:: ఊర్ణనాభుడు ::
మనం ఉండే ఈ లోకాన్నీ, దేవతలు మొదలైన వాళ్ళంతా ఉండే తక్కిన
లోకాల్నీ బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి చెయ్యటంలో తన నేర్పంతా చూపి ఎంతో
అందంగా చేశాడు గనుక బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకున్నారు. కాని, ఊర్ణనాభుడనే వాడు మాత్రం మెచ్చుకోలేదు.
ఊర్ణనాభుడు విశ్వకర్మ కొడుకు. విశ్వకర్మ ఎవరంటే, దేవతలకు మంచి మంచి మేడలు, మిద్దెలు, సభలు కట్టియిచ్చేవాడు. తోటలు, ఉద్యానవనాలు, వాటిలో చిన్నచిన్న సరస్సులు ఇలాంటివన్నీతయారుచేసి యిచ్చి, దేవతలకు ఆనందం కలుగజేసేవాడు. అతని కొడుకు ఊర్ణనాభుడు తండ్రికన్నా నేర్పు కలవాడు. చూసినదల్లా చేసెయ్యగలడు అతడు.
బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకోవడం విని, “ ఓస్, బ్రహ్మ గొప్ప ఏమిటి? ఇలాంటి లోకాలూ, వింతలూ నేనూ చెయ్యగలను
“ అంటూ బ్రహ్మకు మల్లేనే ప్రతీదీ చెయ్యటం మొదలెట్టేడు ఊర్ణనాభుడు.
ఊర్ణనాభుడు తనతో పోటీ చేస్తున్నాడని తెలియడంతోనే
బ్రహ్మకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. అతణ్ణి పిలిపించి “ ఏమోయ్! నువ్వేదో తెలివైన వాడినన్న
గర్వంతో నన్నేధిక్కరిస్తున్నావే. ‘ తగుదునమ్మ ‘అని నాతో పోటీకి వస్తున్నావు.
నువ్వెంత చేసినా అది నా సృష్టిలాగా ఉంటుందా? నీ సృష్టి నీ పేరుకు తగినట్లే ఉంటుంది. ‘ ఊర్ణనాభం ‘ అంటే ‘ సాలెపురుగు ‘. నీ పని సాలెపురుగు
కట్టిన గూడుకుమల్లే పైకి డాబే కాని, ‘ఉఫ్’ మని ఊదితే నిలువదు. అంచేత నాతో పోటీకి రాక, బుద్ధి తెచ్చుకుని
మసలుకో “ అని కూకలేశాడు.
కాని, ఊర్ణనాభుడు ఊరుకోలేదు. “ ఏమయ్యోయ్, నీ డబాయింపు నా దగ్గర పనిచెయ్యదు. నన్ను మానుకోమనటానికి నువ్వెవరవు? “ అని ఎదిరించాడు.
ఎంత మంచి దేవుడైనప్పటికీ
ఎదిరిస్తే ఊరుకుంటాడా? బ్రహ్మదేవునికి
పట్టరాని కోపం వచ్చి, “ ఒరేయ్, ఊర్ణనాభా!
ఒళ్ళు తెలియకుండా మాట్లాడావు కనుక నీవు పోయి, భూలోకంలో ఒక ఊర్ణనాభానివై
( సాలెపురుగు ) పుట్టి, ఒక చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటూ ఉండు
“ అని శపించేశాడు.
ఇంకేముంది? శాపం తగలటంతోనే ఊర్ణనాభుడు గజగజా వణుకుతో బ్రహ్మదేవుని
కాళ్ళమీద పడి “ దేవా! క్షమించు. నన్ను కాపాడు. సాలెపురుగు జన్మలోంచి
తప్పించు “ అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు.
బ్రహ్మదేవునికి జాలివేసింది.
“ నా శాపానికి తిరుగు లేదు. నీవు సాలెపురుగువై పుట్టకతప్పదు. ఎటొచ్చీ, ఆ జన్మలోనే నీకు మోక్షం వచ్చే ఉపాయం ఒకటి చెపుతాను
విను. నువ్వు ఒక అడవిలో ఒక బిల్వ వృక్షం మీద పుట్టబోతున్నావు. ఆ అడవిలోనే ఒక చోట శివుడు
లింగమై వెలిశాడు. ఆ శివుడికి పూజ చెయ్యటానికి భక్తుడొకడు బిల్వ పత్రాలకోసం నీవున్న
చెట్టువద్దకు వస్తాడు. ఆ పత్రితో పాటు నువ్వు శివుని సాన్నిధ్యానికి చేరుకుని ఆ దేవుణ్ణి
సేవించి మోక్షం పొందు “ అని చెప్పేడు.
ఊర్ణనాభుడు శాపం ప్రకారం
ఆ అడవిలో బిల్వవృక్షం మీద సాలెపురుగై పుట్టాడు. సాలెపురుగై ఉన్నా, అతనికి పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకముంది.
ఆ శివభక్తుడు ఎప్పుడు వస్తాడా. తన్ను శివలింగం వద్దకు ఎప్పుడు తీసుకుపోతాడా అని సాలెపురుగు
ఆ చెట్టుమీదే కనిపెట్టుకుని ఉంది.
అలా కొంతకాల మయాక, బ్రహ్మ చెప్పిన శివభక్తుడా చెట్టు దగ్గరకొచ్చి
ఆకులు కొయ్యటం మొదలెట్టాడు. సాలెపురుగు అతను ఆకులు కోస్తున్న కొమ్మమీదకెళ్ళి, ఒక ఆకులో దూరి, ఆకుతోపాటు తాను కూడా అతని బుట్టలోకి చేరుకుంది.
అతడా పత్రి అంతా తీసుకెళ్ళి, ఆ అడవిలోనే వెలసి ఉన్న శివలింగానికి
పూజ చేయసాగాడు. ఒక్కొక్క దళమే తీసి లింగంమీద వేస్తూంటే సాలెపురుగు దాక్కొనిఉన్న ఆకుగూడా
అతని చేతికివచ్చి ఆ పురుగుకు శివదర్శనమయింది. పురుగు ఆకుతోబాటు తనుకూడా లింగం మీద పడిపోకుండా
తప్పించుకుని, భక్తుడు వెళ్ళొపోయాక శివలింగాన్ని తనివితీరా చూడటం
మొదలెట్టింది. “ ఈ మహాదేవుణ్ణి నిత్యం సేవించి, మోక్షం సంపాదించుకుంటాను
“ అని నిశ్చయించుకుంది.
కాని ఆ సాలెపురుగుకు
పట్టుకున్న ఆలోచన ఏమిటంటే, “నేనుత్తి
సాలెపురుగును. ఆ దేవుడికి పూజ చెయ్యాలీ అంటే పువ్వులు, పత్రి
మొదలైనవెన్నో కావాలి.నేను వీటిని తేలేను కదా! మరి, ఈ దేవుడికి
సేవ చెయ్యటం ఎలాగా?” అని.
ఇలా ఆలోచిస్తూ పోగా
చటుక్కున దానికో ఆలోచన తోచింది. “ సేవించాలీ అంటే, పువ్వులూ, పత్రీ తెచ్చే పూజించనక్కరలేదు. నేను ఎంచక్కా అందంగా గూళ్ళు కట్టగలను. ఈ దేవుడికి ఏ భక్తుడూ ఇంకా గుడి కట్టించలేదు.
నేను నా శక్తి అంతా ఉపయోగించి, ఈ దేవుడికి గుడీ, గోపురం అన్నీ కడతాను “ అనుకుంది. అనుకున్న వెంటనే పని ప్రారంభించింది. సాయంకాలం
అయ్యేటప్పటికి, లింగానికి గుడి, గోపురం, ప్రాకారం అన్నీ కట్టేసింది. వేటితో కట్టిందో తెలుసా? ఇటుకలు, రాళ్ళు, సున్నంతోనూ కాదు.
సాలెపురుగు అవన్నీఎక్కడ తేగలదు? సాలెపురుగుకు తన బొడ్డులోనే ఒకరకం
జిగురు ఉంటుంది. ఆ జిగురుతోనే జలతారు పోగులకు మల్లే తళతళ మెరిసిపోయే పోగులు చేసి వాటితో
గూళ్ళు కడుతుంది. మన సాలెపురుగు కూడా ఆ పోగులతోటే శివుడికి గుడి, గోపురం, ప్రాకారం ఎంతో నేర్పుగా కట్టేసింది. అవన్నీ
ఎంత అందంగా ఉన్నాయనుకున్నారు! , మర్నాడు పొద్దునే లేచి చూచేటప్పటికి, మంచు బిందువులు వాటి మీద పడి, ఆ గుడి, గోపురం, ప్రాకారం కూడా తెల్లటి ముత్యాలతో కట్టారా అన్నట్టు
కనపడినై. క్రమంగాఎండ వచ్చి సూర్యకిరణాలు వాటి మీద పడేటప్పటికి, అవన్నీ రంగురంగులుగా మెరిసి, నవరత్నాలతో కట్టినట్లు
కనపడ్డాయి.
కాని ఒక చిక్కొచ్చింది.
సాలెపురుగు పోగులతో కట్టిన గుడీ, గోపురం, ప్రాకారం అందంగా ఉన్నాయన్నమాటేగాని వాటిల్లో గట్టి ఎక్కడుంది? కాస్త గాలి వేసేటప్పటికి ఆ పోగులు అక్కడక్కడా తెగిపోతూండేవి. ఆ తెగిపోయిన
వాటికి అతుకు పెట్టడంతో ఆ సాలెపురుగుకు ప్రొద్దస్తమానం సరిపోయేది. ఐతేం? విసుగూ, విరామం లేకుండా అది అలా అతుకులు పెడుతూనే ఉండేది.
శివుడంటే దానికున్న భక్తి, శ్రద్ధ అటువంటివన్న మాట.
ఇలా కొంతకాలమయాక శివుడికి
దాని భక్తిని పరిక్షిద్దామని బుద్ధి పుట్టింది.
సాలెపురుగును పత్రితోబాటు
శివలింగం వద్దకు తెచ్చిన భక్తుడొకనాడు మామూలు ప్రకారం శివుడికి పూజచేసి, దీపం పెట్టి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళేక శివుడు
తన ప్రభావంచేత ఆ దీపాన్ని పెద్దదయేటట్లు చేశాడు. మొదట ముత్యంలా ఉన్న దీపం సాలెపురుగు
చూస్తుండగానే దివిటీలాగైపోయి, మరో నిమిషానికి తాటిచెట్టంతై, సాలెపురుగు ఎన్ని సంవత్సరాలనుంచో శ్రమపడి కట్టిన గుడినీ, గోపురాన్నీ, ప్రాకారంతో సహా తగులబెట్టి నాశనం చేసింది.
సాలెపురుగుకు దీపం
మీద పట్టరాని కోపం వచ్చింది. “ నేను పరమేశ్వరుని కోసం చేసిన ఈపని అంతా ఈవిధంగా వృధా
అయిపోయాక ఇంక నా బ్రతుకెందుకు? నాకూ, పరమేశ్వరుడికీ అకారణంగా ఇలా అపచారం చేసిన ఈ దీపం పని పడతాను. ఛస్తే ఛస్తాను
దీన్ని మింగేసి, నా కసి తీర్చుకుంటాను “ అని నిశ్చయించుకుని, దీపాన్ని మింగటానికి గబగబా లింగం వద్దకు పరుగెత్తికొచ్చింది.
శివుడాశ్చర్యపోయాడు.
“ అబ్బా, ఈ సాలెపురుగుకి ఎంత భక్తి “ అనుకున్నాడు. తక్షణమే
శివుడు లింగంలోకి ప్రత్యక్షమై, “ ఆగు, ఆగు, దీపాన్ని మింగకు. నీ భక్తిని పరిక్షిద్దామని నేనే చేయించాను ఈ పని. నీ భక్తికి
మెచ్చుకున్నాను. నీకేం కావాలో వరం కోరుకో ఇస్తాను “ అన్నాడు.
ఈశ్వరుడల్లా ప్రత్యక్షమయ్యేటప్పటికి
ఆ సాలెపురుగుకు కలిగిన సంతోషానికి అంతు లేకపోయింది. దానికి శివుణ్ణి స్తోత్రం చెయ్యటానికి
శ్లోకాలూ, మంత్రాలూ రావు కదా! అంచేత భక్తి పొంగివస్తూంటే, అదేపనిగా స్వామికి మ్రొక్కటం మొదలెట్టింది.
వరం కోరుకొమ్మన్నారు
గనుక, సాలెపురుగు జన్మపోయి, మంచి
జన్మ ఏదైనా కోరుకోవచ్చు. డబ్బు, దస్కం ఇమ్మని కోరుకోవచ్చు. కాని, ఆ సాలెపురుగు అలాంటి స్వల్ప కోరికలేమీ కోరలేదు.
“ ఎంత గొప్ప పుట్టుక
పుట్టినా బాధలు తప్పవు. ఏ బాధా లేకుండా ఉండాలంటే జన్మ లేకుండా పోవాలి. కనుక నన్ను నీలో
చేర్చుకో స్వామీ! “ అని మనసారా కోరింది.
ఈశ్వరుడు దాని తెలివికి, జ్ఞానానికి మెచ్చుకుని, తనలో ఐక్యం చేసుకుని మోక్షమిచ్చాడు. ఈ విధముగా కీటకముగా మారినప్పటికీ, ఊర్ణనాభుడు తరించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి