:: వృకాసురుడు ::
పూర్వం వృకాసురుడని ఒక రాక్షసుడుండేవాడు. ' వృకము ' అంటే తోడేలు. అది సాధు జంతువుల్ని మ్రింగేసే క్రూరమృగం. వృకాసురుడు కూడా తోడేలుకు మల్లే లోకంలో ఉండే సాధు జనుల్ని పీడించి హడలగొడుతూండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాడికో దుర్బుద్ధి పుట్టింది. " చచ్చు మనుషుల్ని, చచ్చు దేవతల్ని బాధపెడితే ఏముంది? నేను ఏడిపించ దలుచుకుంటే మహాదేవుడని పిలిపించుకుని గొప్పగా తిరిగే ఆ శివుణ్ణే ఏడిపించాలి " అనుకున్నాడు.
అదే సమయానికి నారద మహర్షి ఆ దారిని వచ్చాడు. వృకాసురుడు ఆ మహర్షికి నమస్కరించి " స్వామీ! నాకు పరమశివుణ్ణి వశం చేసుకోవాలని ఉంది. మార్గం ఏమిటి? " అని అడిగాడు.
నారదుడు, " భగవంతుణ్ణి వశం చేసుకోవాలని ఉంటే ఎవరికైనా ఒకటే మార్గం. అదేమిటంటే తపస్సు చెయ్యటం. చాలా శుచివై యుండి, దీక్షతో తపస్సు చెయ్యి. శివుడు ప్రత్యక్షమై నీకు వరాలిస్తాడు " అని చెప్పి తన దారిని వెళ్ళిపోయాడు.
వృకాసురుడు, 'సరే' అని చెప్పి, నదిలోకి వెళ్ళి స్నానంచేసి తపస్సు చేశాడు. ఎన్నాళ్ళకీ శివుడు ప్రత్యక్షం కాలేదు. ముక్కు మూసుకుని ఉత్తుత్తి తపస్సు చేస్తే లాభం లేదని తలచి, ఒక క్రొత్త పద్ధతి కనిపెట్టాడు.
ఒక పెద్ద హోమగుండం తయారుచేసి, తన శరీరంలోంచి మాంస ఖండాలు కోసి, ఆ గుండంలో వెయ్యటం మొదలెట్టేడు. అయినా, శివుడు ప్రత్యక్షం కాలేదు. తన శరీరంలో మాంసం అంతా కోసి గుండంలో వేసినా, శివుడు ప్రత్యక్షం కాకపోవటం చూసి, వృకాసురుడికి ఇంకా పట్టుదల ఎక్కువై ఒక సాహసం చెయ్యబోయాడు. ఏమిటంటే, తన తలనే నరుక్కుని హోమం చెయ్యాలని. అందుకు సిద్ధపడ్డాడు కూడా!
ఇదంతా కనిపెడుతున్న శివుడు యిక ఆలశ్యం చెయ్యలేదు. తక్షణం ప్రత్యక్షమై " వృకాసురా! నీ సాహసానికి మెచ్చుకున్నాను. లేవయ్యా యింక. అయ్యో పాపం శరీరంలో ఉన్న మాంసమంతా కోసి హోమం చేసేశావే! నేను అనవసరంగా ఆలశ్యం చేశాను. అయితేనేమిలే, వచ్చానుగా ఇప్పుడు. ఏం వరం కావాలో కోరుకో " అన్నాడు.
ఏం వరం కావాలో వృకాసురుడు మొదటే ఆలోచించుకున్నాడు. " స్వామీ! మీరు నాకు దర్శనం యివ్వటమే చాలు. నాకు వరాలెందుకు? అయినా, మీరు కోరుకొమ్మన్నారు కనుక, కోరుకుంటున్నాను. చూడండీ, నా చెయ్యి తీసుకెళ్ళి ఎవడి నెత్తిమీద పెడతానో వాడి తల వెయ్యి వ్రక్కలై వాడు చచ్చిపోయేటట్లుగా నాకు వరం అనుగ్రహించండి " అన్నాడు.
వాడి కోర్కె వినేటప్పటికి శివునికి ఆశ్చర్యం వేసింది. " ఇదేమిటి వెర్రివాడు, ఇంత శ్రమపడి తపస్సుచేసి చివరకు నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇలాంటి వరమడిగాడేమిటి? " అనుకున్నాడు శివుడు. ఉండబట్టలేక, " ఇదేమిటోయ్! ఇలా కోరేవు? " అని కూడా అడిగి చూశాడు.
అందుకు వృకాసురుడు, " వరం అడగమన్నావు కనుక అడిగేను. ఇవ్వటం ఇష్టం లేకపోతే, ఇవ్వలేనని చెప్పి పోరాదా? " అన్నాడు.
" నేను వరం ఇవ్వలేక పోవడమేమిటి? ఇచ్చాను. పుచ్చుకో. నీ ఖర్మం ఎలా ఉంటే అలా అవుతుంది. " అని చెప్పి, శివుడు వాడు కోరిన వరం ఇచ్చేసి, వెళ్ళిపోబోయాడు.
తక్షణమే వృకాసురుడు వెకిలి నవ్వు నవ్వుతూ " ఏమయ్యోయ్! మహాదేవా! ఆగు. ఈ వరం నీ ఖర్మం కాలే యిచ్చావు. నిన్ను ఏడిపించటానికే ఈ వరం కోరుకున్నాను. ఆగు. నా చెయ్యి మొదట నీ నెత్తిమీద పెట్టి, ఈ వర ప్రభావం ఎలాంటిదో పరీక్షచేస్తాను " అంటూ శివుడి మీదికి దుమికేడు.
ఇది చూచి శివుడు హడిలి పోయాడు. ఆయన చటుక్కున తప్పించుకున్నాడు కాని, లేకపోతే వృకాసురుడి చెయ్యి ఆయన తలమీద పడి, నాశనమై పోవలసినవాడే!
" ఎంత కృతఘ్నుడు " అనుకుంటూ శివుడు పరుగెత్తడం మొదలెట్టేడు. వృకాసురుడూ శివుడి వెంట పడ్డాడు. మాంసపు కండలన్నీ కోసి యిచ్చేయటం వల్లా, ఉపవాసాలు చేసి శుష్కించి ఉండటం వల్లా కొంత నీరసంగా ఉన్నాడు కాని, లేకపోతే వృకాసురుడు శివుణ్ణి అందుకోగలిగేవాడే. "
ముందు శివుడూ, వెనుక వృకాసురుడూ పరుగెత్తి పోతూండడం, ఆకాశం మీది నుంచి విష్ణులోకానికి వెడుతున్న నారద మహర్షి చూశాడు.
ఆయన తన దివ్య దృష్టివల్ల జరిగిన సంగతంతా తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. " వీడికి తపస్సు చెయ్యవలసిందని ఆలోచన చెప్పింది నేనే కదా! కాని ఈ దుర్మార్గుడు తపస్సు అందుకోసం చేసేడన్నమాట! మంచివాళ్ళు పరోపకారం కోసం తమ శక్తులు వినియోగిస్తే, దుర్మార్గులు తమ శక్తుల్ని ఇలా దుర్వినియోగం చేస్తారు " అనుకుంటూ నారదుడు ఆపదలో ఉన్న ఆ పరమశివుణ్ణి ఏదోవిధంగా రక్షించాలనుకున్నాడు.
పరమశివుణ్ణి రక్షించాలంటే, మహావిష్ణువే ఏదో ఉపాయం చూపాలనుకుని నారదుడు తక్షణం వైకుంఠానికెళ్ళి విష్ణుమూర్తితో సంగతంతా చెప్పేశాడు.
విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న సమయం అది. అయితేనేం, నారదుడా సంగతి చెప్పటంతో చటుక్కుని లేచాడు. ఏమంటే, తన తోటివాడు శివుడు. త్రిమూర్తులలోనూ ఒకడు. బ్రహ్మదేవుని చేత సృష్టిచేయబడ్డ ఈ లోకాలన్నీ విష్ణుమూర్తి కాపాడతాడు. ఈ లోకాల పని అయిపోయాక, శివుడు వాటిని " ఇంక పనికి రావు " అని నాశనం చేస్తాడు. ప్రళయకాలంలో లోకాలని ఇలా నాశనం చెయ్యవలసిన శివుడే ఇప్పుడు తలవని తలంపుగా ఒక కృతఘ్నుడి చేతిలో నాశనమైపోతే ఎలాగ? విష్ణుమూర్తి ఒక్క క్షణం కూడా ఆలశ్యం చెయ్యకుండా బయల్దేరాడు.
ఒక పొట్టి బడుగు వేషం వేసుకుని, వృకాసురుడు శివుణ్ణి వెదుక్కుంటూ వెడుతూన్న చోటికి వచ్చాడు.
ఆ కపట బ్రహ్మచారిని వృకాసురుడు చూచి, ఆయాసంచేత రోజుకుంటూ ఆగి, " ఏమబ్బాయ్! నీకు శివుడెక్కడైనా కనబడ్డాడా? పిరికిపంద! ప్రాణాలు అరచేతిలో పట్టుకు పారిపోతున్నాడు! " అన్నాడు.
అందుకా బ్రహ్మచారి, " శివుడా! కనపడ్డాడు. ఆ కొండమాటున ఎదురయ్యాడు. ఎందుకయ్యా! ఎవరో తరుముకొచ్చినట్లు పరుగెత్తుతున్నావ్? " అని అడిగాను కూడాను. అందుకు ఆయన " నా భక్తుడు వృకుడు నన్ను ముట్టుకుంటానని తరుముకొస్తున్నాడు. కాస్త ముట్టుకుంటానంటే నాకేం పోయింది గనక? ముట్టుకోనిచ్చేవాణ్ణి. కాని వాడి ఒళ్ళంతా మాంసపు కండలు కోసేసిన పుళ్ళతోటి కంపుగొడుతూ అసహ్యంగా ఉంది. ఆ పళాన్ని ముట్టుకుంటానని పట్టుపట్టకపోతే, దగ్గరగా నది ఉందికదా! ఆ నదిలోకెళ్ళి శుభ్రంగా ఒళ్ళంతా ఒకమాటు కడిగేసుకొని స్నానం చేసి శుచిగా రాకూడదూ? అలా వచ్చి ముట్టుకుంటానంటే నే మాత్రం వద్దంటానా? అన్నాడు. ఔనుగాని, నీకు ఈ మాత్రం తోచింది కాదేమిటోయ్! ఎంత లేదన్నా, దేవుడాయెనుగదా! శివుడు? అతణ్ణి స్నానం చెయ్యకుండా ముట్టుకుంటారటోయ్? " అన్నాడు బ్రహ్మచారి.
వృకాసురుడికి ఆ మాట వినేటప్పటికి, తాను నీళ్ళు పోసుకోకుండా శివుణ్ణి ముట్టుకుంటాననటం పొరబాటే అనిపించింది. " ఇదేమిటి? శాస్త్రాలూ, వేదాలూ చదివిన నాకు ఈ మాత్రం తోచింది కాదేమిటి? ఏటికి వెళ్ళి స్నానం చేసి, సంధ్య వార్చి, సూర్యుని కర్ఘ్యమిచ్చి, శుచినై వస్తాను. అప్పుడు శివుడు తనంత తానే వచ్చి, ముట్టుకోవోయ్! అంటాడు. గోళ్ళతో తీరిపోయే దానికి గొడ్డళ్ళు తేవటం ఎందుకు? " అని ఆలోచించి, నదికి వెళ్ళి, కంఠం లోతువరకూ దిగి, మునగటానికి ముందు జుట్టుముడి విప్పుకుందామని, చెయ్యి తలపైకి పోనిచ్చాడు.
ఇంకేముంది? శివుడా దుర్మార్గుడి కిచ్చిన వరం ఇట్టే పని చేసింది. తక్షణం వృకాసురుడి తల వెయ్యి వ్రక్కలై వాడు నాశనమైపోయాడు.
తాను చేసిన ఉపాయం ఫలించినందుకు విష్ణుమూర్తి సంతోషించి, ఈ సంగతేమీ తెలియక ఇంకా పరుగెడుతూనే ఉన్న శివుణ్ణి కలుసుకుని, " ఆగవయ్యా! ఇంక పరవాలేదు. " అని జరిగినదంతా చెప్పేడు.
శివుడంతా విని " రక్షించావు బాబూ! నన్నేకాదు. లోకాలనన్నింటినీ రక్షించావు. లేకపోతే, ఈ దుర్మార్గుడు కనపడ్డ వాడినల్లా నాశనం చేసేవాడే " అన్నాడు.
అందుకు విష్ణువు " నిజమే. కనుకనే నువ్వు దుర్మార్గులకు అలాంటి వరాలు వీలైనంత వరకూ ఇవ్వకుండా ఉండాలి " అని చెప్పి, శివుణ్ణి కైలాసానికి పంపేసి, తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి