకాశిస్తున్నట్టి, అప్పటి కోపతీవ్రతతో ఊగుతున్నట్టి ఒక జటను సర్రున పీకి భూమిపైన విసిరికొట్టాడు. ఆ జటనుంచి నల్లటి నిలువెత్తు రూపంతో లోకభయంకరుడుగా ఉన్న వీరభద్రుడు పుట్టుకొచ్చి, ఏమి చేయాలో తెలుపుమని శివుని అభ్యర్థించగా, దక్షవాటికకు పోయి శ్రద్ధాళువై యాగాన్ని భగ్నం చేయడంతో బాటు దక్షుడిని సంహరించు. దుర్లభమైన నా అంశాన జన్మనెత్తిన నీకు సాధ్యం కానిది ఏమీ ఉండదని శివుడు ఆజ్ఞాపించగా ఆ వీరభద్రుడు పట్టరానంత వేగంతో ఒక్క ఊపున కదిలాడు. శివప్రమథగణాలు రకరకాల ఆయుధాలను చేపట్టి వీరభద్రుడిని అనుసరించాయి. దక్షయాగ స్థలం చుట్టూ ఉన్న కంచెలను, నడవలను, ఇళ్ళ భాగాలను అస్తవ్యస్తం చేశారు. ప్రధాన యాగగృహం వెన్నుగాడిని భగ్నమొనర్చారు. ధర్మ గేహినులుండే పాకను, యాగ యజమాని పాకను, సభతీర్చే పాకను, అగ్నివహులైన ఋత్విక్కులుండే పాకను, వంటశాలలను పూర్తిగా ధ్వంసం చేశారు. యాగ పాత్రలను, వహ్నులను పాడుచేశారు. అగ్నిహోత్రాలను ఆర్పివేశారు. అగ్నిగుండాలలో మూత్రాన్ని విసర్జించారు. తీర్చిదిద్దిన వేదికల సోమసూత్రాలను తెంపివేశారు. మునులను కష్టపెట్టారు. మునిపత్నులను గజగజలాడించారు. ప్రమథగణములన్నీ జట్లుజట్లుగా యేర్పడి అలా చేస్తుంటే, భృగు ఋషిని మణిమంతుడూ, దక్షుడిని వీరభద్రుడూ, పూషుని చండీశుడూ, భగమునిని నందీశ్వరుడూ నిర్భంధించారు. ఇలాగున సభ్యుల, దేవతల, ఋత్విక్కుల వర్గాలపైకి రాళ్ళు విసరీ, మోకాళ్ళతో కుమ్మీ, అరచేతులతో చరచీ, మోచేతులతో పొడిచీ, పెక్కురకాలుగా పీడించారు. అక్కడి వారంతా భయంతో దిక్కుతోచక తలకొక దిక్కుకూ పరుగులు తీశారు. అప్పట్లో యాగవాటికలో దక్షుడు శివుని తిట్టిపోశాడు. అప్పుడు కనుసైగ చేసిన భగుని, ఇప్పుడు నందీశ్వరుడు పట్టికట్టేశాడు. రెండుకనులను పెరికివేశాడు. ఇదంతా చూస్తున్న జనంలో ఆర్తనాదాలు చెలరేగాయి. దక్షుడు శివుని దూషించినపుడు పూషుడు పల్లికిలిస్తూ నవ్వాడు. ఆ కారణంగా ఇప్పుడు పూషుడి దంతాలను చండీశుడు ఊడపీకాడు. ఆ సమయంలోనే మీసం, గడ్డం మెలిపెడుతూ నవ్విన భృగువును పట్టి వీరభద్రుడు ఆ ముఖ మీసం, గడ్డం మెలితిప్పి పెరికివేశాడు. ఇంకా ఆ వీరభద్రుడు విర్రవీగినవాడై దక్షుడిని ఆధీనం చేసుకొని అతని తలను తెగిపడేలా నరికివేశాడు. కోపం ఆపుకోలేక దక్షిణాగ్నికి ఆహుతి చేశాడు. 

    పిదప దేవతలు బ్రహ్మచెంతకు పోయి శివసైనికులవల్ల తమకు కలిగిన బాధలను వివరించారు. ఆయన శివుని తిరస్కరించటం తగదని చెప్పి, ఆయనను శరణు వేడమని హితముపదేశించాడు. బ్రహ్మ యితర దేవతలు కైలాసం చేరి అభవుని దర్శించి నమస్కరించారు. బ్రహ్మ శివుని వినుతించి దక్షాధ్వరాన్ని మరల ఉద్ధరించి దక్షుని బ్రతికించమని ప్రార్థించాడు. బ్రహ్మ ప్రార్థనను మన్నించి శివుడు, దగ్ధ శిరస్కుడైన దక్షుడు అజముఖుడగుగాక, అని చెప్పి ఆ దేవతలననుగ్రహించాడు. పిదప శివుడు బ్రహ్మాదులతో కూడి దక్షాధ్వర వాటికకు వెళ్ళాడు. ఆయన అనుగ్రహంతో క్షతగాత్రులందరూ పూర్వస్థితి పొందారు. దక్షుని మేషముఖుడిని చేయగా అతడు నిద్రమేల్కొన్నట్లు లేచి రుద్రుని స్తుతించి తనను క్షమించమని కోరాడు. ఆపై యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విష్ణు దేవతాకమైన కర్మ చేయగా శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆ దేవునికి భక్తితో మొక్కారు. పెక్కువిధాల స్తుతించారు. శ్రీహరి దక్షాధ్వరాన్ని ఏ కొరతా లేకుండా జరుగునట్లనుగ్రహించాడు. యజ్ఞానంతరం విష్ణువు మున్నగు వారంతా తమ తమ నెలవులకు వెళ్ళారు. యోగాగ్ని దగ్ధురాలైన సతి జన్మాంతరంలో హిమవంతుని కూతురుగా పుట్టింది. పూర్వదయితుడైన  రుద్రుడినే చేపట్టింది. 
    

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...