:: తుమ్మెదల
మెట్ట ::
పూర్వం అనగా సుమారు రెండు వందలసంవత్సరముల క్రిందట సింహాచలం
దేవాలయంలో ఒక చిత్రం జరిగింది. అది ఏమిటంటే –
సింహాద్రి నారసింహస్వామికి కృష్ణమాచార్యులు అనే ఆంతరంగిక
భక్తుడు ఒకాయన ఉండేవాడు. ఆ వైష్ణవోత్తముడు భక్తిపూర్వకంగా మధురగానం చేసేసరికి
స్వామి మెచ్చుకుని అతని ఎదుట ప్రత్యక్షమై ఆచార్యులు పాడే పాటకు అనుగుణంగా నృత్యం
చేసేవాడు. ఇలా జరుగుతూ ఉంటే ఆచారిలో ఒక విధమైన గర్వం బయలుదేరింది. “
సింహాద్రినాథుడికి నేనే ప్రియమైన భక్తుణ్ణి. స్వామికి నేనుఎంత చెబితే అంత “ అని
మనసులో అనుకునేవాడు.
ఇదే సమయంలో విశిష్టాద్వైత మతాన్ని ఉద్ధరించినటువంటి శ్రీరామానుజ
స్వామివారు దిగ్విజయ యాత్ర చేసుకుంటూ ఈ దేవాలయానికి విజయం చేశారు. మహానుభావుడైన రామానుజస్వామిని
అవతార పురుషునిగా ఎంచి అందరూ అనేక విధాల గౌరవిస్తూ ఉండగా కృష్ణమాచార్యులు మాత్రం
నమస్కారమైనా చేయక నా అంతటి వాడను నేను అనే అహంభావంతో ఆయనవైపే చూడటం మానివేశాడు.
సర్వజ్ఞుడైన రామానుజాచార్యులు ఈపాటి గ్రహించలేరా? అతనిమనసుకి పుట్టిన గర్వాన్ని ఇట్టే
తెలుసుకున్నారు. ఆయనే స్వయంగా కృష్ణమాచారిని పలుకరించి, వినయపూర్వకంగా “ స్వామీ! కృష్ణమాచార్యోత్తమా!
మీరు నాకొక్క ఉపకారం చేసి, తరుణోపాయం
చెప్పాలి. ఈ రాత్రి సింహాద్రినాథుని సన్నిధానమందు దేవరవారు గానమొనర్చి, ఆ దేవదేవుని ప్రసన్నునిగా చేసికొన్న తరువాత
దాసునికిముక్తి ఉన్నదా లేదా? అని అడగండి.
వారు ఏమి సెలవిస్తారో వినండి. తరువాత, మీకు
మోక్షంఉన్నదా లేదా? అనికూడా
ప్రశ్నించండి. స్వామి చెప్పే ప్రత్యుత్తరం జాగ్రత్తగా తెలుసుకుని రేపు ఉదయాన ఈ
దాసునికి తెల్పండి “ అన్నారు.
ఈ మాటకు కృష్ణమాచారి చాలా సంతోషించాడు.ఏమి అంటే- అవతారమూర్తి
అని ఎవరికైతే లోకమంతా జోహారు చేస్తున్నదో, ఆ రామానుజుడే
తనను ఈ విధంగా ఆశ్రయించడంకంటే కావలసినదేముంటుంది?
అందుచేత ఆ రాత్రే తన దివ్యగానం చేత స్వామిని మెప్పించి, ప్రత్యక్షం చేసుకుని “ దేవాదిదేవా!
దక్షిణదేశాన్నుంచి రామానుజాచార్యుడనే యతీశ్వరుడు ఒకాయన వచ్చి ఉన్నారు. ఆయనకు
ముక్తి ఉన్నదా లేదా? ఈ విషయం దేవరను
అడిగి జవాబును చెప్పమన్నాడు. ఏమిటి ఆజ్ఞ ?” అని అడిగాడు.
అప్పుడు సింహాద్రినాథుడు “ ఓయీ! భక్తవరేణ్యా! ఆ రామానుజుడు
కేవలమూ మునీంద్రుడాయెనే. ఆయన యిచ్చిన వారికే ముక్తి కలుగు తూండగా ఆయనకు
ముక్తి ఉన్నదా లేదా? అనేది ఒక
ప్రశ్నా? అది సందేహమేనా? “ అని బదులు
చెప్పాడు.
అయితే, “ స్వామీ! నాకు
మోక్షం కలదా? “ అంటూ మళ్ళీప్రశ్న వేశాడు కృష్ణమాచారి.
అందుకు స్వామి, “ ఓయీ! కృష్ణమాచార్యా! నీవు నాకు ప్రియమైన
భక్తుడివే. నిజమే, కాని, నీకు మోక్షమివ్వటానికి మాత్రం నాకు అధికారం
లేదు. ఏమంటే, ‘
విభూతిద్వయాధికారం ‘ ఇదివరకే
రామానుజాచార్యునికి ఇచ్చివేశాను,. ఎవరికి
మోక్షమివ్వటానికైనా ఆయనే సర్వాధికారి. కనుక, నీకు
మోక్షంకావలెనంటే నీవు వెళ్ళిఆయననే ఆశ్రయించాల్సి ఉంటుంది “ అని చెప్పాడు.
భగవంతుని వాక్యాలు వినగానే అంతులేని అహంకారం చెలరేగి, కృష్ణమాచార్యుడు ఉగ్రుడయ్యాడు. “ ఇంతకాలమై నిన్ను
ఆశ్రయించిన ఫలమిదేనా? పరమపదం కోసం
పరులను ప్రార్థించమంటావా? అమితమైన
భక్తితాత్పర్యాలతో అన్నేళ్ళుగా నిన్ను కీర్తించి భజించానే? చివరకు నన్ను ఇలా మోసగిస్తావా? “ అని నోటికి వచ్చినట్లల్లా నిష్టూరంగా
మాట్లాడ జొచ్చాడు.
ఈ నిష్టురాలకు సహించలేకపోయాడు సింహాద్రినాథుడు. “
కృష్ణమాచార్యా! నీవు రాజసుడివి, తామసుడివి.
భక్తితో పాడానని ఏదో మహా ఉపకారంగా చెబుతున్నావే? నీవు పాడావు.
నేను ఆడాను. నీ పాటకూ, నా ఆటకూ
సరిపోయింది. మరేమీ బాకీ మిగలలేదు. ఇప్పుడు అనాలోచితంగా ఉద్రేకం తెచ్చుకుని నీవు నా
పట్ల కఠినంగా మాట్లాడావు. కాబట్టి నీవు రచించిన కీర్తనలన్నీ నీచులపాలై పోవుగాక! “
అంటూ శపించి వేశాడు.
దేముడిలా శపించే సరికి ఆయన భక్తుడైన కృష్ణమాచార్యునికి కూడా
తీవ్రమైన కోపం వచ్చేసింది. “ ఓయీ! అప్పన్నా! సమస్తమూ నీవేనని నమ్ముకుని ఉన్న నన్ను
మోసగించావు. నా జీవితమంతా నాశనం చేశావు. ఇదిగో నేనే నిజమైన భక్తుణ్ణయితే, నీ ఆలయమంతా ఒక్క రీతిగా ఏడు రోజులు మండి, గోపురాలూ, మంటపాదులూ అన్నీ
కళా కాంతీ లేక పాడిబడి పోవుగాక! “ అంటూ సింహాద్రినాథుడికి ప్రతిశాపం యిచ్చాడు.
సింహాద్రినాథుని శాపంవల్ల కృష్ణమాచార్యుల కీర్తనలన్నీ నీచుల
పాలైనాయి. కృష్ణమాచార్యుని శాప ప్రయోగంవల్ల మరికొద్ది కాలానికే “ మలికనేబు “ డనే మ్లేచ్ఛనాయకుడు
బ్రహ్మాండమైన తన దండుతో సహావచ్చి సింహాచలక్షేత్రాన్ని ధ్వంసం చేయబూనాడు. క్రూరుడైన
ఆ యవనుడు ఆలయాన్ని ముట్టడించి ఆక్రమించబోతాడనే వర్తమానం మహాభక్తుడు, మహాకవి అయినటువంటి గోగులపాటి కూర్మనాథునికి
ముందుగానే తెలిసింది.
ఎవరికీ తెలియకుండా ఆయన తక్షణమే దేవాలయ అంతర్భాగంలోకి పోయి
కూర్చొని మహాభక్తితాత్పర్యాలతో సింహాద్రి దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు
ఫలితంగా అతనికి కవితా ప్రభావం కలిగి “ వైరి హరరంహ! సింహాద్రి నారసింహ “ అనే
మకుటంతో సీస పద్యాలు చెప్ప నారంభించాడు. ఈ పద్యాలలో కూర్మనాథకవి, ఆ యవనుడొనర్చే ఘోరాలను శాంతింప జేయమనీ, శత్రుక్షయము చేయుమనీ కోరాడు. సింహాద్రి దేవుని
దుర్బలత్వాన్ని హెచ్చరిస్తూ అరవై పద్యాలవరకూ ముందు నిష్ఠురంగా వర్ణించాడు.
కూర్మనాథుడు అరవై ఎనిమిదో పద్యం చెప్పిన వెంటనే కవిచంద్రుని
భక్తికి సంతసించి, స్వామి గండు
తుమ్మెదలను సృష్టించాడు. ఆ తుమ్మెదల దండు యవనుల సేనను మర్ధిస్తూ, వాడి అయిన తొండాలతో పొడుస్తూ, చీల్చి చెండాడుతూ సుమారు పదిమైళ్ళ దూరం వరకూ
శత్రు దండును పారద్రీలినై.
ఈ దెబ్బకు తట్టుకోలేక యవనుల దండు వాల్తేరుకు అరమైలు దూరాన ఉండే
ఒక మెట్ట వరకు పారిపోయింది. నాటినుంచి ఆ మెట్టకు “ తుమ్మెద మెట్ట “ అనే పేరు
వచ్చింది. తుమ్మెదల మెట్ట ఇప్పటికీ ఉన్నది. విశాఖపట్టణానికి అది శ్మశాన వాటికగా
ఉపయోగపడుచున్నది. ఈ విధంగా కూర్మనాథకవి సూక్తుల వల్లనే సింహాచలక్షేత్రానికి క్షేమం
కలిగింది. తరువాత కూర్మనాథ కవి తన నరసింహ శతకంలోనే స్వామి మహిమను కొనియాడుతూ
కొన్ని క్షమాపణా పద్యాలు చక్కగా వర్ణించి చెప్పాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి