:: వటపత్ర బాలగణపతి ::
సత్యలోకంలో కమలాసనంమీద కూర్చుని, పగలంతా సృష్టిచేసి చేసి అలసిన బ్రహ్మకు, కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది. ఆ నిద్రమత్తులో ఆయన ఆవులించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్లి, అగ్నులను వెదజల్లాయి. నిద్రపట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా, ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయమేఘాలు మెరుపులతో భయంకరంగా ఘర్జిస్తూ, ఏనుగుతొండాలవంటి ధారలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి. ఆయన కనురెప్పలు బరువుగా వాలడం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా గాఢాంధకారం అలముకున్నది.
ఈ ప్రళయ పరిస్థితిలో బ్రహ్మ నిద్రించాడు. ఆయనకు ప్రళయమనేది రాత్రి కాలం. తిరిగి నూతన కల్పారంభం ప్రారంభం కానున్న సమయం ఆసన్నమైంది. సరికొత్త జగత్తుమీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాలరాగ స్వరాలను మెల్లగా పలికిస్తూండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది.
ఆయన పద్మాసనంవేసి కూర్చొని, నాలుగు ముఖాలతో నాలుగు దిక్కులూ కలయజూశాడు.
కింద ఉన్న జగత్తు అంతా నీటిమయమై మహాపర్వతాల్లాంటి కెరటాలతో కల్లోలంగా ఉంది. ఆ తరంగాలమధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లుకొలిపే తెల్లని కాంతిరేఖ కనిపించింది.
ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్రిఆకు, దానిపై చందమామలాంటి పసివాడు పడుకొని కుడికాలు బొటనవేలు చప్పరిస్తూ కనిపించాడు.
బ్రహ్మ చేతులు జోడించి, కన్నులుమూసి ధ్యానించి తెరిచినంతలో ఒక వింతదృశ్యం కనిపించింది.
ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మమేనని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే. కాని ఇప్పుడా పిల్లవాని తల ఏనుగుతలను పోలి, చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెట్టుతూన్నట్టుగా కనిపించింది.
ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు. నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరునిముషంలో, ఆకుతోసహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. బ్రహ్మకు ఆ ప్రదేశాన ఎత్తుగా లేచిన పెద్ద మట్టిదిబ్బ ఒకటి కనిపించింది.
క్రమక్రమంగా నీటినుండి సువిశాలమైన భూభాగాలూ, సముద్రగర్భాలూ ఏర్పడ్డాయి.
బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు. మొదట పర్వతాలూ, నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరుతీసి జగత్తుమీద చల్లాడు. తరువాత వృక్షాలనూ, సస్యాలనూ, ఖనిజాలనూ సంకల్పించాడు. పిమ్మట కదలాడే జీవరాశిని - మొదట సముద్రంలో చేపలనూ, భూమ్మీద జంతుజాలాన్నీ, క్రిమికీటకాదుల్ని, పక్షుల్నీ సృజించాడు. తరువాత మనుష్యులను సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు.
బ్రహ్మ సృష్టిచేస్తున్నంతసేపూ సరస్వతీదేవి వీణ వాయిస్తూనే ఉన్నది. ఎందువలనో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది. సరస్వతి నివ్వెరపడుతూ కిందకు చూసి మరింత నివ్వెరపడింది. బ్రహ్మ అర్థాంగి నివ్వెరపాటు అర్థంగాక కమలాసనంనుంచి వంగి కిందకు చూశాడు.
పర్వతాలు బోర్లపడుతూ శిఖరాలు భూమిలోకి పాతుకొని వెడల్పుగా పర్వత పాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతూన్నవి.
నదులు సాగరంనుంచి ఎత్తు ప్రదేశాలకు చేరుకోబోతున్నవి. వృక్షాలు తలకిందులుగా, వేళ్ళు ఆకాశానికి తన్నుతున్నవి.
