:: సక్తుప్రస్థుడు ::
పంచపాండవులలో మొదటి వాడైన ధర్మరాజు 'అశ్వమేధయాగం' అనే యజ్ఞం ఒకటి చేశాడు. ఆ యజ్ఞం జరిగినన్నాళ్ళూ ఆయన గొప్ప సంతర్పణలు చేయించాడు. ఎక్కడెక్కడ ఉన్న బ్రాహ్మలూ, ఋషులూ, మునులూ, సాధులూ, సన్యాసులూ, భిక్షువులూ వచ్చి పంచభక్ష్య పరమాన్నాలతో భోంచేసి వెళ్ళేవారు. ధర్మరాజు వాళ్ళందరికీ బంగారపు పాత్రలలో భోజనం పెట్టించి, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పాత్రలనుకూడా బహుమానం కింద పట్టుకు పొమ్మనేవాడు. ఆయన అన్నదానానికీ, దాతృత్వానికీ వచ్చిన వాళ్ళంతా అనేక విధాల మెచ్చుకున్నారు. ఆ స్తోత్రాలు చెవినిబడ్డ ధర్మరాజు సంతోషంతో ఉబ్బిపోయాడు. ఆ తర్వాత అతిథులలో ఒక్కొక్కడికీ రెండేసి, మూడేసి బంగారపు గిన్నెలు ఇచ్చేయటం మొదలెట్టేడు.
దగ్గర ఉండి యజ్ఞం అంతా నడిపిస్తున్న శ్రీకృష్ణుడికి " ఏమిటి చెప్మా, ధర్మరాజు ఇలా వళ్ళు తెలియకుండా ఖర్చుపెడుతున్నాడు? " అనిపించింది. " ఏమిటి బావా! చాలా జోరుగా దానాలిచ్చేస్తున్నావు? " అని అడిగేడు కూడాను.
అప్పుడు ధర్మరాజు దర్జాగా " జోరుకాక మనకేమిటోయ్! వచ్చిన వాళ్ళు మనల్ని గురించి ఎలా చెప్పుకుంటున్నారో వినపట్టంలేదూ? ధర్మరాజువంటి అన్నదాత ఇదివరలో లేడు, ఇకముందు పుట్టబోడు అనుకుంటున్నారు " అన్నాడు.
శ్రీకృష్ణుడు ఏదో చెప్పబోయాడు. కాని, ధర్మరాజు వినిపించుకోలేదు. ఎందుకు వినిపించుకుంటాడు? 'మహాన్నదాతనైపోయాను' అనే అహంభావం అతన్ని కమ్ముకుపోయింది.
శ్రీకృష్ణుడు తన భక్తులన్నా, బంధువులన్నా, మిత్రులన్నా ఎక్కువ ప్రేమ చూపుతాడు. కాని, వాళ్ళలో ఏమాత్రం గర్వం బయల్దేరినా ఆయన సహించడు. ఆ గర్వాన్ని భంగపరిస్తేగాని ఆయనకు నిద్రపట్టదు. మహాన్నదాత ననుకుంటున్న ధర్మరాజుకి గర్వభంగం చెయ్యాలని ఆలోచించి, అతణ్ణి భోజనశాల కవతల అతిథులు చేతులు కడుక్కునే చోటికి తీసుకెళ్ళేడు. కోట్లకొలది అతిథులు భోంచేసి అక్కడ చేతులు కడుక్కుంటూండంవల్ల, ఆ నీరంతా ఒక నదిలా ప్రవహించటం మొదలెట్టింది.
ధర్మరాజు శ్రీకృష్ణుడితో " బావా! చూశావా, ఈ నదిని? " అన్నాడు.
అందుకు కృష్ణుడు " నదికేంగాని ఆ బురదలో అటూ ఇటూ దొర్లుతూ ఓ ముంగిస ఉంది చూశావా? " అన్నాడు.
" ఆ చూశాను. బురదలోంచి ఇవతలికి వచ్చి నిలబడి, తన ఎడంవైపు చూసుకుంటోంది. అదిగో, మళ్ళీ బురదలోకెళ్ళి దొర్లుతోంది చూడు " అన్నాడు ధర్మరాజు.
ఆ ముంగి మళ్ళీ బయటకొచ్చేసింది. అదిచూచి ధర్మరాజు " ఇందాకట్లాగే తన ఎడమవైపు చూసుకుంటోంది. ఎందుకు చెప్మా, బురదలో దొర్లివచ్చి అలా చూసుకుంటోంది " అని కృష్ణుడ్ని అడిగాడు.
కృష్ణుడు జవాబు చెప్పేలోగా ఆ ముంగి ధర్మరాజు ఎదుటికి వచ్చి మనిషికి మల్లే మాట్లాడటం మొదలెట్టింది.
" మహారాజా! విను. కొన్ని సంవత్సరాలకి పూర్వం ఇక్కడకు కొన్ని యోజనాల దూరంలో సక్తుప్రస్థుడనే పేద బ్రాహ్మడొకడుండేవాడు. ఆయన పూరిగుడిసె పక్కన ఓ అతిథి చెయ్యి కడుక్కున్న చోట బురదలో దొర్లితే నా కుడిప్రక్క బంగారమయింది. నా ఎడమ పక్కగూడా బంగారం చేసుకోవాలన్న ఆశతో దొర్లబోతే అక్కడ చాలినంత బురద లేక, ఆ ప్రక్క మామూలుగానే ఉండిపోయింది. " అన్నది ముంగి.
ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. " బురదలో దొర్లితే వళ్ళు బంగారమవుతుందా ఎక్కడన్నా? " అన్నాడు.
" మీకు సందేహంగా ఉంటే చూడండి మహారాజా" అంటూ ముంగిస ఆ నీళ్ళల్లోకి పరుగెత్తి వెళ్ళి తన వంటి బురద కడుగేసికొచ్చి, ధర్మరాజుకు తన కుడివైపు చూపించింది.
" నిజమే! ఈ వైపు అంతా బంగారమే! ఇదెలా సాధ్యమైంది? " అని ఆశ్చర్యంగా అడిగాడు ధర్మరాజు.
" సక్తుప్రస్థుడు మహాన్నదాత. అందువల్లనే ఆయన గుడిసె వద్ద అతిథులు చేతులు కడుక్కున్న నీటికి ఆ మహిమ కలిగింది " అన్నది ముంగి.
" నాకంటే ఎక్కువ అన్నదాతా, ఆ పేద బ్రాహ్మడు? ఇక్కడ చేతులు కడుక్కున్న నీరు ఏరై పారుతోంది. సక్తుప్రస్థుడి పర్ణశాల ప్రక్క బురద నీ కుడిప్రక్కకు మాత్రమే సరిపోయి, ఎడమ పక్కకు లేకపోయిందన్నావు! " అన్నాడు ధర్మరాజు.
" నిజమే కానీ, ఆ కాస్త బురద, అంతటినే నాకు ఒక పక్క బంగారమయింది. నీవు చాలా గొప్పగా అన్నదానం చేస్తున్నావని విని ఇక్కడకు వచ్చి ప్రొద్దుటినుంచీ ఈ బురదలో దొర్లుతూ శ్రమపడుతున్నాను. కాని, ఒక్క పెసరగింజంత మేర అయినా నా ఎడం ప్రక్కని బంగారమవలేదు. సక్తుప్రస్థుడు పూటకు ఠికాణా లేని పేదవాడే గాని ఆయన అన్నదానం ముందు నీ సంతర్పణ ఏ లెక్కకీ రాదని తేలిపోయింది " అన్నది ముంగి.
