:: శ్రీరామదర్శనం ::
అక్బరు చక్రవర్తి కాలమందు హస్తినాపురంలో తులసీదాసు అనే రామ భక్తుడు ఉండేవాడు. ఆయన రోజూ సమీప గ్రామానికి వెళ్ళి అక్కడి వాళ్ళకి వాల్మీకీ రామాయణం చదివి వినిపిస్తూండేవాడు. ఆయన గొప్ప పండితుడూ, కవి, మహాభక్తుడున్నూ. అందువల్ల పురాణం చెబుతుంటే, గ్రామస్థులందరికీ రామాయణం కళ్ళకు కట్టినట్టుండేది.
ఆ వినటానికి వచ్చే వాళ్ళలో ముసిలి బ్రహ్మచారి ఒకాయన అందరికంటే ముందే హాజరయ్యేవాడు. ఆయన చాలీచాలని చిరుగుల అంగవస్త్రంలో వచ్చి, ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఉండేవాడు.
తులసీదాసు అందరికీ వినపడేటట్లు కంఠం ఎత్తి శ్లోకాలు చదివి, అర్థం చెబుతూ ఉంటే మాటిమాటికీ గొంతుక అర్చుకు పోతూ ఉండేది. అటువంటప్పుడు ఆ ముసలి బ్రహ్మచారి మంచినీరు తెచ్చి ఆయన లోటాలో పోసి, " దాహం పుచ్చుకోండి బాబూ! " అని అంటూ ఉండేవాడు.
రోజూ రాత్రి పురాణం అయిపోవటంతోనే తులసీదాసు తన రామాయణ పుస్తకమూ, చెంబు పుచ్చుకొని హస్తినాపురం వచ్చేస్తూ, చెంబులో మిగిలిన నీటిని దారిలో ఒక రావిచెట్టు మొదట్లో పోసి పోతూ ఉండటం మామూలు. ఇలా చాలా కాలం గడిచింది.
ఒకనాటి రాత్రి ఆయన మామూలు ప్రకారం ఆ చెట్టు మొదట నీళ్ళు పోసి తన దారిని పోతూంటే " అబ్బాయ్! ఆగు " అని ఎవరో అన్నట్టు వినిపించింది.
" మనుష్య సంచారం లేని ఈ ప్రదేశంలో ఎవరు చెప్మా పిలుస్త! " అని ఆశ్చర్యపోతూ తులసీదాసు నిలబడి పోయే సరికి బ్రహ్మరాక్షసుడొకడు చెట్టు దిగివచ్చి ఆయనకు ప్రత్యక్షమయాడు. వానిని చూచి తులసీదాసు భయపడేసరికి, " నన్ను చూసి నీవేమి భయపడకు. నేను నీకుమల్లె ఒక పండితుణ్ణే. అయితే దుర్మార్గంగా ప్రవర్తించి, సాధుజనుల్ని హింసించటంవల్ల ఈ ఘోర రూపం వచ్చింది. సరే, నా కథకేమిలే, నీకేమి వరం కావాలో కోరుకో " అన్నాడు.
తులసీదాసు ఆశ్చర్యంతో, " అయ్యో, ఎంతమాట! నాకే వరమూ వద్దు. కాని, నామీద మీకీ దయ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్పండి, సంతోషిస్తాను " అన్నాడు.
" దయ ఊరికే పుట్టుకురాలేదోయ్. దాహంతో పీక ఎండిపోతూ ఉన్న నాకు రోజూ నువ్వు ఇన్ని నీళ్ళు పోసి పోతున్నావు. ఈ ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలనిపించి, వరం ఇస్తున్నాను " అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు.
అందుకు తులసీదాసు, " మహాత్మా! నాకు ఏ కోరికా లేదు. నేను రామ భక్తుణ్ణి. చిరకాలమై రామాయణం పురాణం చెపుతూ, రామనామమే జపిస్తూ జీవితం గడుపుకొస్తున్నాను. కాని యింకా ఆ శ్రీరాముని దర్శనం కాలేదు. ఆయన దర్శనం కలిగేటట్లు అనుగ్రహిస్తే చాలు, అంతకంటే నాకు కావల్సింది ఏమీ లేదు " అంటూ తన మనసులోని కోరిక వెల్లడించాడు.
బ్రహ్మరాక్షసుడికి కాస్సేపటివరకూ నోట మాట రాలేదు. " అబ్బాయ్! నీవంటి మహా భక్తుడు కోరదగిన వరమే యిది. కాని, ఆ వరం సిద్ధింపచేసే శక్తి నాకు లేదు. అంతమాత్రాన నిరుత్సాహ పడకు. నేను నీకు రామదర్శనం చేయించ లేకపోయినా, చేయించగల మహానుభావుణ్ణి చూపెడతాను. ఆయన్ను నువ్వు రోజూ చూస్తూనే ఉన్నావు సుమా! " అన్నాడు.
" ఎవరు బాబూ! ఆయన? " అని ఆత్రంతో అడిగాడు తులసీదాసు.
" నువ్వు పురాణం చెబుతూ ఉంటే రోజూ భక్తి శ్రద్ధలతో వచ్చి వింటూ మధ్య మధ్య నీకు మంచినీరు తెచ్చిపోసే ఆ వృద్ధ బ్రహ్మచారి ఎవరని నీ ఉద్దేశం? రామ భక్తాగ్రేసరుడైన హనుమంతుడే ఆయన " అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు.
ఈ మాట వినటంతోనే తులసీదాసు బ్రహ్మానందభరితుడై, ఆ బ్రహ్మరాక్షసుడి పాదాలు ముట్టుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడికి ఆ ఘోరరూపం పోయి, దివ్యమైన తేజస్సుతో ప్రకాశించే ఒక గంధర్వుడై నిలబడ్డాడు.
" మహాత్మా! నీ స్పర్శవల్ల నా పూర్వరూపం వచ్చింది నాకు. నేనెంత అదృష్టవంతుణ్ణి. నీ మేలు ఎన్నటికీ మరువను. కొద్దికాలంలోనే నీకు శ్రీరామ కటాక్షం కలుగుతుంది. నాకు సెలవియ్యి " అని వేనోళ్ళ స్తోత్రం చేసి అదృశ్యమయ్యాడు.
మరునాడు తులసీదాసు పురాణం చెబుతున్నా ధ్యానమంతా మామూలుగా వచ్చి కూచుని వింటూన్న ఆ వృద్ధ బ్రహ్మచారి మీదనే ఉంది. త్వరగా ముగించేశాడు ఆ రాత్రి. అందరూ వెళ్ళిపోయారు. ముసలి బ్రహ్మచారి కూడా పోబోతూ, " ఏం దాసూ! రాచకార్యం ఏదైనా వచ్చిందా, ముందుగా ముగించేశావు ఇవాళ? " అని అడిగాడు.
తులసీదాసు ఆయనకు పాదాక్రాంతుడై " అన్నా! రాచకార్యమే ఉంది. నీకూ నాకూ ప్రభువైన ఆ శ్రీరామచంద్రుని దర్శనం నీవు నాకు చేయించాలి. నీ నిత్య దర్శనంతో ఇన్నాళ్ళూ నన్ను కటాక్షించావు. నువ్వు ఎంత చెబితే అంత రాముడికి. ఆయన్ను నాకు చూపించు. " అని పరి పరి విధాల వేడుకున్నాడు.
ఆంజనేయుడు చిరునవ్వుతో, " ఏ వేషం వేసినా నా సంగతి తెలిసిపోయిందే వీనికి అనుకుని సరే, వెళ్ళు స్వామి దర్శనం అవుతుందిలే " అని చెప్పి అంతర్ధానమయాడు.
ఆ రాత్రి తులసీదాసు ఇంటికి వెళ్ళి శ్రీరామచంద్రుణ్ణి ధ్యానిస్తూ కూర్చునేప్పటికి చిన్న కునుకు వచ్చింది. ఆ కునుకులో ఒక కల వచ్చి, ఆయనకు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ భరతశత్రుఘ్నులతో సహా ప్రత్యక్షమయాడు. తులసీదాసు ఆనందానికి మేరలేకపోయింది.
అలా ఎంతో సేపుగా నిలబడిపోయి ఉన్న శ్రీరాముడు తులసీదాసుని " ఏమోయ్! ఇంక నేను వెళ్ళవచ్చునా ? " అని ప్రశ్నించినాడు.
ఈ ప్రశ్నకు సీతాదేవి, " ఏమండీ! ఇతనితో మనం చెప్పదలుచుకున్న మాట మరిచే పోయినట్టున్నారే? " అని జ్ఞాపకం చేసింది.
" ఏమిటి శలవు తల్లీ! " అని ఆతృతతో అడిగాడు తులసీదాసు.
అందుకు సీతాదేవి " తులసీదాసూ! వాల్మీకి రాసిన రామాయణం సంస్కృతంలో ఉంది. ఆ భాష ఇప్పుడు అందరికీ అర్ధం కావటం లేదు. కనుక నువ్వు రామాయణాన్ని హిందీలో రాస్తే బాగుంటుందని మా ఉద్దేశం " అని అనటం, ఆ దంపతులు అదృశ్యం కావటం, తులసీదాసుకు మెలకువ రావటం ఒక్కమాటుగా జరిగినై.
సీతారాముల ఆజ్ఞ తలదాల్చి, తులసీదాసు వెంటనే తాటాకులూ, గంటమూ తెచ్చి హిందీభాషలో రామాయణం రాయటం ఆరంభించాడు.
రామాయణం వంటి మహాగ్రంథం దీక్షగా రాయటానికి ప్రశాంతత అవసరమని తలచి, ఆ ఊరు వదిలి తులసీదాసు సరాసరి కాశీలో మకాం పెట్టాడు. కాశీలో గొప్ప గొప్ప పండితులెందరో ఉన్నారు. వాళ్ళతో స్నేహం చేసి, తను రాసినంత వరకు ఏరోజు కారోజు చూపెట్టేవాడు. కొందరు, " ఇలా అందరికీ అర్థమయే భాషలో రాసి లోకోపకారం చేస్తున్నావు తులసీదాసూ, ధన్యుడవోయ్! " అని మెచ్చుకున్నారు.
మరికొందరు " రామాయణం సంస్కృతంలోనే ఉండాలి కాని మరొక భాషలో రాస్తే అపవిత్రం అయిపోతుంది " అంటూ దూషించారు. ఏమైతేనేం, తులసీదాసు పేరు ప్రఖ్యాతులు దశదిశలా ఇట్టే వ్యాపించినై.
ఒకనాడు తులసీదాసు ఆశ్రమంలోకి ఒక స్త్రీ వచ్చి ఆయనకు నమస్కరించింది. ఆయన తన వ్రాత ధోరణిలో ఉండి, " దీర్ఘ సుమంగళీభవ! పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు! " అని ఆమెను దీవించి, మళ్ళీ తన మానాన తను రాసుకుంటున్నాడు.
ఆమె సంతోషించటానికి బదులు వెక్కి వెక్కి యేడవటం మొదలుపెట్టింది. ఆయన వంచిన తలయెత్తి " ఏమి తల్లీ, ఎందుకు దు:ఖిస్తున్నావు? " అని అడిగేడు.
అందుకు ఆమె, " స్వామీ! నాభర్త ఈ ఉదయమే మరణించాడు. శవాన్ని గంగ ఒడ్డుకి తీసుకెళ్ళారు. నేను ఆయనతో సహగమనం చెయ్యటానికి వెడుతూ మహాత్ములైన మీకు నమస్కరించి పోదామని ఇలా వచ్చాను " అంది.
ఆయన నిర్ఘాంత పోయాడు. " తల్లీ! శ్రీరామచంద్రుడే నా నోటివెంట అలా పలికించాడు. కనుక నీవు అదృష్టవంతురాలవన్నమాట. రాముడెన్నడూ ఆడి తప్పలేదు. నా నోట ఆయన పలికించిన ఈ మాటలుకూడా అబద్ధం కావటానికి వీలులేదు. నీవు గంగ ఒడ్డుకు పోయి, శవాన్ని యిక్కడకు రప్పించు చూదాం " అన్నాడు.
ఆమె గబగబా పరుగెత్తికెళ్ళి, భర్త శవాన్ని వెంటబెట్టుకు వచ్చింది.
తులసీదాసు శ్రీరాముణ్ణి ధ్యానించి, " స్వామీ! బండరాయిని లావణ్యవతిగా మార్చిన మహానుభావుడవు. నీకు అసాధ్య మేమున్నది? ఈయనను పునరుజ్జీవితుని చేసి, నామాట నిలబెట్టు తండ్రీ " అంటూ ప్రార్థించాడు.
అతడలా ప్రార్థించుతూ ఉండగానే ఆ శవం నిద్రలోంచి మేలుకున్న వాడికిమల్లే లేచి కూర్చొనేసరికి ఆ స్త్రీ చెప్పలేని ఆనందంతో పరిపరివిధాల తులసీదాసుకి కృతజ్ఞత కనబరుస్తూ వెళ్ళిపోయింది.
ఈ సంగతి అక్బరుచక్రవర్తికి కూడా తెలిసి ఆయన దర్బారులో పండితుల యెదుట తులసీదాసు మహాత్మ్యాన్ని గురించి మెచ్చుకోసాగాడు.
తులసీదాసంటే కిట్టని ఆ పండితులు " ప్రభూ! ఆయనకు మహాత్మ్యం ఏమీ లేదు. అంతా ఉత్తది. పైగా ఇప్పుడు సంస్కృత రామాయణాన్ని హిందీలో రాసి అపవిత్రం కూడా చేస్తున్నాడు. దీనివల్ల దేశానికి ఏమి ఉపద్రవం వస్తుందో ఏమో! " అంటూ అసూయ వెలిగక్కారు.
వెంటనే పాదుషా తులసీదాసుని రప్పించి " ఏమిటయ్యా, నువ్వు కాశీలో ఏదో గమ్మత్తులు చేస్తున్నావుట. చచ్చిన వాణ్ణి బతికించావుట, నిజమేనా? " అని గద్దించి అడిగాడు.
తులసీదాసు " అయ్యా! నేను కాదు, శ్రీరామచంద్రుడే బ్రతికించాడు " అన్నాడు.
" శ్రీరామచంద్రుడా? ఏడీ, అతణ్ణి నాకు చూపించు. చూపలేక బూటకం మాటలు చెప్పావంటే శిక్ష వేయిస్తా సుమా! " అని బెదిరించాడు పాదుషా.
తులసీదాసు ఏమో చెప్పబోతుంటే వినిపించుకోక పాదుషా భటుల్ని పిలిచి, " ఆ రామచంద్రుడెవరో నాకు చూపేవరకు ఇతనిని ఎక్కడికీ కదలనివ్వవద్దు " అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు.
కాస్సేపటికి వృద్ధబ్రహ్మచారి వేషంలో హనుమంతుడు అక్కడికి వచ్చి, కూడా తెచ్చిన తాటాకులూ, గంటం ఆయనకిచ్చి " దాసూ! నువ్వేమీ బాధపడక, నీ రామాయణం రాసుకుంటూ కూచో, పాదుషా పని నే చూస్తానులే " అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు.
తెల్లవారేసరికల్లా, పాదుషా పట్టణమంతా ఎక్కడ చూసినా కోతులతోటి కోడముచ్చులతోటి నిండిపోయింది. ఏ యింటి మీద చూసినా ఒక్క పెంకు కూడా లేదు. ఏ చెట్టుని చూసినా ఒక్క కాయకూడా మిగలలేదు. వీథులమ్మటా వెళ్ళేవాళ్ళను ఒక్కొక్కళ్ళనే పట్టుకుని పీకి వదిలి పెట్టాయి కోతులు. ఎవరేమి ఎక్కడ పెట్టుకున్నా ఉండనియ్యక ఎత్తుకుపోయాయి. ఎక్కడ నలుగురు చేరినా వాళ్ళమీద ఏ కొండముచ్చో దభీమని ఉరికి హడలగొట్టేది. ఆనాడు పాదుషా అంత:పురంలోనూ కోతులే. నాలుగు మహా వానరాలు వచ్చి, ఆయన పడుకున్న మంచాన్ని మోసుకుపోయి, దొడ్లో ఉబ్బెత్తుగా పడవేశాయి. ఆయనకు మెలకువ వచ్చి చూసుకునేటప్పటికి ఏముంది? ఎక్కడ చూసినా కోతుల మయమే. ఎవరిని చూసినా రక్కులూ, రక్తమే.
ఏమిటిదంతా? అని వాకబు చేసేసరికి, మంత్రివచ్చి " ప్రభూ! సాధురూపుడైన తులసీదాసుని నిర్బంధించినందుకు శ్రీరామచంద్రుడు కోపగించి ఈ కోతుల మూకని పంపాడేమో అని నాకు తోస్తోంది " అన్నాడు.
అక్బరు చక్రవర్తి యెకాయెకిని తులసీదాసు ఉన్న చోటుకి వెళ్ళి " మహాత్మా! నా వల్ల అపరాధం జరిగింది. ఈ కోతుల్ని ఎక్కణ్ణుంచి రప్పించావో అక్కడికి పంపెయ్యి " అని పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు.
తులసీదాసుకి కోతులొచ్చాయన్న సంగతే తెలీదు. ఏమంటే ఆయన తన వ్రాత ధోరణిలో ఉన్నాడు. అంతేకాకుండా కోతులు ఆ దరికి రాలేదు. " కోతులేమిటి? " అంటూ ఆయన బయటకొచ్చి చూచేటప్పటికి, వానరసేన అంతా బుద్ధిమంతులకు మల్లే తలలు వంచుకుని కూర్చుని ఉంది.
ఆనందభరితుడైన తులసీదాసు అక్బరుతో " ప్రభూ! నీవెంత అదృష్టవంతుడివయ్యా! శ్రీరామచంద్రుని దర్శనం నీకు కాబోతోంది. వారి రాకను తెలుపుతూ ఈ కోతులు వచ్చాయి. శ్రీరామచంద్రుడికి ఇలాంటి సేనలు డైబ్భై రెండున్నాయి. అందులో ఇప్పుడు ఒక్కటే వచ్చింది. ఆ డెబ్భై రెండూ వచ్చిన పిమ్మట, శ్రీరాములవారు సీతాదేవినీ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్నీ, హనుమంతుణ్ణీ, సుగ్రీవ, విభీషణుల్నీ వెంటబెట్టుకుని వస్తారు. ఏ చక్రవర్తికీ పట్టని అదృష్టం పట్టింది నీకు " అంటూ, పాదుషా నిమిత్తాన తనకు కూడా శ్రీరామదర్శనం కలుగబోతోందన్న సంతోషంతో పొంగిపోయాడు.
అక్బరు మాత్రం హడలిపోయాడు. ఒక్క సేన వల్లనే ఇంత అల్లకల్లోలం జరిగిందే, మిగతా డెబ్భై యొక్క వానర సేనలు వస్తే ఇంకేమైనా ఉండా? అని ఆయన భయం.
పాదుషా తులసీదాసు కాళ్ళమీద పడి, " మహాత్మా! ఆ సేనలూ వద్దు. రాముడూ రావద్దు. ఈ కోతుల్ని పొమ్మను. నీకు పుణ్యం ఉంటుంది. " అంటూ గోలపెట్టాడు.
తులసీదాసు హనుమంతుణ్ణి తలుచుకునేసరికి కోతులూ, కొండముచ్చులూ ఎక్కడి వక్కడ మాయమయ్యాయి.
పాదుషా నాటి నుంచి సాధువులను బాధించకూడదని నిశ్చయించుకుని, తులసీదాసుని అనేక విధాల సత్కరించి, సురక్షితంగా మళ్ళీ కాశీకి పంపేశాడు.
మరికొంత కాలానికి తులసీదాసు తన హిందీ రామాయణాన్ని పూర్తిచేసి జన్మ చాలించి శ్రీరామునిలో ఐక్యమయ్యాడు. ఆయన దేశానికి అర్పించి వెళ్ళిన హిందీ రామాయణం వల్ల తులసీదాసు కీర్తి శాశ్వతంగా ఉండిపోయింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి