15, జూన్ 2025, ఆదివారం

 :: శ్రీ ముఖలింగేశ్వరుడు :: 

    చాలా కాలానికి పూర్వం మన రాష్ట్రానికి ఉత్తరంగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సవరవాడు చిన్న గెడిసె వేసుకొని కాపురం ఉండేవాడు. 

    అతనికి యిద్దరు భార్యలు. అందులో పెద్ద భార్య ఉత్తమురాలు. చిన్న భార్య గయ్యాళి గంప. ఈమెకు కోపము, ద్వేషము, అసూయ మొదలయిన దుర్గుణాలన్నీ ఉన్నాయి. పెద్దామె పరమ సాత్వికురాలు. సవతి ఎన్ని విధాలు తిప్పలు పెట్టినా ఊరుకొనేది కాని, పల్లెత్తు మాట ఆడి ఎరుగదు. 

    రోజురోజుకూ చిన్న భార్య ఆగడం మరీ ఎక్కువయిపోతున్నది. పెద్దామె లొంగినకొద్దీ మరింత లోకువకట్టి, చిన్న భార్య అస్తమానం భర్తతో చాడీలు చెప్పటం, పేచీలు పెట్టటం ప్రారంభించింది. 

    సవరివాడి భార్యలిద్దరకూ ఒక్క క్షణమైనా పడటంలేదు. వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడుకోవటం చూసి, అతను ఇక ఈబాధ పడలేననుకున్నాడు. తను కాపురమున్న గుడిసెను రెండు భాగాలుగా చేసి, తూర్పు భాగం పెద్ద భార్యకూ, పడమటి భాగం చిన్న భార్యకూ పంచి యిచ్చాడు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క భార్య యింట్లో ఉండటానికి నిర్ణయం చేసుకున్నాడు. 

    వాళ్ళ పెరట్లో ఒక మారేడు చెట్టూ, పారిజాతం చెట్టూ కలసి పుట్టి పెద్ద మానులయ్యాయి. ఆ ఇల్లు రెండు భాగాలైనప్పుడు ఆ చెట్లు సరిగా గోడమందడికి వచ్చాయి. ఇద్దరు భార్యలూ ఎవరి భాగం వేపున ఉన్న కొమ్మల పువ్వులు వాళ్ళు కోసుకొని తలలో పెట్టుకొనేవాళ్ళు. 

    సరే, ఈ పద్ధతి బాగా ఉంది. ఇక భార్య లిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకోకుండా ఉంటారు. ఇకముందు పేచీలేవీ ఉండవు. మనస్సుకు కాస్త శాంతి ఉంటుందికదా అని సవరవాడు ఆశపడ్డాడు.   

    కానయితే, చిన్నభార్య చుప్పనాతితనం  ఎప్పటిలాగానే ఉంది. ఆమెకు పెద్దామె పైన ఉండే అసూయ ఎంతమాత్రమూ తగ్గలేదు. సమయం దొరికినప్పుడల్లా పెద్దామె పైన కసి తీర్చుకుందామనీ, ఆమెను కష్టపెడదామనే చిన్నభార్య ఎదురుచూస్తూ ఉండేది. 

    పెద్దామె దైవభక్తి గలది. మారేడు చెట్టులో ఈశ్వరుని అంశ ఉందనీ, పారిజాతం పువ్వులు విష్ణుమూర్తికి ప్రీతికరమనీ పెద్దలవల్ల ఆమె చిన్నప్పుడే తెలుసుకొన్నది. దేవుని మహిమ తెలిసిన భక్తురాలు కనుక పెద్దభార్య, పెరట్లో ఉండే మారేడుతో కలసిన పారిజాతపు చెట్టును దేవునిగా భావించింది. ప్రతిరోజునా ఆ చెట్టుక్రింద అలికి ముగ్గుపెట్టి భక్తితో పూజించేది. 

    చిన్నభార్యకు పతిభక్తి లేదు. దైవభక్తి అంతకంటే లేదు. అసలు దేవుడంటేనే ఆమెకు నమ్మకం  లేదు. పైగా సోమరిపోతు. అందుచేత ఇల్లు తుడిచిన ధూళీ, దొడ్డి తుడిచిన చెత్తా అంతా పోగుచేసుకు వచ్చి తనవేపున ఉండే ఆ చెట్టుకింద పారబోస్తూ ఉండేది. 

    అదేమి మాయోగాని, ప్రతిరోజూ తెల్లవారే సరికి పెద్దభార్య భాగం వేపున ఉన్న కొమ్మలు బంగారపు పువ్వులు పూచేవి. చిన్నభార్య భాగంలో ఉన్న కొమ్మలు, మామూలు పారిజాతం పువ్వులే పూచేవి. రోజూ బంగారం పువ్వులు దొరకటం వల్ల కొన్నాళ్ళకు పెద్దభార్య భాగ్యవంతురాలై పోయింది. 

    కొంతకాలం గడిచింది. పారిజాతం చెట్టు తూర్పుకొమ్మలకు బంగారుపూలు పూస్తున్నాయని చిన్నభార్య చెవిని పడింది. తనకు భర్త అన్యాయంచేసి పనికిరాని భాగం ఇచ్చాడనుకుని, భర్త ఇంటికి రాగానే " నాకు తూర్పు భాగం కావాల" ని అడిగింది చిన్నభార్య. 

    " సరే, నీ యిష్టం వచ్చిన భాగం తీసుకో " అని సవరవాడు చిన్నభార్యకు ఆ భాగాన్ని యిచ్చేశాడు. పెద్దభార్య యిప్పుడు చెత్తతో నిండిన పడమటి భాగానికి వచ్చింది. మళ్ళీ పూర్వంలాగే ఆమె యిక్కడ కూడా శుభ్రంగా బాగుచేసి మారేడుచెట్టును పూజించ సాగింది. 

    మామూలుగా తెల్లవారే సరికి పెద్దభార్య భాగంలో మళ్ళీ బంగారు పువ్వులు రాలుతూ ఉండేవి. " తెడ్డు ఎక్కడికి వెళ్ళినా ఏగానే " అన్నట్టు, సోమరిపోతు అయిన చిన్నభార్య తూర్పు భాగానికి వెళ్ళినా, ఆమె ఆ చెట్టును పూజించనూ లేదు, ఆమెకు బంగారు పువ్వులు దొరకనూ లేదు. 

    ఓ రెండురోజులు పోయాక, చిన్నభార్య ఉదయాన్నే లేచి పెద్దామె బంగారు పువ్వులు కోసుకుంటూ ఉండడం చూసింది. చిన్నభార్యకు మళ్ళీ అసూయ కలిగి, ఈ బంగారు పువ్వుల సంగతి భర్తకు చెప్పి, రోజూ ఆ పువ్వులు దొంగతనంగా తనకు తెచ్చి యిమ్మంది భర్తను.

    సవరవాడికి దొంగతనం ఇష్టంలేకపోయింది. " నే తెచ్చి యివ్వను " అనేశాడు. చిన్నభార్య రోజూ తెమ్మని నానా హంగామా చేస్తూండేది ఇంట్లో. ఇంక సవరవాడు ఆమె బాధ భరించలేక " ఈ చెట్టు ఉండటం మూలానే కదా యిన్ని తగవులు వస్తున్నాయి " అని ఆలోచించి, గొడ్డలి పుచ్చుకొని ఆ చెట్టు మొదటికే నరికేశాడు. 

    రెండు చెట్లు కలసి పుట్టడం మూలాన, పారిజాతం చెట్టుతో బాటు మారేడుచెట్టు కూడా పడిపోయింది. 

    ఆ మారేడుచెట్టు పడిపోగానే దాని మొదట్లోంచి రక్తం చిమ్మింది. " చెట్టులోనుంచి రక్తం చిమ్మడం ఏమిటి? అని ఆశ్చర్యంగా చూశాడు సవరవాడు. ఏమీ కనబడలేదు. గునపము తెచ్చి కొంచెం చుట్టూ త్రవ్వాడు. " ఒసేవ్! దేవుణ్ణి నరికేశానే " అమ్మో!" అంటూ త్రుళ్ళిపడి యింట్లోకి పరుగెత్తాడు. ఈ ఆశ్చర్యం చూడటానికి, భార్యలిద్దరూ పరుగెత్తుకు వచ్చారు. 

    అక్కడ ఒక ఈశ్వరలింగం ఉంది. దానికి నోరు, ముక్కు, కళ్ళు, సరిగ్గా మనిషికున్నట్టే ఉన్నాయి. గొడ్డలితో నరకడం మూలాన తలమీద చిన్న గాయం పడి, రక్తం కారుతున్నది కూడా పాపం ఆ ఈశ్వరుడికి. అయ్యో! దేవుణ్ణి నరికామే అని చాలా విచారించి, దంపతులు ముందు ఆ గాయం కడిగారు. తక్షణమే సవరవాడు అడవికి పోయి, తనకు తెలిసిన మందు ఆకులూ, మూలికలు తెచ్చి, పసరుపిండి గాయానికి పూశాడు. 

    " అయ్యో! దేవుణ్ణి కొట్టాను గదా, దేవుడేమి చేసి పోతాడో ! " అని భయపడ్డాడు పాపం సవరవాడు. ఎంత నిద్ర పోదామన్నా నిద్ర పట్టలేదు. వాడికి చివరకు ఎల్లాగో, వేకువ సమయాన చిన్న కునుకు పట్టింది. 

    కలలో ఈశ్వరుడు కనబడి " ఓయీ! సవరా! నీవేమి భయపడకు. నేనక్కడ ఉన్నానని నీకు మాత్రం ఏం తెలుసు? పాపం, తెలియక చేశావు. రేపు ఉదయాన్నే, నువ్వు ఇక్కడినుండి బస మార్చి, వేరే అడవికి పో! తరువాత పట్టణానికి పోయి, రాజుగారితో ఈ సంగతంతా చెప్పు. నీ దరిద్రం తీరిపోతుంది " అని చెప్పి మాయమైనాడు. 

    కల వచ్చిన వెంటనే సవరవాడు కన్నులు నులుముకుంటూ లేచి, భార్యలిద్దరనూ లేపాడు. ఈశ్వరుడు చెప్పిన మాటలు వాళ్ళకు చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యం పొందారు. దేవుని మహిమలు తెలిసిన పెద్దభార్యకు ఇటువంటి కలలంటే ఎంతో నమ్మకం. అందుచేత ఒక్క క్షణమైనా ఆలశ్యం చేయక ఈశ్వరుని ఆజ్ఞ శిరసావహించాలని ఆమె భర్తను తొందర పెట్టింది. 

    తెల్లవారి లేవగానే, ఇంక ఆ స్థలంలో నిలువకుండా, భార్య లిద్దరనూ వెంటబెట్టుకొని సవరవాడు ఇంకో అడవికి కాపురం మార్చివేశాడు. ఈ విచిత్రాన్ని రాజుగారితో మనవి చేయటానికి ఆ రోజే పట్నం వెళ్ళాడు. 

    పట్టణంలో ఉన్నవాళ్ళంతా, సవరవాడు చెప్పిన కథవిని చాలా అశ్చర్యపోయారు. చెట్టులో శివుడు ఉండటం ఏమిటని, సవరవాడూ, పట్టణంలోని ప్రజలూ, అందరూ కలసి కోటలోకి పోయి రాజుగారితో చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు వింటే, రాజుగారికి కూడా ఆశ్చర్యమేసింది. చెట్టులో పుట్టిన శివుణ్ణి చూడటానికి రాజుగారు పెద్ద పరివారంతో బయలుదేరాడు.

    ఆ అడవిలోంచి " వంశధార " అనే నది ప్రవహిస్తున్నది. దాని ఒడ్డున ఒక చిన్న సవర పల్లె ఉంది. రాజు, అతని పరివారమూ కూడా ఆ గ్రామానికి వెళ్ళి " ఆ దేవుడుండే స్థలం ఇక్కడికెంత దూరం?" అని గ్రామస్థులను అడిగారు. 

    " బాబూ! ఇక్కడి కింకా రెండు మైళ్ళ దూరం ఉంది. అదుగో, ఆ దిక్కు చూడండి, ఆ కనబడుతున్న శిఖరమే దేవాలయం " అన్నారా పల్లెవాళ్ళు. అప్పుడే ఉదయించిన సూర్యకాంతిలో, ఆ శిఖరం బంగారంలా మెరుస్తున్నది. సవరవాడూ, రాజూ, పరివారం, అందరూ ఆశ్చర్యపోయారు, నిన్నటికి లేని గుడి యివాళిటికెలా తయారయిందా! అని. 

    " ఆ గుడి ఎవరు కట్టారు? " అని రాజు పల్లెవాళ్ళను అడిగాడు. 

    " బాబూ! అదేమో మేము ఎరుగము, కాని నిన్న రాత్రి తెల్లవార్లూ అక్కడ పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగుతోపాటు చాలామంది జనం మాట్లాడిన సందడి కూడా వినబడింది. మేము అందరం, అదేమిటో చూద్దామని కొంచెం దూరం పోయే సరికి దార్లో పులులు, సింహాలు ఎదురై మమ్మల్ని ముందుకు పోనిచ్చాయికావు. అందుకని తిరిగి వచ్చేశాము. ఉదయం లేచి చూద్దుముకదా, అక్కడ గుడి కనబడింది. ఈ విధంగా గుడికట్టడం మానవులవల్ల కాదు. తప్పకుండా ఇది దేవతలు చేసినపనే అనుకున్నాము. ఇంతే మాకు తెలిసినది " అని పల్లె వాళ్ళు చెప్పారు. 

    ఈ సంగతి వినేసరికి అందరకూ చాలా ఆశ్చర్యంవేసి, తొందరగా ఏరు దాటి ఆ గుడి దగ్గరకు పోయారు. ఆ గుడికి వెనుక భాగంలో పారుతున్న " వంశధార "  నదిలో స్నానం చేసి అందరూ గుడిలో ప్రవేశించారు. లోపల రెండు వెండి దీపపు సెమ్మెలలో దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో ముఖం ఉన్న ఈశ్వరలింగం వాళ్ళకి కనబడింది. విగ్రహం తలమీద మాత్రం చిన్న లొట్ట కనబడింది. అదే, సవరవాడు నరకడంవల్ల ముక్క పోయిన జాగా అయి ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల మారేడుచెట్టు గాని, పారిజాతంచెట్టు గాని, సవరవాడి గుడిసె గాని ఏమీ కనబడలేదు. 

    రాజుగారు, వెళ్ళిన జనం అంతా ఆ దేవునికి ముఖం ఉంది కాబట్టి " ముఖలింగేశ్వరుడు " అని పేరు పెట్టారు. పువ్వులు, పత్రి తెచ్చి భక్తితో పూజించారు. ఆ దేవుని పేర రాజుగారు చాలా ఆస్తి రాసిచ్చారు. 

    ఇటువంటి గొప్ప దేవుణ్ణి సవరవాడు ముందుగా చూశాడు కాబట్టి, వాడికి చాలా ధనం ఇచ్చారు. సవరవాడికి కలలో ఈశ్వరుడు కనబడి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినై. ఇదంతా దేవుని మహిమ కదా అని వాడు ఎంతో సంతోషించి, అప్పటినుంచి గొప్ప ఈశ్వర భక్తునిగా మారిపోయాడు. 

    గుడి తయారుగానే ఉంది కాబట్టి, రాజుగారు దేవునకు అనేకమంది అర్చకులను నియమించారు. ఆ అర్చకులందరకూ అక్కడనే ఇళ్ళు కట్టించి యిచ్చారు. ఇళ్ళన్నీ చేరి అది ఒక గ్రామంగా తయారయింది. ఈ విధంగా వెలసిన ఆ గ్రామానికి కూడా " ముఖలింగం " అని రాజు గారు పేరు పెట్టారు. 

    సవరవాడు గుడిసె వేసుకొని నివసించిన ఆ అడవి ప్రదేశంలో ఈనాడు ఈశ్వరుని ఆలయం వెలిసింది. అక్కడ ఎల్లప్పుడూ అతి వైభవంగా అర్చనలూ, అభిషేకాలూ జరుగుతూ ఉంటాయి. శివరాత్రినాడు ముఖలింగేశ్వరుడికి జరిగే గొప్ప ఉత్సవం చూడటానికి రెండు కళ్ళూ చాలవన్నమాట. 

    కొంత కాలమయిన తరువాత, భూమి దున్నుకునే వాళ్ళకు, నూతులు త్రవ్వుకొనే వాళ్ళకు ఎక్కడికక్కడే బోలెడన్ని శివలింగాలు కనబడుతూ వచ్చాయి. ఆ ఊరిచుట్టూ, ఎక్కడ చూసినా శివలింగాలే. 

    ఒక్కొక్క శివలింగానికి " భీమేశ్వరుడు " "సోమేశ్వరుడు " అంటూ పేర్లుపెట్టి రాజుగారు ఎన్నో ఆలయాలు కట్టించారు. ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే ఆ " వంశధార " నది ఒడ్డునా, తోటల్లోనూ, కొన్ని ఇళ్ళలోనూ శివలింగాలు కనబడుతూనే ఉంటాయి. 

    ఇక్కడ దొరికే లింగాలు కోటికి ఒక్కటి తక్కువగా ఉన్నవని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. అదీగాక, వంశధారా నది గుడికి ముందు కాకుండా వెనుకవైపు ప్రవహించడం గూడా ఒక లోపమేనట. ఈ లోపాలే లేకుండా ఉంటే ఈ గ్రామం కూడా కాశీతో సమానమైన మహత్తు కలిగి ఉండేది అని వారి ఉద్దేశం. 

    

    

    
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...