ఆ ముంగి ఇలా ధర్మరాజుతో చెప్పేసి తన దారిని వెళ్ళిపోయింది. ధర్మరాజు సిగ్గుతో కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడు తానేమీ ఎరగనట్లు దిక్కులు చూడటం మొదలెట్టాడు. ధర్మరాజు ఆయనతో, " బావా! ఈ సక్తుప్రస్థుడు ఎవరు? " అని అడిగాడు.
అప్పుడు కృష్ణుడు సక్తుప్రస్థుని గురించి యిలా చెప్పసాగాడు.
" ఆ ముంగి చెప్పిందిగా అతడొక పేద బ్రాహ్మడని. పేదవాళ్ళల్లోకల్లా పేదవాడతను. అయితేనేం? అతను, అతని కుటుంబం కూడా 'దేహీ' అని ఒకళ్ళని యాచించకుండానే జీవితం గడిపేరు. అతను, అతని భార్య, కొడుకూ, కోడలు ఈ నలుగురూ కూడా పొలాలలో రాలిపడ్డ ధాన్యం యేరి తెచ్చుకుని దంచి బియ్యం చేసి, ఆ బియ్యంతో పొట్టపోసుకునే వారు. ఆ అన్నమే కొంత అతిథులకు పెట్టి మిగిలినది తాము తినేవారు.
ఇలా రోజులు గడిచిపోతూంటే, ఉన్నట్టుండి కరువొచ్చింది. పేదవాళ్ళ సంఖ్య ఎక్కువై, పొలాలలో రాలిన గింజలు ఏరుకు పొయ్యేవాళ్ళు ఎక్కువయ్యారు. అంచేత సక్తుప్రస్థుని కుటుంబానికి చాలా ఇబ్బంది వచ్చింది. వాళ్ళు నలుగురూ వెళ్ళి వరుసగా నాలుగు రోజులు ఏరితెస్తే తప్ప ఒక పూటకు సరిపడే గింజలు దొరికేవికావు. అంచేత నాలుగేసి రోజులకోమాటు భోజనంచేసి, తక్కిన రోజులలో పస్తులుండేవారు.
ఇలా ఓ మాటు నాలుగు రోజులూ ఉపవాసాలుండి, కూడబెట్టుకున్న బియ్యాన్ని వండి, ఆ అన్నం నాలుగు వాటాలు చేసుకుని, విస్తళ్ళలో వడ్డించుకుని తిందామనుకుంటుంటే ఎక్కడినుంచి వచ్చాడో ఓ అతిథి వచ్చాడు. మరెవరైనా ఔతే ఆ సందర్భంలో, " అయ్యా! నాలుగు రోజులనుంచి మాకు తిండి లేదు. ఇప్పుడు వండుకున్నది మాకు పూర్తిగా కడుపు నిండదు. కనుక మరోచోటు చూసుకోండి " అని నిర్మొగమాటంగా చెప్పేద్దురు. కాని, సక్తుప్రస్థుడలా చెయ్యలేదు. విస్తరిముందు కూర్చున్నవాడు దభీమని లేచి, ఆ వచ్చిన వృద్ధుని పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిమీద చల్లుకుని, ఆయనను తన విస్తరిముందు కూచోబెట్టి 'ఆరగించండి బాబూ! " అని అన్నాడు.
ఆ అతిథి, ఈ కాస్తా నేను తినేస్తే నీమాట ఏమిటి? అనకుండా ఒక్క మెతుకైనా మిగలకుండా విస్తట్లో అన్నం అంతా తినేశాడు. పోనీ, అంతా తినేసి లేచాడా? అదీ లేదు. పైగా, 'నాకేం కడుపు నిండలేదు' అన్నాడు.
అతిథి అర్ధాకలితో లేవకూడదు- అని సక్తుప్రస్థుడు బాధపడ్డాడు. " ఎందుకూ, నా వాటా వడ్డిస్తాను " అని ఆయన భార్య తన అన్నాన్ని తెచ్చింది. ఆయన, అయ్యో! నీకు నేను తెచ్చిపెట్టవలసినది బదులు నీ వాటానే పుచ్చేసుకోవడమా? ఏ భర్తా తన భార్య కిలాంటి అన్యాయం చెయ్యడు " అని వాపోయాడు. అందుకామె, అబ్బే, ఇందులో అన్యాయమేముంది? అన్నాతురుడై వచ్చిన అతిథికి ఆకలి తీర్చడంలో నాకూ బాధ్యత ఉంది." అంటూ, తన అన్నాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణునకు వడ్డించేసింది.
ఆ అతిథి ఆ అన్నాన్ని కూడా తినివెయ్యటానికి, వడ్డించినంత సేపైనా పట్టలేదు. తినేసి, 'ఇంకా కావాలి' అన్నాడు.
" మహాత్మా! ఇదిగో సిద్ధంగా ఉంది. ఆరగించండి " అంటూ సక్తుప్రస్థుని కుమారుడు తన వాటా అన్నాన్ని తెచ్చి వడ్డించాడు.
అతిథి అదికూడా తినేసి ' నా ఆకలి తీరలేదు. ఇంకా లేదా? " అన్నాడు.
ఆ మాట విని సక్తుప్రస్థుని కోడలు మహదానందంతో, " మహాత్మా! నా అత్తమామలూ, నా భర్తా ధన్యులైనట్లే, నేను కూడా ధన్యురాలినవటానికి అవకాశం వచ్చింది. ఇదిగో, ఈ అన్నం కూడా భుజించండి " అంటూ తన అన్నాన్ని కూడా తెచ్చి వడ్డించింది. అతిథి ఆ అన్నం కూడా తినేసి, 'నా కడుపు నిండింది' అంటూ లేచి, అవతలికి వెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు. అతని చేతినుంచి నీళ్ళతోబాటు పడ్డ మెతుకులకోసం ఆశపడి వచ్చి ఈ ముంగి తన కుడి ప్రక్క బంగారం చేసుకుంది.
" అంతవరకు మసలి బ్రాహ్మడికిమల్లే ఉన్న ఆ అతిథి ఓ దివ్యపురుషునికిమల్లే మారిపోయాడు. ఆయన తేజస్సు చూసి సక్తుప్రస్థుడూ వాళ్ళు ఆశ్చర్యపోయి, " మహాత్మా! మమ్మల్ని అనుగ్రహించటానికి ఈ అతిథి రూపంలో వేంచేసిన శ్రీమహావిష్ణువే మీరు అని స్తోత్రం చేశారు. అందుకాయన , నేను మిమ్మల్ని పరిక్షిద్దామని వచ్చిన యమధర్మరాజును. మీ ఆతిధ్యానికి మెచ్చుకున్నాను. నాలుగు రోజులనుంచీ తిండిలేక, తిందామని వడ్డించుకున్న సిద్ధానాన్ని మనస్ద్ఫూర్తిగా అతిథికి ఇచ్చేశారు. మీ చిత్తశుద్ధి గొప్పది. ఈ పుణ్యానికి ఫలంగా మీరు బొందితో కైలాసానికి వెళ్ళేటట్లు వరం యిచ్చాను. అనిచెప్పి అంతర్ధానమయాడు. మరి కాసేపటికి కైలాసం నుంచి విమానం వచ్చి ఆ నలుగుర్నీ కైలాసం తీసుకుపోయింది."
ఈ కథ విన్న ధర్మరాజు, పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టి, బంగారు పాత్రలు దక్షిణగా యిచ్చినా, తన అన్నదానం సక్తుప్రస్థుని అన్నదానం ముందు ఎందుకూ పనికిమాలినదైనదని తెలుసుకుని చిన్నబోయి మౌనంగా యజ్ఞశాలకు తిరిగి వచ్చాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి