:: ఉస్తికాయ ::
రామ రావణయుద్ధం అయిందీ అన్నారు. అంటే, లోకకంటకుడైన పదితలల రావణాసురుడూ, అతని పరివారమూ నాశనమయ్యారన్నమాట. అవునా? - అవతార పురుషుడైన శ్రీరాముడూ, ఆయన పరివారమూ జేజేల మధ్యన సంతోషాంతరంగులై ఉన్నారు. అయితే, శ్రీరాముడి పరివారమెవరూ?- కపివీరులు. ఈ మాట మనం మరవనే కూడదు.
" వచ్చిన పని తీరిన తర్వాత ఇంకా ఎందుకు లంకలో? అయోధ్యకు వెళ్ళిపోదామా? " అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. వెంటనే వెళ్ళి విభీషణుడు పుష్పక విమానం తీసుకువచ్చాడు. అన్నట్టు, పుష్పక విమానమంటే తెలుసుగా? అది ఒక చిత్రమైన విమానం. దానిమీద ఎందరు ఎక్కి కూర్చున్నా, ఇంకా ఒకరికి సరిపడే చోటు ఉంటూనే ఉంటుందట.
రాముడూ, సీతా, లక్ష్మణుడూ, ఇంకా ముఖ్యులు విమానం ఎక్కారు. వారితో పాటు హనుమంతుడూ ఎక్కాడు. కపిసేనకు నాయకులైన అంగద సుగ్రీవాదులు అలా రంగంమీద నుంచునే ఉన్నారు. వారి శిక్షణ క్రింద కపివీరులంతా తోకలు నడుముకి చుట్టేసుకుని, చేతులు నులుముకుంటూ బారులు తీర్చి నిలబడ్డారు.
" పోయివస్తా "మన్నట్టుగా శ్రీరాముడు ఒక శాంతయుతమైన చల్లను చూపు విసిరాడు. చెప్పలేక చెప్పలేక, లాంఛన ప్రాయంగా " దయ ఉంచండి " అన్నారు నాయకులు. ఈ సమయంలో రాముడు కపివీరులందరి వేపూ కలయ జూచాడు. రామప్రభువుతో ఏదో విన్నవించుకోవాలనే ఆత్రం వారి ముఖాలలో గోచరించింది. కపివీరులు గుసగుసలాడ జొచ్చారు. " హుష్! " అని వారిని అదమాయించారు నాయకులు.
పెల్లుబికిన ఉత్సాహంతో కపివీరులంతా ఒక్కసారిగా కిచకిచ మన్నారు. " మా ఎదుటనే అంత ఆగడమా? " అన్నట్టు నాయకులు వారివేపు గద్దింపుతో చూచారు.
ఈపాటి తెలుసుకోలేడా ఆ సుగుణాభిరాముడు! " అంగదా!, సుగ్రీవా! కపివీరులను మీరు భయపెట్టకండి. వారి మనసులో కోరికలు నిర్భయంగా చెప్పనీయండి. వారు సామాన్యులు కారు. మనకు యుద్ధంలో జయలక్ష్మిని చేకూర్చిన శోభన దేవతలు. ఇంతకూ అదికారం చలాయించవలసిన ఘట్టం దాటిపోయింది. అనురాగం చూపవలసిన సమయం యిది " అన్నాడు శ్రీరాముడు. ఈ అభయానికి సంతోషం పట్టలేక, కపివీరులు తోకలు సద్దుకుని మరొక్కసారి కిచకిచ లాడారు.
అప్పుడు వాలయ్య అనే కపివీరుడు ఝడుపు వదిలి ముందుకు వచ్చి " స్వామీ! చనవిచ్చారు కనుక కడుపులో ఉద్దేశం మనవి చేసుకుంటున్నాము. రామసేవ కోసం పుట్టిన వీరులం మేము. వచ్చిన పని అయింది. ఇప్పుడు మమ్మల్ని ఇలా వదిలేస్తే, మమ్మల్ని విమానం ఎక్కించేది ఎవరు? ఈ మాటలో పొరపాటుంటే మన్నించండి " అన్నాడు.
" అదికాదండీ, ఎంతమందినైనా భరించి తీసుకుపోవటానికి మహిమగల పుష్పక విమానం ఉండగా, మనందరినీ ఎక్కించుకోవటానికి సందేహమెందుకో? ఎవళ్ళది ఏమి పోవాలి అంట " అని ప్రశ్నించాడు ఇంకొక వీరుడు.
ఇలా వాళ్ళు వాదించుకునే సరికి లక్ష్మణుడికి చీకాకెత్తింది. " చూచావా అన్నయ్యా! ఇప్పుడే వీళ్ళల్లో వీళ్ళకు పడటంలేదు. ఈ కోతిమూకను వెంటబెట్టుకు వెళితే నలుగురూ నవ్విపోతారు కూడాను " అన్నాడు.
తమ్ముణ్ణి మందలించాడు శ్రీరాముడు. " వాలయ్యా! నీవేమీ ఆత్రపడకు. మనలో ఒక్కొళ్ళమూ ఇక్కడ దిగపడి పోనక్కరలేదు. అందరమూ కలిసి అయోధ్యకు వెళ్ళి పోదాము. దివ్యమైన పుష్పక విమానం ఉండగా మనకేం లోటోయ్! ఈ సంగతి ముందే చెప్పవలసింది మీతో. మరిచా, పొరపాటు..." అంటూ తన మందమతికి చిన్నపుచ్చుకున్నాడు.
" అవునవును. ఎంత పొరపాటు జరిగింది? మన కపివీరుల కోరికలు ఇంకా ఏమున్నాయో ఇప్పుడైనా కనుక్కోండి " అని సలహా పూర్వకంగా హెచ్చరించింది జనని జానకి.
అంతట తిండిపోతు తిమ్మయ్య జంకుతూ వచ్చి, " రామప్రభూ! ఎవరేమి కోరుకున్నా లేదనకుండా అనుగ్రహిస్తారనే బిరుదు ఉందటకదా నీకు? కాయా కసురూ, దుంపాధూళీ నమిలి నమిలి విసుగెత్తిపోయింది. మీ వంటి రాజాధిరాజులు రుచికరమైన లాడూలూ అవ్వీ ఆరగిస్తారని చెప్పుకుంటారే, మేం మాత్రం వాటిని కాస్త రుచి చూడకూడదా? " అని తనకు గల అపేక్షను వెల్లడించాడు.
అమాయకమైన ఈ కోరిక విని సీతారాములు నవ్వుకున్నారు. " అసలే కోతిమూక, అందులో ఇది యుద్ధ జయం కలిగిన సంతోష సమయం. పైగా దయామయుడైన రామచంద్రుడు " కావలసినదల్లా అడగండి " అని అభయమిచ్చి ఉన్నాడు. వళ్ళూ పై తెలియకుండా వీళ్ళు ఇంకా పిచ్చి కోరికలు ఏమేమి కోరుకుంటారో? అని తలచి, హనుమంతుడు హుంకరించాడు వాళ్ళ వైపు తిరిగి. కపివీరులు తలలు వంచారు.
తిమ్మయ్య కోరిక విన్న వెంటనే శ్రీరాముడు " అలాగేనోయ్ నా తండ్రీ! లాడూలు తప్పక తిందువుకాని. అయోధ్యకు చేరుకోగానే అన్నీ చేసుకోవచ్చు జాగెందుకు రండి " అన్నాడు.
గిరగిరమని తోకలు ఊపుకుంటూ, బిలబిలమని కపి వీరులంతా విమానం ఎక్కేశారు. జాంమని ఝంకారం పెడుతూ పుష్పకం గగన మార్గాన ఎగిరిపోయి, కొంచెం సేపటికల్లా అయోధ్య నగరంలో వాలింది. అయోధ్యలో దిగీదిగటంతోనే ముందు సీతారాములు కపివీరులకు విందు ఏర్పాటు చేశారు. హనుమంతుడు పెద్దరికం వహించాడు.
ఒక్క గంటలో వస్తు సంబారాలన్నీ సమకూడి పోయినై. మరొక్క గంటసేపటికల్లా పంచభక్ష్య పరమాన్నాలతో భోజనాదికాలు సిద్ధమైనాయి. హనుమంతుడు వచ్చి " బారులు తీర్చి అందరూ బుద్ధిగా కూర్చోండి. వడ్డన జరుగుతుంది " అని చెప్పాడు.
ఎలా అయితేనేం, ఆంజనేయుని మాటవిని, అందరూ కుదురుగా కూర్చున్నారు. క్షణమైనా అయిందో లేదో, ఒక ఉస్తికాయ వచ్చి బంతిమధ్యన కూర్చున్న ఒక కపివీరుని ఒడిలో పడింది. వీరుడు ఆ కాయకేసి తదేక దీక్షతో చూచి చూచి, లోపల ఏమిటి ఉంటుందోననే ఆత్రంతో రెండు వ్రేళ్ళతోనూ నొక్కాడు. పుసుక్కుమని ఒక గింజ కాయలోనుంచి బయటకు జారివచ్చి పైకి ఎగిరింది.
" ఓసీ, నలుసంతలేవే, నాకంటే ఎత్తుగా ఎగురుదామనా నీ ఉద్దేశం " అంటూ వీరుడు ఆ గింజతో పాటే ఒక్క ఎగురు ఎగిరాడు. తమ్ముడు ఎందుకు ఎగురుతున్నాడో, ఏమి ప్రమాదం వచ్చిందో, మనం వెళ్ళి సాయపడకపోతే ఎలాగా? " అని అనుకొని, ప్రక్కనున్న వీరుడూ ఎగిరాడు. ఈ ఇద్దరూ ఎగిరేసరికల్లా, కారణం తెలుసుకోకుండానే ఇంకొకరు, మరొకరూ వచ్చి వాళ్ళతోపాటు గెంతులేశారు. అంతలోనే పంక్తులన్నీ చెదిరిపోయి, అందరూ ఒక్కచోట మూగేసి, ఒక్కలా ఎగర జొచ్చారు.
ఇది చూసి హనుమంతుడు " ఏమర్రా! మీగోలకూల! ఇంతట్లోనే మీ బుద్ధి గడ్డితిన్నదే! మన చేష్టలు చూచే అందరూ మనల్ని కోతుల భాగోతం అంటారు. భోజనాల వేళ ఎంత గొడవ చేశారే! మీ వాలకం చూస్తే, ఆ రామయతండ్రికి మాత్రం ఎంతకని ఓరిమి నిలుస్తుంది? " అంటూ మందలించ బోయాడు.
ఇంతలో విస్తళ్ళు వేయడం, ఆ వెంటనే లాడూల బుట్టలు చేతపట్టుకుని సీతారాములు స్వయంగా వడ్డించ రావటం జరిగింది. " హనుమా! మన వీరులమీద విసుక్కుంటున్నావెందుకు? చూడు, పాపం, ఎంత బుద్ధిగా కూర్చుంటున్నారో! ఏది, ఎక్కువగా అల్లరి చేశాడంటున్నారే, ఆ వీరుడేడి? అతనికి రెండు లాడూలు. అంతే శాస్తి. " అనేసరికల్లా ఎక్కడివాళ్ళక్కడ సర్దుకున్నారు. వీళ్ళకి బుద్ధి వచ్చింది. ఫరవాలేదని హనుమంతుడు ధైర్యం చెందాడు.
జానకీ రాములు వడ్డన చేస్తూండగా, ఉన్నట్టే ఉండి ఒక కపివీరుడు శ్రీరాముని భుజం ఎక్కి కూర్చున్నాడు. మరొకడు బుట్టలో లాడూలు బలవంతంగా లాక్కొన్నాడు. ఇంకొక కపివీరుడు ఊరుకోక జానకమ్మ మెడలో హారం తీసి పరీక్ష చేయబోయాడు. ఏదో మహా తెలిసినట్టుగా.
ఇన్ని చేసినా ఆ దంపతులు ఆనందంతోనే ఉన్నారు. నిజానికి, కపివీరుల చేష్టలు చూచినకొద్దీ వారికి సంతోషం ఎక్కువయింది. కాని, వారు పడే యాతన చూడలేక హనుమంతుడూ, లక్ష్మణుడూ కపివీరులను కోపదృష్టితో చూడసాగారు. " హనుమా! లక్ష్మణా! మన బిడ్డల అల్లరి మనకు ముద్దుకాదటోయ్! అయినా, వారు చేసేది అల్లరికాదు. అది నిష్కపటమైన ఆనందం " అన్నాడు రాముడు మందహాసంతో.
విందు పూర్తయింది. ఒక్కొక్క కపివీరుణ్ణి ఒడిలోనికి తీసుకుని శ్రీరామచంద్రమూర్తి నిమిరేసరికి, వాళ్ళకు యుద్ధపు బడలిక ఎక్కడిదక్కడనే ఎగిరిపోయింది.
తరువాత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు జరిగినై. ఆ సమయమందు శ్రీరాముడు ప్రత్యేకించి కపిసేననూ, వాళ్ళ ప్రజ్ఞనూ ప్రస్తుతించాడు. పైగా నిండు దర్బారులో " ఓ మహావీరులారా! భూలోకంలో రామకథతోపాటు రామసేవకు అంకితమైన కపివీరుల కథనాలు కూడా నడుస్తూనే ఉంటాయి. కపివీరుడు కంటబడితే చాలు మానవులకు రామాయణ కథ జ్ఞాపకం వస్తుంది. అటువంటి అవినాభావ సంబంధమున్నది రెండింటికీ. మీ సంతోషమే నా సంతోషమే అని తెలియటం చేత, మానవులు మిమ్మల్ని గౌరవిస్తే నన్ను పూజించినట్టుగానే భావిస్తారు. ఇంతటినుండి మీరు దేశమందుండే పుణ్యక్షేత్రాలు చేరుకుని ఉనికి ఏర్పరుచుకోండి. అక్కడకు వచ్చే భక్తులు మిమ్మల్ని చూడగానే రామకథ గురుతువచ్చి ధన్యులవుతారు. మీరు చేసిన సాయానికి ఇదే నేనీయగల కానుక. " అంటూ ఆప్యాతతో వారిని దీవించాడు.
శ్రీరామమూర్తి ఇలా చెబుతూ ఉంటే జయదుందుభులు మ్రోగినై. కపివీరులమీద పుష్పవర్షం కురిసింది. కపివీరులు వాలములు ఊపుకుంటూ, సీతారాములకు, హనుమంతునికి నమస్కరించి, సెలవు తీసుకొని , కితకితలాడుతూ పోయి దివ్యక్షేత్రాలు చేరుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి