:: నారదసంసారం ::
నారదమహర్షి చాలా గొప్పవాడు. కాని, అంత గొప్పవానికి కూడా ఒక గర్వం ఉండేది. " అందరూ పెళ్ళిచేసుకుని పెళ్ళామనీ, పిల్లలనీ మాయలో పడిపోతున్నారు. నేను మాత్రం అలాంటి మాయలో పడలేదు. ఎన్నటికీ పడబోను " అంటూండేవాడు. పెళ్ళి చేసుకున్న ప్రతి మహర్షిని ఆక్షేపిస్తూండేవాడు. అతని అహంకారం ఎంతవరకూ వెళ్ళిందంటే, పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే ఆక్షేపించాడు ఒకనాడు.
" ఈ త్రిమూర్తులు మరీని. బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నాలుకమీద ఉంచుకున్నాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వక్షస్థలంమీద కూర్చోబెట్టుకున్నాడు. శివుడు గంగను నెత్తిమీదనే కూర్చోబెట్టుకు మోస్తున్నాడు. పైగా పార్వతీదేవికి సగం శరీరమూ ఇచ్చేశాడు " అని నిందించాడు.
నారదుడు తమరినిలా ఆక్షేపించాడని బ్రహ్మవిష్ణుమహేశ్వరులు తెలుసుకోలేక పోతారా? తెలుసుకొన్నారు. కాని నారదుడేమన్నా, తన కొడుకే గనక బ్రహ్మదేవుడు వినీవిననట్లు ఊరుకొన్నాడు. విష్ణుమూర్తి " పోనీ, ఆక్షేపిస్తే వాడి నోరే నొప్పెడుతుందని ఊరుకొనేవాడే గాని శివుడు మాత్రం అలా ఊరుకోనిచ్చాడు కాదు. " ఇలా ఊరుకుంటే ప్రతివాడూ ఇంకా మనల్ని ఆక్షేపిస్తూనే ఉంటాడు. కనుక ఈ నారదుడికి తగిన శాస్తి చెయ్యాలి" అన్నాడు శివుడు.
" సరే, అయితే చెప్తాను వీడి పని " అని విష్ణుమూర్తి తగిన సమయానికి ఎదురుచూశాడు.
ఆ తర్వాత కొన్ని రోజులయాక నారదుడే వైకుంఠానికి వచ్చాడు. విష్ణుమూర్తి " ఏమిటి విశేషాలు నారదమహర్షీ? " అని అడిగాడు.
మూడు లోకాలూ సంచారం చేసి వచ్చిన నారదుడు, " విశేషాలు ఏమి ఉన్నాయి? ఎవణ్ణి చూసినా పెళ్ళాం, పిల్లలూ, సంసారం అంటూ మాయలో చిక్కుకుపోయి ఉన్నారు, నేనొకణ్ణి తప్ప " అని తన మామూలు ధోరణి మొదలెట్టాడు.
విష్ణుమూర్తి మారుచెప్పక, " నారదా! అలా పోయివద్దాము పద " అన్నాడు. నారదుడు విష్ణుమూర్తితో బయలుదేరాడు.
ఎక్కడికి అని నారదుడు అడగనూ లేదు, విష్ణుమూర్తి చెప్పనూ లేదు. ఇద్దరూ ఆ కబురూ, యీ కబురూ చెప్పుకుంటూ వెళ్ళి ఒక అడవిలో ప్రవేశించారు.
ఉన్నట్టుండి విష్ణుమూర్తి, " నారదా! నాకు దాహం వేస్తోందయ్యా " అన్నాడు.
" నడవండి, ఎక్కడైనా కోనేరు ఉన్నదేమో చూద్దాం " అన్నాడు నారదుడు.
విష్ణుమూర్తి, " నేను ఒక్క అడుగయినా వెయ్యలేను. నువ్వు వెళ్ళి, ఏ ఆకు దొప్పలోనో ఇన్ని నీళ్ళు తెచ్చి, నా ప్రాణాలు నిల్పు " అంటూ ప్రాణం పోతున్నవాడికి మల్లే అక్కడ చతికిలబడ్డాడు.
" మూడు లోకాలలోనూ ఉండే కోటానుకోట్ల జీవులందరకూ ఆకలీ, దప్పీ తీర్చే మహావిష్ణువుకు దాహమేమిటి? అనే జ్ఞానం లేక నారదుడు విష్ణుమూర్తి మాయలో పడి, " నిజంగా నీరు కావాలి కామోసు " అనుకొని నీటికోసం పరుగెత్తాడు. సమీపంలోనే పుష్కలంగా జలం ఉన్నటువంటి కోనేరు ఒకటి కనబడింది. తామరపూవులతోటి, ఆకులతోటి కలకల్లాడుతూ ఆ సరస్సు ఆ మునికి కన్నుల పండుగు చేసింది. ఆ నీటిని చూడ్డంతోనే, అతనికి కూడా దాహం వేసి, " విష్ణుమూర్తి దాహం మాట తర్వాత చూసుకోవచ్చు మొదట నా దాహం తీర్చుకుంటాను " అనుకొని నారదుడు కొలనులోనికి దిగేడు. చాలాదూరం నడిచి నడిచి, కాళ్ళు లాగటం చేత, ఆ కాళ్ళకు నీళ్ళు తగిలేటప్పటికి అతని ప్రాణం లేచివచ్చింది. ఆ చెరువులో స్నానం చేస్తే పూర్తిగా బడలిక పోతుందని తోచి, కంఠంలోతువరకూ వెళ్ళి ఒక్క మునుగు మునిగేడు.
మునిగిలేచేటప్పటికి, అంతకు ముందున్న పిలకజుట్టు కాస్తా పోయి, తలనిండా పట్టుకుచ్చులా నిగనిగలాడే బారెడు జుట్టు మొలిచింది. " ఇదేమిటా? అని ఆశ్చర్యపోతూ, చేతులెత్తి తల తడుముకుంటూంటే, అతని ముంజేతుల్ని గలగలలాడుతూ గాజులు కనబడ్డాయి. మెడలో ఉండే తులసి పూసలపేరు ముత్యాలహారమై తళతళమెరిసింది. అతని కాషాయవస్త్రం పట్టుచీరగా మారిపోయింది. గట్టుమీదకి వచ్చి చూసుకొంటే నారదముని ఒక స్త్రీగా మారిపోయాడు. ఆ చెఱువులో నీరు ఎప్పటిలాగా మళ్ళీ నిశ్చలమై అద్దంలా కనబడింది. ఆ స్త్రీకి తన ప్రతిబింబం ఆ నీటిలో కనబడి " అబ్బో, నేనెంత అందంగా ఉన్నాను " అనిపించింది.
అయ్యో! నేను నారద మహర్షినే! ఇలా ఆడదానిగా మారిపోయానేమిటి? అన్న జ్ఞానంగాని, విచారంగాని ఇప్పుడు ఆమెకు లేదు. తనతో కూడా వచ్చిన విష్ణుమూర్తి మాట అసలే జ్ఞాపకంలేదు.
ఆ చెఱువు గట్టమ్మటే నడచి వెళ్ళి, అక్కడేదో పువ్వుల చెట్టు ఉంటే చూసి పువ్వులు కోసుకోవటం మొదలుపెట్టింది. దూరాన్నుంచి విష్ణుమూర్తి ఇదంతా కనిపెట్టి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడ్డాడు. ఆప్పుడు ఆ దారిని ఒక రాజకుమారుడు వేటకని వచ్చి, విష్ణుమూర్తిని చూచి ఎవరో అనుకొని " అయ్యా! దాహం వేస్తోంది, సమీపంలో చెఱువు ఏదైనా ఉన్నదా? " అని అడిగాడు. విష్ణుమూర్తి రాజకుమారునకు నారదుడు సంచరిస్తూన్న ఆ కొలనువైపు చూపించాడు. ఆ రాజకుమారుడు అక్కడకు వెళ్ళి, తలలో పువ్వులు అలంకరించుకొని ఒయ్యారంగా నిలబడ్డ ఆ అందగత్తెను చూసి " ఎవరు నువ్వు? గంధర్వ కాంతవా? లేక అప్సరసవా? లేక వనదేవతవా? " అని అడగడం మొదలెట్టేడు.
తానెవరో తనకే తెలియక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడి పోయిందామె. " సరే! నువ్వెవరివైతేనేమి? చాలా అందంగా ఉన్నావు. నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను. నాతో వచ్చేసెయ్యి. నాకు రాణిగా ఉందువుగాని " అన్నాడు. పెళ్ళి అనటంతోనే ఆమెకు సరదాపుట్టి ఆ రాజుతో వెళ్ళిపోయింది. విష్ణుమూర్తి శివుడి దగ్గరకెళ్ళి జరిగినదంతా చెప్పాడు. శివుడూ, పార్వతి మొదలైన వాళ్ళంతా కడుపులుబ్బేటట్లు నవ్వుకున్నారు.
అక్కడ రాజు ఆమెను పట్టణానికి తీసుకెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు. ఆమెకు ఒకరూ, ఇద్దరూ కాదు - వరసన అరవైమంది పిల్లలు పుట్టేరు. వాళ్ళకు ప్రభవుడు, విభవుడు, శుక్లుడు మొదలైన అరవై పేర్లూ పెట్టించింది. ఆ పిల్లలకు నీళ్ళు పొయ్యడం, బొట్టూకాటుకా పెట్టడం, బట్టలు తొడగడం, బువ్వ పెట్టడం, నిద్దర పుచ్చడానికి, జోల పాడడం - ఈ పనులతో ఆమెకు పొద్దస్తమానం సరిపోయేది. " పిల్లలూ, సంసారం మాయ " అని అందర్నీ ఆక్షేపించే నారదుడే ఇలా ఓ పెద్ద సంసారంలో తగులుకొని, ఆ సముద్రంలో ఊపిరి సలుపకుండా కొట్టుకోడం మొదలెట్టేడు. శివుడూ, విష్ణువూ కూడా " మంచి శాస్తి అయింది నారదుడికి " అని సంతోషించారు. కాని, బ్రహ్మదేవుడికి మటుకి నారదుడు తన కొడుకే గనుక, అతను అవమానింప బడటం బాధగానే ఉంది. " కుఱ్రవాడేదో తెలియక అంటే ఇంత కఠిన శిక్ష వెయ్యడం ఏమిటి? " అని విష్ణుమూర్తి వద్ద బ్రహ్మ సణిగాడు.
బ్రహ్మమాత్రం ఎవరు? తన కొడుకేగా! అంచేత విష్ణుమూర్తి తాను నారదుణ్ణి స్త్రీగా మార్చి సంసారంలో తగిలించటం బ్రహ్మకు బాధగా ఉందని తెలియటంతోనే, ఆమెను మళ్ళీ నారదునిగా మార్చివేద్దామని నిశ్చయించుకున్నాడు. కాని నారదుడు స్త్రీగా మారి తీరా సంసారంలో ఎలాగూ ప్రవేశించాడు గనుక అదెటువంటి మాయో అతను అనుభవ పూర్వకంగా తెలుకొని మరీ అవతలకు రావటం మంచిదని విష్ణుమూర్తి ఆలోచించాడు.
ఆలోచించి ఏం చేశాడంటే, ఆ రాజు పాలించే రాజ్యం మీదికి ఒక శత్రురాజు సైన్యంతో దండెత్తి వెళ్ళేటట్లు చేశాడు. ఆ రాజుకీ ఈ రాజుకీ పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నారదుడు స్త్రీగా మారి పెండ్లి చేసుకున్న రాజూ, ఆ రాజువల్ల ఆమెకు కలిగిన అరవై మంది కొడుకులూ ఒక్కరైనా మిగలకుండా చచ్చిపోయారు.
భర్త, పిల్లలూ యుద్ధంలో చనిపోయారని తెలిసేటప్పటికి ఆమెకు దు:ఖం ఆగలేదు. తాను రాణినన్న మాటే మరచిపోయి ఆమె యుద్ధభూమికి వచ్చేసి, భర్త శవాన్ని, కొడుకుల శవాల్నీ చూసి గుండె బాదుకుంటూ ఏడవడం మొదలెట్టింది. " సంసారం-పిల్లలు-ఇదంతా మాయ " అన్న నారదుడేనా యీమె అని విష్ణుమూర్తికే ఆశ్చర్యం వేసింది. ఆమెకు అతడక్కడ ప్రత్యక్షమై, " నారదా! నాకు మంచినీళ్ళు తెస్తానని వెళ్ళి, ఇక్కడిలా ఏడుస్తూ కూచున్నావేమిటి? " అని అడిగాడు.
కాని, ఆ స్త్రీకి తాను నారదుడన్న జ్ఞానం ఇంకా రాలేదు. " నేనీ పట్టణపు రాణిని. నన్ను నారదుడంటావేమిటి? అందామె.
" నాతో రా, చెపుతా " అంటూ విష్ణుమూర్తి ఆమెను మళ్ళీ ఆ చెఱువు దగ్గరకు తీసుకెళ్ళి, " ఆ చెఱువులో దిగి స్నానం చేసి రా, ఒక చెయ్యి మాత్రం నీటికి తగులకుండా పైకెత్తి స్నానం చెయ్యి " అన్నాడు. ఆమె అలాగే చేసి గట్టుమీదకొచ్చింది. ఏమి ఆశ్చర్యం! జుట్టంతాపోయి పిలక వచ్చింది మళ్ళీ. ముత్యాలహారం తులసి పేరుగా మారిపోయింది. కాని పెకెత్తి ఉంచిన చెయ్యి మాత్రం గాజులతో అలాగే ఉండిపోయింది.
నారదునికి నిద్రపోయి లేచినట్లయింది. తాను రాణి అయి అరవైమంది పిల్లల్ని కనటం, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయి, యుద్ధంలో చనిపోయి వాళ్ళకోసం తాను ఏడవటం - ఇదంతా ఒక కలగా జ్ఞాపకానికి వచ్చింది. కాని, ఆ గాజుల చెయ్యి చూసుకుంటే, " కలకాదు నిజమే! " అని తేలింది. తనూ సంసారపు మాయలో తగులుకున్నందుకు నారదుడు సిగ్గుపడ్డాడు.
విష్ణుమూర్తి, " సిగ్గు అక్కర్లేదు నారదా, ఇది వరకు నీకు సంసారం అంటే యేమిటో, మాయ అంటే ఏమిటో తెలీదు. అందులో పడి, దు:ఖం అనుభవించావు. కనుక ఇప్పుడు తెలిసింది. ఇంక నువ్వు జ్ఞానివవుతావు " అని నచ్చచెప్పేడు.
నారదుడు ఆ మాటలకు సంతోషించాడు. కాని, తాను స్త్రీ అయినప్పుడు పుట్టిన అరవైమంది పుత్రులమీదా అతనికి మమకారము పూర్తిగా పోయింది కాదు. అంచేత అతడు తండ్రి అయిన బ్రహ్మదేవుని దగ్గరకెళ్ళి " తండ్రీ! నా కుమారుల పేర్లు భూలోకంలో శాశ్వతంగా ఉండేటట్లు చెయ్యి " అని కోరుకున్నాడు.
కుమారుని కోర్కె ప్రకారం బ్రహ్మ " సరే " నని చెప్పి ప్రభవా, విభవా, శుక్లా మొదలైన ఆ అరవై మంది పేర్లు మన సంవత్సరాలకి పెట్టి, లోకంలో ఆ పేర్లు శాశ్వతంగా ఉండేటట్లు చేశాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి