30, సెప్టెంబర్ 2025, మంగళవారం

:: కుమారస్వామి జననం ::  

    " విఘ్నేశ్వరా! ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూంటాయి. ముందుకాలంలో ప్రజల స్వేచ్ఛ, శ్రేయస్సులకోసం సాగే ఉద్యమాలు గణేశ ఉత్సవాలతో జయప్రదంగా కొనసాగి ఫలిస్తాయి. ఉత్సవాలన్నిటికి గణపతి నవరాత్రి ఉత్సవం తిలకంగా ఉంటుంది " అని ఆకాశవాణి పలికింది. 

    విష్ణువు విఘ్నేశ్వరుడితో " పార్వతీ నందనా! మేనల్లుడివని చెప్పి నాకు మరొక పనికూడా కల్పించావా! " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " మేనమామ వరసపెట్టి కాలనేమి అయిన కంసుణ్ణి మేనమామ గండాన నువ్వెలాగూ పుట్టి, చంపుతావుగదా! ఇలాంటి వరసలన్నీ నీవు నేర్పిన విద్యలేగదా! నీరజాక్ష! " అన్నాడు. 

    విష్ణువు " విఘ్ననాశకా! నీ పరశువుముందు నా చక్రాయుధం ఏపాటి? నీ గొడ్డలి సాము చూసినప్పుడు మహముచ్చటేసిందిసుమా! " అన్నాడు. 

    " పరశురామావతారంలో నా గొడ్డలి ఎరువు తీసుకెళ్ళి గర్వపోతులైన క్షత్రియుల్ని తెగనరుకుదువుగానిలే " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    విష్ణువు " గజవిఘ్నాసురుడిమీద ఎక్కి మర్దిస్తున్నప్పుడు నీ బుడిబుడి నడకల గుజ్జురూపం కూడా నన్నెంతో మురిపించిందోయ్ " అన్నాడు. 

    " అలాగైతే,వామనుడవై బలిచక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కుదువుగానిలే " అని విఘ్నేశ్వరుడు అన్నాడు . 

    " నీ బుద్ధి విశేషం గూడా నన్ను అమితంగా ఆకర్షించుతోంది. ఏం చెయ్యను? " అని విష్ణువు అనగా, విఘ్నేశ్వరుడు " ఏ యుగానికి అవసరమైన ధర్మాన్ని,  ఆ యుగంలో స్థాపించడమేగదా, నీ అవతారాలకు మూలకారణం. ధర్మ సంస్థాపనకు అసలు అర్థం సంఘం హింసతో, మూఢాచారాలతో కుళ్ళిపోతున్న రోజుల్లో బుద్ధుడవై మానవులకు సక్రమ సంఘ జీవనాన్ని, నిర్వాణాన్ని బోధించుతావులే! మాయాదేవి స్వప్నంలో నా తెల్లని ఏనుగురూపం గర్భంలో ప్రవేశించి బుద్ధుడైన సిద్ధార్థుడి అవతారానికి నాంది పలుకుతుంది " అని చెప్పాడు. 

    విష్ణువు మహదానందం పొందాడు. 

    పరమాణు రూపంలో ఉన్న విఘ్నం " విఘ్నరాజా! నీ బానిసను. నీ ఆజ్ఞానువర్తిని. వెడుతున్నాను " అని శలవు తీసుకొని కాళింది మడుగుజేరి కాళియుడుగా దాక్కుంది. 

    విఘ్నం వెనుకనే మూషికాసురుడు మూషికరూపంతో వచ్చి ప్రచ్ఛన్నంగా దాగి, విఘ్నానికి పట్టిన గతిచూసి పటపట పళ్ళుకొరికి, నిజరూపంతో బోరవిరుచుకొని విఘ్నేశ్వరుడి ముందు నిలబడి సింహనాదం చేశాడు.

    విఘ్నేశ్వరుడు బలిష్ఠమైన అతని శరీరాన్ని సంతృప్తిగా చూశాడు. మూషికాసురుడు నిర్లక్ష్యంగా విషపు నవ్వు నవ్వుతూ, " విఘ్నం నీ బానిస గనుక ఏం చేసినా చేశావుగాని, నేను నీ జన్మ విరోధిని. సింహస్వప్నం అనే మాట వినే ఉంటావు. సింహాన్నై నీ కుంభస్తలాన్ని చీలుస్తాను " అని అంటూ సింహంగా మారి పెద్దగా గర్జించాడు. 

    విఘ్నేశ్వరుడు " సింహమా! నువ్వు జగజ్జనని వాహనానివి. నిన్ను గౌరవిస్తున్నాను " అన్నాడు. 

    సింహం మళ్ళీ గర్జించి ఉరకబోతూంటే, విఘ్నేశుడు " శివా, శరభా! " అని స్మరించాడు. 

    సింహానికెదురుగా శివుని శరభావతారం ఘీంకార గర్జనలు చేస్తూ నిలిచింది. శరభానికి సింహ శరీరము, కేసరాలు, కోరలు ఉంటూ ఏనుగు తొండము, దంతాలు ఉన్నాయి. మహాసర్పంలాంటి తోక, చివర జ్వాలలు కక్కే మఖరముఖము ఉంది. శరభం జూలు అగ్నిశిఖల్లాగా ఎగురుతోంది. శరభం తొండంతో సింహం ముఖం వాచేలా కొట్టింది. సింహం తోకముడిచి పరుగుతీసింది. శరభావతారం మాయమయింది. 

    విఘ్నేశ్వరుడు తొండాన్ని యోజనం పొడవున సాగదీసి సింహం నడుము చుట్టుపట్టి ఎత్తాడు. సింహం కిరకిర లాడింది. ఆ సమయంలో ఆకాశ గమనం చేస్తున్న నారదుడు ' సా' అని గొంతు సాగదీస్తూ " సామజవరవదనా " అంటూ హిందోళ రాగాన్ని ఆలాపించాడు. 

    దేవతలు గుమిగూడి ఆకాశంనుండి వింత చూస్తున్నారు. విష్ణువు " విజయవిఘ్నేశ్వరా! నువ్వు పట్టిన సింహాన్ని పెంచుకుంటాను. యివ్వవూ? " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు నవ్వి " పెంచినట్టే పెంచి తలా, గోళ్ళు తీసుకొని నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి చీలుద్దామనా? అదేం కుదరదు. ఈ మృగరాజు అవసరం నాకు ఉంది. నీ నరసింహావతారం నీవు చూసుకోవలసిందే " అన్నాడు. 

    తొండం మూషికాసుర సింహాన్ని తిన్నగా తీసుకెళ్ళి మహాశ్వేతముందు విడిచి అదృశ్యమయింది. మహాశ్వేత భర్తకు హితవు చెప్పినా వినకుండా నిజరూపంతో విఘ్నేశ్వరుడితో ఢీకొనడానికి పరుగుతీశాడు. మహాశ్వేత దేవిని ప్రార్థించింది. దేవి కనిపించి " నీ భర్త విఘ్నేశ్వరుడికి ఎలుక వాహనంగా చిరంజీవిగా ఉంటాడు. అలా రాసిపెట్టి ఉంది. నీవు కూడా శ్వేత ఛత్రానివై నీ భర్తతో పాటు కలకాలం విఘ్నేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటావు " అనిచెప్పి అంతర్థానమయింది. 

    వజ్రదంతుడు కామరూపి గనుక, ఈసారి ఏనుగుల్ని తన్నుకుపోగల గండభేరుండ పక్షి రూపంతో, దారిలో కనుపించిన రెండు ఏనుగుల్ని గోళ్ళతో పట్టుకొని ఎగిరి వెడుతూండగా చెలరేగిన అలజడికి, చిన్న గ్రద్ద రూపంతో ఒక చెట్టుమీద హరిని ధ్యానిస్తూ ఉన్న గరుత్మంతుడికి ధ్యాన భంగమయింది. కోపంతో గ్రద్ద గండభేరుండాన్ని ముక్కుతో పొడిచింది. ఆ పోటుకు వజ్రదంతుడు నిజరూపంతో నేలకూలాడు. 

    గరుత్మంతుడు " ఇంతకంటే రుచికరమైన ములుకుపోట్లు తినబోతున్నావు. వెళ్ళు " అంటూ ఎగిరిపోయాడు. 

    మూషికాసురుడు వెళ్ళి విఘ్నేశ్వరుడితో " నీకూ ఉన్నాయి పెద్ద దంతాలు. వెలక్కాయలు నొక్కి తినడానికి తప్ప మరెందుకూ పనికి రావు. నా దంష్ట్రలతో వజ్రాల్ని పిండి చేస్తాను. కైలాసాన్ని గుల్ల చేస్తాను. తెలుసునా? " అన్నాడు. 

    వినాయకుడు దిక్కులు చూస్తూ, తనలో తాను గొణుక్కుంటూన్నట్లుగా " ఔనౌను. ఎందుకూ కొరగాని దంతాలు ఉండి ఎందుకూ? " అంటూ ఒక దంతాన్ని పటుక్కున సగానికి విరచి, పారేసినట్టుగా విసిరేశాడు. 

    ఆ దంతం గాలిలో గిర్రున తిరుగుతూ ఇంద్రజాలం ప్రదర్శించి వెళ్ళి వజ్రదంతుణ్ణి గుచ్చి గుచ్చి పొడవడం ప్రారంభించింది. రక్తం ధారలుకట్టి కారసాగింది. మహాశ్వేత అది చూడలేక మూర్ఛ పోయింది. వజ్రదంతుడు చిన్న ఎలుకగా మారి తుర్రున పారిపోయి రాళ్ళ మధ్య కలుగు చేసుకొని దూరాడు. ఒక దంతాన్ని విరుచుకొని విఘ్నేశ్వరుడు ఏకదంతు డనిపించు కొన్నాడు. 

    దంతంకూడా కలుగులో దూరి ఎలుకను అలా పొడుస్తూనే వెంబడించింది. 

    తోకవెంట రక్తం జాడకడుతూంటే ఎలుక సొరంగం దొల్చుకొంటూ పాతాళానికి, పాతాళం నుంచి భూమ్మీదకు వచ్చి పరుగులుతీసి లోకమంతా చుట్టి చివరకు విఘ్నేశ్వరుడి శరణుజొచ్చి " నాకా చావు రాదు. నీ దంతం గుచ్చి గుచ్చి చంపుతున్నది. బాధతప్పించు దేవా! " అని వేడుకున్న మూషికాసురుడికి విఘ్నేశ్వరుడు అభయం యిచ్చాడు. దంతం వచ్చి అతని హస్తం అలంకరించింది. 

    విఘ్నేశ్వరుడు " మూషికా! చూట్టానికి చిట్టెలుకవే కాని, మహాబలుడివి. మహాకూర్మావతారంతో మంధరపర్వతాన్ని, ఆదివరాహావతారంతో భూమిని ఎత్తిన విష్ణువుకంటే బలశాలివి. తగిన వాహనం కుదరక నేను నా లంబోదరంతో నడవలేక అవస్థ పడుతున్నాను. నీలాంటి...." అంటూ చెప్పటానికి సందేహిస్తున్నట్టు నసిగాడు. 

    విఘ్నేశ్వరుని పొగడ్తకు మూషికాసురుడు పొంగిపోయి " స్వామీ! నీ దంతం నాలోని అజ్ఞానాన్ని పారదోలి గుచ్చి గుచ్చి జ్ఞానాన్ని నింపింది. నీకు వాహనం కావడం నా భాగ్యంగా భావిస్తున్నాను " అంటూ ఏనుగంత ఎలుకగా పెరిగాడు. 

    విఘ్నేశ్వరుడు దానిపై కాలుమోపి కూర్చోబోగా మహామూషికం కీచుకీచుమంటూ అణుక్కుపోయింది. 

    విఘ్నేశ్వరుడు " నాయనా! మూషికా! నీవు చిట్టెలుకగా ఉంటేనే నన్ను సునాయాసంగా మోయగలవు. నా ఆకారానికి చిట్టెలుక వాహనమే అన్ని విధాలా అమరుతుంది " అన్నాడు. 

    మూషికాసురుడు యధాప్రకారంగా చిట్టెలుకగా తగ్గిపోయాడు. విఘ్నేశ్వరుణ్ణి ఎక్కించుకొని చకచకా చుట్టూరా తిరుగుతూ " ఔను స్వామీ! ఇప్పుడు నిన్ను మోస్తున్నట్టే లేదు " అన్నాడు. 

    మూర్ఛనుండి తేరుకున్న ధవళ విఘ్నేశ్వరుడికి నమస్కరించి " దేవా! నా భర్త నీకు చిట్టెలుక వాహనంగా ఉంటాడు. నేనుకూడా నీకు శ్వేత ఛత్రమై ఉంటాను. ఈ వరం అనుగ్రహించు " అన్నది. 

    విఘ్నేశ్వరుడు " అమ్మా! నీ తెల్లని గొడుగు చల్లని నీడ నాకు రక్ష. నా భాగ్యంకొద్దీ దొరికింది " అంటూ ఎలుకను చూసి, వజ్రదంతా! దేవి అనుగ్రహం పొందిన సాధ్వి ధవళ మాటకు తిరుగులేదు. నా వాహనంగా ఉండు. నాతోబాటే నాకు పెట్టేవన్నీ నువూ తిను. అందరూ మొట్టికాయలు పెట్టుకొని, మూడు గుంజీలు తీసి లెంపలేసుకుంటూంటే తృప్తిగా ఉంటుంది.  నాముందు నీముందు కూడా అలాగే అంతా చేస్తూంటారు " అన్నాడు.

    " ఔను దేవా! నేనూ అలానే కోరదామనుకున్నాను. నేను వజ్రదంతుడిగా నా ముందర దేవతల చేత అలాగే చేయిస్తూండేవాణ్ణి. నీ వాహనాన్నై కృతార్థుడనయ్యాను " అని మూషికుడన్నాడు. 

    ధవళ తెల్లని గొడుగుగా విఘ్నేశ్వరుడిపై నిలిచింది. ఆ దంపతులు చిరంజీవులై వినాయకుణ్ణి అలాగే సేవిస్తూంటారు. విఘ్నేశ్వరుడు మూషికవాహనుడయ్యాడు. 

    విష్ణువు విఘ్నేశ్వరుడితో " ఏకదంతా! మూషికోత్తమవాహనా! నీ వాహనం చూస్తే నాకు అసూయగా ఉందోయి. ఎంత మంచి వాహనాన్ని సంపాదించావు! " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " నీ కల్కి అవతారంలో నా వాహనం నీకు తెల్లని గుర్రమై అంతరిక్షాన్ని దాటి గ్రహాంతరాలకు తీసుకు వెళ్తుందిలే. మానవులకు క్రొత్త వలస రాజ్యాలు సమకూర్చు " అన్నాడు. 

    విష్ణువు " ఆహాహా! నీ నోటి చలవ వల్ల అలాగే జరగాలి " అని ఆనందించాడు. 

    నారదుడు " విజయవిఘ్నేశ్వరా! ఇప్పటికి నీతోబాటే విష్ణువు తొమ్మిది అవతారాలు తెలిశాయి. ఒక్కటి మిగిలింది " అన్నాడు. 

    విష్ణువు నారదుణ్ణి చూసి కన్నుగీటి, " త్వరలోనే  ఆ కళ్యాణ ఘడియ వచ్చినపుడు అదీ తెలుస్తుందిలే. తొందరెందుకు " అన్నాడు. 

    " ఎవరి కళ్యాణం దేవా? " అని అడిగాడు నారదుడు. 

    " మన కళ్యాణ చక్రవర్తి విజయవిఘ్నేశ్వరుడిదే " అన్నాడు విష్ణువు. 

    విఘ్నేశ్వరుడు చిరుకోపంగా చూశాడు. 

    " వెయ్యి విఘ్నాలు కల్పించుకోక తప్పదు " అని గట్టిగా అనుకున్నాడు. 

    " నాయన్నాయన! అంతటితో సరిపెట్టు. వెయ్యి విఘ్నాలు పూర్తయ్యాక అర విఘ్నం అయినా కల్పించుకోడానికి చెల్లేదు లేదు సుమా! " అని విష్ణువు హెచ్చరించాడు.

    నారదుడు " వెయ్యి విఘ్నాలనగా ఏ మాత్రం? వెయ్యి విఘ్నాల తర్వాత విఘ్నేశ్వరుడి పెళ్ళి తప్పదు-తప్పదు" సరిసరిమాగరి అని పాడుతూ ముల్లోకాలూ తిరిగాడు. 

    శివుడికి పార్వతిపై గల మోహానురాగం తేజస్సుగా మారింది. అగ్నిదేవుడు దాన్ని తీసుకెళ్ళి శరవణ సరస్సు చేరేలాగా చేశాడు. ఆరు ముఖాలతో కుమారస్వామి అవతరించాడు. ఆరుగురు ఋషిభార్యలు అతణ్ణిపెంచి పార్వతీ పరమేశ్వరులకు అప్పగించారు. కుమారస్వామి పెరిగి పెద్దవాడయ్యాడు. గరుత్మంతుడు అతడికి నెమలి వాహనం యిచ్చాడు. ఇంద్రుడు అతడికి ఎన్నో ఆయుధాలు ఇచ్చాడు. పార్వతి శక్తిబళ్ళాణ్ణి యిచ్చింది. కుమారస్వామి పెరిగి పెద్ద అవుతూంటే తారకాసురుడు తల్లడిల్లిపోతూ భయంతో పీడకలలు కనసాగాడు. 

    కుమారస్వామి గొప్ప తపస్సుచేసి బ్రహ్మజ్ఞానాన్ని విడమర్చి చెప్పి సుబ్రహ్మణ్యస్వామి అనిపించుకున్నాడు. ఓంకారం గురించిన నిగూఢరహస్యాన్ని శివుడంతటి వాడికే గురువై ఉపదేశించాడు. అన్నదమ్ములైన విఘ్నేశ్వరుడు, కుమారస్వామి కైలాసంలో పార్వతీశివుల కనులపండుగగా  ఎంతో సఖ్యంగా ఆటపాటలతో విహరిస్తున్నారు. 



    

27, సెప్టెంబర్ 2025, శనివారం

 :: విజయవిఘ్నేశ్వరుడు :: 

    పార్వతి క్షణంలో తన దు:ఖమంతా మరచిపోయి, పిల్లవాణ్ణి ఎత్తుకొని దిష్టి తీసింది. శివుడు చేతులుచాచి పిలిచాడు. శివుడు మళ్ళీ ఏంచేసి పోతాడో అని భయంభయంగా తప్పటడుగులు వేస్తూ వెళ్ళిన విఘ్నేశ్వరుడి ముద్దుచేష్టకు అంతా ముచ్చట పడ్డారు.

    " నాయనా! విఘ్నేశ్వరా! నిన్ను పుత్రుడుగా పొంది ధన్యులం అయ్యాం. చిరంజీవ! " అని శివుడు ఎత్తి ముద్దాడుతూంటే విఘ్నేశ్వరుడు క్రిందకు దూకి " తండ్రీ! ఎంతమాట. నేను మీ కొడుకును. ధన్యుణ్ణి నేను " అంటూ పార్వతీ శివుల పాదాలను చిరుతొండంతో చుట్టి, కళ్ళకద్దుకొని ప్రణామాలు చేశాడు. తరువాత విష్ణువును సమీపించి ఆయనకు ప్రణామం చేశాడు. 

    విష్ణువు " రావోయీ ముద్దుల మేనల్లుడా! " అని దగ్గరకు తీసుకొని " కల్యాణమస్తు " అని దీవించాడు. 

    అప్పుడు విష్ణువు కాంతిలో విఘ్నేశ్వరుడు నీలాకాశం రంగులో కనిపించాడు. విష్ణువుకీ, విఘ్నేశ్వరుడికీ ఏవో పోలికలున్నట్లు అందరికీ తోచింది. అదే, మేనమామ పోలిక అంటే! అని అనుకున్నారు. 

    వినాయకుడు బ్రహ్మకు నమస్కరించాడు. బ్రహ్మ " తొలిపూజలందుకోవయ్యా బొజ్జగణపయ్యా! " అని అంటూ అతని ఏనుగు బుగ్గలు చిదిమి చిటికె వేశాడు. 

    తరువాత విఘ్నేశ్వరుడు లక్ష్మికి, సరస్వతికి మ్రొక్కాడు. వాళ్ళిద్దరూ కలిసి అతణ్ణి ఎత్తుకొని చెరో చెంపా ముద్దాడి " మేము విఘ్నేశ్వరుడి ఇరుప్రక్కలా అత్తాకోడళ్ళ పొరపొచ్చాలు మాని ఇలాగే సఖ్యంగా ఉంటాము " అని పార్వతిని చూసి " ముగ్గురమూ ఒకే ముగ్గురమ్మల మూలపుటమ్మ నుండి వచ్చిన సంగతి పుత్రగణపతి చెప్పనే చెప్పాడు. తర్వాత మళ్ళీ విడివిడిగా క్షీరసాగరం నుంచి లక్ష్మి, బ్రహ్మ నాలుక నుండి సరస్వతిగా వాణి, మొదట దక్షుని కుమార్తె సతీదేవిగాను, ఇప్పుడు హిమవంతుని పుత్రి పార్వతిగా ఉమ అవతరించాము. జయలక్ష్మి అనే సిద్ధి, విద్యావతి అనే బుద్ధి వినాయకునకు తగిన వధువులు. ఇహ విఘ్నేశ్వరుని పెళ్ళి ముచ్చటే చూడాలి " అని అన్నారు. 

    లక్ష్మి " లక్ష్మీకరుడైన విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన వారిని స్థిరంగా అంటిపెట్టుకొని ఉంటాను. సిద్ధిస్వరూపిణి జయలక్ష్మి నా అంశ. వినాయకుడికి కానున్న భార్య " అని చెప్పింది. 

    సరస్వతి " విఘ్నేశ్వరుడు జ్ఞాన ప్రదాత. విజ్ఞానదాయకుడు. అక్షరాభ్యాసానికి ముందు పిల్లలచేత పసుపుముద్ద విఘ్నేశ్వరుడి పూజ జరిపించి, విఘ్నేశ్వర పరిపూర్ణ స్వరూపంగా గుండ్రంగా చుట్టించి మరీ ఓనమాలు దిద్దించాలి. నా అంశగల విద్యావతి బుద్ధి రూపిణి. వినాయకుని నాయకి " అని చెప్పింది. 

    అప్పుడు విఘ్నేశ్వరుడు బేలముఖం పెట్టి, అందరినీ కలయజూసి, " చూశారా! పెద్దలతీరు ఎలా ఉందో! పెళ్ళిచేసుకొని, వారు పడ్డ అవస్థలే పిల్లలుకూడా పడాలని పెళ్ళి తొందర పెడతారేగాని, హాయిగా ఉండనివ్వరు. అందునా అమ్మకు మరీ ఆరాటం " అన్నాడు. 

    అప్పుడు విష్ణుమూర్తి " లేదురా బాబూ! అణిమాది సిద్ధులకు, అష్టైశ్వర్యాలకూ మూలమైన సిద్ధులు ఎనమండుగురు, చక్కని చుక్కలై నిన్ను పూర్ణచంద్రుణ్ణి కొలిచినట్లు సేవిస్తూంటే చూడాలని తొందరగానే ఉంది సుమా! " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " ఓహో! అలాగా, నువ్వు కృష్ణావతారంలో అష్టమహిషులతో వేగుతూ ఆనందిద్దువుగానిలే " అన్నాడు. విష్ణువు మందహాసం చేసి " నీమాటకు తిరుగులేదు కాని, నీకుమాత్రం పదిమంది వధువుల పెళ్ళి తప్పదు " అన్నాడు. 

    " అలాగయితే విఘ్నేశ్వరుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అన్న సామెతగా, నేనే విఘ్నాలు కల్పించుకోక తప్పదు " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    " వెయ్యికాదు, కోటి విఘ్నాలు వచ్చినా విఘ్నేశ్వరుడి పెళ్ళి ఆగదు " అని బ్రహ్మతో గొంతులు కలిపి అందరూ అన్నారు. 

    అప్పుడు నారదుడు ముందుకు వచ్చి " విజ్ఞానేశ్వరా! వాచాలతలో నన్ను మించావు కాని, పెళ్ళి తప్పించుకోవడం ఎవరి తరం? నేను సంసార సాగరం ఈదడం చేతగాకనే గదా మునినై తిరుగుతున్నాను. జ్ఞానేశ్వరా! కళ్యాణం, ఉద్యోగం పురుష లక్షణం అని పురుషోత్తములూ ఆదిదేవుళ్ళూ అనిపించుకున్న ప్రముఖులంతా పెళ్ళిళ్ళు చేసుకొని సృష్టి, స్థితి, లయాది ఉద్యోగాలు చేస్తున్నారు. నీవూ, నేనూ అనగా ఎంత? " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు నవ్వి " ఓహో! నీకూ పెళ్ళిపిచ్చి తగిలేలాగుందే! స్వయంవరానికి కూడా వెళ్ళేవులాగుంది " అన్నాడు. 

    నారదుడు " త్రికాలవేదిని నేనే ననుకుంటే అనంతకాల వేదివి నీవు. నీతో వాదించటం నా తరమా? మాటకారితనంలో నీ తర్వాతనే నేను. అందరి జాతకాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నిన్ను విస్మరించిన ఎలాంటి ఉద్ధండ జ్యోతిష పాండిత్యమూ ఫలించదు. మనం యిద్దరం మేలురకం వాగుడుకాయలం. మాటలకు దిగితే అనంతకాలం చాలదు కాని, నీవు పూర్ణజ్ఞానివి. మాలాంటి అర్థజ్ఞానులు, ఎలాంటి పిచ్చిలో పడ్డా నీలాంటి వాళ్ళు తామరాకుమీద నీటిబొట్టులాగ దేనికీ లొంగిపోరు. నీవు మాయకు అతీతుడవు. కాబట్టి సిద్ధి బుద్ధులు, అష్ట సిద్ధులు నిన్ను వరించుతాయని, నన్నుకూడా శ్రీరస్తు, శుభమస్తు, శీఘ్రకల్యాణసిద్ధిరస్తు అని పలికించనియ్యి " అని అంటూ మహతి వీణపై కళ్యాణిరాగం మొదలుపెట్టి సామరాగం అందుకొని సౌరాష్ట్ర రాగంతో మంగళగీతాన్ని పలికించాడు. 

    దేవతలంతా ఎవరి తావులకు వారు వెళ్ళారు. విఘ్నేశ్వరుణ్ణి, పార్వతిని వెంటబెట్టుకొని శివుడు తన నిజ నివాసమైన కైలాసానికి వెళ్ళాడు. నారదుడు తిన్నగా వజ్రదంతుడి దగ్గరకు బయలుదేరాడు. 

    ఆనాడు పుత్రగణపతి తోకపట్టి గిరగిరా త్రిప్పి విసిరితే పడ్డ పాటుకు వజ్రదంతుడి ఒళ్ళు నొప్పులు యింకా తీరనేలేదు. ధవళ, భర్తకు పరిచర్యలు చేస్తున్నది. వచ్చిన నారదుణ్ణి చూసి, మళ్ళీ ఏం గొడవ తెచ్చిపెడతాడో అని అనుకుంటూనే లోనికి వెళ్ళింది. 

    నారదుడు మూషికాసురుడుతో " నిన్ను పరాభవించిన గణపతి విఘ్నేశ్వరుడిగా వర్థిల్లుతున్నాడు. మరి...." అంటూ ఆగాడు. 

    పరాభవాగ్ని రగిలి, వజ్రదంతుడు " ఇప్పుడేం చేయమంటావు నారదా! " అని బిక్కమొహం పెట్టాడు. 

    నారదుడు " వరాల దేవుడు బ్రహ్మ ఉండనే ఉన్నాడు గదా! వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ప్రతీకారం సాధించు. గణపతి విఘ్నేశ్వర నామం ధరించాడు. గజముఖుడు. గుర్తుంచుకో! " అని చెప్పి చల్లగా వెళ్ళాడు. 

    మహాశ్వేత అనే నామాంతరంగల ధవళ ఎంతచెప్పినా వినకుండా, వజ్రదంతుడు " మహాశ్వేతా! నీ పసుపుకుంకాల పుణ్యమా అని నాకెలాగూ చావు భయం లేదుకదా! ప్రతీకారం చేసి మనశ్శాంతిని పొందనివ్వు " అని చెప్పి, ఘోరమైన తపస్సుచేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. 

    " ఏం కావాలి యింకా? " అని బ్రహ్మ అడిగాడు. 

    " విఘ్నానికి రూపం కల్పించి, నా అజ్ఞానువర్తిగా చెయ్యి " అని మూషికాసురుడు కోరాడు. 

    బ్రహ్మ విఘ్నాన్ని ఆవాహనచేసి వజ్రదంతుడి ముందుంచాడు. అతడికేమీ కనిపించలేదు. బ్రహ్మ అతనికి సూక్ష్మదర్శిని దృష్టి యిచ్చాడు. విఘ్నం మామూలు కంటికి కనిపించని కారునల్లని సూక్ష్మక్రిమి రూపంలో అతడికి కనిపించింది. 

    మూషికాసురుడు ఆశ్చర్యంతో " ఇదేమిటి? ఈ నలుసును ఏం చేసుకోను? " అన్నాడు. 

    బ్రహ్మ నవ్వి " విఘ్నం పెనుభూతంలాగా ఉంటుందనుకున్నావు కాని, విఘ్నబీజం కంటికి కనిపించని సూక్ష్మాణువు. సూక్ష్మక్రిమి వల్ల భయంకర వ్యాధి వ్యాపించినట్లే, అనర్ధదాయకమైన విఘ్న కారణం ఎంత చిన్నదయినా, ఎంతటి భీషణాకృతినైనా ధరించి సర్వనాశనం చేయగలదు. కామరూపి. ఏ రూపాన్నైనా ధరించి, అనర్థాలు కలిగించటమే దాని పని. ఏం చేసుకుంటావో చేసుకో " అని చెప్పి అంతర్థానమయ్యాడు. 

    మూషికాసురుడు విఘ్నంతో " నువ్వు వెంటనే మహాగజాసుర రూపంలో వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి నాశనం చెయ్యి " అని అజ్ఞాపించాడు. 

    విఘ్నం ఏనుగు శరీరమూ, ఏనుగు కాళ్ళూ, భయంకరమైన చిన్న తలా, పెద్ద కోరలూ, నిప్పుల్లాంటి కళ్ళుగల గజాసుర రూపం పొంది మహాపర్వతంలాగ కత్తి ఝళిపిస్తూ ఆకాశానికి ఎగిసి ఎగురుతూ వెళ్ళాడు. 

    కైలాసంలో విఘ్నేశ్వరుడు అల్లారుముద్దుగా పెరిగి, తల్లిదండ్రుల అనుమతితో తాను పుట్టిన విశ్వకర్మ నిర్మించిన భవనానికి బయలుదేరాడు. ఎదురుగా వస్తూ మన్మథుడు రూపంతో కనిపించాడు. విఘ్నేశ్వరుడు ఆశ్చర్యంగా " కనిపించని వాడివి కనిపించావు. ఏమిటి విశేషం? నామీద నీ విలువిద్య చూపకుమీ! అర్భకుణ్ణి " అన్నాడు. 

    మన్మథుడు వినయంగా తలవంచి " గజేంద్రాననా! నీవు నా బాణాలకు అతీతుడవు. నాకు కనిపించాలని ఉంటే కనిపించే వరం శివుడు యిచ్చినదేగదా! దగ్గరి పోలికలున్న దగ్గరి వాళ్ళం గనుక కనిపించాను అంతే! నీవు ఎద్దునెక్కిన శివుడి కొడుకువైతే, నేను గ్రద్దనెక్కిన విష్ణువు కుమారుణ్ణి. నన్ను శివుడు దహించి బ్రతికించాడు. నిన్ను ఖండించి బ్రతికించాడు. నా వాహనం చిలుక. నీ వాహనం ఎలుక. మనస్సును చలింపజేసే పూలమ్ములు నా ఆయుధాలైతే, మనోనిగ్రహాన్నిచ్చే పాశాంకుశాలు నీ ఆయుధాలు. మరి, నీకు తమ్ముడు కుమారస్వామి పుట్టాలిగదా! పార్వతీ పరమేశ్వరుల పరస్పర అనురాగ తేజస్సే కుమారస్వామిగా అవతరించాలి. తారకాసుర నిర్మూలన జరగాలి. అందుకేగదా! నన్ను దేవతలు బూడిదగూడా చేయించింది. కైలాసం చేరబోతున్నాను. అనుజ్ఞ యివ్వు " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " మన్మథా! అందుకే నేనూ కైలాసం దిగి వెళ్తున్నదీను. నీపని నిర్విఘ్నంగా నెఱవేర్చు. జయప్రదమవుతుంది " అన్నాడు. 

    మన్మథుడు అదృశ్యుడై పార్వతీ శివులున్న కైలాస మంటపాన్ని చేరుకున్నాడు. విఘ్నేశ్వరుడు భవనాన్ని చేరుకొని, సింహద్వారానికి చేరువగా చంద్రశిలావేదికపై సుఖంగా కూర్చొని పరిసర ప్రకృతిని ఆనందంగా చూస్తున్నాడు. మెరుగుపెట్టిన వెండి హిమగిరి శిఖరాలు సంధ్యకాంతుల్ని తళతళ ప్రతిఫలిస్తున్నాయి. హిమానీజలపాతాలు మంద్రగంభీరంగా సరిగమలు వినిపిస్తున్నాయి. అలాంటి ప్రశాంత సమయంలో " విఘ్నేశ్వరుడనేవాడు ఎక్కడ? " అనే భీకర గర్జన దిక్కుల మారుమోగుతూ వినిపించింది. 

    మహాగజాసుర రూపం ధరించిన విఘ్నం, విఘ్నేశ్వరుడి ఎదురుగా వాలింది. భూమి కంపించింది. గజాసురుడు " నేను మహాగజాసురుణ్ణి. నువ్వు గజముఖుడివైతే, నేను గజకాయుణ్ణి. నిన్ను హతమార్చ వచ్చాను " అంటూ రంకె వేశాడు. 

    విఘ్నేశ్వరుడు చెవిటి వాడిలాగ అమాయకంగా చూస్తూ " అబ్బీ! ముక్కలు నరుక్కొని చెరుకుగడ తినాలని ఉంది. గొడ్డలి కాస్త పదునుపెట్టి యిస్తివా, నీకు కుడుములు పెడతాను " అని అంటూ పరశువును వాటంగా విసిరాడు. గజాసురుడి కాళ్ళుతెగి పర్వతంలా కూలాడు. విఘ్నేశ్వరుడు ఎక్కి తాండవం చేస్తూ మర్దిస్తూంటే " మహాప్రభో! నేను విఘ్నాన్ని. బ్రహ్మ యిచ్చిన వరం మేరకు మహాగజాసుర రూపంలో వచ్చాను.  శాస్తి అయింది " అని విఘ్నం అరిచింది. 

    విఘ్నేశ్వరుడు " నేను విఘ్న వినాశకుణ్ణి. అదీగాక నువ్వు ఇప్పుడు మాయదారి గజాసురుడివి. నిన్ను తుత్తునియలు చేయక తప్పదు. నీ తునకలు నన్ను, నిన్ను ఏమర్చిన వాళ్ళను మాత్రమే పట్టి పీడిస్తాయి. నువ్వు కాళీయ నాగుడువై కాళింది మడుగున దాగి ఉండు. బాలకృష్ణుడు నిన్ను మర్దిస్తాడు. అతని పాదాలు నీ తలలమీద పడి నీ పాపపరిహారం అవుతుంది. జాతిసర్పాల పడగలపై విష్ణుపాద ముద్రలు అది మొదలు అలంకారంగా శోభిస్తాయి " అని చెప్పి పరశువును పట్టి విఘ్నాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఆ రేణువులు అంతటా వ్యాపించి అదృశ్యమయ్యాయి. విఘ్నం అణురూపంలో మిగిలింది. దేవతలు విఘ్నేశ్వరుడిపై పూలజల్లు కురిపించారు. 

    

    

20, సెప్టెంబర్ 2025, శనివారం

:: మహాగణపతి :: 

    పార్వతి పుత్రగణపతి కేకకు బిరబిరా వచ్చి, తల తెగిపడి ఉన్న బాలుణ్ణిచూసి, శివుణ్ణి చురచుర చూస్తూ " ఎంతపని చేశావు. మన పుత్రుణ్ణి నరికావు. పుత్ర హంతకుడివి " అంటూ కుప్పకూలబడి భోరుమని శోకించ సాగింది. 

    అంతవరకూ స్తంభించిపోయి చూస్తూన్న గుంపులో కలకలం సముద్ర ఘోషలాగా చెలరేగింది. పెద్ద నేరం చేసినవాణ్ణి లాగా శివుణ్ణి చూడసాగారు. శివుడికి ముచ్చెమటలు పోశాయి. బిక్కముఖం పెట్టి " నాకు తెలియని పుత్రుడా! ఎలాగ వచ్చాడు? " అన్నాడు. 

    పార్వతి తన వంటికి పెట్టుకున్న నలుగుముద్ద ఏవిధంగా పుత్రగణపతి అయినదీ చెప్పింది. దానికి శివుడు పెదవి విరిచి, కోపంగా చూస్తూ " నీకు కుమారుడైతే కావచ్చు. అందుకే అమ్మ, అమ్మ అంటూ తెగ వాగాడు. మన పుత్రుడంటున్నావు. నాకు పుత్రుడెలాగు అవుతాడు? " అని అడిగాడు. 

    పార్వతి తెల్లబోయింది. అప్పుడు విష్ణువు బ్రహ్మకు సైగ చేశాడు. బ్రహ్మ ముందుకు వచ్చి " శివుడు పార్వతి చేతిని పుచ్చుకున్నప్పుడే శివుడి తేజస్సు పార్వతి శరీరం నిండా ప్రవేశించి పులకరింప జేసింది. అది మొదలు శివుడు పార్వతిలో సగభాగంగా అంతర్లీనమై ఉంటూనే ఉన్నాడు. పుత్రగణపతి శివుడి కుమారుడే " అని నాలుగు వేళ్ళతో నొక్కి చెప్పాడు. 

    శివుడు చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తూంటే, పార్వతి బాలుడి కళేబరంమీద పడి ఏడుస్తూంటే, ఆకాశంనుండి " ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తూన్న ఏనుగు తలను తెచ్చి నాకు అతకండి. నేను లేస్తాను " అన్న పుత్రగణపతి వాక్కులు వినిపించాయి. 

    వెంటనే దేవతలు, ప్రమథులు అంతా గాలిస్తూ ఎంత వెదికినా ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తున్న వాళ్ళెవరూ కనిపించలేదు. 

    ఇంకా వెతుకుతూ పోగాపోగా సహ్యాద్రి పర్వతంమీద బిల్వ వనంలో ఒక తెల్లని ఏనుగు గున్న మాత్రం ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తూనే శివస్మరణ చేస్తూ కనిపించింది. 

    ఆ ఏనుగు గున్న దేవలోకంలో దేవతా గజమైన ఐరావతం కుమారుడైన గజేంద్రుడు. ఐరావతం ఇంద్రుడి వాహనం. ఒకసారి ఇంద్రుడు అలా వస్తూంటే గజేంద్రుడు అతణ్ణి లెక్కచేయకుండా తన ధ్యాసలో తానుండటం చూసి ఇంద్రుడు కళ్ళెర్రజేసి " నా వాహనం కొడుక్కి ఇంత పొగరా? " అని దుర్భాషలాడాడు. 

    అప్పుడు గజేంద్రం శాంతంగా " నా తండ్రి తన విధిని తాను చేస్తున్నాడు. అంతమాత్రం చేత నీవు మమ్మల్ని తక్కువచేసి మాట్లాడవలసిన పనిలేదు.నీకు నేను భయపడాల్సింది ఏమీ లేదు " అన్నాడు. 

    " నేను దేవేంద్రుణ్ణిరా, ఏనుగా! " అన్నాడు ఇంద్రుడు గర్వంగా. 

    ఔను, నేను ఏనుగును. గజేంద్రుణ్ణి. మరొకరు నాగేంద్రుడైతే, ఇంకొకరు పక్షీంద్రుడు. ఇలా ఎంతమంది ఇంద్రుళ్ళున్నా ఉండవచ్చు. నూరు యజ్ఞాలు చేస్తే చాలు. ఇంద్రపదవి పొందవచ్చు. తపస్సుతో సాధించవచ్చు. అందుకే ఎవరెక్కడ ఏది చేస్తున్నారని తెలిసినా నీకు తగని భయం. ఇంద్రత్వం ఏమంత గొప్పదని నీవు జ్ఞానంతో చెప్పుకొంటున్నావు? " అన్నాడు గజేంద్రుడు. 

    ఇంద్రుడు రెచ్చిపోయి శపించుతున్నట్లుగా " నీతల తెగా " అని తిట్టాడు. 

    గజేంద్రం నవ్వుతూ " శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదుకదా! ఆ తలముందే నీతల వంచవలసి వస్తుందేమో ఎవరికెరుక " అన్నాడు. 

    గజేంద్రం గొప్ప జ్ణాని అని గుర్తించలేని గర్వాంధుడైన ఇంద్రుడు " ఆ శివుణ్ణే నమ్ముకో. భూమ్మీదపడు " అని గజేంద్రాన్ని స్వర్గంనుండి క్రిందకు తోసేసాడు. గజేంద్రం సహ్యపర్వతంమీద పడి, ఎల్లప్పుడూ శివ సంస్మరణం చేసుకొంటూ, శివుడి నివాసమైన కైలాసం ఉండే ఉత్తరదిక్కుకే తలపెట్టుకొని నిద్రిస్తూండేది. 

    దేవతలు గజేంద్రం తల నరికి తీసుకెళ్ళారు. ఆ తలను శివుడు బాలుడి కళేబరానికి అతికించగానే పుత్రగణపతి ఏనుగు ముఖంతో కళకళలాడుతూ లేచి నుంచున్నాడు.

    " నా ముద్దులయ్యకు ఏనుగుముఖం ఏమిటి? నేను చూడలేను " అని పార్వతి దు:ఖంతో కళ్ళు మూసుకుంది. 

    అప్పుడు గజముఖుడు వీనుల విందు చేసే స్వరంతో " అమ్మా! ఎందుకు విచారిస్తావు? జరగాల్సిందంతా నిర్విఘ్నంగా జరిగింది. ఆనాడు మీరిద్దరూ గోడమీద ఏనుగుల చిత్రాన్ని చూస్తున్నప్పుడు కనిపించిన నన్ను గుర్తించలేదా? విఘ్నేశ్వరుణ్ణి " అన్నాడు. 

    ఆ మాటలు వింటూనే పార్వతికి కల వచ్చినట్లుగా ఆ విశేషమంతా కనిపించింది. శివుడికి అలాగే విఘ్నేశ్వరుడు స్ఫురణకు వచ్చాడు.

    " విఘ్నేశ్వరా! నీవా! మాకు పుత్రుడవై అవతరించావా? ఇందుకా నన్ను అంతగా కవ్వించి కయ్యానికి కాలుదువ్వి, నాకు కోపం తెప్పించింది. నాకు అంతా బోధపడుతున్నది. నీ లీల అద్భుతం " అన్నాడు శివుడు. 

    " లేకపోతే గజాసురుడికి నువ్వు యిచ్చిన వాగ్దానాలు ఎలా నెరవేరతాయనుకున్నావు? " అని విఘ్నేశ్వరుడు జ్ఞాపకం చేశాడు. 

    శివుడు " బాగా జ్ఞాపకం చేశావు. నేను గజచర్మాన్ని గూడా కట్టుకోవలసి ఉన్నది. ఏనుగుతల నా కుమారుడికి ఉండనే ఉన్నది " అన్నాడు. ఆ తర్వాత గజచర్మాన్ని తెప్పించుకొని కట్టుకున్నాడు. 

    శివుడు విఘ్నేశ్వరుడికి వినయంగా వంగి " విఘ్నేశ్వరా! నీ విశ్వరూపాన్ని చూపించు " అని కోరాడు. 

    అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశానికి పెరిగి అయిదు తలలతో కనిపించాడు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అనే పంచభూతాల రంగులైన ఆకుపచ్చ, మబ్బురంగు, ఎరుపు, తెలుపు, నీలం రంగులు అయిదు ఏనుగు తలలకూ ఉన్నవి. ఆ తలలపై నక్షత్రాలు తలపూవులుగా మెరుస్తున్నవి. విఘ్నేశ్వరుని గుండ్రని పెద్ద బొజ్జ మినుకు మినుకుమనే కాంతులతో ఆకాశాన్ని పోలి ఉన్నది. అతని అనేకమైన చేతుల్లో అంకుశము, గొడ్డలి, పాశము, కలశములతోపాటు త్రిమూర్తులకు చెందిన శంఖ చక్ర గదా పద్మ ఢమరుక త్రిశూల వజ్రాయుధాలు, జపమాల, కమండలువు, వీణ, ఖడ్గము, శక్తియీటె మొదలైనవన్నీ ఉన్నాయి. అతని రూపాన్ని తలలు పైకిసారించి చూస్తున్న వారంతా కళ్ళు మిరుమిట్లు గొలిపే అతని తేజస్సు చూడలేక తలలు దించారు. అప్పుడు అందరిలోనూ ఏదో మహానందం కలిగింది. సరస్వతి వీణ తీసి విఘ్నేశ్వరుడికి ప్రియమైన హంసధ్వని రాగాన్ని సంరంభంగా దురితగతితో పలికిస్తూంటే, నారదుడు మాయామాళవ గౌళరాగాన్ని మధ్యమధ్య జోడించాడు. శివుడు ఆనందతాండవం చేశాడు. 

    ఇంద్రుడితో సహా ముక్కోటి దేవతలు తలలువంచి విఘ్నేశ్వరుడికి నమస్కరించారు. అప్పుడు ఇంద్రుడి చెవుల్లో " ఆ తలముందే నీతల వంచవలసి వస్తుందేమో " అని గజేంద్రం అన్న మాటలు గింగురుమన్నాయి. పుత్రగణపతికి అతికిన తల గజేంద్రానిదని అతనికి తెలుసు. ఇంద్రుడు చెవులు పట్టుకొని మూడుసార్లు వంగిలేస్తూ లెంపలేసుకొని సాష్టాంగపడి మ్రొక్కి " గజేంద్రా! నీవు జ్ణానివి. నేను అజ్ఞానిని. నా గర్వాన్ని మన్నించు " అని మనస్సులో అనుకున్నాడు. దేవతలంతా ఇంద్రుడు చేసినట్లే అనుకరించి మ్రొక్కారు. 

    విశ్వరూపం దాల్చిన విఘ్నేశ్వరుడితో శివుడు " విఘ్నేశ్వరా! నీ రూపానికి ఎన్నో విశేషార్థాలున్నట్లుగా మాకు తోస్తున్నది. తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాము " అని అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు  " శివ భక్తుల సమ్మెళనమే యీ విశ్వం. నేను విశ్వ జననీ జనకులైన పార్వతీ శివులకు పుత్రుణ్ణి మాత్రమే. వారికి అంజలి ఘటిస్తున్నాను " అని అంటూ చేతులెత్తి జోడించి ఊరుకున్నాడు. 

    బ్రహ్మ ముందుకు వచ్చి యిలా చెప్పాడు. " మత్స్యావతారం ఎత్తి విష్ణువు సోమకాసురుణ్ణి సంహరించి వేదాల్ని భద్రపరిచాడు. నిండు చందమామ కాంతుల్ని విరజిమ్ముతూ విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి వాటిని నాకు అందజేసాడు. నాకు జ్ఞాన సిద్ధి కలిగింది. అప్పుడు విఘ్నేశ్వరుని గురించి విశేషాలు చాలా తెలుసుకున్నాను. సంకల్పసిద్ధికి మూలమైన విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి సక్రమంగా సృష్టి చేయగలిగాను. 

    విఘ్నేశ్వరుడు విరాట్ స్వరూపుడు. వ్యాపించేవాడు కనుకనే " విష్ణుం " అనిపించుకున్నాడు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, మట్టి అనే పంచ మహాభూత గణానికి అధిపతి గనుకనే విఘ్నేశ్వరుడు మహాగణాధిపతి. లక్ష్మీస్వరస్వతుల నిలయంగా నడుమనున్న విశ్వరూప విఘ్నేశ్వరుడి అయిదు తలలూ శ్వేతనీలము, ఊదా, ఎరుపు, శ్యామనీలము, పచ్చరంగులతో పంచ మహాభూతాలకు ప్రతిరూపాలుగా ఉన్నవి. 

    ఏనుగు తల బలానికి, మేథస్సుకి చిహ్నం. బొజ్జ ఉండగానే సంబరం కాదు. తగినంత మేథస్సు ఉండాలని అర్థం. కొత్తవి పడుతూ ఉంటే, పాతవి జీర్ణం అవుతూండే తినుబండారాలకుమల్లే, అనంతాకాశంలో నక్షత్ర మండలాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, గోళాలు, లోకాలు నిండి ఉన్నాయని లంబోదరం గుర్తుచేస్తూన్నది. ఈయన త్వరలోనే చిన్న ఎలుకనెక్కి తిరుగబోతున్నాడు. అంటే, సూర్యచంద్రాది గ్రహాలు, మహా మండలాలు శూన్యాకాశంలో గతులు తప్పకుండా అంతలా ఘనంగా తిరుగుతున్నాయనీ, విశ్వస్వరూపం చిట్టెలుకపై ఏనుగుస్వారీ లాంటి చిత్రాతి చిత్రమైన జ్ఞానంతో నిండి ఉన్నదనీ చెప్పడం అన్నమాట. విశ్వ విజ్ఞానానికి విఘ్నేశ్వరుడు సంకేతం. ఆయన విజ్ఞానేశ్వరుడు అనబడుతున్నాడు. 

    విశ్వానికి అధినేత. నియంత. అంకుశాన్ని ధరించాడు. బుద్ధిబలానికి విఘ్నేశ్వరుడు గురుతు. బుద్ధి వెర్రితలలు వేయకుండా మావటివాడు ఏనుగును ఉంచినట్లుగా, అదుపులో ఉంచాలని అంకుశం మనోనిగ్రహానికి ప్రతిరూపంగా ఉన్నది. సర్వమూ తమ తమ ధర్మాలకు కట్టుబడి ఉన్నదని విఘ్నేశ్వరుని చేతనున్న పాశము చెబుతున్నది. పరిపూర్ణత తొణకని బెణకని నిండుకుండ లాంటిదని కలశాన్ని ధరించాడు. పరశువుతో విఘ్నాన్ని చిన్నాభిన్నం చేస్తాడు. విశ్వం నాదాత్మకమయినది. అనేక ఓంకార ఝంకారాల్ని ధ్వనించే విశ్వ వీణనే విఘ్నేశ్వరుడు మీటుతున్నాడు. చరాచర జీవకోట్ల మొరలన్నీ వినడానికే పెద్ద చెవులు రిక్కించి ఉన్నాడు. ఏనుగు కళ్ళు చిన్నవైనా సూక్ష్మదర్శనం కలిగి,  నిశితంగా చూడ గల్గినట్లే, పరమాణువు మొదలుకొని బ్రహ్మాండాన్ని పరిశీలిస్తున్నాడు. వంపుపెట్టిన వక్రతుండం వంకల్ని తుండ తుండాలుగా చేసి సరిదిద్దుతుంది. తొండం నిడువుగా సాగి ఎన్నిటినైనా అందుకుంటుంది, అందిస్తుంది.
    
    సస్య సమృద్ధికి విఘ్నేశ్వరుడు అధినాథుడు. భోజనప్రియుడు గనుక, ఆహారం వల్లనే కండబలమూ, కండబలం ఉంటేనే బుద్ధిబలానికి నిలకడ, సార్ధకతా ఉంటాయని పండ్లు, పిండివంటలు, ఆకుకూరలు వద్దనకుండా స్వీకరిస్తాడు. భాద్రపద మాసంలో ఏనుగుల్లాంటి మేఘాలు తొండాలవంటి వర్షపు ధారలు కురుస్తాయి. మేఘ గణాలకు నాథుడు గణనాథుడు. విఘ్నేశ్వరుడు అవతరించిన ఇది భాద్రపద మాసమే. భాద్రపద శుక్ల చవితినాడు విఘ్నేశ్వరుణ్ణి అర్చించిన వారికి సంకల్పసిద్ధితో బాటు అన్ని విఘ్నాలను అరికట్టుకోగల బుద్ధి నిబ్బరము కలుగుతుంది. 

    తన దంతపు ఘంటాన్ని మోపినది ఎత్తకుండా విఘ్నేశ్వరుడి చేతి మీదుగానే పంచమవేదం అనదగ్గ మహాభారతం అక్షరసిద్ధిపొంది చిరస్థాయిగా నిలుస్తుంది. విఘ్నరాజు మహిమలు వర్ణించడం నా తరం కాదు. ఏ కార్యమైనా తలపెట్టేముందు విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి, పూజించి మరీ ప్రారంభించాలి. శుభం కలుగుతుంది అంటూ అభయముద్ర పట్టి ఉన్నాడు. మహాగణాధిపతి అందరికీ ప్రథమ ఆరాధ్య దైవము " అని బ్రహ్మ ముగించాడు. 

    అప్పుడు శివుడు అందర్నీ కలయజూసి " బ్రహ్మ వాక్కు విన్నారు గదా! విఘ్నేశ్వరుడు తొలిపూజ దేవర " అన్నాడు. 

    అందరూ ఔను ఔనని తలలూపారు. నారదుడు హంసధ్వని రాగాన్ని వీణపై హోరెత్తిస్తూంటే, సరస్వతి హంసానంది రాగాన్ని అందుకొంది. ఆ సంరంభంలో పార్వతి విఘ్నేశ్వరుడికి నమస్కరించబోతూంటే, విశ్వరూప మహాగణాధిపతి " అమ్మా! అమ్మా! వద్దు " అని వారిస్తూ చప్పున విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని, గుజ్జు వినాయకుడై తల్లి కాళ్ళు చుట్టేసుకున్నాడు. 

    

    

6, సెప్టెంబర్ 2025, శనివారం

:: పుత్రగణపతి ::  

    తారకాసురుడి నిరంకుశత్వానికి తోడుగా, త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులు తపస్సులు చేసి వరాలుపొంది ఆకాశంలో ఎగురుతూ తిరిగే మూడు పట్టణాలను నిర్మించుకొని, ముల్లోకాల మీద విరుచుకు పడ్డారు. మూడు పురాల మీద ఎగురుతూ అగ్నిగోళాల్ని కురిపిస్తూ, పట్టణాలనూ, పచ్చని పల్లెలనూ తగలబెడుతూ విధ్వంసకాండ సాగిస్తున్నారు. జగత్తు అట్టుడుకు పోతున్నది. వారిని అంతమొందించ గలవాడు శివుడొక్కడే అని తెలిసిన దేవతలంతా కలిసివచ్చి, మందిర ప్రాంగణంలో హోరెత్తి ప్రార్థనలు చేశారు. పెళ్ళాడిన కొత్తలోనే ఏదో బెడద వచ్చిందని శివుడు విసవిస లాడినా, త్రిపురాసురులు చేస్తున్న మారణహోమం విన్నమీదట ఉద్రేకం పుట్టి మూలనున్న త్రిశూలాన్ని దుమ్ముదులిపి పట్టుకొని, తన అనుచరుల్నీ, ప్రమథ గణాలను వెంటబెట్టుకొని, త్రిపురాసురలను తుదముట్టించడానికి కదిలాడు. 

    అదే సమయంలో జడల ఏనుగుగా మారి లోకాన్ని భీభత్సం చేస్తూ ఒక రాక్షస రాజు బయలుదేరాడు. ఏనుగు రూపం కారణంగా అతడికి గజాసురుడు అన్న పేరు వచ్చింది. అతడు గొప్ప శివ భక్తుడు. శివుడి వల్ల తప్ప మరెవరివల్లా చావులేని వరం పొందాడు. 

    " శివుణ్ణి నీలోపలే ఉంచేసుకొంటే మరీ మంచిదిగదా! " అని నారదుడు గజాసురుడి మేలు కోరుతున్న వాడిలాగా అతడితో చెప్పాడు. గజాసురుడు వెంటనే ఉగ్రమైన ఆరాధనతో శివుణ్ణి గూర్చి తపస్సు మొదలుపెట్టి శివుణ్ణి మెప్పించాడు. త్రిపురాసుర సంహారానికని బయలుదేరిన శివుడు గజాసురుడి కోరిక ప్రకారం గజాసురుడి గుండెలో లింగరూపంతో ఉండిపోయాడు. 

    " శివుడు గజాసురుడి గుండెలో ఉండిపోతే త్రిపురాసుర సంహారం ఎలా జరుగుతుంది? నవ వధువు పార్వతి ముచ్చట తీరేదెలా? శివుడికి, పార్వతికీ పుట్టవలసిన వాడివల్లనే కదా తారకాసురుడి అంతం జరగాలి? " అని దేవతలంతా దిగులు ముఖాలు వేస్తూంటే నారదుడు, " శివుడు ఉబ్బు లింగడు గదా! " అని ఉపాయం అందించాడు. దేవతలంతా గజాసురుడి యెదుట శివుణ్ణి పొగుడుతూ స్తోత్ర పాఠాలు మొదలుపెట్టారు. 

    గజాసురుడు కూడా తన్మయుడై వారితో కలిసి శివభజన సాగించాడు. శివలింగం ఉబ్బి అలాఅలా పెరిగిపోతూ, గజాసురుణ్ణి చీల్చివేసింది. శివుడు ఇవతల పడ్డాడు. గజాసురుడు కన్నుమూస్తూ, " నిన్ను నమ్ముకొంటే ఇలా చేసావేమిటి? అని శివుణ్ణి నిందించగా " గజా! శివభక్తికి తార్కాణంగా కలకాలం నీపేరు నిలిచేలాగా ఏనుగుతల నాకు సన్నిహితంగా ఉంటుంది. గజ చర్మాన్ని కట్టుకుంటాను " అని శివుడు చెబుతూ గజాసురుణ్ణి తనలోకి తీసుకొని కైవల్యాన్ని ప్రసాదించాడు. 

    శివుడు భూమిని రథంగా, సూర్యచంద్రుల్ని రథ చక్రాలుగా, వేదాలు గుర్రాలుగా, బ్రహ్మ సారథిగా, మేరుపర్వతాన్ని ధనుస్సుగా, విష్ణువును బాణంగా సమకూర్చుకొని, తన అనుచరులైన నందీ, శృంగీ, భృంగీ మొదలైన ప్రమథ గణాలను వెంట వీసుకొని, ముక్కోటి దేవతలు వారివారి దేవేరులతో సహా వెనుక రాగా, భయంకరులైన త్రిపురాసురలపై యుద్ధానికి వెళ్ళాడు. 

    ఇంట్లో వంటరి పార్వతికి కాలం బరువుగా గడుస్తున్నది. శివుడు ఎప్పుడు వచ్చేదీ తెలీదు.ఆ సమయంలో నారదుడు వచ్చి " అమ్మాయీ! పార్వతీ! శివుడు నిన్ను పెళ్ళాడినప్పట్నుంచీ తారకాసురుడు తల్లడిల్లిపోతూ పీడకలలు కంటున్నాడు. నీకు ఎలాంటిహాని తలపెడతాడో ఏమో! వాడికి వజ్రదంతుడు తోడై ఉన్నాడు. వజ్రదంతుడు బహుమాయావి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలిసుమా! " అని హెచ్చరించి వెళ్ళాడు. 

    పార్వతికి మరింత చికాకు, దిగులూ కూడా కలిగాయి. చక్కగా తలంటు స్నానం చేస్తే చిరాకు తగ్గి బాగుంటుందనిపించింది. 

    పార్వతి నలుగు పెట్టుకొని, ఆ నలుగుముద్ద కూడదీసి, ఆ ముద్దతో ఒక బొమ్మచేసి ముచ్చటగా చూసుకొని అలా కింద పెట్టి అటు తిరిగి ఇటు చూసేసరికి బొమ్మకు మారుగా ముద్దులు మూటగట్టే బాలుడు కనిపించాడు. " ఎవరబ్బా, నీవు? " అని పార్వతి అడిగింది. 

    " నీ కాంతిని పుణికి పుచ్చుకొని రాలిన నలుగు ముద్దనే కదుటమ్మా! నీ పుత్రుణ్ణి. పుత్రగణపతిని " అన్నాడు బాలుడు. పార్వతి బాలుణ్ణి అక్కున చేర్చుకొని ముద్దాడి, ఒక అంకుశ గదా దండాన్ని అతని చేతికిచ్చి, " నాయనా! ఎవ్వరినీ, పురుగునైనా రానీయకు " అని చెప్పి సింహద్వారం దగ్గర కాపలా ఉంచింది. 

    " అమ్మా! తినడానికేమైనా పెట్టవూ! " అని అడిగాడు కుర్రవాడు. అప్పటికప్పుడు పిండి కలిపి చలిమిడి ముద్దనూ, ఉండ్రాళ్ళనూ చేసి యిచ్చి పార్వతి స్నానానికి వెళ్ళింది. 

    పార్వతిని అంతమొందించితే శివుడికి కొడుకుపుట్టే అవకాశం లేదు. తన ప్రాణానికి భయం ఉండదని తలచి తారకాసురుడు వజ్రదంతుణ్ణి పార్వతిని అపహరించుకు రావడానికి ముందు గజకర్ణి, గోకర్ణి అనే తన ముఖ్యానుచరులైన రాక్షసు లిద్దరిని పంపించాడు. 

    వాళ్ళు దున్నపోతుల్లాగా బలిసిన కుర్రాళ్ళ రూపంతో వెళ్ళి, దొంగ చూపులు చూస్తూ, సింహద్వారం దగ్గర అంకుశ గదా దండాన్ని పట్టి అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాస్తున్న బాలుణ్ణి " ఆడుకుందాం రా! " అని పిలిచారు. 

    బాలుడు వాళ్ళను చూడనట్టే చూసి నవ్వుతూ, " ముందు కాస్త తినండిరా! " అంటూ రెండు చలిమిడి ముద్దలు వాళ్ళ మీదకు విసిరాడు. వాళ్ళు తలలు దిమ్మతిరిగి పారిపోతోంటే, రెండు ఉండ్రాళ్ళు పెద్ద బండరాళ్ళై వాళ్ళ ముందు పడగా బోర్లా పడ్డారు. పుత్రగణపతి వాళ్ళను పిలిచి " చెవులు పట్టుకొని మూడేసి గుంజీలు తీసి, లెంపలేసుకొని మరీ పొండిరా! " అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే చేసి, రాక్షస రూపాలతో వజ్రదంతుడికి ఎగ ఊపిరితో జరిగింది చెప్పారు. 

    వజ్రదంతుడు హుంకరించి ఎలుక రూపంతో వెళ్ళి ద్వారానికి సమీపంలో బొరియ చేసి దూరబోతూండగా పుత్రగణపతి మొలపాశాన్ని తీసి ఉచ్చుపన్ని విసిరి మూషికాన్ని పట్టాడు. ఉచ్చు మెడకు బిగిసి కీచుకీచు మంటూన్న దాని నెత్తిన నాలుగు మొట్టికాయలు పెట్టి, తోక పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేశాడు. 

    పుత్రగణపతి విసురికి మూషికాసురుడు అమాంతంగా అతని రాజ్యంలో అంత:పురం ముందు దభీమని నిజరూపుతో బోర్లా పడ్డాడు. అతని భార్య ధవళ గొప్ప దేవీ భక్తురాలు. ఎప్పటికీ తన పసుపు కుంకుమలు నిలిచేలాగా  భర్తకు చావులేని వరం దేవివల్ల పొందింది. ధవళ భర్తను ఊరడించి వరం సంగతి చెప్పి ధైర్యం కలిగించి, పార్వతి జోలికి పోవద్దని హితవు చెప్పింది. 

    త్రిపురాసురులను సంహరించి ముందుగా వచ్చిన శివుడు పార్వతిని చూడాలనే తహతహతో హుటాహుటీగా వెళ్ళబోతూంటే బాలుడు అడ్డగించాడు. శివుడు చకితుడై " ఎవరు నువ్వు? " అని గద్దించాడు. 

    బాలుడు పకపక నవ్వుతూ " అమ్మ కొడుకుని. మాయావులూ, వేషధారులూ తిరుగుతున్నారు. పురుగైనా పోకుండా కాపలా పెట్టింది మా అమ్మ " అన్నాడు. 

    " నేను ఈశ్వరుణ్ణి. దేవుణ్ణి " అన్నాడు శివుడు. 

    " నాకు ఎటువంటి దేవుడితోనూ నిమిత్తం లేదు. అమ్మ ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి శాసనాన్ని అనుసరించి నడుచుకోవటం కంటే జీవకోటికి వేరే ధర్మమేదీ లేదు కదా! అమ్మ ఆజ్ఞ పాటించటమే నా విధి " అన్నాడు బాలుడు. 

    కొంచెం వెనుకనుంచి త్రిపురాసుర సంహారం చేసిన శివుడి పరాక్రమ వీరగాథను గానం చేస్తూ జయజయ ధ్వానాలతో వస్తూన్న ప్రమథ గణాలు, ముక్కోటి దేవతలు అక్కడకు చేరుకొని, శివుడు బాలుడితో ఘర్షణ పడుతూండడం చూసి ఆశ్చర్యంతో బొమ్మల్లాగా నిల్చిపోయి, వాళ్ళ సంవాదం వినసాగారు. 

    " కుర్రకుంకవు. తెలియక దేవుడు లేడంటున్నావు. అంతటికీ మూలము పరబ్రహ్మము. అతడే దేవుడు " అన్నాడు శివుడు. " పెద్దవాడివైనా, నీకే తెలియనట్టుంది. ఆదిశక్తి నుండి విశ్వమూ, త్రిమూర్తులూ వచ్చిన సంగతిని సూక్ష్మంగా చెబుతాను విను " అంటూ బాలుడు చెప్పసాగాడు. 

    ఆదిశక్తి రూపుదాల్చి బ్రహ్మను, విష్ణువును, మహేశ్వరుణ్ణి, తన మేను విదల్చగా వచ్చిన ఎరుపు, నీలం, తెలుపు రంగుల తేజస్సుల నుండి పుట్టించింది. బ్రహ్మ, విష్ణువు లిద్దరూ దేవి చెప్పింది వినకుండా ధిక్కరించారు. వాళ్ళను ఆమె తన మూడో కంటిని తెరచి బూడిద కుప్పల్ని చేసింది. మహేశ్వరుడు గడుసువాడు. చెప్పినట్టే వింటాను గాని, ముందు మూడో కన్ను తనకిమ్మన్నాడు. దేవి తన మూడో నేత్రాన్ని తీసి అతని నొసట అతికించింది. వెంటనే అతడు దాన్ని తెరచి ఆవిణ్ణి కాల్చాడు. ఆమె మండిపోతూంటే అగ్నిరేణువులు విరజిమ్ముకొని తేజోమండలాలు ఏర్పడ్డాయి. భస్మం రేగి అంతటా నిండింది. ఆ విధంగా విశ్వం ఏర్పడింది. తర్వాత కాలినట్టే కాలి పోయిన దేవి మళ్ళా యధారూపంలో కనిపించింది. అందుకే ఆమెను " మహామాయా " అని అన్నారు. మహేశ్వరుణ్ణి మెచ్చుకొని, అతడిని లయకారుడిగా నిర్ణయించింది. బ్రహ్మ, విష్ణువులను వారి బూడిదలనుండి రప్పించింది. కొంత మిగిలిఉన్న తన బూడిదను మూడు భాగాలు చేసి వాణిని, లక్ష్మిని, ఉమను రూపొందించింది. వాణిని బ్రహ్మ, లక్ష్మిని విష్ణువు, ఉమను మహేశ్వరుడు అర్థాంగులుగా స్వీకరించి లోకపాలన చేయండని చెప్పి దేవి అంతర్ధానమయింది. 

    " నీవు చెప్పినదంతా ఒట్టి కట్టు కథ " అన్నాడు శివుడు. 

    " నాది కట్టు కథ అయితే, బ్రహ్మమూ, దేవుడూ అంటూ నీవు చెప్పేదంతా కేవలం మెట్ట వేదాంతం అంటే తప్పేముంది?  అంతా దేవుడి నుండి పుట్టినదనడంకంటే ఆదిశక్తి నుంచి వచ్చినదనడం ఎక్కువ నిజంగా వినిపించడం లేదా? " అని అడిగాడు బాలుడు. అతని మాటలకు అక్కడున్న మగవాళ్ళ ముఖాలు వెలవెల పోయాయి. ఒక్క విష్ణువు మాత్రం మెచ్చుకుంటూన్నట్లుగా బాలుణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు. బ్రహ్మ బాలుడి తర్కానికి మురిసిపోయాడు. ఆడవాళ్ళ ముఖాలు కళకళలాడుతూ వికసించాయి. 

    శివుడు ముఖం ఎర్రగా చేసుకొని " చూస్తే పసివాడివైతివి. భయపడకు. నిన్నేమీ చేయనులే! మంచిగా ద్వారానికి అడ్డం తొలిగిపో! " అన్నాడు కసురుతూన్నట్టుగా! " నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను వెళ్ళ నిచ్చేది లేదు " అన్నాడు బాలుడు నిర్భయంగా. శివుడికి పట్టరాని కోపం వచ్చింది. చప్పట్లు చరచి ప్రమథ గణాలకు సైగ చేశాడు. బాలుణ్ణి ఈడ్చి పారేయడానికి వాళ్ళు ముందుకురికారు. 

    బాలుడు నవ్వుతూ, " పసివాడి వంటూ కనికరించినట్లే నటిస్తూ నామీదకు నీ గణాల్ని బలప్రయోగానికి ఉసికొల్పడం ఏమైనా బాగుందా? సరే, నేనూ గణాధిపతినే " అంటూ అంకుశదండాన్ని నేలకు గట్టిగా తాటించాడు. నేల ఈనినట్లు పుత్రగణపతి లాంటి రూపురేఖలుగల వాళ్ళు వేలకువేలు పుట్టుకొచ్చి, నందినీ, శృంగినీ, భృంగినీ, చండీశ్వరుణ్ణి  తమ చేతులలో ఉన్న అంకుశాలు, గదలు, పాశాలు, శూలాలతో గొడ్లను తరిమినట్టు తరిమేశారు. మిగతా శివానుచరులంతా జాడలేకుండా పారిపోయారు. పుత్రగణపతి గణమంతా అదృశ్యమయ్యారు. 

    శివుడు రుద్రుడై త్రిశూలం ఎత్తాడు. బాలుడు అంకుశ దండంతో అడ్డుకోగా ఖంగున మ్రోగుతూ త్రిశూలం పడిపోయింది. బాలుడు పకపక నవ్వుతూ " మా అమ్మ యిచ్చిన దండం నాచేత నుండగా నన్నేమీ చేయలేవు. నీవేదో చేద్దామనుకుంటున్నది నిర్విఘ్నంగా నెరవేర్చాలనే నేనూ సిద్ధంగా ఉన్నాను. తర్వాత కథ అమ్మ చూసుకుంటుంది " అంటూ అంకుశ గదా దండాన్ని దూరంగా విడిచి పెట్టాడు. శివుడు ఒళ్ళు తెలియని కోపంతో ఉన్మత్తుడిలాగా త్రిశూలాన్ని బాలుడి కంఠానికి గురిపెట్టి విసిరాడు. మరుక్షణంలో బాలుడు " అమ్మా!" అని పెద్దపెట్టున అరుస్తూండగా అతని తల తెగి ఆకాశానికి ఎగిరి పెద్ద జ్యోతిగా వెలిగిపోతూ, అంతరిక్షంలో లీనమైంది. సశేషం. తరువాయి జరిగే సంఘటనలు తిరిగి వచ్చే వారం. అంతవరకూ శలవు. 


:: కుమారస్వామి జననం ::        " విఘ్నేశ్వరా! ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూం...