14, జులై 2025, సోమవారం

:: నత్కీరుడు :: 

    ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద కోనేరు, కోనేటి ఒడ్డున ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు క్రిందకు ఒక కుష్ఠువాడు నడచివచ్చి, ఆయాసం తీర్చుకోవటానికి ఆ నీడను కూర్చున్నాడు. కూర్చుని యధాలాభంగా చెఱువుకేసి చూశాడు. అతడలా చూస్తుండగానే, ఆ చెట్టునుంచి ఆకొకటి రాలి చెఱువులో పడింది. పడీపడ్డంతోటే అది ఒక చేపగా మారిపోయి బుడుంగుమని నీటిలో మునిగి పోయింది. 

    `ఆకు చేప అయిపోవటం చూచి అతను ఆశ్చర్యపడుతూ ఉంటే మరో ఆకు రాలింది. ఆ ఆకు నీటిలో కాకుండా గట్టుమీద పడింది. అది ఒక పిట్టగా మారిపోయి, తుర్రుమని పైకెగిరి పోయింది.

    ఇంతలో ఇంకో ఆకు రాలింది. ఈమాటు రాలిన ఆకు పూర్తిగా చెఱువులోనూ పడలేదు, పూర్తిగా ఒడ్డునా పడలేదు. సగం నీటిలోనూ, సగం ఒడ్డునా పడింది. నీటిలో పడ్డ సగం చేప అయింది. ఒడ్డున పడ్డ సగం పక్షి అయింది. 

    చేపగా మారిన భాగం నీటిలోకి పారిపోదామని అటు లాగింది. పక్షిగా మారిన భాగం పైకి ఎగిరిపోదామని అటువైపు లాగింది. కుష్ఠువాడు లేచివెళ్ళి ఆ చోద్యం చూట్టం మొదలెట్టేవరకు అది ఒక పెద్ద భూతంగా మారిపోయింది. నెత్తిమీద మేకులకుమల్లే నిటారుగా నిలబడి ఉన్న బిరుసు వెంట్రుకలు, చింత నిప్పులకుమల్లే ఎర్రగా కణకణ లాడుతూ ఉండే కళ్ళూ, వాడి కోరలూ, గూని నడ్డీ, బాన కడుపూ గల ఆ భూతం, భయంతో వణికిపోతూ నోట మాట లేకుండా నిలబడ్డ ఆ కుష్ఠువాణ్ణి అమాంతం ఎత్తి భుజంమీద వేసుకుని గబగబా పారిపోయింది. 

    భూతం అలా వెళ్ళి వెళ్ళి ఒక గుహ దగ్గర ఆగింది. ఆ గుహ ద్వారం ఒక పెద్ద రాయితో మూసేసి ఉంది. భూతం ఆ రాయిని సునాయాసంగా పక్కకు ఒత్తిగించి లోపల ప్రవేశించింది. భుజం మీద మోసుకొచ్చిన కుష్ఠువాణ్ణి నేలమీద పడేసి, అక్కడ తానంతకుముందు ఇలాగే తెచ్చి పడేసి ఉంచిన మనుష్యులనందరినీ ఒక్కమాటు లెక్కపెట్టుకుంది. కుష్ఠువానితో కలిపి వాళ్ళు నూరుమందయ్యారు. అప్పుడా భూతానికి కలిగిన సంతోషం ఏమని చెప్పం? ఎప్పుడు దొరికిన మనిషినప్పుడు తినెయ్యదా భూతం. అలా తినేస్తే దానికి కడుపు నిండినట్టే ఉండదు. నూరుమందయే దాకా ఊరుకొని, ఆవేళ వాళ్ళనందర్నీ దొంతరపెట్టి తినేసి, ఆ చెరువులో ఉన్న నీళ్ళు తాగి, కొన్నాళ్ళపాటు ఆ గుహలో నిద్రపోతుంది. 

    ఈవేళ కుష్ఠువానితో నూరుగురయారు కనుక కడుపునిండా భోజనం దొరికిందన్న సంతోషంతో ఒక్కమాటు ఎగిరి గంతేసింది. చెరువుకెళ్ళి స్నానం చేసి వచ్చి మింగేద్దామని తలచి బయల్దేరింది. 

    గుహలో అంతకుముందు పడిఉన్న తంభైతొమ్మండుగురూ ఆ కుష్ఠువాణ్ణి చూచి, " నాయనా! నీతో నూరుగురం అయాం. నేటితో మనకు నూరేళ్ళూ నిండేయి " అని గొల్లుమంటూ ఏడవడం మొదలుపెట్టేరు. 

    " ఈ భూతాన్ని చంపేసే ఉపాయమేమీ లేదా? " అన్నడు కుష్ఠువాడు. 

    " ఈ భూతాన్ని చంపాలంటే కేవలం ఆ పరమశివుడో లేకపోతే అలాంటి మరో దేవుడో రావలసిందే గాని మనుష్యమాత్రులం మనం ఏమి చెయ్యగలం? " అన్నారు వాళ్ళు. 

    కుష్ఠువాడు " శివుడికి వినిపించేటట్లు నేను స్తోత్రం చేయగలనుగాని, వినిపించికూడా ఆయన రాడేమో? నేనంటే ఆయనకు కోపం " అన్నాడు. 

    " నీమీద శివునికి కోపం ఎందుకొచ్చింది? " అని వాళ్ళల్లో ఒకడు అడిగాడు. 

    " ఆ కథను చెబుతూ కూచుంటే భూతం వచ్చి మనని మింగేస్తుంది. ముందు ఆ భూతాన్ని చంపే మార్గం చూడాలి. భూతం చచ్చిపోయాక ఎన్ని కథలైనా చెప్పుకోవచ్చు " అంటూ కుష్ఠువాడు శివుని కుమారుడైన కుమారస్వామిని భక్తితో స్తోత్రం చేసే వరకు ఆ దేవుడు ప్రత్యక్షమై " ఎందుకు నన్ను రప్పించావు? " అని అడిగాడు. 

    అప్పటికప్పుడే భూతం స్నానం చేసేసి గుహకి తిరిగి వచ్చింది. 

    కుష్ఠువాడు కుమారస్వామికి మ్రొక్కి " స్వామీ! మొదట ఈ భూతాన్ని చంపేసి మమ్మల్ని కాపాడు " అని కోరేసరికల్లా, కుమారస్వామి తన ఆయుధంతో ఆ భూతాన్ని ఒక్క దెబ్బకు నరికి పారేశాడు. 

    కుమారస్వామి కుష్ఠువానివైపు చూసి " ఏమయ్యా! నువ్వు గొప్ప కవిలాగా ఉన్నావే ? కవులు తప్ప ఇంత చక్కటి శ్లోకాలు మరెవరు చెప్పగలరు? మరి, నీకీ కుష్ఠురోగం ఎలా వచ్చింది? " అని అడిగేటప్పటికి కుష్ఠువాడు, " స్వామీ! మీ తండ్రి పరమేశ్వరుడి శాపం వల్లనే నాకీ రోగం వచ్చిందని చెప్పాడు. 

    " భూతం చచ్చిపోయింది కనుక ఆ కథంతా ఇప్పుడు సావకాశంగా చెప్పు " అని గుహలోని వాళ్ళంతా ఆ కవీశ్వరుణ్ణి కోరారు. 

    కుమారస్వామి కూడా వింటుంటే అతడు తన కథను ప్రారంభించాడు. 

    మాది పాండ్యరాజ్యం. నాపేరు నత్కీరుడు. మధురలో పాండ్యరాజు ఆస్థానంలో రత్నాలపీఠం ఒకటి ఉంది. సరస్వతీదేవితో సమానమైన కవీశ్వరులు కూచోటం కోసమని ఆ పీఠాన్ని అగస్త్యమహాముని పాండ్యరాజుకి ఇచ్చాడు. ఆ పీఠం ఒక్క కవి కూచోటానికి సరిపోయింది. కాని, చిత్రమేమిటంటే, గొప్పకవు లెందరొచ్చినా అది విస్తరించి కూచోటానికి చోటిస్తుంది. 

    నేను పాండ్యరాజు సభలోకి వెళ్ళేటప్పటికి ఆ పీఠం అప్పటికప్పుడే పదకొండుగురు మహాకవీశ్వరులకు చోటిచ్చింది. నేను నా కవిత్వంతో అందర్నీ మెప్పించాను. చటుక్కున ఆ పీఠం పెరిగి నాకూ చోటిచ్చింది. నా తర్వాత కూడా చాలామంది కవులు పాండ్యరాజు సభకు వచ్చి కవిత్వం చెబుతూండేవారు. వాళ్ళెవ్వరికీ ఆ పీఠం చోటివ్వలేదు. రాజు వాళ్ళనెవళ్ళనీ ఉత్తి చేతులతో పంపేవాడు కాడు. ఆ పీఠం మీద కూర్చొని 'గొప్ప కవులం' అనిపించుకున్న మేము పన్నెండుగురం అక్కడకు వచ్చిన ఒక్కొక్క కవినే పరీక్షచేసి శిఫార్సు చేశాక, ఆ శిఫార్సు ప్రకారం కానుకలిచ్చి పంపేవాడు. క్రమక్రమంగా సభకు కవులు రావటం తగ్గిపోయింది. దానికి కారణం ఆ పీఠంలో తమకు చోటు దొరకదనే మాటెలా ఉన్నా, వారు మా ముందువచ్చి నిలబడడానికే భయపడే వారు. దానితో మాకందరికీ గర్వం, అహంకారం ఎక్కువైపోయినై. ముఖ్యంగా నాకు మరిన్నీ. 

    ఒకనాడు కవినంటూ ఒకడు రాజసభకు వచ్చి ఒక పద్యం చదివేడు. ఆ పద్యంలో " ఒక స్త్రీయొక్క జుట్టుముడి సహజమైన సువాసనతో ఉన్నదంటూ " చెప్పేడు. నేను నవ్వుతో " ఇదేం కవిత్వమయ్యా? ఎక్కడైనా జుట్టుముడికి సహజమైన సువాసన ఉంటుందా? ఏ వాసన నూనో రాసుకుంది కాబోలు " అని ఎగతాళి చేశాను. దానితో వాడు కిక్కురు మనకుండా సభలోంచి అవతలికి పోయాడు. " మంచి బాగా చివాట్లు పెట్టి పంపించేశావయ్యా! " నత్కీరా, అని తక్కిన పదకొండుగురు నన్ను మెచ్చుకున్నారు. 

    ఇంతలో సభలోంచి పోయినవాణ్ణి వెంటబెట్టుకుని మరొకాయన కోపంతో ప్రవేశించి " ఇతడు నా భక్తుడు. తిండికిలేక బాధపడుతూంటే ఒక పద్యం రాసిచ్చి, దాన్ని తీసుకెళ్ళి రాజసభలో చదివి బహుమానం తెచ్చుకోమనగా, ఇతనిక్కడకొచ్చి ఆ పద్యం చదివితే ఎవడో దానిలో తప్పుపట్టాడట! ఎవడు వాడు? అని గద్దించి అడిగేడు. 'నేనే' అంటూ మీసం మీద చెయ్యివేసి నిలబడి " జుట్టుముడికి సహజమైన సువాసన ఉంటుందా ఏ స్త్రీకైనా? " అన్నాను. అందుకాయన నీకు తెలియదేమోగాని అలాంటి స్త్రీ ఒకామె ఉంది. నా భార్యయైన పార్వతీదేవి కేశములు సహజ పరిమళం కలవి. తెలియకపోతే తెలియనట్టుగా ఊరుకోవాలిగాని, ప్రతిదానికీ తప్పులు వెతకడం సత్కవుల లక్షణం కాదు " అంటూ ఆయన తన నిజ రూపంలో సాక్షాత్కరించాడు. " శివుడు - శివుడు " అంటూ సభలోని వారంతాలేచి నిలబడ్డారు. 

    రత్నపీఠం మీద కూర్చున్న తక్కిన పదకొండుగురు కవులూ లేచి " వందే శంభు ఉమాపతిం " అంటూ స్తోత్రాలు మొదలెట్టేరు. వాదన వచ్చినపుడు నువ్వా? నేనా? అని ఢీకొనాలే గాని శివుడు గదా అని బెదిరిపోయి స్తోత్రాలు మొదలెట్టడమా? అని నాకు వళ్ళు మండిపోయింది. ఏమైనా సరే, నీ పద్యంలో తప్పు లేకుండా పోయిందా? అని నేను వాదించే సరికి, శివునకు కోపం వచ్చి " వళ్ళు తెలియకుండా మాట్లాడావు గనక నీ వళ్ళంతా కుష్ఠురోగం వచ్చి అసహ్యంగా కనబడుదువు గాక " అని శపించాడు. గజగజ వణుకుతో పీఠం మీదనుంచి దిగి పరుగున శివుని కాళ్ళమీద పడి క్షమించమని ప్రార్థించగా, ఆయనకు జాలి కలిగి " సరే వెళ్ళు, కైలాస దర్శనం చేసి రా! అప్పుడు నీ కుష్ఠురోగం పోతుంది. ఎవడి కవిత్వంలోనైనా సరే, మంచి ఉంటే మెచ్చుకో! అంతేకాని తప్పులు పట్టటం పనిగా పెట్టుకోకు " అని బుద్ధిచెప్పి అంతర్ధానం అయిపోయాడు. కైలాసం చూడటానికి వెడుతూ ఈ భూతానికి పట్టుబడి ఇక్కడకొచ్చాను - అని ముగించాడు. 

    నత్కీరుడలా తన కథను ముగించాక కుమారస్వామి వెళ్ళిపోతూ " నువ్వెలాగైనా గొప్ప కవివి. కనుక నీకేమైనా వరమిద్దామని ఉంది. కోరుకో. ఇచ్చి వెడతాను " అన్నాడు. 

    నత్కీరుడు " స్వామీ! నేనీ కుష్ఠురోగంతో ఉండలేను. కైలాసాన్ని చూస్తే తప్ప ఈరోగం పోదు. కైలాసం ఎక్కడో హివవత్పర్వతాలలో ఉంది. అంతవరకూ నేనీ రోగంతో నడిచి వెళ్ళలేను. నాకు సులభంగా కైలాస దర్శనం చేయించు " అన్నాడు. 

    అప్పుడు కుమారస్వామి ఒక యుక్తి చేశాడు. " కైలాసమంటే శివుడుండే కొండగదా! ఎక్కడ శివుడుంటే అదే కైలాసం. ప్రస్తుతం శివుడు మీ దక్షిణ దేశంలోనే కాళహస్తి అనే చోట వెలిశాడు. అక్కడున్న కొండనే దక్షిణ కైలాస మంటున్నారు. అక్కడ దిగబెడతాను. ఆ కొండచూచి నీరోగం పోగొట్టుకో " అన్నాడు. 

    గుహలో వాళ్ళందరివద్దా నత్కీరుడు శలవు పుచ్చుకొని కుమారస్వామితో బయల్దేరి కాళహస్తి వెళ్ళి అక్కడున్న కైలాస పర్వతాన్ని దర్శించాడు. కుష్ఠురోగం పోయి అతనికి మామూలు శరీరం వచ్చింది. అప్పుడా కవి శివునిమీద నూరు పద్యాలు చెప్పి స్తోత్రం చేసి, ఆ దేవుణ్ణి మెప్పించి మోక్షం సంపాదించుకున్నాడు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...