జంతువులూ చాలా అనర్థాలతో పుట్టాయి. తలలులేకుండా కొన్ని, వెనుకకాళ్ళు లేకుండా కొన్ని, ఒంటికాలువి, మూడుకాళ్ళవీ, కళ్ళూ, చెవులూ అన్నీఉండి నోరు అనేది లేనివీ, తోకలకు తలలున్నవీ, తలలకు తోకలున్నవీ కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు. అవి నడవాలంటే కాళ్ళు లేక నేలమీద దొర్లుకుంటున్నవి.
ఈ వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగుందోనని ఆత్రంగా చూశాడు.
మనుషులలో కొందరికి రెండుతలలున్నాయి. అందులో ఒకటి స్త్రీది, రెండోది పురుషుడిది.
పురుషులు జానెడు, బెత్తెడుగా ఉన్నారు. స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా, తాటిచెట్లలాగా ఉన్నారు. వీపులకు తలలు అతికించినట్లున్నవాళ్ళు, నాలుగు, మూడు, ఒంటికాళ్ళవాళ్ళూ, పొట్టకే పెద్దనోళ్ళున్న కబంధులూ ఆక్రందనలుచేస్తూ కనిపించారు.
జంతువులు మోరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నవి. మూగగా చూస్తున్నవి. బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నవి, కదనుతొక్కుతున్నవి.
ఒక జానెడు మగవాడు తాటిచెట్టంత వికృతాకారిణి అయిన స్త్రీని చూపిస్తూ " ఓ బ్రహ్మదేవుడా! ఇలాంటి స్త్రీతో నేనెలా సంసార సాగరం ఈదేది? " అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు.
" నాలుగుతలలంటూ ఉన్నా, అసలు తల అంటూలేని ఓయీ బ్రహ్మదేవుడా! మమ్మల్నెందుకిలాగ పుట్టించావు? " అంటూ వికృతాకారాల మనుషులు చేస్తున్న ఆక్రందనలు మిన్నుముట్టుతున్నవి.
బ్రహ్మ నాలుగుతలలూ గిర్రున తిరిగిపోయాయి. ఎనిమిది కళ్ళూ బైర్లుకమ్మాయి. తెల్లబోతూ బ్రహ్మ సరస్వతివంక అయోమయంగా చూశాడు. అతని నాలుగు తెల్లమొహాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి ఊరుకున్నది.
" ఎందుకిలా జరిగింది? సక్రమమైన సృష్టి జరపాలనే సత్సంకల్పంతోనే కదా! నేను సృష్టికి పూనుకున్నాను. ఇలాగ ఎందుకు జరిగింది? " అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తలలుపైకెత్తి అరిచాడు బ్రహ్మ. అతని ప్రశ్న దశదిశలా మారుమ్రోగింది. అయోమయంగా వెర్రిచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుతమూర్తి కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగుతల ఉన్నది. నాలుగు చేతులలో పాశము, అంకుశము, కలశము, పరశువు ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుడివలె ప్రకాశిస్తున్నాడు. తెల్లని అతని ఉత్తరీయము ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతున్నది. అప్పుడు సరస్వతివీణ ఓంకారనాదం చేసింది. సరస్వతీదేవి వేళ్ళు వాటంతట అవే వీణపై నాదనామ క్రియారాగాన్ని పలికిస్తూ, మాయామాళగౌరవ రాగానికి మారుతూ, హంసధ్వనిరాగాన్ని అందుకొన్నవి. గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు. అతనిచుట్టూరా శరత్కాల పూర్ణిమనాటి వెన్నెలవంటి వెలుగు ఆవరించి ఉన్నది.
బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, " మహానుభావా! అద్భుతమూర్తివైన నీవెవ్వడవు? నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని. అనుగ్రహించు " అని అడిగాడు.
" నాయనా! బ్రహ్మదేవా! సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూంటుంది. అదే విఘ్నం. విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను. విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్నీ నిండుకలశంలాగ జయప్రదంచేసే విఘ్ననాయకుడిని. పంచభూతములనబడే పృథ్వి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములనే భూతగణానికి అధిపతినైన గణపతిని. ఆహారధాన్యాల్ని ఫలించే సస్యాల్ని నాశనంచేసే మదించిన ఏనుగులవంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాశము అనే బలమైన త్రాటితో కట్టి ఉంచే నన్ను విఘ్నేశ్వరుడని పిలువు " అని గంభీరస్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు.
అప్పుడు బ్రహ్మ " దేవా! విఘ్నేశ్వరా! నా సృజన శక్తికి ఎందుకిలాగ ఘోరమైన విఘ్నం జరిగింది. ఇన్ని వంకరలెందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు " అన్నాడు.
" విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది. మర్రిఆకుపై బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను. అప్పుడు నా గురించి ఆలోచించ లేకపోయావు. నా గురించి ఆలోచించడమంటే విఘ్నం గురించి ముందుజాగ్రత్తపడే జ్ఞానాన్ని కలిగి ఉండడమే! ఆ జ్ఞానస్వరూపుణ్ణే నేను. బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతిజీవీ కార్యరంగానికి దిగేముందు విఘ్నం రాకుండా జయప్రదం కావడానికి తగు జాగ్రత్తనూ, జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు. ఏనుగు అడుగు వేసేముందు నేల గట్టితనాన్ని తెలుసుకొని మరీ నడుస్తుంది. ప్రాణుల్లో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది. ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను. నీవు నిద్రిస్తూన్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడు నీ నాలుగు వేదాల్నీ అపహరించి సముద్రం అడుగున దాచాడు. మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్రశాయినై ఉన్న నా దగ్గర ఉంచాడు. ఇవిగో! వాటిని తిరిగి గ్రహించి సృష్టి నిర్వర్తించు " అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలనిచ్చాడు.
బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ " విఘ్నేశ్వరా! నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి, మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు. అవకతవకలుగా తయారైన సృష్టి ఉపసంహరించుకునేలాగా చెయ్యి " అని కోరాడు.
విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకూ జరిగిన వంకరటింకరుల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైంది. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో " ఓ బ్రహ్మదేవుడా! వక్రతను తుండతుండములుగా ముక్కలు చేసేవాడిని కనుక నేను వక్రతుండుడు అనేపేరు సార్ధకంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతూంటాను. వక్రతుండుణ్ణి అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పనికూడా వంకరపోదు. నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించు. సృజించటం ఒక కళ. ఆ కళ ఎటువంటి వంకరటింకరులు పోకుండా జగత్తు నీవు మలచిన కళానిలయంగా భాసిస్తుంది. నీకుమల్లే జగత్తులో అందరికీ అందుబాటుగా తొలిపూజలందుకునే విఘ్నేశ్వరుడిగా విఘ్నాలనుంచి కాపాడుతూ, సంకల్పసిద్ధిని కలిగించే సిద్ధివినాయకుడిగా, సకల గణాలకూ అధిపతిగా గణపతినై శివపార్వతులకు కొడుకుగా అవతరిస్తాను " అని చెప్పి బ్రహ్మను దీవించి అంతర్థానమయ్యాడు.
సరస్వతీదేవి బ్రహ్మకేసి చిరునవ్వు నవ్వి హిందోళ, శ్రీరాగాలతో మంగళస్వరాల్ని మహాకాశం పులకరించేటట్లుగా వీణపై వినిపించింది.
బ్రహ్మ " విఘ్నేశ్వరాయనమ: " అంటూ సృష్టిని ప్రారంభించాడు. సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది. గంభీరమైన పర్వత పంక్తులూ, అమృత జలాలతో నదులూ, సుందర వనాలూ, రంగురంగుల బొమ్మల్లాంటి జంతుజాలమూ, శారీరకంగానూ, మానసికంగానూ ఉన్నతులూ, బలవంతులూ అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళానిలయంగా విలసిల్లింది. వాగ్దేవి అయిన సరస్వతి తన వాణిని సంగీతంలా ప్రాణకోటికి స్వరపరచింది. జీవకోటి సలక్షణంగా పెరిగింది.