:: సంధ్యాదేవి ::
పూర్వం త్వష్టప్రజాపతి అని ఒక గొప్ప విశ్వకర్మ ఉండేవాడు. అతను దేవతలకు విమానాలు, ఆయుధాలు చేసి యిచ్చేవాడు.
విశ్వకర్మకు సంధ్యాదేవి అనే చక్కటి కూతురు. ఆమె చాలా సుకుమారురాలు. సంధ్య పెళ్ళి యీడుకు రాగా, సూర్యుడే ఆమెను వరించాడని తెలిసి తక్కిన దేవతలంతా పోటీచేయక ఊరుకున్నారు. సూర్యుడు లోకాలన్నీ నిత్యం తిరిగొచ్చేవాడు కనుక ఎక్కడెక్కడి పెళ్ళి కూతుళ్ళ సంగతి అతనికి తెలుసును. వాళ్ళందరిలోకి సంధ్యాదేవి అందమైనదని తోచి ఆమెనే పెళ్ళిచేసుకుందామని నిశ్చయించాడు. సూర్యభగవానుడి గొప్పదనం తెలిసిన విశ్వకర్మ ఒక మంచి ముహూర్తాన సంధ్యాదేవిని సూర్యదేవునికిచ్చి పెండ్లి చేశాడు.
గొప్పవాణ్ణి పెళ్ళిచేసుకున్నందుకు సంధ్యాదేవి మొదట సంబరపడిందే కాని అత్తవారింటికెళ్ళడంతోనే ఆ సంబరమంతా చప్పబడిపోయింది. సూర్యుడు లోకబాంధవుడే కావచ్చు కాని ఆ భగభగ మండే భర్తతో ఎలా కాపురం చెయ్యటం? అందులోనూ సంధ్యాదేవి లాంటి సుకుమారి అసలే చెయ్యలేదు. " స్వామీ! మీరు చాలా వేడిగా ఉన్నారు. మీ వద్ద ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది " అని తన బాధ భర్తతో చెప్పుకుందామని ఆమె అప్పుడప్పుడు అనుకునేది గాని ఆయన ఏమనుకుంటాడో అని భయపడి చెప్పకుండా ఊరుకొనేది.
కొంతకాలానికి ఆవిడకు వైవస్వతుడు, యముడు అనే యిద్దరు కుమారులు, యమున అనే ఒక కూతురూ పుట్టారు. క్రమంగా సూర్యుని వేడి, తగ్గడానికి బదులు ఎక్కువైపోయి, సంధ్యాదేవికి సహించటానికి వీల్లేనంత బాధ కలిగించింది. ఆమె తన బాధ ఎవళ్ళకీ చెప్పుకోలేక ఒంటరిగా కూచుని దు:ఖించింది. అప్పుడు ఆమె నీడ ఆమె ప్రక్కనే కనబడింది. ఆ నీడ సరిగ్గా తనలాగా కనబడేసరికి సంధ్యకు ఒక ఆలోచన తట్టింది. ఆ నీడకు ప్రాణం పోస్తే అది తనలాగే సుందరి అయి, సరిగ్గా తనలాగే ఉంటుంది. తన స్థానంలో ఆమెను సూర్యునకు భార్యగా ఉంచేసి, తాను పుట్టింటికి వెళ్ళి, ఇంతవరకూ సూర్యుని వేడి వల్ల కమిలిపోయిన తన శరీరం తేరుకునే వరకు అక్కడ విశ్రాంతి తీసుకుని ఆ పిమ్మట రావచ్చు అని.
వెంటనే సంధ్యాదేవి తన నీడకు ప్రాణంపోసి అచ్చు తనవలెనే ఉన్న ఆ సుందరికి, ఛాయాదేవి అని పేరు పెట్టింది. ' ఛాయ ' అంటే నీడ. ఛాయాదేవి " అక్కా! నన్నెందుకు పుట్టించావు? అని అడిగింది. సంధ్య తన బాధంతా చెప్పి, " నువ్వు భర్తగారికి అనుమానం తగలకుండా నడుచుకోవాలి. ఆయనకు సందేహం రాకుండా నా పిల్లల్ని కూడా ఇక్కడే విడిచి వెడుతున్నాను. వాళ్ళకి కూడా ఏ సంశయమూ కలగకుండా ' ఇది అమ్మే ' అనే నమ్మకం పుట్టేటట్లు నువ్వు వాళ్ళని పెంచాలి. మన యీ రహస్యం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు " అని చేతిలో చెయ్యి వేయించుకుని, మర్నాడే సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళింది.
సంధ్యాదేవి తనంత తానే వచ్చిందనేటప్పటికి " ఏం చెప్మా " అనిపించింది విశ్వకర్మకి. ఆమె మనసు విడిచి చెప్పటానికి బిడియపడింది. బహుశ: మొగుడితో ఏదో పేచీ వచ్చి, ఇలా వచ్చేసి ఉంటుందనీ, కొన్నాళ్ళుపోతే అల్లుడే వచ్చి ఆమెను సమాధాన పరచి తీసుకువెడతాడనీ, అంతగా రాకపోతే, తామే తీసుకుపోయి అప్పుడే దిగబెట్టవచ్చుననీ తల్లిదండ్రులు అనుకున్నారు.
కానీ వాళ్ళు అనుకున్నట్లు సూర్యుడు ఎప్పటికీ రాలేదు. ఎందుకొస్తాడు? అతడికి సంధ్యాదేవి బాధకాని, ఆమె పుట్టింటికి వెళ్ళిందనిగానీ తెలిస్తేగా? ఛాయాదేవి కాస్త గూడా సూర్యునికి అనుమానం కలగకుండా అచ్చం సంధ్యాదేవిలాగే వర్తిస్తున్నదాయె! పోనీ అంటే, పిల్లలకు కూడా అనుమానం తగలలేదు. ఛాయాదేవి వాళ్ళని స్వంత తల్లిలాగానే ప్రేమతో పెంచుతోంది. ఇంక వాళ్ళకెలా అనుమానం తగుల్తుంది?
అక్కడ విశ్వకర్మ, అల్లుడు రాకపోవటం చూచి, ఇంక ఉపేక్ష చేయటం మంచిది కాదని తోచి సంధ్యతో, " అమ్మాయ్! చెట్టుకు కాయ బరువు కాదుకదా! నువ్వు ఎన్నాళ్ళున్నా మా కానందమే. కాని భర్తతో ఉండవలసిన కాలంలో పుట్టింట ఉండటం క్షేమంకాదు " అన్నాడు. అప్పుడు సంధ్యాదేవి, " నిజమే నాయనా నీవు చెప్పిన మాట. నేనొక్కర్తెనూ వెళ్ళగలను. నీకెందుకు శ్రమ? " అని చెప్పేసి వెంటనే బయల్దేరింది. కాని సూర్యభగవానుని తీవ్రత తలచుకునేటప్పటికి ఆమె గుండె ఝల్లుమంది. సూర్యలోకానికని బయలుదేరిన ఆమె దారిలో ఒక అడవిలో ఆగిపోయింది. తనలాంటి అందమైన స్త్రీ ఒంటరిగా అడవిలో ఉండటం క్షేమం కాదని తోచి, ఆమె తన మనుష్యరూపాన్ని వదిలేసి, ఒక ఆడ గుర్రం అయిపోయి, అక్కడే ఉండిపోయింది. విశ్వకర్మకు ఈ సంగతేమీ తెలియక తన కుమార్తె అత్తింట జేరుకుని సుఖంగా ఉందనే అనుకున్నాడు.
సూర్యుడికి ఇదేమీ తెలియక ఛాయాదేవినే సంధ్యాదేవి అనుకుని ఆమెను ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. సంధ్యాదేవి పిల్లలైన వైవస్వతుడు, యముడు, యమునా కూడా ఆమే తమ అమ్మ అనుకుని, అమ్మమీద ఉండే చనవూ, గౌరవం చూపుతున్నారు.
కొంతకాలానికి ఛాయాదేవికి కూడా పిల్లలు పుట్టేరు. సౌవర్ణుడు, శని అనే యిద్దరు కుమారులు, తపతి అనే కుమార్తె. అయితే, తనకు పిల్లలు పుట్టటం తోనే ఛాయాదేవిలో మార్పు వచ్చింది. అంతవరకూ తాను కన్నబిడ్డలకుమల్లే చూచి పెంచిన సంధ్యాదేవి పిల్లలంటే ఆమె కిప్పుడు ప్రేమపోయి, వాళ్ళని సవతి పిల్లల్ని చూచినట్లు చూడటం మొదలెట్టింది. తమను కన్నతల్లే ఇలా పక్షపాతంతో ప్రవర్తిస్తూందని తేలిపోవడంతో యముడు కోపంతో మండిపడి ఛాయాదేవిని తన్నడానికి సిద్ధపడ్డాడు. ఛాయ తక్షణం వెళ్ళి సూర్యునితో ఫిర్యాదుచేసి ఉన్నవీ లేనివీ కలిపి చెప్పింది.
అయితే, సూర్యుడు తొందరపడే రకం కాదు. " యముడు పిన్నవాడైనా ధర్మపరాయణుడు. అతడిలా ఎందుకు ప్రవర్తించాడు చెప్మా " అనిపించిందతనికి. కుమారుణ్ణి పిలిచి విచారించాడు.
" తపతి పుట్టినప్పట్నుంచీ అమ్మ మమ్మల్ని సవతి పిల్లల్ని చూచినట్లు చూస్తోంది, మీకు తెలుసో లేదో? " అన్నాడు యముడు. సూర్యుడా మాటలు విని ఆశ్చర్యపోయి, యముడన్నమాట నిజమో కాదో అని భార్య ప్రవర్తన గురించి, ఆమె చిన్న పిల్లలంటే ఎక్కువ మమకారం చూపిస్తోందనీ తెలుసుకున్నాడు. ఏమిటిది? తన కడుపున పుట్టిన ఆరుగుర్నీ సమంగా చూడటానికి బదులు సంధ్యాదేవి మొదటి వాళ్ళను సవతి పిల్లలకుమల్లే ఉపేక్షచేస్తూ కడసారి వాళ్ళని నెత్తి నెక్కించుకుంటోందేమిటి? సూర్యుడు ఉండబట్టలేక భార్యను పిలిచి నిలేసి అడిగాడు. ఛాయాదేవి తప్పించుకుపోదామని చూసింది. కాని సూర్యుడు అలా పోనివ్వలేదు. ప్రళయకాల రుద్రుడికి మల్లే భగ్గుమనేసరికి ఛాయాదేవి గజగజ వణుకుతో తాను సంధ్యాదేవిని కాదనీ, సంధ్య పుట్టింటికి వెళ్ళిపోయిందనీ యధార్థం చెప్పేసింది.
అదివిని సూర్యుడు చాలా విచారించాడు. " కూతురును నేను సుఖపెట్టలేక పోయానని మామగారేమనుకున్నాడోకదా! " అని బాధపడి తక్షణం విశ్వకర్మ ఇంటికెళ్ళి " సంధ్యాదేవి ఏదండీ? " అని అడిగాడు. ఆ మాట వినేటప్పటికి విశ్వకర్మ నిర్ఘాంతపోయాడు. " మీ వద్దకే వెడుతున్నానని బయల్దేరిందే! " అన్నాడు. సూర్యుడు జరిగినదంతా మామగారికి పూసగ్రుచ్చినట్లుగా చెప్పగా, విశ్వకర్మ అల్లుణ్ణి ఓదార్చి తన యంత్రసామాగ్రి దెచ్చి, సూర్యుణ్ణి చేత్తో పట్టుకుని, భగభగ మండే పెచ్చులన్నీ ఊడి క్రిందపడేటట్లు సాన పట్టేశాడు. మంటలకు బదులు వెచ్చదనమూ, కాంతి మిగిలి సూర్యుడు చూడటానికెంతో అందంగా కనబడ్డాడు. అలా మారిపోయి సంధ్యాదేవిని వెతుకుతూ వెళ్ళిపోయాడు. ఆవిడ తన మానాన్ని కాపాడుకునెందుకని ఆడ గుర్రమై అడవిలో ఉందని తెలిసి, తానుకూడా ఒక గుర్రం రూపంతో అక్కడకు వెళ్ళేడు.
సంధ్యాదేవికి సూర్యుడు తెలియజెప్పుకునేసరికి " ప్రభూ! మీరు మళ్ళీ మీ సూర్యరూపం ధరించకండి. మీ వేడి భరించలేను " అని ఆమె ఉన్నమాట చెప్పేసింది. వాళ్ళలా కొంతకాలం గుర్రాల రూపంలోనే ఉండగా, వారికి అశ్వనీకుమారులు పుట్టేరు. ఈ అశ్వినీ కుమారులే దేవతలకు వైద్యులయారు. కాని సూర్యుడు, సంధ్యాదేవి అడవిలో గుర్రాల రూపంలో ఆట్టే కాలం ఉండటానికి వీల్లేకపోయింది. ఏమంటే, సూర్యుడు లేకపోతే లోకాలకు వెలుగో, మరి? అంచేత అదివరకుమల్లే గాక తన వేడి అంతా పోయిందన్న సంగతి ఆమెకు నచ్చచెప్పి తన లోకానికి తీసుకుపోయాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి